లాకప్‌లో మరణించిన యువకుడు
రక్షక భటులే భక్షకులయ్యారంటూ జనం తిరగబడ్డారు. ప్రజాగ్రహానికి పోలీస్‌స్టేషన్ రణరంగమైంది. ఆందోళనకారులు బీభత్సం సృష్టించి పోలీస్‌స్టేషన్, అక్కడి వాహనాలకు నిప్పుపెట్టారు. స్టేషన్‌లోని విలువైన పత్రాలను తగులబెట్టారు. అలజడి సృష్టిస్తున్న ఆందోళనకారులను అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. సంబల్‌పూర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఈ విధ్వంసకర సంఘటనపై బాధ్యులను చేస్తూ ముగ్గురు పోలీస్ సిబ్బందిపై డీజీపీ సస్పెన్షన్ వేటు వేశారు.
భువనేశ్వర్/సంబల్‌పూర్: సంబల్‌పూర్ జిల్లాలోని ఒంయిఠాపల్లి పోలీస్‌స్టేషన్‌లో జరిగిన లాకప్‌డెత్ సంఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గురువారం అర్ధరాత్రి ఓ నిందితుడు పోలీస్‌స్టేషన్‌లో ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం ఉదయం ఈ వార్త ప్రసారం కావడంతో సంబల్‌పూర్‌లో శాంతిభద్రతలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నెల 7వతేదీన జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో మొబైల్, బంగారు ఆభరణాలు చోరీ అయినట్లు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. దీని ఆధారంగా చోరీ కేసులో ఒంయిఠాపల్లి పోలీసులు భాలూపల్లి గ్రామస్తుడు ఒవినాష్ ముండాను(25) అనుమానిత నిందితుడిగా గురువారం స్టేషన్‌కు తీసుకువచ్చారు. మర్నాడు ఉదయం నిందితుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులకు సమాచారం అందింది. బెడ్‌షీట్‌తో ఉరివేసుకుని నిందితుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల కథనం. శుక్రవారం వేకువ జామున 3 గంటల ప్రాంతంలో కుటుంబీకులకు ఈ వార్త తెలిసింది. జిల్లా ప్రధానఆస్పత్రికి మృతదేహం తరలించినటుŠల్ తెలియడంతో అంతా అక్కడకు చేరారు. మృతుని కుటుంబీకులు, మేజిస్ట్రేట్ సమక్షంలో పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని బుర్లా మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు.
పోలీసులే చంపేశారు
తమబిడ్డ ప్రాణాల్ని పోలీసులే పొట్టన పెట్టుకున్నారని కుటుంబీకులు వాపోతున్నారు. పోలీసుల వేధింపులు తాళలేని పరిస్థితుల్లోనే ప్రాణాలు కోల్పోయి ఉంటాడని మృతుని కుటుంబీకులు ఆవేదనతో రగిలిపోతున్నారు. వీరితో పాటు స్థానికులు కూడా పోలీస్ చర్యల పట్ల సందేహం వ్యక్తం చేస్తున్నారు. దుశ్చర్యలకు ఆత్మహత్య రంగు పులిమి దాటవేతకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసులతో జరిగిన సంప్రదింపులు క్రమంగా వేడెక్కాయి. నిందితుని ప్రాణాల్ని పోలీసులే బలిగొన్నారన్న ఆరోపణ బహిరంగంగా ప్రసారం కావడంతో ఒంయిఠాపల్లి పోలీస్‌స్టేషన్ పరిసరాలు యుద్ధరంగంగా మారాయి. మృతుని కుటుంబీకులు, బంధుమిత్రులతో పాటు స్థానికులు ఒక్కసారిగా పోలీస్‌స్టేషన్‌పై దాడికి పాల్పడ్డారు. రాళ్లు రువ్వుతూ విజృంభించారు.
స్టేషన్‌లోకి చొరబడి ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి ఆందోళనకు దిగారు. స్థానికుల ఆగ్రహావేశాల్ని నియంత్రించడం పోలీసులకు సాధ్యం కాలేదు. ఒంయిఠాపల్లి స్టేషన్‌పై నిరవధికంగా రాళ్లు రువ్విన స్థానికులు చివరికి నిప్పు అంటించారు. అలాగే స్టేషన్ ప్రాంగణంలో వాహనాలకు నిప్పుపెట్టి బీభత్సం సృష్టించారు. ఈ క్రమంలో ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలు ఝుళిపించడంతో పరిస్థితి చేయి దాటింది. ప్రజలు పోలీసులపై ప్రత్యక్ష తిరుగుబాటుకు సిద్ధం కావడంతో పోలీస్‌స్టేషన్ ఆవరణ రణక్షేత్రంగా మారింది. పోలీసులు, ప్రజల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు సాధారణ ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువుర్ని ఆస్పత్రిలో చేర్చారు. స్టేషన్ పరిసరాల్లో బీభత్సానికి పాల్పడిన ప్రజానీకం అనంతరం జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు. దీంతో సంబల్‌పూర్–ఝార్సుగుడ మార్గంలో వాహనాల రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
మానవ హక్కుల కమిషన్ విచారణ
ఈ సంఘటనపై మానవ హక్కుల కమిషన్ విచారణకు ఆదేశించినట్లు డీజీపీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ శర్మ తెలిపారు. ముగ్గురు సభ్యుల మానవ హక్కుల కమిషన్ బృందం ఈ దర్యాప్తు చేపడుతుంది. ఉత్తర ప్రాంతీయ ఇనస్పెక్టర్ జనరల్ ఈ సంఘటనలో ప్రత్యేక దర్యాప్తు నిర్వహించి నివేదిక దాఖలు చేస్తారని డీజీపీ తెలిపారు. సత్వరమే ఈ నివేదిక దాఖలు చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. సంబల్‌పూర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సంప్రదింపులతో మానవ హక్కుల పరిరక్షణ బృందం విచారణ, దర్యాప్తు కొనసాగుతుందని మానవ హక్కుల పరిరక్షణ విభాగం – హెచ్‌ఆర్‌పీసీ అదనపు డైరెక్టర్ జనరల్ మహేంద్ర ప్రతాప్ తెలిపారు.
ఇన్‌స్పెక్టర్ ఇన్‌చార్జిపై వేటు
విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ఆరోపణ కింద సంబల్‌పూర్ ఒంయిఠాపల్లి పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇన్‌చార్జిని తక్షణమే విధుల నుంచి తప్పించి సస్పెన్షన్ వేటు వేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరు స్టేషన్ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు డీజీపీ ప్రకటించారు. వీరిలో స్టేషన్ డైరీ చార్జ్ ఆఫీసర్, సెంట్రీ ఇన్‌చార్జి ఉన్నట్లు ఉత్తర ప్రాంతీయ ఇన్‌స్పెక్టర్ జనరల్ సుశాంత నాథ్ తెలిపారు. 2 యూనిట్ల అగ్ని మాపక దళం రంగంలోకి దిగి మంటల్ని నివారించింది. ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకుంటే శాంతిభద్రతల పరిరక్షణ సక్రమంగా ఉంటుందని డీజీపీ వివరించారు. పరిస్థితి అదుపులోకి రాకుంటే ఈ ప్రాంతంలో 144వ సెక్షన్ విధించడం అనివార్యమవుతుందని డీజీపీ స్పష్టం చేశారు. ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకునేందుకు 7 ప్లాటూన్ల పోలీసు దళాల్ని రంగంలోకి దింపారు.
హెచ్‌ఆర్‌సీ మార్గదర్శకాలతో పోస్ట్‌మార్టం
జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాల మేరకు సందిగ్ధ లాకప్ డెత్ సంఘటనలో మృతదేహానికి పోస్ట్‌మార్టం జరుగుతుంది. వైద్య నిపుణుల బృందం ప్రత్యక్ష పర్యవేక్షణలో శవపరీక్షలు నిర్వహిస్తారు. ఈ యావత్ ప్రక్రియ వీడియో రికార్డింగ్ అవుతుందని సంబల్‌పూర్ ఎస్పీ సంజీవ్ అరోరా తెలిపారు.
మృతుని కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం
పోలీసు స్టేషన్‌లో తుదిశ్వాస విడిచిన నిందితుని కుటుంబీకులకు ముఖ్యమంత్రి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. లాకప్ డెత్‌ను పురస్కరించుకుని ఆయన ఈ పరిహారం ప్రకటించారు. ఈ సంఘటనపట్ల సీఎం నవీన్ పట్నాయక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment