మధుస్మిత జెన
మొన్నటికి మొన్న గ్వాలియర్‌లో... చీరె ధరించి ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో పాల్గొని సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు మహిళామణులు. తాజాగా... మాంచెస్టర్ మారథాన్‌లో చీరె ధరించి పాల్గొని ‘శభాష్’ అని ప్రశంసలు అందుకుంటోంది మధుస్మిత జెన...
చిన్నప్పటి నుంచి మధుస్మితకు పరుగెత్తడం అంటే ఇష్టం. ఆ ఇష్టమే తనకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువచ్చింది. మాంచెస్టర్‌లో హైస్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న మధుస్మిత జెన నార్త్ వెస్ట్ ఇంగ్లాండ్ ఒడియా కమ్యూనిటీలో క్రియాశీల కార్యకర్త. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మారథాన్‌లు, ఆల్ట్రా మారథాన్‌లలో పాల్గొంది.
తాజాగా మాంచెస్టర్‌లో 42.5 కి.మీల మారథాన్‌లో పాల్గొంది. ఈసారి మాత్రం అందరూ ఆశ్చర్యపడేలా చేసింది. అభినందనలు అందుకుంది. ఈసారి ప్రత్యేకత...సంబల్‌పురీ చీర కట్టి మారథాన్‌లో పాల్గొంది మధుస్మిత.
‘అంతదూరం చీరతో పరుగెత్తడం సులువేమీ కాదు’ అంటున్న మధుస్మిత సంతోషం ప్లస్ సంకల్పబలంతో నాలుగు గంటల యాభైనిమిషాలలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. ‘చీరతో మారథాన్‌లో పాల్గొనడం అసాధ్యం అనేది చాలామంది నమ్మకం. ఇది తప్పని రుజువు చేయాలనుకున్నాను’ అంటుంది 41 సంవత్సరాల మధుస్మిత.
‘తనలోని ప్రతిభతో ఎప్పుడూ ఎంతోమందికి స్మిత స్ఫూర్తి ఇస్తుంటుంది. ఆమె విజయానికి గర్విస్తున్నాం’ అంటున్నాడు ఒడియా కమ్యూనిటీ మాజీ కార్యదర్శి సుకాంత్ కుమార్ సాహు. ఒడిశాలోని కుస్పూర్ గ్రామానికి చెందిన మధుస్మితకు తల్లి, అమ్మల ద్వారా చీరెపై ఇష్టం ఏర్పడింది. ఇంగ్లాండ్‌లో ప్రత్యేకమైన సందర్భాలు, వేసవిలో చీర ధరిస్తుంది మధుస్మిత.
Comments
Please login to add a commentAdd a comment