సరోగసీ బిల్లు! ఆమిర్, షారుఖ్‌కు సుష్మా చురకలు
న్యూఢిల్లీ: పిల్లలు లేని దంపతులకు వైద్యశాస్త్రం అందించిన వరం అద్దె గర్భం (సరోగసీ) విధానం. అయితే, ఈ విధానాన్ని దుర్వినియోగం చేస్తూ పెద్ద ఎత్తున వ్యాపారం సాగుతున్న నేపథ్యంలో.. ఈ వ్యాపారాన్ని పూర్తిగా నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం సరోగసి చట్టాన్ని తీసుకువస్తున్నది. బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే.. సరోగసీ కోసం పిల్లలు లేని దంపతులు ఇతర మహిళల గర్భాలను అద్దెకు తీసుకోవడం కుదరదు. ఇందుకోసం వారు తమ బంధువులు, లేదా తెలిసిన వారి సహాయం మాత్రమే తీసుకొనే అవకాశం ఉంటుంది.
'వాణిజ్య సరోగసీపై పూర్తి నిషేధం ఉంటుంది. వైద్యపరంగా పిల్లలు పొందలేని దంపతులు తమ సన్నిహిత బంధువుల సాయం తీసుకొని సరోగసీ ద్వారా పిల్లల్ని పొందొచ్చు. దీనిని అల్ట్రుయిస్టిక్ సరోగసీ అంటారు' అని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ విలేకరులకు తెలిపారు.
ఈ బిల్లుప్రకారం విదేశీయులు, ప్రవాస భారతీయులు, సింగల్ పెరెంట్, సహజీవనం చేసే దంపతులు, స్వలింగ సంపర్కులు సరోగసీ విధానం ద్వారా పిల్లలు పొందడానికి ఇకమీదట అనుమతించబోరు. 'ఓ జంట పెళ్లిచేసుకొని, కనీసం ఐదేళ్లు కలిసి జీవిస్తేనే' సరోగసీ విధానం అనుమతిస్తామని, వారికి ఇప్పటికే ఓ సంతానం ఉంటే ఇందుకు అనుమతించబోమని సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు.
సెలబ్రిటీలకు సుష్మా చురకలు!
తాజాగా తీసుకొచ్చిన సరోగసి బిల్లులో సెలబ్రిటీలకు ఎలాంటి మినహాయింపు ఉండబోదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్‌లకు ఇద్దరేసి సంతానం ఉన్నా.. సరోగసి విధానం ద్వారా మరో బిడ్డను పొందిన సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్న మరో బాలీవుడ్ హీరో తుషార్ కపూర్ కూడా సరోగసీ విధానంలో బిడ్డను కన్నాడు. ఈ నేపథ్యంలో ఇలాంటి విధానాలను ఇకముందు అనుమతించబోమని కేంద్రం తాజా బిల్లుతో తేల్చిచెప్పింది.
మీడియా సమావేశంలో ఈ సెలబ్రిటీల పేర్లను సుష్మా ప్రస్తావించకపోయినా.. వారికి పరోక్షంగా చురకలు అంటించారు. 'ఇద్దరేసి పిల్లలు ఉన్నప్పటికీ సెలబ్రిటీలు సరోగసీ ద్వారా మరో బిడ్డను కన్నారు. వాళ్ల భార్యలు పిల్లల్ని గర్భంలో మోసే బాధను పొందలేరు కనుక వేరే మహిళల మీద ఆ భారాన్ని మోపారు' అని సుష్మా పేర్కొన్నారు. అదేవిధంగా అద్దెగర్భాన్ని మోసినందుకు సన్నిహిత బంధువు అయిన మహిళకు వైద్యఖర్చులు మాత్రమే చెల్లించాలని, అంతేకానీ ఎక్కువమొత్తంలో ఆశ చూపకూడదని ఈ బిల్లు స్పష్టం చేస్తున్నది.