24, 25 తేదీల్లో నిర్వహణ
27 వేలకు పైగా రన్నర్లు పాల్గొనే అవకాశం
తొలిసారిగా ఈ మారథాన్‌కు వరల్డ్ అథ్లెటిక్స్ గుర్తింపు
దేశంలో గుర్తింపు పొందిన రెండో మారథాన్
సాక్షి, సిటీబ్యూరో: అది ముంబై మహానగరం.. ఉరుకులు పరుగుల జీవితం.. ఎవరి పనుల్లో వారు ఫుల్ బిజీ.. కానీ ఆ ఒక్క రోజు మాత్రం ముంబై నగరం మొత్తం పండుగ. కులం, మతం తేడా ఉండదు. చిన్నా పెద్ద బేధాలు ఉండవు. నగర వీధుల్లోకి వచ్చి పూలు చల్లుతూ కొందరు.. ఎనర్జీ డ్రింక్స్ ఇస్తూ ఇంకొందరు.. తినుబండారాలు ఇస్తూ మరికొందరు అలా ఉండిపోతారు. ఇంతకీ ఇలా ముంబైకర్లు ఎందుకు చేస్తారనే కదా మీ సందేహం..
ముంబై మారథాన్ రోజున ఇలా అందరూ ఏకమై ఓ పెద్ద పండుగలా సంబరాలు చేసుకుంటారు. ముంబై మారథాన్‌ను తమదిగా ముంబైవాసులు అంతలా ఓన్ చేసుకుంటారన్న మాట. ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే అదే రీతిలో మన హైదరాబాద్ నగరంలో కూడా కొద్దిరోజుల్లోనే ఎన్‌ఎండీసీ హైదరాబాద్ మారథాన్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగే ఈ మారథాన్‌ను కూడా నగరం సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈసారి ఈ మారథాన్‌కు ఓ అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ అథ్లెటిక్ గుర్తింపు పొందింది. ముంబై మారథాన్‌కు మాత్రమే ఇప్పటి వరకు ఈ గుర్తింపు ఉండేది. దేశంలో ఆ గుర్తింపు పొందిన మారథాన్ హైదరాబాద్ మారథాన్ కావడం విశేషం.
రూ.44 లక్షల ప్రైజ్‌మనీ..
ఈ మారథాన్‌లో మొత్తం రూ.44 లక్షల ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. తొలిస్థానంలో నిలిచిన వారికి రూ.5 లక్షలు, రెండోస్థానంలో పూర్తిచేసిన వారికి రూ.2.5 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.2 లక్షల పురస్కారం అందించనున్నారు. ఇక, కోర్సు రికార్డు సాధించిన రన్నర్‌కు రూ.10 లక్షల నగదు పురస్కారం, జాతీయ రికార్డు బద్దలు కొట్టిన వారికి రూ.5 లక్షల పారితోషికం అందజేస్తారు.
దేశంలోనే రెండో అతిపెద్దది..
మరో 15 రోజుల్లో ప్రారంభమయ్యే హైదరాబాద్ మారథాన్‌లో వేల సంఖ్యలో రన్నర్లు పాల్గొంటారు. ఈ ఏడాది 27 వేలకు పైగా మంది మారథాన్‌లో పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ మారథాన్‌లో పాల్గొనే రన్నర్ల సంఖ్య పరంగా చూసుకుంటే.. భారత్‌లోనే అతిపెద్ద రెండో పరుగు ఇది. ఈ మారథాన్‌లో 42 కిలోమీటర్ల దూరం రన్నర్లు పరుగెత్తనున్నారు. ఫుల్ మారథాన్‌తో పాటు హాఫ్ మారథాన్, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల పరుగు కూడా ఉంటుంది. ఇటీవలే ఈ మారథాన్
డ్రైరన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.
ఫన్ రన్‌తో ప్రారంభమై..
మారథాన్ మొదటి రోజైన 24వ తేదీన ఫన్ రన్ పేరుతో 5కే రన్ ఉంటుంది. ఇది అసలు మారథాన్‌కు కర్టెన్ రైజర్ లాంటిది. ప్రతిఒక్కరూ రన్నింగ్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు ఈ ఫన్ రన్ ఏర్పాటు చేశారు. ఇది హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ క్యాంపస్‌లో ఉంటుంది. ఇక మరుసటి రోజు అసలు మారథాన్ (42 కి.మీ.) ప్రారంభం అవుతుంది. పీపుల్స్ ప్లాజా వద్ద ఉదయం మారథాన్ ప్రారంభం అవుతుంది. రాజ్‌భవన్ రోడ్డు, పంజాగుట్ట ఫ్లైఓవర్, కేబీఆర్ పార్కు, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, మైండ్ స్పేస్ జంక్షన్, బయోడైవర్సిటీ జంక్షన్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, హెచ్‌సీయూ మీదుగా గచ్చిబౌలి అథ్లెటిక్ స్టేడియం వద్ద ముగుస్తుంది. హాఫ్ మారథాన్ పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభమై.. 21 కి.మీ. దూరం ఉండేలా నిర్దేశించిన మార్గంలో రన్ ఉంటుంది. ఇది కూడా గచ్చిబౌలి స్టేడియం వద్ద ముగుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment