పారిస్: డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. వింబుల్డన్ చాంపియన్, నాలుగో సీడ్ ఎలీనా రిబాకినా ఫిట్‌నెస్ సమస్యలతో వైదొలగగా, ఆరోసీడ్ కోకో గాఫ్, 14వ సీడ్ హదాడ్ మైయాతో పాటు పురుషుల ఈవెంట్‌లో సీడెడ్లు కాస్పెర్ రూడ్, హోల్గెర్ రూన్ (డెన్మార్క్) ప్రిక్వార్టర్ ఫైనల్ చేరారు. జపనీస్ స్టార్ నిషిఒకా చెమటోడ్చి ముందంజ వేయగా, 15వ సీడ్ బొర్నా కొరిచ్ మూడో రౌండ్లో నిష్క్రమించాడు.
ఏకపక్షంగా...
మహిళల సింగిల్స్‌లో రెండుసార్లు (2020, 2022) ఇక్కడ క్లే కోర్ట్ చాంపియన్‌గా నిలిచిన ప్రపంచ నంబర్‌వన్ స్వియాటెక్‌కు మూడో రౌండ్లో చైనీస్ ప్రత్యర్థి నుంచి కనీస పోటీనే లేకపోయింది. దీంతో పోలండ్ స్టార్ 6–0, 6–0తో జిన్యూ వాంగ్‌ను అతి సునాయాసంగా ఓడించింది. కేవలం 51 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ఏకపక్షంగా ముగించింది. వింబుల్డన్ చాంపియన్, నాలుగో సీడ్ ఎలీనా రిబాకినా మ్యాచ్ బరిలోకి దిగకుండా టోర్నీ నుంచి తప్పుకుంది. అనారోగ్య కారణాలతో మూడో రౌండ్ బరిలోకి దిగలేనని 23 ఏళ్ల కజకిస్తాన్ ప్లేయర్ వెల్లడించింది. దీంతో ప్రత్యర్థి సార సొరిబెస్ టొర్మో (స్పెయిన్) వాకోవర్‌తో ప్రిక్వార్టర్స్ చేరింది. మిగతా మ్యాచ్‌ల్లో ఆరో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–7 (5/7), 6–1, 6–1తో మిర అండ్రీవా (రష్యా)పై గెలుపొందగా, 14వ సీడ్ హదాడ్ మైయా 5–7, 6–4, 7–5తో అలెగ్జాండ్రొవా (రష్యా)ను ఓడించింది.
పోరాడి ఓడిన సెబొత్
బ్రెజిలియన్ క్వాలిఫయర్ తియాగో సెబొత్ వైల్డ్ అంటే ఇకపై ప్రత్యర్థులు హడలెత్తిపోవాల్సిందే. ఎందుకంటే ఇదివరకే అతను తొలి రౌండ్లోనే యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ (2021), రెండో సీడ్ మెద్వెదెవ్ (రష్యా)పై సంచలన విజయం సాధించాడు. తాజాగా అతని దూకుడుకు జపాన్ నంబర్‌వన్ ఆటగాడు యొషిహితో నిషిఒకా బ్రేకులేసినప్పటికీ సెబొత్ తన పోరాటంతో ఆకట్టుకున్నాడు. 27వ సీడ్ నిషిఒకా 3–6, 7–6 (10/8), 2–6, 6–4, 6–0తో సెబొత్ వైల్డ్‌పై శ్రమించి గెలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్ నిరుటి రన్నరప్, నాలుగో సీడ్ కాస్పెర్ రూడ్ (నార్వే) 4–6, 6–4, 6–1, 6–4తో చైనాకు చెందిన జాంగ్ జిజెన్‌పై గెలుపొందాడు. నార్వే స్టార్‌కు తొలిసెట్లో ప్రతిఘటన ఎదురైనా... తర్వాత సెట్లలో సులువుగానే గెలిచాడు. గతేడాది క్వార్టర్ ఫైనల్ చేరిన ఆరోసీడ్ డెన్మార్క్ స్టార్ రూన్ ఇప్పుడు మెరుగైన ప్రదర్శన కనబరచాలనే పట్టుదలతో ఆడుతున్నాడు. మూడో రౌండ్లో తనకెదురైన ప్రత్యర్థి ఒలీవియెరి (అర్జెంటీనా)ను 6–4, 6–1, 6–3తో ఓడించాడు. కేవలం రెండు గంటల్లోనే (గంటా 58 నిమిషాలు) మ్యాచ్‌ను ముగించాడు. బొర్న కొరిచ్ (క్రొయే షియా) 3–6, 6–7(5/7), 2–6తో మార్టిన్ ఎచెవెరి (అర్జెంటీనా) చేతిలో పరాజయం చవిచూశాడు.
French Open 2023: ప్రిక్వార్టర్స్‌లో స్వియాటెక్
Published Sun, Jun 4 2023 5:56 AM | Last Updated on Sun, Jun 4 2023 5:56 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment