
Kelvin Kiptum: కెన్యా అథ్లెట్, మారథాన్ ప్రపంచ రికార్డు విజేత కెల్విన్ కిప్టం దుర్మరణం పాలయ్యాడు. ఆదివారం జరిగిన కారు ప్రమాదంలో 24 ఏళ్ల ఈ యువ అథ్లెట్ మరణించాడు. ఆ సమయంలో కెల్విన్‌తో పాటే కారులో ఉన్న అతడి కోచ్ గెర్వాస్ హాకిజిమనా కూడా కన్నుమూశాడు.
ఈ ఘటన క్రీడా ప్రపంచంలో తీవ్ర విషాదం నింపింది. కెల్విన్, గెర్వాస్ హఠాన్మరణం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని.. వారి ఆత్మలకు శాంతి కలగాలంటూ వరల్డ్ అథ్లెటిక్స్ అధ్యక్షుడు సెబాస్టియన్ కోయే విచారం వ్యక్తం చేశాడు.
కాగా పురుషుల మారథాన్ ఈవెంట్లో కెల్విన్ కిప్టం ప్రపంచ రికార్డు సాధించాడు. అక్టోబరు 8, 2023లో చికాగో మారథాన్‌లో పాల్గొన్న అతడు రెండు గంటల 35 సెకండ్లలోనే పరుగు పూర్తి చేశాడు. తద్వారా రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచిన ఎల్యూడ్ కిచోగ్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఎల్యూడ్ కంటే 34 సెకండ్ల ముందే లక్ష్యాన్ని చేరుకుని ఈ ఘనత సాధించాడు.
ఈ క్రమంలో... రెండు గంటల ఒక నిమిషానికి ముందే మారథాన్ పూర్తి చేసిన పురుష అథ్లెట్‌గా కెల్విన్ చరిత్రకెక్కాడు. పారిస్ ఒలింపిక్స్-2024 లక్ష్యంగా ముందుకు సాగుతున్న అతడు ఇలా హఠాన్మరణం చెందాడు.
కోచ్‌తో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో కెల్విన్ కిప్టం కారు అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కెల్విన్, కోచ్ గెర్వాస్ అక్కడిక్కడే మృతి చెందగా.. కారులో ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.కాగా కెల్విన్ కిప్టంకు భార్య అసెనాథ్ రోటిచ్, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
చదవండి: Devon Conway - Kim Watson: ‘గర్భస్రావం.. మా బిడ్డను కోల్పోయాం’