సోమాజిగూడ: పాలకుల వ్యాపార ధోరణి, నిర్లక్ష్యం, సరైన ప్రణాళిక, ముందుచూపు లేకపోవడం, అభివృద్ధి పేరుతో విచ్చలవిడి నిర్మాణాలతో నగరం నరకప్రాయంగా మారుతోందని పలువురు జల, పర్యావరణ నిపుణులు అభిప్రాయపడ్డారు. వేలాది చెరువులు, కుంటలను సర్వనాశనం చేసుకొని ఇప్పడు గుక్కెడు మంచినీటి కోసం వందల కిలోమీటర్ల దూరం నుంచి నీటిని తరలించాల్సిన పరిస్థితి దాపురించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణపై కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ ‘కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్’ ఆధ్వర్యంలో బేగంపేట సెస్ ప్రాంగణంలో ‘మేకింగ్ హైదరాబాద్ ఏ గ్రీన్ అండ్ లివబుల్ సిటీ’ పేరుతో గురువారం చర్చావేదిక నిర్వహించారు.
ఈ చర్చలో పలువురు పర్యావరణ, జల వనరుల నిపుణులు పాల్గొని ప్రస్తుత స్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ.. అర్థరహితమైన, ప్రణాళిక రహితమైన అభివృద్ధితో నగరాన్ని ఓ ‘గ్యాస్ ఛాంబర్’ గా మార్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను దూరంగా తరలించి, ప్లాస్టిక్ వాడకాన్ని గణనీయంగా తగ్గించాలన్నారు. పర్యావరణ నిపుణుడు డాక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, సింగూరు, మంజీరా, కృష్ణా నదులు నీరు లేక ఎండిపోయాయన్నారు. ఇప్పుడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి నది నుంచి నీటిని తెస్తున్నారని, కొన్నాళ్ల తర్వాత గోదావరి కూడా ఎండిపోతే గంగానది నీటిని తెస్తారా? అని ఆగ్రహంగా ప్రశ్నించారు. కౌన్సిల్ ప్రెసిడెంట్ లీలా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. నిపుణుల చర్చల సారాంశాన్ని క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు.
కార్యక్రమానికి అనుసంధాన కర్తగా వ్యవహరించిన ‘సాక్షి’ దినపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ.. వ్యాపార కోణంలో జరుగుతున్న పట్టణీకరణతో తీవ్ర దుష్ఫలితాలు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ ప్రణాళికకు పరిమితం కావాల్సిన హెచ్‌ఎండీఏ వ్యాపార సంస్థగా మారిపోయిందని ఆరోపించారు. ‘ మార్కెట్ ఆధారిత మోడల్ అభివృద్ధి’ వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని, స్పష్టమైనప్రణాళికతో నీటి సంరక్షణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్ తరాలు తీవ్రంగా నష్టపోతాయని హెచ్చరించారు. కార్యక్రమంలో మురుగునీటి వ్యవస్థలపై సత్యభూపాల్‌రెడ్డి, ఇంకుడు గుంతలపై సుభాష్‌రెడ్డి, చెత్త మేనేజ్‌మెంట్‌పై మేజర్ శివకిరణ్, పచ్చదనంపై బీవీ, సుబ్బారావు, ముత్యంరెడ్డి, సాయిభాస్కర్‌రెడ్డి, పారిశ్రామిక కాలుష్యంపై ఏ. కృష్ణారావు, అర్బన్ గార్డెనింగ్‌పై ‘సాక్షి’ వ్యవసాయ విభాగం పాత్రికేయులు పంతంగి రాంబాబు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జే. బాపురెడ్డి, శ్రీనివాస్‌లు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
‘గ్యాస్ ఛాంబర్’గా భాగ్యనగరం
Published Fri, Jan 1 2016 12:22 PM | Last Updated on Fri, Sep 28 2018 4:15 PM
Advertisement
Advertisement