రికార్డ్ ఈతగాడు | Record Swimmer Dileep chit chat with Sakshi Cityplus | Sakshi
Sakshi News home page

రికార్డ్ ఈతగాడు

Published Sat, Oct 25 2014 1:06 AM | Last Updated on Fri, Sep 28 2018 4:15 PM

రికార్డ్ ఈతగాడు - Sakshi

రికార్డ్ ఈతగాడు

‘లైఫ్ సేవింగ్ ఆర్ట్’  అని నాన్న చెప్పిన మాటలు అతడిని కదలించాయి. ఈత నేర్చుకుంటే మనల్నే కాదు ఇతరులను కూడా ఆపద సమయాల్లో రక్షించవచ్చన్న అమ్మ మాటలు.. అతని మనసును ఈతవైపు మళ్లించాయి. ఇంటర్‌లో నేర్చుకున్న స్విమ్మింగ్ ఈ రోజు అతగాడిని గజఈతగాడిగా నిలబెట్టాయి. హైదరాబాద్ సిటీ సలామ్ చేసేలా యాప్రాల్‌లోని పయనీర్ స్విమ్మింగ్ పూల్‌లో ఏకంగా 24 గంటల పాటు 75 కిలోమీటర్ల లాంగెస్ట్ స్విమ్మింగ్ మారథాన్ చేసి ఇండియన్, ఆసియా బుక్స్ రికార్డుల్లో చోటు దక్కించుకున్న ‘దిలీప్’తో సిటీప్లస్ ముచ్చటించింది.
 
 మాది కరీంనగర్ జిల్లా గోదావరిఖని. నాన్న రాజలింగం సింగరేణిలో ఏరియాస్ స్టోర్స్ క్లర్క్. మంచి స్పోర్ట్స్‌మన్ కూడా. అమ్మ కళావతి గృహిణి. చిన్నప్పటి నుంచే ఎక్కువగా పాఠశాలలో జరిగే కబడ్డీ, ఖోఖో, క్రికెట్ పోటీల్లో పాల్గొనేవాణ్ని. ఇంటర్ వచ్చాక నాన్న ఈత నేర్చుకోవడం మంచిదని ఓ రోజు స్విమ్మింగ్ పూల్‌కు తీసుకెళ్లారు.‘స్విమ్మింగ్ మంచి వ్యాయామమే కాదు.. ఆపదలో ఉన్నవారిని రక్షించే విద్య’ అని అమ్మ చెప్పింది. అలా నా స్విమ్మింగ్ ప్రస్థానం మొదలైంది.
 
 కోచ్ ప్రోత్సాహం..
 మొదట్లో ఈతంటే భయపడ్డాను. స్విమ్మింగ్ కోచ్  కృష్ణమూర్తి చిట్కాలతో స్విమ్మింగ్‌ను ఎంతో ఎంజాయ్ చేశా. రోజుకు నాలుగు గంటలకు పైగా ప్రాక్టీసు చేశా. నాలో ఉన్న ప్రతిభను గుర్తించిన కృష్ణమూర్తి 2006లో కర్నూలులో జరిగిన 1,500 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌కు తీసుకెళ్లాడు. అక్కడ మెరుగైన ప్రదర్శన ఇచ్చా. అప్పటికే మా కుటుంబం హైదరాబాద్‌కు షిఫ్ట్ అయింది. అలా హైదరాబాద్‌లో జరిగిన బ్రెస్ట్ స్ట్రోక్, బ్యాక్ స్ట్రోక్, బటర్‌ఫ్లయ్ విభాగాల్లోనూ పాల్గొన్నా. 2007లో గుజరాత్, 2008లో కేరళ, 2009లో ముంబైలో 400 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లలో పాల్గొన్న. కేరళలో జరిగిన ఈవెంట్లో ఆరో స్థానం సాధించాను.
 
 టీచింగ్ చానల్..
 జీవితం మధ్యలో నాకు వచ్చిన ఈతను.. మరెందరికో నేర్పించాలనే ఉద్దేశంతో మూడేళ్ల కిందట యాప్రాల్‌లో పయనీర్ స్విమ్మింగ్ అకాడమీ నెలకొల్పాను. ఇక్కడ ఈత నేర్చుకున్న వారు అనేక ఈవెంట్లలో రాణిస్తున్నారు. సక్సెస్‌ఫుల్ స్విమ్మర్ కావాలన్న పట్టుదల ఉండి, ఆర్థికంగా లేని వారికి ఉచిత శిక్షణ ఇస్తున్నాను.
 
 లక్ష్యం...
 ఇంగ్లిష్ చానల్‌ను ఈదాలన్నది నా లక్ష్యం. భారత్ నుంచి శ్రీలంక మధ్యలో ఉండే పాక్ స్ట్రెయిట్ ఈదాలనుకుంటున్నాను. నా అకాడమీ నుంచి బెస్ట్ స్విమ్మర్‌లను తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నాను.
 - వాంకె శ్రీనివాస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement