gas chamber
-
పొగబారిన ఉత్తరాది.. 50 రైళ్లు, పలు విమానాలపై ప్రభావం
ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్తో సహా ఉత్తర భారతదేశమంతా గత రెండు రోజులుగా తెల్లటి పొగమంచు కింద తలదాచుకుంటోంది. ఈరోజు (శుక్రవారం) మూడో రోజు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. పెరిగిన చలికి తోడు పొగమంచు కారణంగా పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. పొగమంచు దట్టంగా అలముకోవడంతో రవాణా సమస్య తీవ్రమయ్యింది. ఉత్తర భారతదేశంలోని పలు నగరాల్లో పొగమంచు కారణంగా ఉదయం 9 గంటలకు వరకూ కూడా విజిబులిటీ సరిగ్గా లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. రైళ్లు, విమానాలపై కూడా పొగమంచు ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఈ రోజు కూడా అమృత్సర్, చండీగఢ్, ఢిల్లీల నుండి పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రన్‌వేపై చాలా తక్కువ విజిబులిటీ కారణంగా విమానాల రాకపోకలపై ప్రభావం పడుతోంది. పొగమంచు కారణంగా లక్నో, చండీగఢ్‌లకు వచ్చే విమానాలను జైపూర్‌కు మళ్లించారు.ఇక రైళ్ల విషయానికొస్తే ఢిల్లీలోని వివిధ స్టేషన్లలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీకి వచ్చే 30కి పైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్లోని 50కి పైగా రైళ్లపై పొగమంచు ప్రభావం కనిపిస్తోంది. న్యూఢిల్లీకి వచ్చే 30కి పైగా రైళ్లు, ఆనంద్ విహార్‌కు వచ్చే 10 రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఎన్సీఆర్లోని 50కి పైగా రైళ్లపై పొగమంచు ప్రభావం కనిపిస్తోంది. ఈ రైళ్లన్నీ చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది కూడా చదవండి: Delhi Pollution: గ్యాస్ ఛాంబర్ కన్నా ఘోరం.. బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు! -
ఢిల్లీకి వస్తే గ్యాస్ ఛాంబర్లో కాలు పెట్టినట్లే: ప్రియాంకా గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీలో ఏర్పడిన వాయు కాలుష్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేరళలోని వయనాడ్‌లో లోక్‌సభ ఉపఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఆమె ఢిల్లీకి తిరిగి వచ్చారు. తాను రాజధానికి తిరిగి రావడం ‘గ్యాస్ ఛాంబర్’లో ప్రవేశించినట్లుగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.ఢిల్లీలో కాలుష్యం ఏటా పెరిగిపోతోందని, స్వచ్ఛమైన గాలి కోసం అందరూ కలసికట్టుగా పనిచేయాలని ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్‌లో.. వయనాడ్ నుండి ఢిల్లీకి తిరిగి రావడం గ్యాస్ చాంబర్లోకి ప్రవేశించినట్లుగా అనిపిస్తున్నదని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలంతా స్వచ్ఛమైన గాలి కోసం ఉద్యమించాలన్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు వాయు కాలుష్యం కారణంగా పలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. Coming back to Delhi from Wayanad where the air is beautiful and the AQI is 35, was like entering a gas chamber. The blanket of smog is even more shocking when seen from the air.Delhi’s pollution gets worse every year. We really should put our heads together and find a solution… pic.twitter.com/dYMtjaVIGB— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 14, 2024కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కేరళలోని వయనాడ్ నుంచి తన ఎన్నికల ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ప్రియాంక సోదరుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి వైదొలగడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఆ మధ్య జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, వయనాడ్ స్థానాల నుంచి గెలుపొందిన రాహుల్ ఆ తర్వాత వయనాడ్ లోక్‌సభకు దూరమయ్యారు.ఇది కూడా చదవండి: ‘ఆమె రీల్స్ చేస్తే.. ప్రజలేందుకు బాధ్యత తీసుకోవాలి’ -
దీపావళికి ముందే గ్యాస్ ఛాంబర్లా రాజధాని
న్యూఢిల్లీ: దీపావళికి ముందే దేశరాజధాని ఢిల్లీ గ్యాస్ ఛాంబర్లా మారింది. ఢిల్లీ-ఎన్సీఆర్లో పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా స్థానికులు పలు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు.విపరీతమైన వాయు కాలుష్యం కారణంగా వృద్ధులు, చిన్నారులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు(శనివారం) ఉదయం నుండే ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌తో సహా పలు చోట్ల పొగమంచు కమ్ముకుంది.ఢిల్లీ వాతావరణంలో గతంలో కన్నా స్వల్ప మెరుగుదల కనిపించింది. టాప్-10 కాలుష్య నగరాల్లో ఢిల్లీ ఏక్యూఐ240తో మొదటి, రెండవ స్థానాల నుండి 7వ స్థానానికి చేరుకుంది. దేశంలోని కాలుష్య నగరాల జాబితా ప్రకారం చూస్తే ఢిల్లీ ఆరో స్థానంలో ఉంది. ఢిల్లీలోని ఆనంద్ విహార్ ప్రాంతం ఏక్యూఐ 364తో వాయు నాణ్యత విషయంలో దారుణంగా ఉంది. ఏక్యూఐ ఉదయం 6 గంటలకు 364 వద్ద నమోదైంది.ఢిల్లీ-ఎన్సీఆర్లో గాలి నాణ్యత తక్కువగా ఉండడానికి పంజాబ్-హర్యానాతో సహా పొరుగు రాష్ట్రాలలో గడ్డి తగులబెట్టడమే ప్రధాన కారణం. ప్రతి ఏటా ఈ సీజన్లో ఢిల్లీలోని గాలి విషపూరితంగా మారుతుంటుంది. దీపావళికి ముందే గాలిలో విషవాయువులు పెరుగుతున్నాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) డేటాను పరిశీలిస్తే 2021 సంవత్సరం నుండి ఇప్పటివరకు ప్రతీ అక్టోబర్‌లో కాలుష్య స్థాయి పెరిగింది.ఇది కూడా చదవండి: ఒడిశాకు తప్పిన తుఫాను ముప్పు: సీఎం మోహన్ -
మళ్లీ గ్యాస్ చాంబర్‌గా ఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీని చలిగాలులు చుట్టుముట్టాయి. గాలి దిశలో మార్పు కారణంగా ఢిల్లీ మరోసారి గ్యాస్ ఛాంబర్‌గా మారింది. గాలి వేగం తక్కువగా ఉండడంతో గురువారం ఉదయం నుంచి ఆకాశంలో పొగమంచు కమ్ముకుంది. ఢిల్లీలో బుధవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 409 వద్ద నమోదైంది. ఇది మంగళవారం కంటే 41 సూచీలు అధికం. గురువారం ఉదయం నుంచి రాజధానిలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. మధ్యాహ్నం వేళ కూడా సూర్యరశ్మి తక్కువగానే ఉంది. రాత్రి అయ్యేసరికి వాతావరణం మరింత చల్లగా మారిపోతోంది. పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా జనానికి కంటి, శ్వాస సమస్యలు ఎదురవుతున్నాయి. బుధవారం ఢిల్లీలోని 13 ప్రాంతాల్లో ఏక్యూఐ 400గా నమోదైంది. శనివారం వరకు పరిస్థితులు మెరుగుపడే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఆ శాఖ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం గాలి పశ్చిమం నుండి ఉత్తరం వైపునకు సగటున గంటకు ఆరు నుండి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీచింది. రాబోయే రెండు రోజులలో వివిధ దిశల నుండి గాలి వీయనుంది. శుక్రవారం ఈశాన్యం నుండి వాయువ్య దిశలో గాలి వీయనుంది. దాని వేగం నాలుగు నుండి ఎనిమిది కిలోమీటర్లుగా ఉండవచ్చు. శనివారం వాయువ్యం నుండి పశ్చిమ దిశగా గాలి వీచే అవకాశం ఉంది. ఈ సమయంలో గాలి వేగం గంటకు ఆరు నుంచి 12 కిలో మీటర్లుగా ఉండవచ్చు. అందుకే ఈ వారం అంతా గాలి నాణ్యత పేలవంగానే ఉండవచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది. -
గ్యాస్ చాంబర్‌గా రాజధాని.. కనిపించని సూర్యుడు!
దేశరాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం ఉదయం దట్టమైన పొగమంచు అలముకుంది. న్యూఢిల్లీలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 6.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువ. డిసెంబర్లో రెండోసారి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా శనివారం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత తొమ్మిది డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది. శనివారం ఢిల్లీలో నాలుగు నుండి 10 కిలోమీటర్ల వేగంతో ఆగ్నేయ దిశ నుండి ఓ మోస్తరు గాలులు వీచే అవకాశం ఉంది. ఢిల్లీలో డిసెంబర్ 28 వరకు ఉదయం పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గాలి దిశలో మార్పు, తగ్గిన వేగం కారణంగా రాజధాని మరోసారి గ్యాస్ ఛాంబర్‌గా మారింది. పెరుగుతున్న కాలుష్యం కారణంగా జనం కళ్ల మంటలతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. శుక్రవారం ఎన్‌సిఆర్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 409గా నమోదయ్యింది. ఇది తీవ్రమైన విభాగంలో ఉంది. ఇది గురువారం కంటే 48 సూచీలు ఎక్కువ. శుక్రవారం మధ్యాహ్నానికి కూడా సూర్యుడు కనిపించలేదు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఢిల్లీలోని 24 ప్రాంతాల్లో గాలి తీవ్రమైన కేటగిరీలో నమోదైంది. ఇది కూడా చదవండి: ‘జనవరి 22.. ఆగస్టు 15 లాంటిదే’ -
‘ప్రజాస్వామ్యానికి గ్యాస్ చాంబర్ బెంగాల్’
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వంపై రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రం ప్రజాస్వామ్యానికి గ్యాస్ చాంబర్‌గా మారిందంటూ వ్యాఖ్యానించారు. మాట్లాడేందుకు కూడా రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఆజ్‌తక్ చానల్‌తో మాట్లాడారు. రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి చీఫ్‌గా ఉన్న కోల్‌కతా హైకోర్టు రిటైర్డు జడ్జి ఒకరు రాష్ట్రంలో మానవహక్కుల కమిషన్ ఐసీయూలో ఉందని తనతో అన్నారని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు ఆ జడ్జి వ్యాఖ్యలే ఉదాహరణ అని ధన్కర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పాలన రాజ్యాంగానికి లోబడి నడవడం లేదన్నారు. చదవండి: (మేము లేకుండా బీజేపీని ఓడించలేరు) -
‘గ్యాస్ ఛాంబర్’గా భాగ్యనగరం
సోమాజిగూడ: పాలకుల వ్యాపార ధోరణి, నిర్లక్ష్యం, సరైన ప్రణాళిక, ముందుచూపు లేకపోవడం, అభివృద్ధి పేరుతో విచ్చలవిడి నిర్మాణాలతో నగరం నరకప్రాయంగా మారుతోందని పలువురు జల, పర్యావరణ నిపుణులు అభిప్రాయపడ్డారు. వేలాది చెరువులు, కుంటలను సర్వనాశనం చేసుకొని ఇప్పడు గుక్కెడు మంచినీటి కోసం వందల కిలోమీటర్ల దూరం నుంచి నీటిని తరలించాల్సిన పరిస్థితి దాపురించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణపై కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ ‘కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్’ ఆధ్వర్యంలో బేగంపేట సెస్ ప్రాంగణంలో ‘మేకింగ్ హైదరాబాద్ ఏ గ్రీన్ అండ్ లివబుల్ సిటీ’ పేరుతో గురువారం చర్చావేదిక నిర్వహించారు. ఈ చర్చలో పలువురు పర్యావరణ, జల వనరుల నిపుణులు పాల్గొని ప్రస్తుత స్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ.. అర్థరహితమైన, ప్రణాళిక రహితమైన అభివృద్ధితో నగరాన్ని ఓ ‘గ్యాస్ ఛాంబర్’ గా మార్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను దూరంగా తరలించి, ప్లాస్టిక్ వాడకాన్ని గణనీయంగా తగ్గించాలన్నారు. పర్యావరణ నిపుణుడు డాక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, సింగూరు, మంజీరా, కృష్ణా నదులు నీరు లేక ఎండిపోయాయన్నారు. ఇప్పుడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి నది నుంచి నీటిని తెస్తున్నారని, కొన్నాళ్ల తర్వాత గోదావరి కూడా ఎండిపోతే గంగానది నీటిని తెస్తారా? అని ఆగ్రహంగా ప్రశ్నించారు. కౌన్సిల్ ప్రెసిడెంట్ లీలా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. నిపుణుల చర్చల సారాంశాన్ని క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. కార్యక్రమానికి అనుసంధాన కర్తగా వ్యవహరించిన ‘సాక్షి’ దినపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ.. వ్యాపార కోణంలో జరుగుతున్న పట్టణీకరణతో తీవ్ర దుష్ఫలితాలు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ ప్రణాళికకు పరిమితం కావాల్సిన హెచ్ఎండీఏ వ్యాపార సంస్థగా మారిపోయిందని ఆరోపించారు. ‘ మార్కెట్ ఆధారిత మోడల్ అభివృద్ధి’ వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని, స్పష్టమైనప్రణాళికతో నీటి సంరక్షణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్ తరాలు తీవ్రంగా నష్టపోతాయని హెచ్చరించారు. కార్యక్రమంలో మురుగునీటి వ్యవస్థలపై సత్యభూపాల్‌రెడ్డి, ఇంకుడు గుంతలపై సుభాష్‌రెడ్డి, చెత్త మేనేజ్మెంట్పై మేజర్ శివకిరణ్, పచ్చదనంపై బీవీ, సుబ్బారావు, ముత్యంరెడ్డి, సాయిభాస్కర్రెడ్డి, పారిశ్రామిక కాలుష్యంపై ఏ. కృష్ణారావు, అర్బన్ గార్డెనింగ్పై ‘సాక్షి’ వ్యవసాయ విభాగం పాత్రికేయులు పంతంగి రాంబాబు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జే. బాపురెడ్డి, శ్రీనివాస్‌లు తమ అభిప్రాయాలను వెల్లడించారు.