‘ఐదేళ్ల వరకు పిల్లల్ని కనకూడదా?’
ముంబై: కేంద్రం ఆమోదించిన సరోగసీ(అద్దెగర్భం) బిల్లు ముసాయిదాను బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. పౌరుల స్వేచ్ఛను హరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
‘మేమేం తినాలో మీరే చెబుతున్నారు. మేము ఎటువంటి బట్టలు ధరించాలో కూడా చెబుతున్నారు. పిల్లల్ని ఎప్పుడు కనాలో కూడా చెప్పేందుకు ఇప్పుడు రెడీ అయ్యార’ని ఫరాఖాన్ అన్నారు. 43 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ ద్వారా ఒకేసారి ముగ్గురు పిల్లలకు ఫరాఖాన్ జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
సరోగసీ ముసాయిదా బిల్లుతో సరోగసీ మహిళల హక్కులకు ఎటువంటి ప్రయోజనం ఉండదని ఫరాఖాన్ అభిప్రాయపడ్డారు. పెళ్లైన దంపతులను మాత్రమే సరోగసీకి అనుమతిస్తామని చెప్పడం, అదికూడా ఐదేళ్ల తర్వాతే అని బిల్లులో పొందుపరచడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దంపతులు ఐదేళ్ల వరకు పిల్లల్ని కనకూడదని ఎలా చెబుతారని ఆమె ప్రశ్నించారు.
కరీనా కపూర్ కూడా సరోగసీ బిల్లుపై ఇంతకుముందు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అద్దెగర్భం ద్వారా శిశువులకు జన్మనిచ్చిన మహిళల ప్రయోజనాలు కాపాడేందుకు, కమర్షియల్ సరోగసిని నియత్రించేందుకు ఈ బిల్లు రూపొందించినట్టు కేంద్రం తెలిపింది.