Running competitions
-
Hyderabad: రన్.. సిటీ రన్! త్వరలో నగరంలో మారథాన్..
సాక్షి, సిటీబ్యూరో: అది ముంబై మహానగరం.. ఉరుకులు పరుగుల జీవితం.. ఎవరి పనుల్లో వారు ఫుల్ బిజీ.. కానీ ఆ ఒక్క రోజు మాత్రం ముంబై నగరం మొత్తం పండుగ. కులం, మతం తేడా ఉండదు. చిన్నా పెద్ద బేధాలు ఉండవు. నగర వీధుల్లోకి వచ్చి పూలు చల్లుతూ కొందరు.. ఎనర్జీ డ్రింక్స్ ఇస్తూ ఇంకొందరు.. తినుబండారాలు ఇస్తూ మరికొందరు అలా ఉండిపోతారు. ఇంతకీ ఇలా ముంబైకర్లు ఎందుకు చేస్తారనే కదా మీ సందేహం..ముంబై మారథాన్ రోజున ఇలా అందరూ ఏకమై ఓ పెద్ద పండుగలా సంబరాలు చేసుకుంటారు. ముంబై మారథాన్‌ను తమదిగా ముంబైవాసులు అంతలా ఓన్ చేసుకుంటారన్న మాట. ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే అదే రీతిలో మన హైదరాబాద్ నగరంలో కూడా కొద్దిరోజుల్లోనే ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగే ఈ మారథాన్‌ను కూడా నగరం సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈసారి ఈ మారథాన్‌కు ఓ అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ అథ్లెటిక్ గుర్తింపు పొందింది. ముంబై మారథాన్‌కు మాత్రమే ఇప్పటి వరకు ఈ గుర్తింపు ఉండేది. దేశంలో ఆ గుర్తింపు పొందిన మారథాన్ హైదరాబాద్ మారథాన్ కావడం విశేషం.రూ.44 లక్షల ప్రైజ్‌మనీ.. ఈ మారథాన్‌లో మొత్తం రూ.44 లక్షల ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. తొలిస్థానంలో నిలిచిన వారికి రూ.5 లక్షలు, రెండోస్థానంలో పూర్తిచేసిన వారికి రూ.2.5 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.2 లక్షల పురస్కారం అందించనున్నారు. ఇక, కోర్సు రికార్డు సాధించిన రన్నర్‌కు రూ.10 లక్షల నగదు పురస్కారం, జాతీయ రికార్డు బద్దలు కొట్టిన వారికి రూ.5 లక్షల పారితోషికం అందజేస్తారు.దేశంలోనే రెండో అతిపెద్దది.. మరో 15 రోజుల్లో ప్రారంభమయ్యే హైదరాబాద్ మారథాన్‌లో వేల సంఖ్యలో రన్నర్లు పాల్గొంటారు. ఈ ఏడాది 27 వేలకు పైగా మంది మారథాన్‌లో పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ మారథాన్‌లో పాల్గొనే రన్నర్ల సంఖ్య పరంగా చూసుకుంటే.. భారత్‌లోనే అతిపెద్ద రెండో పరుగు ఇది. ఈ మారథాన్‌లో 42 కిలోమీటర్ల దూరం రన్నర్లు పరుగెత్తనున్నారు. ఫుల్ మారథాన్‌తో పాటు హాఫ్ మారథాన్, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల పరుగు కూడా ఉంటుంది. ఇటీవలే ఈ మారథాన్ డ్రైరన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఫన్ రన్‌తో ప్రారంభమై..మారథాన్ మొదటి రోజైన 24వ తేదీన ఫన్ రన్ పేరుతో 5కే రన్ ఉంటుంది. ఇది అసలు మారథాన్‌కు కర్టెన్ రైజర్ లాంటిది. ప్రతిఒక్కరూ రన్నింగ్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు ఈ ఫన్ రన్ ఏర్పాటు చేశారు. ఇది హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ క్యాంపస్‌లో ఉంటుంది. ఇక మరుసటి రోజు అసలు మారథాన్ (42 కి.మీ.) ప్రారంభం అవుతుంది. పీపుల్స్ ప్లాజా వద్ద ఉదయం మారథాన్ ప్రారంభం అవుతుంది. రాజ్‌భవన్ రోడ్డు, పంజాగుట్ట ఫ్లైఓవర్, కేబీఆర్ పార్కు, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, మైండ్ స్పేస్ జంక్షన్, బయోడైవర్సిటీ జంక్షన్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, హెచ్‌సీయూ మీదుగా గచ్చిబౌలి అథ్లెటిక్ స్టేడియం వద్ద ముగుస్తుంది. హాఫ్ మారథాన్ పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభమై.. 21 కి.మీ. దూరం ఉండేలా నిర్దేశించిన మార్గంలో రన్ ఉంటుంది. ఇది కూడా గచ్చిబౌలి స్టేడియం వద్ద ముగుస్తుంది. -
కుక్కల పరుగు పందెం.. మామూలుగా లేదుగా!
అయిజ(జోగుళాంబ గద్వాల జిల్లా): అయిజలోని తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం అంతర్రాష్ట్ర శునకాల పరుగు పోటీ నిర్వహించారు. పోటీలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 9 కుక్కలు పాల్గొనగా.. అన్ని బహుమతులను కర్ణాటక రాష్ట్రానికి చెందిన శునకాలు కైవసం చేసుకోవడం విశేషం. ఇండి జిల్లాకు చెందిన వీఐపీ లల్యా ప్రథమ బహుమతిగా రూ.15,016, సుల్తాన్ ద్వితీయ బహుమతిగా రూ.10,016, తేజకళ్ల తృతీయ బహుమతిగా రూ.8,016, బాపురం జిల్లాకు చెందిన అంజి నాలుగో బహుమతిగా రూ.5,016 గెలుపొందాయి. పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిమంది తరలివచ్చారు. చదవండి: బాబా ముసుగులో ‘నిత్య’ పెళ్లికొడుకు -
5 నెలల గర్భవతి... 10 కి.మీ. పరుగు... 62 నిమిషాల్లో...
బెంగళూరు: మహిళా‘శక్తి’ అంటే ఇదేనేమో! పురుషులు ఏ కొంచెం ఎక్కువ శ్రమించినా బాగా అలసిపోయాం... ఇక విశ్రాంతి కావాల్సిందే అంటారు. కానీ మహిళ మాత్రం ఓ బిడ్డను మోస్తున్నా ఇంటి పని చేస్తుంది. ఆఫీస్‌కెళ్లి డ్యూటీ చేస్తుంది. అంతేగానీ... నెలతప్పిన నాటి నుంచి ప్రసవించే దాకా రెస్ట్ తీసుకుంటానని భీష్మించుకోదు కదా! ఇదే జరిగితే మన పొద్దు గడవడం కాదు... ప్రపంచమే నడవకుండా ‘లాక్డౌన్’ అయ్యేది. ఇక విషయానికొస్తే... ఓ మహిళ మరో అడుగు ముందుకేసింది. స్ఫూర్తిగొలిపే పరుగు పెట్టింది. ఐదు నెలల గర్భవతి అయిన ఆమె 10కే (10 కిలోమీటర్లు) పరుగును 62 నిమిషాల్లో పూర్తి చేసింది. ఆ ధీర వనిత బెంగళూరుకు చెందిన 35 ఏళ్ల అంకిత గౌర్. వృత్తిరీత్యా ఇంజినీర్ అయిన అంకిత గత తొమ్మిదేళ్లుగా ఇలాంటి పరుగు పోటీల్లో పాల్గొంటూనే ఉంది. ఇక టీసీఎస్ 10కే రన్లో 2013 సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా పోటీ పడుతూనే ఉంది. ఇందులో విశేషం లేదు. కానీ ఇప్పుడామె 5 నెలల గర్భవతి. మరో మూణ్నాలుగు నెలల్లో అంకిత తల్లి కానుంది. అయినా సరే తనకిష్టమైన పరుగు కోసం తన గైనకాలజిస్టును సంప్రదించి మరీ పోటీపడింది. దీనిపై అంకిత మాట్లాడుతూ ‘గడిచిన తొమ్మిదేళ్లుగా ఈ ‘పరుగు’ పెడుతూనే ఉన్నాను. నిత్యం నేను తీసుకునే శ్వాసలాగే నా జీవితంలో నేను పెట్టే పరుగు ఓ భాగం’ అని వివరించింది. ప్రతిరోజూ తను రన్నింగ్ చేస్తూనే ఉంటానని చెప్పిన ఆమె ఐదు అంతర్జాతీయ మారథాన్లలోనూ పాల్గొన్నట్లు పేర్కొంది. బెర్లిన్‌లో మూడుసార్లు, బోస్టన్, న్యూయార్క్ మారథాన్లలో ఒక్కోసారి పోటీపడినట్లు తెలిపింది. గతంలో టీసీఎస్ 10కేలోనూ పతకాలు గెలిచానని వివరించింది. -
గాడిదలకు పరుగు పందాలు
-
ఉత్సాహంగా క్రాస్‌కంట్రీ పరుగు పోటీలు
గుడివాడ టౌన్, న్యూస్‌లైన్ : కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల క్రాస్‌కంట్రీ పరుగు పోటీల్లో ఇబ్రహీంపట్నం, నందిగామ విద్యార్థులు ప్రతిభ చాటారు. పురుషుల విభాగంలో ఇబ్రహీంపట్నం డాక్టర్ జాకీర్‌హుస్సేన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, మహిళల విభాగంలో నందిగామ కేవీఆర్ కళాశాల విద్యార్థులు మొదటిస్థానం సాధించారు. శనివారం స్థానిక ఏఎన్నార్ కళాశాలలో ఉత్సాహపూరిత వాతావరణంలో ఈ పోటీలు జరిగాయి. పురుషుల విభాగంలో 12 కిలోమీటర్లు, మహిళల విభాగంలో 6 కిలోమీటర్ల పరుగు పోటీలు నిర్వహించారు. యూనివర్సిటీ పరిధిలోని మొత్తం 13 కళాశాలలకు చెందిన 100 మందికి పైగా విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. పురుషుల విభాగంలో మొవ్వ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రెండో, గుడివాడ ఏఎన్నార్ కళాశాల మూడో, నందిగామ కేవీఆర్ కళాశాల విద్యార్థులు నాలుగో స్థానంలో నిలిచారు. మహిళల విభాగంలో గుడివాడ ఏఎన్నార్ కళాశాల రెండో, విజయవాడ ఎస్జీఎంఎస్ కళాశాల మూడో, మేరీ స్టెల్లా కళాశాల విద్యార్థులు నాలుగో స్థానం సాధించారు. పురుషుల పోటీలను స్థానిక ఏలూరు రోడ్డులోని వీకేఆర్ అండ్ వీఎన్‌బీ పాలిటెక్నిక్ వద్ద ఏఎన్నార్ కళాశాల కోశాధికారి కె.ఎస్.అప్పారావు, మహిళల పోటీలను పెదపారుపూడి మండలం దోసపాడులో సర్పంచ్ సజ్జా శివకుమార్ ప్రారంభించారు. ఈ పోటీల్లో ఒక్కొక్క కళాశాల నుంచి ఆరు నుంచి తొమ్మిది మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీల్లో విజేతలకు ఆర్డీవో వెంకటసుబ్బయ్య బహుమతులు అందజేశారు. క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణిస్తారు.. క్రీడలపై ఆసక్తి ఉంటే అన్ని రంగాల్లో రాణించగలుగుతారని ఆర్డీఓ ఎస్.వెంకటసుబ్బయ్య అన్నారు. పరుగు పోటీల విజేతలకు బహుమతుల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. క్రీడలు శారీరక దారుఢ్యాన్ని పెంచడంతో పాటు మానసిక వికాసాన్ని పెంపొందిస్తాయన్నారు. ప్రతి విద్యార్థీ తనకు తోచిన క్రీడపై ఆసక్తి పెంచుకుని అందులో నైపుణ్యం సాధించడానికి ప్రయత్నించాలని సూచించారు. కృష్ణా యూనివర్సిటీ ఈ విధమైన గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. కృష్ణా యూనివర్సిటీ పరిశీలకుడు ఎన్.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరానికి గాను క్రీడల అభివృద్ధి, ప్రోత్సాహానికి రూ.33 లక్షల నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెదపారుపూడి కళాశాల కార్యదర్శి పర్వతనేని నాగేశ్వరరావు, కోశాధికారి కేఎస్ అప్పారావు, కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.శంకర్, పీజీ డెరైక్టర్ నరసింహారావు, వ్యాయామ ఉపాధ్యాయుడు వై.ఉదయభాస్కర్, టి.శ్రీనివాసరావు, లైబ్రేరియన్ పద్మజ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.