
Worlds Coldest Marathon At Yakutia: చూశారుగా... కనురెప్పలు సహా మొహాన్ని మంచు కప్పేసినా, గడ్డకట్టే చలి తీవ్రతకు నోట్లోని లాలాజలం సూదిలా పెదవులను గుచ్చుతున్నా లెక్కచేయకుండా ఓ యువకుడు లక్ష్యం వైపు సాగిపోతున్న దృశ్యమిది. మంచులో ఈ పరుగేమిటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇది అలాంటి, ఇలాంటి పరుగు పందెం కాదండి. రష్యాలోని సైబీరియాలో ఉన్న ఓమ్యకోన్‌లో ఇటీవల జరిగిన మంచు మారథాన్ అన్నమాట.
అదేనండి 42.19 కి.మీ. ఆగకుండా పరుగెత్తి గమ్యం చేరుకోవడం. ఆ ఏముందిలే.. ఒళ్లంతా వెచ్చని దుస్తులు కప్పుకొని పరిగెత్తడమూ ఓ విశేషమేనా అని అనుకుంటున్నారా? విశేషమే మరి.ఈ పోటీ జరిగిన సమయంలో ఉష్ణోగ్రత ఎంతో తెలుసా? ఏకంగా మైనస్ 53 డిగ్రీల సెల్సియస్. ఇంత చల్లటి ఉష్ణోగ్రతల్లో జరిగిన పోటీ కాబట్టే ‘వరల్డ్స్ కోల్డెస్ట్ మారథాన్’గా గిన్నిస్ రికార్డులకెక్కింది. ఈ పోటీలో అమెరికా, రష్యా, యూఈఏ, బెలారస్‌కు చెందిన 65 మంది పరుగువీరులు అత్యంత ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్కచేయకుండా పాల్గొన్నారు.
సుమారు 100 మంది స్థానికులు ఈ పోటీని చూసేందుకు, పోటీదారులను ఉత్సాహపరిచేందుకు వచ్చారు! పురుషుల విభాగంలో రష్యాకు చెందిన వ్యాసిలీ ల్యూకిన్ 3 గంటల 22 నిమిషాల్లో ఈ మారథాన్‌ను పూర్తి చేయగా మహిళల విభాగంలో సైబీరియా ప్రాంతానికి చెందిన మెరీనా సెడలిస్చెవా 4 గంటల 9 నిమిష్యాల్లో గమ్యం చేరుకుంది.
చదవండి: ఆ వ్యక్తి ఏడు నిమిషాలకే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడయ్యాడు!.. ఎలాగో తెలుసా?
ఏటా దాదాపు 10 నెలలు మంచు దుప్పటిలో ఉండే ఓమ్యకాన్ ప్రాంతంలో చలి తీవ్రత ఎంతలా ఉంటుందంటే అక్కడ ఎవరైనా మరణిస్తే వారికి అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశం గడ్డకట్టకుండా ఉండేందుకు రోజుల తరబడి పెద్దపెద్ద మంటలు వేయాల్సి ఉంటుందట! అంతటి ప్రతికూల వాతావరణంలో ఎందుకు పరుగులు పెట్టడం? అని పోటీదారులను అడిగితే ‘గల్లీలో సిక్సర్ ఎవడైనా కొడతాడు.. స్టేడియంలో కొట్టే వాడికే ఓ రేంజ్ ఉంటుంది’ అనే తరహాలో బదులిచ్చారు.
– సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment