అది 1999 సంవత్సరం... ప్రతిష్టాత్మక ‘టూర్ డి ఫ్రాన్స్’ సైక్లింగ్ రేసు పోటీలు జరుగుతున్నాయి. అందరి దృష్టి అమెరికాకు చెందిన లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్‌పై నిలిచింది. అలా ఆకర్షించేందుకు అతనేమీ స్టార్ కాదు. అప్పటికే కొన్ని చెప్పుకోదగ్గ ఈవెంట్స్ గెలిచినా... దీంతో పోలిస్తే వాటి స్థాయి చిన్నదే. కానీ ఆర్మ్‌స్ట్రాంగ్ మూడేళ్ల క్రితం క్యాన్సర్‌తో ఆటకు దూరమయ్యాడు. ఆ మహమ్మారితో పోరాడి గెలిచిన తర్వాత ఇప్పుడు మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. అభిమానమో, సానుభూతో కానీ చాలా మంది అతనికి మద్దతుగా నిలిచారు. అద్భుత ప్రదర్శనతో టైటిల్ గెలుచుకున్న ఆర్మ్‌స్ట్రాంగ్ అదే జోరును మరో ఆరేళ్లు కొనసాగించి చరిత్ర సృష్టించాడు. కానీ ఇదంతా డ్రగ్స్ పవర్ అని తెలిసిన రోజున ప్రపంచం నివ్వెరపోయింది. ఒక హీరో అందరి దృష్టిలో విలన్‌గా మారిపోయాడు.
చిన్నప్పుడు స్విమ్మర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్మ్‌స్ట్రాంగ్ టీనేజీలో ట్రయాథ్లెట్‌గా కెరీర్‌పై దృష్టి పెట్టాడు. ఆ తర్వాత ప్రొఫెషనల్ సైక్లిస్ట్‌గా మారిన అతను ఈ క్రమంలో కొన్ని విజయాలు సాధించాడు. ‘థ్రిఫ్ట్ ట్రిపుల్ క్రౌన్ ఆఫ్ సైక్లింగ్’గా చెప్పుకునే పిట్స్‌బర్గ్, వర్జీనియా, ఫిలడెల్ఫియా కూడా ఉన్నాయి. ‘టూర్ డి ఫ్రాన్స్’లో కూడా కొన్ని రేసులు గెలిచినా... తగినంత గుర్తింపేమీ రాలేదు.
క్యాన్సర్‌తో పోరు...
సైక్లింగ్‌లో అద్భుతమైన కెరీర్‌ను ఆశిస్తున్న దశలో ఆర్మ్‌స్ట్రాంగ్‌పై పిడుగు పడింది. 25 ఏళ్ల వయసులోనే అతనికి ‘టెస్టిక్యులర్ క్యాన్సర్’ ఉన్నట్లు బయటపడింది. దాంతో జీవితంపై ఆశలు ఒక్కసారిగా కుప్పకూలాయి. అప్పటికే శరీరంలోని ఊపిరితిత్తులు, మెదడు, పొత్తికడుపులోకి అది వ్యాపించిందని డాక్టర్లు తేల్చారు. ఇక ‘స్ట్రాంగ్’గా పోరాడాల్సిన సమయం వచ్చేసింది. కేవలం 20 శాతం మాత్రమే బతికే అవకాశాలు ఉన్నాయని చెప్పిన రోజు నుంచి బతుకును మార్చుకునేందుకు అతను విధితో పోరాడాడు. రెండేళ్లకుపైగా అన్ని రకాల పరీక్షలను, చికిత్సలను ఎదుర్కొన్నాడు. చివరకు క్యాన్సర్‌ను జయించాడు. అయితే అది చావు నుంచి మాత్రమే... ఆట మా త్రం కుదరదు అని కొందరు హెచ్చరించారు. కానీ లాన్స్ వదల్లేదు. మళ్లీ సైకిల్ తీసుకొని ట్రాక్‌పైకి బయల్దేరాడు.
అద్భుత పురోగమనం...
ఇలాంటి స్థితిలో ఒక వైద్యుడి ద్వారా యూఎస్ పోస్టల్ సర్వీస్ జట్టులో చోటు దక్కింది. అదే అతని కెరీర్‌ను మలుపు తిప్పింది. 1998లో ‘టూర్ డి ఫ్రాన్స్’ బరిలోకి దిగినా ఫలితం దక్కలేదు కానీ తర్వాతి ఏడాది అతని జీవితం మలుపు తిరిగింది. 1999లో తొలిసారి అతను ఈ ప్రతిష్టాత్మక రేసులో గెలిచాడు. అది అక్కడితో ముగిసిపోలేదు. అదే జోరు కొనసాగిస్తూ వరుసగా 2000, 2001, 2002, 2003, 2004, 2005లలో కూడా ఆర్మ్‌స్ట్రాంగ్ విజేతగా నిలిచాడు.
ఈ క్రమంలో 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో కూడా టైమ్ ట్రయల్ రేస్‌లో కాంస్యం కూడా దక్కింది. ఆ సమయంలో అతను ప్రపంచవ్యాప్తంగా సైక్లింగ్‌కు పర్యాయపదంగా నిలిచాడు. అశేష అభిమానులు, స్పాన్సర్‌షిప్‌లు... ఇలా ఒక్కటేమిటి ఏడేళ్ల పాటు అతను సైక్లింగ్ ప్రపంచాన్ని శాసించాడు. 2005 విజయం తర్వాత అతను ఆటకు గుడ్‌బై చెప్పాడు. అయితే 2008లో పునరాగమనం చేసి కొన్ని రేస్‌లలో పాల్గొన్నా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.
డ్రగ్స్‌తో పతనం...
ఆర్మ్‌స్ట్రాంగ్ కెరీర్‌లో డ్రగ్స్ ఆరోపణలు కొత్త కాదు. క్యాన్సర్‌లాంటి వ్యాధి నుంచి కోలుకొని ఈ తరహా విజయాలు సాధించడం అసాధ్యమంటూ చాలాసార్లు అతనిపై విమర్శలు వచ్చినా అతను ప్రతీసారి వాటిని కొట్టిపారేశాడు. అతని సైక్లింగ్ సహచరుడు ఫ్లాయిడ్ లాండిస్ 2012లో చేసిన డోపింగ్ ఆరోపణలు ఆర్మ్‌స్ట్రాంగ్ పరువు తీశాయి. మేమందరం డ్రగ్స్ తీసుకునేవాళ్లమంటూ అతను చెప్పుకోవడంతో బండారం బయటపడింది. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన యునైటెడ్ స్టేట్స్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఇవన్నీ నిజమని నిరూపించింది.
తాను అమాయకుడిని అంటూనే దీనిపై అప్పీల్ వెళ్లకుండా ఆర్మ్‌స్ట్రాంగ్ మౌనం పాటించడంతోనే సైక్లింగ్ ప్రపం చం నివ్వెరపోయింది. తాజా పరిణామాలతో అతని నేరాన్ని ఒప్పు కున్నట్లుగా భావించి ఆర్మ్‌స్ట్రాంగ్ సాధించిన విజయాలన్నింటినీ లెక్క లోంచి తీసేశారు. వరల్డ్ యాంటీ డోపింగ్ నిబంధనల ప్రకారం అతను గెలిచిన ఏడు ‘టూర్ డి ఫ్రాన్స్’ టైటిల్స్‌ను రద్దు చేశారు. ఒలింపిక్ పతకాన్ని వెనక్కి తీసుకున్నారు.
చివరకు అంగీకారం
తనపై నిషేధం విధించాక ఏడాదికి ఆర్మ్‌స్ట్రాంగ్ నోరు విప్పాడు. ఇన్నేళ్లపాటు తాను జాగ్రత్తగా, ఒక పద్ధతి ప్రకారం డ్రగ్స్‌ను తీసుకున్నానని, తన విజయాలకు అదే కారణమని అంగీకరించాడు. అసలు డ్రగ్స్ లేకుండా ఏ రేసులోనూ బరిలోకి దిగలేదని బయటపెట్టాడు. దాంతో ఇన్నాళ్లూ అతనికి అండగా నిలిచిన స్పాన్సర్లు, కార్పొరేట్లు తిరగబడ్డారు. ఒక దిగ్గజ ఆటగాడిగా ప్రపంచం దృష్టిలో నిలిచి ఇప్పుడు ఇలా నైతికంగా పతనం కావడం నిజంగా విషాదం.
Comments
Please login to add a commentAdd a comment