దేశ రాజధాని ఢిల్లీని చలిగాలులు చుట్టుముట్టాయి. గాలి దిశలో మార్పు కారణంగా ఢిల్లీ మరోసారి గ్యాస్ ఛాంబర్‌గా మారింది. గాలి వేగం తక్కువగా ఉండడంతో గురువారం ఉదయం నుంచి ఆకాశంలో పొగమంచు కమ్ముకుంది. ఢిల్లీలో బుధవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 409 వద్ద నమోదైంది. ఇది మంగళవారం కంటే 41 సూచీలు అధికం.
గురువారం ఉదయం నుంచి రాజధానిలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. మధ్యాహ్నం వేళ కూడా సూర్యరశ్మి తక్కువగానే ఉంది. రాత్రి అయ్యేసరికి వాతావరణం మరింత చల్లగా మారిపోతోంది. పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా జనానికి కంటి, శ్వాస సమస్యలు ఎదురవుతున్నాయి.
బుధవారం ఢిల్లీలోని 13 ప్రాంతాల్లో ఏక్యూఐ 400గా నమోదైంది. శనివారం వరకు పరిస్థితులు మెరుగుపడే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఆ శాఖ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం గాలి పశ్చిమం నుండి ఉత్తరం వైపునకు సగటున గంటకు ఆరు నుండి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీచింది. రాబోయే రెండు రోజులలో వివిధ దిశల నుండి గాలి వీయనుంది. శుక్రవారం ఈశాన్యం నుండి వాయువ్య దిశలో గాలి వీయనుంది. దాని వేగం నాలుగు నుండి ఎనిమిది కిలోమీటర్లుగా ఉండవచ్చు. శనివారం వాయువ్యం నుండి పశ్చిమ దిశగా గాలి వీచే అవకాశం ఉంది. ఈ సమయంలో గాలి వేగం గంటకు ఆరు నుంచి 12 కిలో మీటర్లుగా ఉండవచ్చు. అందుకే ఈ వారం అంతా గాలి నాణ్యత పేలవంగానే ఉండవచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment