
మృత్యువుతో ముఖాముఖి
విధివశాత్తూ దగ్గరి వారిని పోగొట్టుకున్న బాధితుల మనసులో కల్లోలాలు చెలరేగుతాయి. ఇదే అంశంతో తన స్వీయానుభవాలను జోడించి ‘వేర్ ఎర్త్ మీట్స్ వాటర్’ నవలను రాశారు పియా పడుకొనే...
విధివశాత్తూ దగ్గరి వారిని పోగొట్టుకున్న బాధితుల మనసులో కల్లోలాలు చెలరేగుతాయి. ఇదే అంశంతో తన స్వీయానుభవాలను జోడించి ‘వేర్ ఎర్త్ మీట్స్ వాటర్’ నవలను రాశారు పియా పడుకొనే...
విలయాలలో, విపత్తులలో, దుర్ఘటనల్లో అశువులు బాసే వారితో పాటే, విధివశాన మృత్యుంజయులైన వారూ ఉంటారు. అయితే ఆ ప్రమాదాలనుంచి తప్పించుకున్న వారు కూడా చాలాకాలం పాటు ఆ విషాద జ్ఞాపకాలలో జీవనం సాగిస్తుంటారు. అలాంటి విషాద జీవితాన్ని ‘వేర్ ఎర్త్ మీట్స్ వాటర్’ సున్నితంగా, భావయుక్తంగా స్పృశిస్తుంది.
మృత్యుముఖంలోకి వెళ్లొచ్చిన రచయిత్రి పియా పడుకొనె! నిజానికి మృత్యుముఖంలోకి వెళ్లొచ్చాకే ఆమె రచయిత్రి అయ్యారని చెప్పాలి. 2001 సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు ఆ జంట ఆకాశ హర్మ్యాలలోని ఒక దానిలో పియా కూడా ఉండవలసిందే కానీ ‘అదృష్టవశాత్తూ’ నాలుగు రోజుల ముందే ఆమె అక్కడ పని మానేసి వెళ్లిపోయారు. తిరిగి 2004లో పియా మృత్యువు సమీపానికి వెళ్లి వచ్చారు. ఆ ఏడాది డిసెంబరులో భారతదేశపు తూర్పు తీర ప్రాంతాన్ని సునామీ ముంచెత్తుతోంది. ఆ సమయానికి పియా తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి కొన్ని మైళ్ల సమీపంలో సముద్రపు ఒడ్డున ఉన్నప్పటికీ ‘అదృష్టవశాత్తూ’ బతికి బయటపడగలిగారు.
2013లో కూడా విధి పియాతో చెలగాటం ఆడబోయి ఆఖరి నిమిషంలో మనసు మార్చుకున్నట్లు ఆమెను వదిలిపెట్టింది. బోస్టన్ మారథాన్‌లో అకస్మాత్తుగా బాంబు పేలుళ్లు సంభవించిన సంవత్సరం అది. ఆ మారథాన్‌లో పాల్గొన్న పియా భర్త, అక్కడికి సమీపంలో ఉన్న పియా ఇద్దరూ ‘అదృష్టవశాత్తూ’ తృటిలో తప్పించుకున్నారు. నిజానికి అదొక అద్భుతం లా జరిగింది. పియ భర్త ఫినిషింగ్ లైన్‌ని దాటిన సంబరాన్ని ఆస్వాదించేందుకు దంపతులిద్దరూ కలిసి అక్కడికి సమీపంలోని బార్‌లోకి వెళ్లి కూర్చున్నారు. రెండు గుటకలు వేశారో లేదో... ఆ ప్రదేశం బాంబుల చప్పుళ్లతో దద్దరిల్లింది.
అయితే పియా ఈ మూడు సంఘటనల్లోనూ తను బయట పడడాన్ని ‘అదృష్టం’అనుకోలేకపోతున్నారు. మృత్యువు నుంచి తప్పించుకోవడం తనది అదృష్టం అయితే, మృత్యువుకు బలైన వారి మాట ఏమిటి? ఈ సంఘటన లు ఆమెలో ఆలోచనలను రేకెత్తించాయి. వీటి ఆధారంగా విధిపై ఒక పుస్తకం రాయడానికి ఆమెను ప్రేరేపించాయి. ఆ పుస్తకం పేరే ‘వేర్ ఎర్త్ మీట్స్ వాటర్’. హార్లెక్విన్ ఇండియా వారు ప్రచురించారు.
‘‘విధివశాత్తూ దగ్గరి వారిని పోగొట్టుకున్న బాధితుల భావోద్వేగాలలో ఎలాంటి కల్లోలాలు చెలరేగుతాయనే అంశంతో ఈ పుస్తకం రాశాను’’ అంటారు పియా. కన్నీళ్లను, ఉద్వేగాలను, మానసిక స్థితి గతులను మాత్రమే సారాశంగా తీసుకుని నవలను నడిపించారు. అందుకే పుస్తకంలో మనకు ఎక్కువగా పియా వ్యక్తిగత అభిప్రాయాలు, జ్ఞాపకాలు కనిపిస్తాయి. పాఠకులను కదిలిస్తాయి.
‘‘సెప్టెంబర్ 11 దాడుల ఘటనలో కొందరు ట్రేడ్ సెంటర్ ఉద్యోగులు రైలును సమయానికి అందుకోలేక తప్పించుకున్నారు. కొందరు ఆఫీస్ టైమ్‌కి నిద్రలేవలేక, కొందరైతే మీటింగ్ రద్దయిన కారణంగా ఆఫీసుకు రావలసిన అవసరం లేక తప్పించుకున్నారు. అలాంటి వారిలో తాము బైటపడ్డామన్న సంతోషం కన్నా కూడా, ‘అయ్యో వారు చనిపోయారే’ అనే బాధ, అవేదన ఉంటుందని నేను గ్రహించగలను. ఆ గ్రహింపునుంచే నాకీ నవల రాయాలన్న ఆలోచన వచ్చింది’’ అని చెబుతున్న పియా పడుకొనె ఇప్పటికే రెండో నవల రాసే ప్రయత్నంలో ఉన్నారు! ప్రస్తుతం ఆమె తన భర్త రోహిత్‌తో కలిసి ‘టు అడ్మైరబుల్ ప్లెజర్స్’ అనే బ్లాగు నడుపుతున్నారు.
అందులో వారు పుస్తక సమీక్షల గురించీ, కొత్త కొత్త వంటల తయారీ గురించి రాస్తుంటారు. ఇద్దరం కలిసి ఇలా కొత్త కొత్త రుచులను పంచుకోవడం నాకెంతో బాగుంటుంది’’ అని చెప్పే పియా పడుకొనేకి ఇక ఇప్పట్లో మృత్యువుతో ముఖాముఖి ఉండకూడదని ఆశిద్దాం.