Marathon race
-
విశాఖ సాగరతీరంలో వైజాగ్ నేవీ మారథాన్ 2023 (ఫోటోలు)
-
విషాదం నింపిన మారథాన్.. ట్రాక్‌పైనే కుప్పకూలిన అథ్లెట్
గత ఆదివారం నిర్వహించిన లండన్ మారథాన్ 2022లో విషాదం నెలకొంది. మారథాన్‌లో పాల్గొన్న 36 ఏళ్ల అథ్లెట్ ట్రాక్‌పైనే కుప్పకూలాడు. ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించగా అథ్లెట్ మరణించినట్లు వైద్యులు ద్రువీకరించారు. అయితే చనిపోయిన అథ్లెట్ కుటుంబసభ్యుల వినతి మేరకు నిర్వాహకులు పేరును వెల్లడించలేదు. అయితే అథ్లెట్ మాత్రం సౌత్-ఈస్ట్ ఇంగ్లండ్‌కు చెందినవాడని పేర్కొన్నారు. మరో మూడు మైళ్లు చేరుకుంటే అతని రేసు పూర్తయ్యేది.. కానీ విధి మరోలా తలిచింది అంటూ మారథాన్ నిర్వాహకులు తమ బాధను వ్యక్తం చేశారు. ''లండన్ మారథాన్‌లో పాల్గొన్న ప్రతి అథ్లెట్ ఇవాళ మరణించిన తమ సహచర అథ్లెట్‌కు నివాళి అర్పిస్తున్నారు. అతని కుటుంబసభ్యుల వినతి మేరకు ఈ విషయాన్ని మీడియాకు దూరంగా ఉంచాలని భావించాం. అతని కుటుంబసభ్యులకు ఇవే మా ప్రగాడ సానభుతి.''అంటూ పేర్కొంది. ఇక అథ్లెట్ మరణంపై తుది రిపోర్టు రావాల్సి ఉందని నిర్వహాకులు పేర్కొన్నారు. ఇక ప్రతీ ఏడాది లాగే ఈసారి కూడా లండన్ మారథాన్ 2022 ఘనంగా జరిగింది. దాదాపు 40వేల మంది ఈ మారథాన్‌లో పాల్గొన్నట్లు సమాచారం. 26.2 మైళ్ల దూరంలో భాగంగా సౌత్ లండన్‌లోని గ్రీన్విచ్ నుంచి మాల్ వరకు ఈ మారథాన్ జరిగింది. పురుషుల విభాగంలో కెన్యాకు చెందిన అమోస్ కిప్రుటో విజయం సాధించాడు. కిప్రుటో రెండు గంటల నాలుగు నిమిషాల 39 సెకన్లలో మారథాన్‌ను పూర్తి చేసి తొలి స్థానంలో నిలిచాడు. ఇక మహిళల విభాగంలో ఇథియోపియాకు చెందిన యెహువాలా మారథాన్‌ను 2 గంటల 17 నిమిషాల 25 సెకన్లలో పూర్తిచేసి విజేతగా నిలిచింది. చదవండి: 'చదువును చంపకండి'.. రషీద్ ఖాన్ ఎమోషనల్ ట్వీట్ -
ఆగస్ట్‌లో హైదరాబాద్ మారథాన్, టైటిల్ స్పాన్సర్‌గా ఎన్ఎండీసీ!
తెలంగాణ ప్రభుత్వం, ఎన్ఎండీసీ లిమిటెడ్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్, హైదరాబాద్ రన్నర్స్ సొసైటీలు సంయుక్తంగా 11వ ఎడిషన్ ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ - 2022 ప్రారంభం కానున్నాయి. ఆగస్ట్ 27న 5కె ఫన్ రన్, ఆగస్టు 28న 10 కె, హాఫ్ మారథాన్ 21.095కె , ఫుల్ మారథాన్ 42.195కెలు జరగనున్నట్లు నిర్వాహాకులు తెలిపారు. ఇందుకోసం 15వేల మందికి పైగా రన్నర్లు, 3500 మందికి పైగా వాలంటీర్లు, 250 మంది వైద్య సిబ్బంది పాల్గొననున్నారు. ఇక ఈ హైదరాబాద్ మారథాన్ టైటిల్ స్పాన్సర్ షిప్‌ను ఎన్ఎండీసీ అందిస్తున్నట్లు ఆ సంస్థ రేస్ డైరెక్టర్ ప్రశాంత్ మోర్పారియా తెలిపారు. హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొనేవారికి ప్రపంచ స్థాయి అనుభవాన్ని అందించే దిశగా కృషి చేస్తామని అన్నారు. మారథాన్ ఈవెంట్‌కు ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ ఫేస్ ఆఫ్ ది ఈవెంట్‌గా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా నిఖత్ జరీన్ మాట్లాడుతూ.. ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 2022 ఎడిషన్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని తెలిపారు. నగరంలో జరిగే అతిపెద్ద కమ్యూనిటీ ఫిట్నెస్ ఈవెంట్‌ను విజయవంతం చేయాలని నిఖత్ జరీన్ పిలుపునిచ్చారు. -
వాటర్ బాటిల్ అనుకుని శానిటైజర్‌ని తాగిన అథ్లెట్లు...ఆ తర్వాత..
School athletes drink sanitiser: నిజానికి దేశాల మధ్య స్నేహ భావాన్ని పెంపొందింప చేసేందుకు దోహదపడేవి క్రీడలు. అంతేకాదు ఐక్యతను చాటి చెప్పేందుకే ప్రపంచ దేశాలన్నీ క్రీడలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఆసక్తి కనబరుస్తాయి. ఆయ దేశాలు తమ క్రీడాకారులకు కావల్సిన సౌకర్యాలను కల్పించి మరి దేశ విదేశాల్లో జరుగుతున్న క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తుంది కూడా. కానీ కొన్నిచోట్ల అరకొర సౌకర్యాలతో సమస్యలను ఎదుర్కొంటున్న క్రీడాకారులు ఉన్నారు. అంతేకాదు స్పోర్ట్స్ ట్రైయినింగ్ సెంటర్లలో క్రీడాకారులకు సంబంధించిన డైట్ విషయంలో నిర్లక్ష్యం వహించి వారి జీవితాలతో ఆడుకున్న సందర్భాలు అనేకం. అచ్చం అలానే ఒక పాఠశాలలోని అథ్లెట్లు స్పోర్ట్స్ నిర్వాహకులు నిర్లక్ష్య వైఖరితో ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు. వివరాల్లోకెళ్తే...జపాన్‌లోని ఒక పాఠశాలలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. సెంట్రల్ జపాన్‌లోని యమనాషి ప్రిఫెక్చర్లో నిర్వాహకులు గత వారాంతంలో బాలికల 5 వేల మీటర్ల మారథాన్ రేసును నిర్వహించారు. ఐతే పొరపాటున నిర్వాహకులు వాటర్ బాటిల్ అనుకుని శానిటైజర్‌ని కప్పుల్లో వేసి సర్వ్ చేశారు. దీంతో ఒక అథ్లెట్ వాంతులు చేసుకుని రేసు నుంచి నిష్క్రమించగా, మరో ఇద్దరు మాత్రం ఉమ్మివేసి రేసుని తిరిగి కొనసాగించినట్లు జపాన్ అధికారులు తెలిపారు. ఈ మేరకు మొత్తం ముగ్గురు అథ్లెట్లు అస్వస్థకు గురై ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. తాగునీటి వాటర్ బాటిల్ తోపాటు శానిటైజర్ కూడా అదే ప్లాస్టిక్ బాటిల్‌తో ఉందని హైస్కూల్ యమనాషి స్పోర్ట్స్ ఫెడరేషన్ తెలిపింది. ఈ ఘటన పై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని యమనాషి గవర్నర్ కొటారో నాగసాకి తెలిపారు. అంతేకాదు ఆయన అథ్లెట్లకు వారి కుటుంబ సభ్యులకు హృదయ పూర్వక క్షమాపణలు చెప్పారు కూడా. (చదవండి: శ్రీలంకలో ఆగని అల్లర్లు.. ప్రధాని ఇంటికి నిప్పు) -
– 53 డిగ్రీల సెల్సియస్, గడ్డకట్టే చలిలో పరుగు, ఎందుకిదంతా అని ఆశ్చర్యపోతున్నారా?
Worlds Coldest Marathon At Yakutia: చూశారుగా... కనురెప్పలు సహా మొహాన్ని మంచు కప్పేసినా, గడ్డకట్టే చలి తీవ్రతకు నోట్లోని లాలాజలం సూదిలా పెదవులను గుచ్చుతున్నా లెక్కచేయకుండా ఓ యువకుడు లక్ష్యం వైపు సాగిపోతున్న దృశ్యమిది. మంచులో ఈ పరుగేమిటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇది అలాంటి, ఇలాంటి పరుగు పందెం కాదండి. రష్యాలోని సైబీరియాలో ఉన్న ఓమ్యకోన్లో ఇటీవల జరిగిన మంచు మారథాన్ అన్నమాట. అదేనండి 42.19 కి.మీ. ఆగకుండా పరుగెత్తి గమ్యం చేరుకోవడం. ఆ ఏముందిలే.. ఒళ్లంతా వెచ్చని దుస్తులు కప్పుకొని పరిగెత్తడమూ ఓ విశేషమేనా అని అనుకుంటున్నారా? విశేషమే మరి.ఈ పోటీ జరిగిన సమయంలో ఉష్ణోగ్రత ఎంతో తెలుసా? ఏకంగా మైనస్ 53 డిగ్రీల సెల్సియస్. ఇంత చల్లటి ఉష్ణోగ్రతల్లో జరిగిన పోటీ కాబట్టే ‘వరల్డ్స్ కోల్డెస్ట్ మారథాన్’గా గిన్నిస్ రికార్డులకెక్కింది. ఈ పోటీలో అమెరికా, రష్యా, యూఈఏ, బెలారస్‌కు చెందిన 65 మంది పరుగువీరులు అత్యంత ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్కచేయకుండా పాల్గొన్నారు. సుమారు 100 మంది స్థానికులు ఈ పోటీని చూసేందుకు, పోటీదారులను ఉత్సాహపరిచేందుకు వచ్చారు! పురుషుల విభాగంలో రష్యాకు చెందిన వ్యాసిలీ ల్యూకిన్ 3 గంటల 22 నిమిషాల్లో ఈ మారథాన్‌ను పూర్తి చేయగా మహిళల విభాగంలో సైబీరియా ప్రాంతానికి చెందిన మెరీనా సెడలిస్చెవా 4 గంటల 9 నిమిష్యాల్లో గమ్యం చేరుకుంది. చదవండి: ఆ వ్యక్తి ఏడు నిమిషాలకే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడయ్యాడు!.. ఎలాగో తెలుసా? ఏటా దాదాపు 10 నెలలు మంచు దుప్పటిలో ఉండే ఓమ్యకాన్ ప్రాంతంలో చలి తీవ్రత ఎంతలా ఉంటుందంటే అక్కడ ఎవరైనా మరణిస్తే వారికి అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశం గడ్డకట్టకుండా ఉండేందుకు రోజుల తరబడి పెద్దపెద్ద మంటలు వేయాల్సి ఉంటుందట! అంతటి ప్రతికూల వాతావరణంలో ఎందుకు పరుగులు పెట్టడం? అని పోటీదారులను అడిగితే ‘గల్లీలో సిక్సర్ ఎవడైనా కొడతాడు.. స్టేడియంలో కొట్టే వాడికే ఓ రేంజ్ ఉంటుంది’ అనే తరహాలో బదులిచ్చారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
నేను కూడా అంటూ...మారథాన్‌లో పాల్గొన్న బాతు
వాషింగ్టన్: ఇటీవల కాలంలో మనుష్యుల మాదిరిగా తాము అన్ని చేయగలమంటూ జంతువులు, పక్షులు ఏవిధంగా అనుకరిస్తున్నాయో చూస్తునే ఉన్నాం. అచ్చం అలానే ఇక్కడొక రింక్ల్ బాతు తాను సైతం మారథాన్ చేయగలనంటూ న్యూ యార్క్ సిటీ మారథాన్‌లో పాల్గొంది. పైగా అక్కడ మారథాన్‌లో పాల్గొన్న వాళ్లలా చక్కగా నడిచేసింది. గతేడాది కరోనా పరిస్థితుల దృష్ట్యా మారథాన్ నిర్వహించలేదన్న సంగతి తెలిసింతే. (చదవండి: దగ్గు, తుమ్ము, నీరసంతో బాధపడుతున్న సింహాలు) కానీ ఈ ఏడాది న్యూయర్క్ సిటీలో నిర్వహించిన మారథాన్‌లో బాతు పాల్గోని న్యూయార్క్ వాసులకి కనువిందు చేయడమే కాక ఆశ్చర్యానికి గురి చేసింది. పైగా అక్కడ ఉన్న ప్రేక్షకులు సైతం కమాన్ కమాన్ అంటూ ఆ బాతుని ఉత్సాహపరిచారు. అయితే దీనికి సంబంధించిన వీడియోతోపాటు " నేను మారథాన్‌లో పరుగెత్తాను. వచ్చే ఏడాది మరింత మెరుగ్గా పరుగెత్తుతాను" అనే క్యాప్షన్‌తో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: చావు నోట్లో నుంచి కాపాడిన ‘సమయస్ఫూర్తి’) View this post on Instagram A post shared by Wrinkle 🦢 宙紋✨ (@seducktive) -
మహిళల మారథాన్‌లో ప్రపంచ రికార్డు
షికాగో (అమెరికా): మహిళల మారథాన్‌లో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఆదివారం జరిగిన షికాగో మారథాన్‌లో కెన్యాకు చెందిన 25 ఏళ్ల బ్రిగిడ్ కోస్గె 42.195 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల 14 నిమిషాల 04 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది. 16 ఏళ్లుగా పౌలా రాడ్‌క్లిఫ్ (బ్రిటన్–2గం:15.25 సెకన్లు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కోస్గె తిరగ రాసింది. -
ఒకే ఒక్కడు... కిప్‌చెగో
వియన్నా: గతంలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను కెన్యా రన్నర్, రియో ఒలింపిక్స్ చాంపియన్ ఇలియుడ్ కిప్‌చెగో సాధించాడు. 42.195 కిలోమీటర్ల పురుషుల మారథాన్ రేసును 2 గంటల్లోపు పూర్తి చేసిన తొలి అథ్లెట్‌గా కిప్‌చెగో గుర్తింపు పొందాడు. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో శనివారం ప్రత్యేకంగా జరిగిన మారథాన్ రేసులో 34 ఏళ్ల కిప్‌చెగో గంటా 59 నిమిషాల 40.2 సెకన్లలో గమ్యానికి చేరాడు. అయితే ఇది అధికారికంగా గుర్తింపు పొందిన మారథాన్ రేసు కాకపోవడంతో కిప్‌చెగో ఘనత రికార్డు పుస్తకాల్లో చేరడం లేదు. ప్రస్తుత మారథాన్ ప్రపంచ రికార్డు కిప్‌చెగో పేరిటే ఉంది. గత ఏడాది బెర్లిన్ మారథాన్‌లో కిప్‌చెగో 2 గంటల 1 నిమిషం 39 సెకన్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శనివారం వియన్నాలో జరిగిన మారథాన్ రేసును తిలకించేందుకు కిప్‌చెగో స్వదేశం కెన్యాలోని వీధుల్లో ప్రత్యేకంగా టీవీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. వేలాది మంది అభిమానులు కిప్‌చెగో ఘనతను టీవీల్లో వీక్షించారు. రెండేళ్ల క్రితం ఇటలీలో కిప్‌చెగో 2 గంటల్లోపు మారథాన్ రేసును పూర్తి చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అయితే రెండో ప్రయత్నంలో మాత్రం అతను సఫలమై తన ప్రత్యేకతను చాటుకున్నాడు. -
రన్ మమ్మీ రన్
ఎదుటి వాళ్ల సమస్యలు కొన్ని చాలా సాధారణంగా కనిపిస్తాయి. వీటినీ గట్టెక్కానని చెప్పుకోవడం పెద్ద ఘనతా అని కూడా అనిపిస్తుంది. కాని వాటిని అనుభవిస్తున్న వాళ్లకే తెలుస్తుంది ఆ సమస్యల లోతు. అయినా ఈదుకుంటూ జీవితం చూపించిన ఒడ్డుకు చేరడం నిజంగా ధైర్యమే! అలాంటి ధీశాలే ఈ ఫొటోలోని వ్యక్తి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ పేజీలో తన కథ రాసి చాలామందికి ప్రేరణగా నిలిచారు. ఆమె జీవితం ఆమె మాటల్లోనే... ‘‘నేను డిగ్రీ అలా పూర్తి చేశానో లేదో మంచి సంబంధం వచ్చిందని పెళ్లిచేసేశారు మా పెద్దవాళ్లు. ఆయన డాక్టర్. గ్రామీణ మధ్యతరగతి నుంచి వచ్చిన నాకు నిజంగానే అది గొప్ప సంబంధమే అనిపించింది. అంతా అనుకున్నట్టే జరిగితే జీవితం ఎందుకు అవుతుంది? కాబట్టి జరగలేదు. నా కన్నా తొమ్మిదేళ్లు పెద్దవాడైన నా భర్తకు, నాకు మానసిక సఖ్యత కుదరలేదు. మేమిద్దరం ఒకరికొకరం అర్థమయ్యేలోపే మాకు బాబు పుట్టాడు. వాడి రెండోయేట పిల్లాడికి ఆటిజం ఉందని బయటపడింది. పిల్లాడికున్న సమస్య కూడా మా మధ్య సయోధ్యను కుదర్చలేకపోయింది. ప్రతిక్షణం మేమిద్దరం గొడవలు పడ్తూంటే వాడు బెంబేలెత్తి పోవడం.. దాంతో వాడి ప్రాబ్లం మరింత జటిలమవడం ఇష్టంలేక ఒకరికొరం సమ్మతించుకునే విడాకులు తీసుకున్నాం. మా ఇద్దరి ఫైనాన్షియల్ రెస్పాన్స్‌బిలిటీ మా ఆయనే చూసుకోవాలనే ఒప్పందం ఉన్నా.. నా అసలు జీవితం విడాకుల తర్వాతే మొదలైంది. పిల్లాడి బాధ్యత అంతా నాదే. వాడిని థెరపీస్కు తీసుకెళ్లడం.. వాడితో నేనెలా నడచుకోవాలో ట్రైనింగ్ తీసుకోవడం.. ఇలా ట్వంటీఫోర్ ఇంటూ సెవెన్ వాటి చుట్టే ఉండేదాన్ని. సింగిల్ మదర్‌గా ఆ టఫ్ జాబ్‌లో పడిపోయి నా గురించి నేను మరిచిపోయాను. కొడుకు విహాన్‌తో మారథాన్ మమ్మీ (నాడు – నేడు) ఫలితంగా బరువు పెరిగాను. దాంతో నాకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో అప్పుడు స్పృహలోకి వచ్చాను. వెంటనే మా ఇంటి దగ్గర జిమ్‌లో జాయిన్ అయ్యాను. నా రొటీన్లో అదీ భాగమయ్యేసరికి ఆ జిమ్ కాస్త మూతబడింది. అప్పటి నుంచి ప్రతి రోజూ ఉదయం పరిగెత్తడం మొదలుపెట్టాను. నేను చేస్తోంది మంచి పని, తర్వాత అది నా జీవితాన్నే మార్చేస్తుందని అప్పటికి నాకు తెలియదు. ఓ నాలుగు నెలలకు ముంబై మారథాన్ గురించి తెలిసింది. దాని మీద అవగాహన లేకపోయినా అందులో పాల్గొన్నాను. గెలిచాను. ఆశ్చర్యమేసింది. నా శక్తీ తెలిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పరుగు ఆపలేదు. దాదాపు 95 మారథాన్లలో పాల్గొన్నాను. మెడల్స్ గెలుచుకున్నాను. చాలామందికి శిక్షణా ఇస్తున్నాను. నేను గెలిచినప్పుడల్లా మా అబ్బాయి మొహంలో కనిపించే ఆనందం నాకు కొత్త ఉత్సాహాన్నిస్తుంటుంది. స్కూల్లో వాడిని ఎవరైనా ‘‘మీ అమ్మ చేస్తుంది?’’ అని అడిగితే ‘‘మా అమ్మ రన్నర్ ’’ అని చెప్తాడు. అది చాలు నేను సెల్ఫ్ సఫీషియంట్ అని అనుకోవడానికి, చెప్పుకోవడానికి. నేను, నా భర్త విడిపోయి కలిసి ఉంటున్నాం. సమస్యలు లేకపోతే జీవితానికి ఒకటే దారి. సమస్యలొస్తే నాలుగు దారులు. యెస్.. ప్రాబ్లమ్స్ జీవితాన్ని నాలుగు దారుల కూడలిలో నిలబెడ్తాయి. మనలోని శక్తిని వెలికితీస్తాయి. కొత్త బలాన్నిస్తాయి. దానికి నేనే ఉదాహరణ’’ అంటూ రాసుకున్నారు ఆమె (ఎక్కడా తన పేరును ప్రస్తావించలేదు). -
బాలికా.. నువ్వే ఏలిక
గచ్చిబౌలి: సేవా భారతి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం గచ్చిబౌలి స్టేడియంలో ‘రన్ ఫర్ ఏ గర్ల్ చైల్డ్’ పేరిట నిర్వహించిన 5కే రన్ ఉత్సాహంగా సాగింది. కార్యకమాన్ని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వల్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. బాలికల వికాసానికి తోడ్పాటు అందిస్తూ సేవా భారతి ప్రపంచానికి మంచి సందేశాన్ని అందిస్తోందని కితాబిచ్చారు. ‘బేటీ బచావో..బేటీ పడావో’ నినాదంతో ప్రదాని నరేంద్ర మోదీ బాలికల విద్యను ప్రోత్సహిస్తున్నారని, స్త్రీ, పురుషుల మధ్యనున్న వ్యత్యాసాలను తగ్గించేందుకు సమాజంలో మరింత చైతన్యం తీసుకరావాల్సిన అవసరం ఉందన్నారు. సేవా భారతి స్వచ్ఛంద సంస్థ తెలంగాణలో 185 కిశోర్ వికాస్ కేంద్రాల ద్వారా బాలికలకు విద్య, వృత్తి విద్యలో శిక్షణ ఇస్తోందన్నారు. తాను పార్లమెంట్‌కు సైకిల్‌పై వెళతానని, పర్యావరణ పరిరక్షణకు అందరు తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. మహిళల సంక్షేమ కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. అనంతరం రన్లో విజేతలకు కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వల్, జయేష్ రంజన్లు బహుమతులు ప్రదానం చేశారు. ఉత్సాహంగా రన్.. 10కే రన్‌ను సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్, హెచ్‌సీయూ వైస్ చాన్సలర్ పి.అప్పారావు ప్రారంభించారు. 21కే రన్‌ను ఏఓసీ సెంటర్ కమాండెంట్, బ్రిగేడియర్ జేజేఎస్ బిందర్, ప్రముఖ జిమ్నాస్ట్ మేఘనారెడ్డి ప్రారంభించారు. రన్లో 400 మంది సైనికులతో పాటు వివిధ ఐటీ కంపెనీలకు చెందిన 8 వేల మంది సిబ్బంది పాల్గొన్నారు. -
ఇక విశాఖలో సింబెక్స్ సందడి
విశాఖసిటీ: నాలుగు రోజుల పాటు పోర్టు బ్లెయిర్‌లో అండమాన్ సముద్రం వేదికగా సాగిన సింబెక్స్–2018 సిల్వర్ జూబ్లీ విన్యాసాలు ఈ నెల 19 నుంచి విశాఖ వేదికగా జరగనున్నాయి. ఇందులో భాగంగా పోర్ట్ బ్లెయిర్ నుంచి భారత్, సింగపూర్ యుద్ధ నౌకలు, విమానాలు, హెలి కాప్టర్లు శుక్రవారం తూర్పునౌకాదళం ప్రధాన కేంద్రం విశాఖకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సింగపూర్ నౌకాదళ బృందానికి తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ కరమ్‌బీర్‌సింగ్ జ్ఞాపికలు అందించారు. భారత్ నౌకాదళం, రిపబ్లికన్ ఆఫ్ సింగపూర్ దేశాలు కలిసి పాతికేళ్లుగా సింబెక్స్ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. అండమాన్ సముద్రంలో జరిగిన ద్వైపాక్షిక విన్యాసాల్లో ఇరుదేశాలకు చెందిన 12 నౌకలు, జలాంతర్గాములు పాల్గొన్నాయి. రెండో విడత విన్యాసాలు విశాఖ వేదికగా ఈ నెల 19 నుంచి 21 వరకు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి తూర్పునౌకాదళం అంతా సిద్ధం చేసింది. పాల్గొనే నౌకలివే.. రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ తరఫున ఆర్ఎస్ఎస్ ఫర్మిడబుల్, ఆర్ఎస్ఎస్ స్టెడ్‌ఫాస్ట్, ఆర్ఎస్ఎస్ యూనిటీ, ఆర్ఎస్ఎస్ విగార్, ఆర్ఎస్ఎస్ వాలియంట్, డీప్ సీ రెస్క్యూ వెహికల్ నౌకతో పాటు ఆర్చర్ క్లాస్ జలాంతర్గామి ఆర్ఎస్ఎస్ స్వార్డ్స్‌మాన్‌తో పాటు ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లు పాల్గొననున్నాయి. ఇక భారత యుద్ధ నౌకలైన రణ్వీర్ క్లాస్ యుద్ధ నౌక, ఐఎన్ఎస్ రణ్విజయ్, ఐఎన్ఎస్ సాత్పురా, ఐఎన్ఎస్ సహ్యాద్రి, ఐఎన్ఎస్ కద్మత్, ఐఎన్ఎస్ కిర్చి, ఐఎన్ఎస్ సుమేధ, ఐఎన్ఎస్ సుకన్య, ఐఎన్ఎస్ శక్తితో పాటు సింధుఘోష్ తరగతికి చెందిన సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ సింధుకీర్తితో పాటు ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లు విశాఖ సముద్ర జలాల్లో విన్యాసాల్లో పాల్గొననున్నాయి. సింబెక్స్‌లో భాగంగా ఇరుదేశాల నౌకాదళాధికారుల విన్యాసాలు, కార్యచరణ సమావేశాలతో పాటు స్నేహపూర్వక వాలీబాల్, బాస్కెట్‌బాల్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఈ నెల 18న జరగనున్న నేవీ మారథాన్‌లో సింగపూర్ నౌకాదళ బృందం పాల్గొననుంది. -
వైరల్: అయ్యో అమాత్యా!
సాక్షి, బెంగళూరు : దసరా ఉత్సవాల్లో భాగంగా మైసూర్లో నిర్వహించిన హాఫ్ మారథాన్‌లో కర్ణాటక విద్యాశాఖ మంత్రి జీటీ దేవగౌడ పాల్గొన్నారు. స్థానికులతో కలసి ఉత్సాహంగా పరుగెత్తారు. అయితే కొంత దూరం పరుగెత్తిన అమాత్యులు అలవాటు లేని పని కావడంతో బొక్కబోర్లా పడ్డారు. దీంతో అతని మోకాళ్లకు గాయాలయ్యాయి. అప్రమత్తమైన మారథాన్ నిర్వాహకులు మంత్రిని పక్కకు తీసుకెళ్లారు. అందరూ రన్నింగ్‌కు సౌకర్యాంగా ఉండే దుస్తులతో పరుగెత్తితే మంత్రి గారు మాత్రం లుంగీ పైకి కట్టి పరుగెత్తాడు. దీంతోనే పరుగు చేస్తూ నియంత్రణ కోల్పోయి పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. -
వైరల్: అయ్యో అమాత్యా!
-
మారథాన్‌లో కొత్త ప్రపంచ రికార్డు
బెర్లిన్ (జర్మనీ): పురుషుల అథ్లెటిక్స్‌లో అత్యంత క్లిష్టమైన రేసు మారథాన్‌లో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఆదివారం జరిగిన బెర్లిన్ మారథాన్‌లో కెన్యాకు చెందిన 33 ఏళ్ల ఎలియుడ్ కిప్‌చోగె ఈ ఘనత సాధించాడు. రియో ఒలింపిక్స్‌లో పసిడి పతకం నెగ్గిన కిప్‌చోగె 42.195 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల ఒక నిమిషం 39 సెకన్లలో పూర్తి చేసి... స్వర్ణ పతకం సొంతం చేసుకోవడంతోపాటు కొత్త ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 2014 బెర్లిన్ మారథాన్‌లోనే కెన్యాకు చెందిన డెన్నిస్ కిమెట్టో (2గం:02ని.57 సెకన్లు) నెలకొల్పిన ప్రపంచ రికార్డును కిప్‌చోగె తెరమరుగు చేశాడు. -
ఏషియన్ గేమ్స్‌లో సత్తా చాటిన హిమదాస్
-
ఏషియన్ గేమ్స్: మెరిసిన హిమదాస్
జకార్త : ఏషియన్ గేమ్స్‌లో హిమదాస్ సత్తా చాటింది. హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఈ అస్సాం అమ్మాయి రజతం కైవసం చేసుకుంది. అథ్లెటిక్స్ 400 మీటర్ల విభాగంలో 50.79 సెకన్లలో పరుగును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో పాల్గొన్న మరో భారత అథ్లెట్ నిర్మల నాలుగోస్థానంతో సరిపెట్టుకుంది. ఆమె 52.96 సెకన్లలో పరుగును పూర్తి చేసి తృటిలో కాంస్యాన్ని చేజార్చుకుంది. ఇక అగ్రస్థానంలో నిలిచిన బెహ్రెయిన్ క్రీడాకారిణి నాసెర్ సల్వా 50.09 సెకన్లలో పరుగును పూర్తిచేసి స్వర్ణం కైవసం చేసుకుంది. కజకిస్తాన్ క్రీడాకారిణి మికినా ఎలినా 52.63 సెకన్లలో పరుగును పూర్తి చేసి కాంస్యం దక్కించుకుంది. చదవండి: హిమదాస్ టాలెంట్‌కి ప్రశంసలేనా.. ఇంకేం లేదా? హిమదాస్ ఇటీవల అండర్–20 ప్రపంచ చాంపియన్‌షిప్ 400 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణం నెగ్గి దేశప్రజల మన్ననలు పొందిన విషయం తెలిసిందే. దీంతో జకార్తాలోనూ ఆమె ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఇక 100 మీటర్ల విభాగంలో భారత రన్నర్ ద్యూతీ చంద్ ఫైనల్‌కు అర్హత సాధించింది. పురుషుల విభాగంలో.. పురుషుల 400 మీటర్ల విభాగంలో సైతం భారత్‌కు రజతం వరించింది. భారత అథ్లెట్ యహియా మొహహ్మద్ 45.69 సెకన్లలో పరుగును పూర్తి చేసి రజతం దక్కించుకున్నాడు. ఖతర్ అథ్లెట్ హసన్ అబ్దెల్లా(44.89) స్వర్ణం దక్కించుకోగా.. బెహ్రెయిన్ క్రీడాకారుడు కమీస్ అలీ (45.7) కాంస్యం సొంత చేసుకున్నాడు. ఇదే విభాగంలో పాల్గొన్న మరో భారత రన్నర్ ఆరోకియారాజీవ్ (45.84) నాలుగో స్థానంలో నిలిచాడు. దీంతో భారత పతకాల సంఖ్య 7 స్వర్ణాలు,9 రజతాలు, 19 కాంస్యలతో కలుపుకొని 35కు చేరుకుంది. ప్రస్తుతం పతకాల జాబితాలో భారత్ 9వ స్థానంలో కొనసాగుతోంది. -
నెక్లెస్‌రోడ్డులో మెగా మారథాన్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఇవాళ తెల్లవారుజామున పుల్ మారథాన్ ప్రారంభమయింది. నెక్లెస్ రోడ్డు నుంచి గచ్చిబౌలికి 42 కొలోమీటర్ల పుల్ మారథాన్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ప్రారంభించారు. పుల్ మారథాన్‌లో 26దేశాలకు చెందిన వేలాది మంది రన్నర్స్ పాల్గొన్నారు. హప్ మారథాన్ జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిశోర్ ప్రారంభించారు. దాదాపు 6,500 మంది హాఫ్ మారథాన్‌లో పాల్గొన్నారు. హైదరాబాద్ రన్నర్స్ ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో ఈ మారథాన్ జరుగుతోంది. -
ఏషియన్ గేమ్స్: నన్ను తోసేసి స్వర్ణం నెగ్గాడు!
జకార్త: ప్రశాంతంగా సాగుతున్న ఏషియన్ గేమ్స్‌లో శనివారం వివాదం చోటుచేసుకుంది. పురుషుల రన్నింగ్ కాంపిటేషన్‌లో తనను నెట్టేసి జపాన్ ఆటగాడు హిరోటో స్వర్ణం గెలిచాడని బెహ్రెయిన్ రన్నర్ ఎలబస్సి ఆరోపించాడు. జకార్త వీధుల్లో అప్పటి వరకు జరిగిన 42 కిలోమీటర్ల పరుగు పందెంలో ఈ ఇద్దరు ఆటగాళ్లు నువ్వా-నేనా అన్నట్లు పరుగెత్తారు. ఫైనల్ 100 మీటర్ల విభాగంలో హోరాహోరిగా పోటీపడ్డారు. అయితే అంతా ఎలబస్సే గెలుస్తాడని భావించారు. ఇంతలో అతని సమీపంలో ఉన్న హిరటో.. ఎలబస్సిని నెట్టేశాడు. దీంతో పట్టు తప్పిన ఎలబస్సి కింద పడిపోకుండా సమన్వయంతో పరుగును కొనసాగించాడు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రెప్పపాటు వ్యవధిలో స్వర్ణం గెలుస్తాననుకున్న ఎలబస్సి ఆశలు గల్లంతయ్యాయి. దీంతో హిరటోకు పసిడి సొంతం కాగా.. ఎలబస్సికి రజతం దక్కింది. ‘అతను తోసేసాడు లేకుంటే నేనే గెలిచేవాడిని’ అని పరుగు అనంతరం ఎలబస్సి ఆవేదన వ్యక్తం చేశాడు. స్వర్ణ విజేత హిరోటో మాత్రం.. ‘చివర్లో అసలేం జరిగిందో నాకు తెలియదు. కానీ ఆశ్చర్యం వేస్తుంది’ అని తెలిపాడు. జపాన్ అధికారులేమో అతన్ని అధిగమించే సమయంలో వారి మధ్య గ్యాప్ లేదని, దాంతోనే తమ అథ్లెట్ తాకాడని వాదిస్తున్నారు. రిఫరీ మాత్రం ఇరుదేశాల అభ్యర్థనలను తోసిపుచ్చారు. దీంతో బెహ్రెయిన్ జట్టు మేనేజ్మెంట్ అధికారులు ఆసియా క్రీడల ప్రతినిధులకు ఫిర్యాదు చేశారు. వీడియోలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. బెహ్రెయిన్ కోచ్ మాత్రం జపాన్ అథ్లెట్ ఎలాగైనా నెగ్గాలనే ఉద్దేశంతో తోసేశాడని ఆరోపించాడు. -
హైదరాబాద్ : రేపు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ రన్నర్స్ మారథాన్ రన్ ఆదివారం హైదరాబాద్, సైబరాబాద్ పరిధిల్లోని నెక్లెస్‌రోడ్–గచ్చిబౌలి స్టేడియం మధ్య 42 కిలో మీటర్ల మేర జరుగనుంది. ఇందులో దాదాపు 20 వేల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఈ రన్ నేపథ్యంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులకు తావు లేకుండా రెండు కమిషరేట్ల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ పోలీసు కమిషనర్లు అంజనీ కుమార్, వీసీ సజ్జనార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలో తెల్లవారుజాము 4.30 నుంచి ఉదయం 9 గంటల వరకు, సైబరాబాద్‌లో ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 వరకు అమలులో ఉండనున్నాయి. వీవీ విగ్రహం, తెలుగుతల్లి, ఇక్బాల్ మీనార్, లిబర్టీ, కర్బాల మైదాన్, కవాడిగూడ చౌరస్తా, డీబీఆర్ మిల్స్, నల్లగుట్ట జంక్షన్, ఎన్ఎఫ్సీఎల్ ఐలాండ్, క్యాన్సర్ హాస్పిటల్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్ నెం.1/45, రోడ్ నెం.36/10 జంక్షన్లు, కావూరి హిల్స్, రోడ్ నెం.45, సైబర్ టవర్స్ జంక్షన్, మెటల్ చార్మినార్, బయోడైవర్శిటీ పార్క్, గచ్చిబౌలి జంక్షన్, లింగంపల్లి జీహెచ్ఎంసీ ఆఫీస్, విప్రో జంక్షన్, గోపన్‌పల్లి ఎక్స్‌రోడ్స్, గచ్చిబౌలి ట్రాఫిక్ పీఎస్ కేంద్రంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఎస్ఐ అభ్యర్థులు ముందుగా చేరుకోవాలి ఆదివారం సైబరాబాద్‌లోని 55 సెంటర్లలో ఎస్సై అభ్యర్థుల ప్రాథమిక పరీక్ష జరుగనుంది. దీనికి దాదాపు 1.88 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతాయని అంచనా. ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షలకు హాజరయ్యే వారు ఈ ట్రాఫిక్ ఆంక్షల్ని దృష్టిలో పెట్టుకోవాలని కమిషనర్ వీసీ సజ్జనార్ కోరారు. నిర్ణీత సమయానికి ముందే బయలుదేరాలని పేర్కొన్నారు. ఎలాంటి సహాయం అవసరమైనా సైబరాబాద్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ 8500411111, 040–23002424, మాదాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ 9490617257, గచ్చిబౌలి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ 9490617479 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. -
కార్పొరేట్ స్పోర్ట్స్ బీట్..
‘కాలేజ్ డేస్‌లో టెన్నిస్ బాగా ఆడేవాణ్ణి.తర్వాత ఉద్యోగ బాధ్యతలతో ఆటకు పూర్తిగా దూరమయ్యాను. అయితే ఇటీవల మా కంపెనీ స్పోర్ట్స్ టీమ్‌లో చేరడంతో మరోసారి టెన్నిస్ బ్యాట్‌తో నా సత్తా చాటగలిగాను’ అంటూ చెప్పారు నగరంలోని యూసుఫ్గూడలోనివసించే రంజిత్. సిబ్బందిని ఆరోగ్య పథంలో నడిపించే క్రమంలో కంపెనీలు ఉద్యోగులను మారథాన్లు, క్రీడల్లో ప్రోత్సహిస్తున్న తీరుకు ఇది చిరు ఉదాహరణ మాత్రమే. సాక్షి, సిటీబ్యూరో :ఒక మారథాన్‌లో పాల్గొనాలంటే కొన్ని రోజుల పాటు శరీరాన్ని దానికి సన్నద్ధం చేయాలి. టెన్నిస్/ఫుట్‌బాల్ మరేదైనా క్రీడల్లో పాల్గొనాలంటే కూడా ముందస్తు శిక్షణ తప్పదు. అన్ని రోజుల సమయం వెచ్చించాలంటే ఉద్యోగాలు, బాధ్యతలు ఉంటే కష్టం. అయితే ఏకంగా మనం పనిచేసే కంపెనీలే సెలవులతో పాటు కావాల్సిన వసతులన్నీ ఇచ్చి ప్రోత్సహిస్తే... ‘ఆటాడుకుందాం రా.. అంటూ పాడేసుకోమా?’ అందుకే మన నగరం కేవలం బిర్యానీలు, ముత్యాలకు మాత్రమే కాదు... ఇప్పుడు ఐటీ ఉద్యోగుల ఆటలకు, మారథాన్‌లకూ కేరాఫ్‌గా మారుతోంది. అత్యధిక సంఖ్యలో ఐటీ ఉద్యోగులు స్పోర్ట్స్ ఈవెంట్లలో పాల్గొంటున్నారు. తద్వారా దేశంలో జరిగే మారథాన్లలో హైదరాబాద్‌కు ప్రత్యేకతను తెచ్చిపెడుతున్నారు. కేవలం రెండు మూడు నెలలు తప్ప మిగిలిన ఏడాది మొత్తం చక్కని వాతావరణం, ఆహ్లాదకరమైన పరిసరాలు ఔత్సాహిక క్రీడలకు అనుకూలంగా ఉండడం... నగరంలో కార్పొరేట్ స్పోర్ట్స్ కల్చర్ స్థిరపడేందుకు కారణమవుతున్నాయి. మారథాన్... ధనాధన్ రన్నర్స్ ఎప్పుడూ పరుగు తీసే సామర్థ్యానికి సానబెట్టుకుంటూనే ఉంటారు. ఈ క్రమంలో కచ్చితమైన సమయపాలన అలవడుతుందని, లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్‌తో ఎనర్జీ మేనేజ్మెంట్ తెలుస్తుందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. జీవితకాలాన్ని పెంచడంలో పరుగుకు ఎనలేని ప్రాధాన్యత ఉందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అలాగే చురుకైన జీవనశైలి, పనిలో రాణింపునకు కూడా ఇది దోహదపడుతుందని స్పష్టం చేస్తున్నాయి. అది మారథాన్ అయినా లేక ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్ట్ వర్క్ అయినా సరే... అంకితభావం, వేగం, సామర్థ్యం, ఓర్పు... ఈ నాలుగూ లక్ష్యసాధనకు అత్యవసరం. ఈ నేపథ్యంలోనే కంపెనీలు సిటీ మారథాన్లలో తమ ఉద్యోగులు పాల్గొనడాన్ని బాగా ప్రోత్సహిస్తున్నాయి. దాదాపు 11ఏళ్లుగా కొనసాగుతున్న హైదరాబాద్ మారథాన్‌లో అంతకంతకు పెరుగుతున్న ఐటీ ఉద్యోగుల భాగస్వామ్యానికి కారణమిదే. తొలుత 10కె రన్, 5కె రన్లకే పరిమితమైన ఉద్యోగులు ఇప్పుడు హాఫ్, ఫుల్ మారథాన్లకు సైతం సై అంటుండడం విశేషం. దీని వల్ల టైమ్ మేనేజ్మెంట్, క్రమశిక్షణ, లక్ష్యాలను సాధించాలనే పట్టుదల, క్రమబద్ధమైన కార్యాచరణ వంటి లక్షణాలు బాగా అలవడతాయనే సైకాలజిస్ట్‌ల సూచనలను కంపెనీలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఇదోఉదాహరణ.. నగరంలోని పలు కంపెనీలు ఇదే బాట పడుతున్నాయి. ‘లివ్ వెల్’ పేరుతో ఆప్టమ్ కార్పొరేట్ కంపెనీ ప్రత్యేక వెల్నెస్ ప్రోగ్రామ్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తమ ఉద్యోగుల పూర్తిస్థాయి ఆరోగ్యంపై కంపెనీ శ్రద్ధ వహిస్తోంది. వీటిలో యోగా, పొగతాగే అలవాటు నుంచి విముక్తి వరకు ఉన్నాయి. అదే విధంగా క్రీడల్ని కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికి తమ ఉద్యోగుల్లో 5,700 మంది ప్రయోజనం పొందారని కంపెనీ ఇటీవల ప్రకటించింది. అంతేకాదు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడంలో ఉద్యోగులను ప్రోత్సహించే దిశగా హైదరాబాద్ మారథాన్‌లో ఈసారి సంస్థ నుంచి 1200 మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన మారథాన్లలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొంటున్న కంపెనీగా వరుసగా 4 ట్రోఫీలు సైతం దక్కించుకుంది. హెల్తీ లైఫ్‌స్టైల్ కోసం... ఉద్యోగుల ఆరోగ్యానికే మా తొలి ప్రాధాన్యం. సిటీలో జరిగే స్పోర్ట్స్ ఈవెంట్లలో వీలున్నంత వరకు వారిని మేం ప్రోత్సహించడం వెనుక కారణం ఇదే. మారథాన్‌లో పాల్గొనే ఉద్యోగుల సంఖ్య పరంగా గత నాలుగేళ్లుగా మేం టాప్ ప్లేస్‌లో ఉండడం దీనికో ఉదాహరణ.– క్షితిజి కశ్యప్,వైస్ ప్రెసిడెంట్, హ్యూమన్ క్యాపిటల్, ఆప్టమ్ గ్లోబల్ సొల్యూషన్స్ -
కెన్యా కేక
♦ ఏడు స్వర్ణాలతో తొలిసారి అగ్రస్థానం ♦ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ బీజింగ్ : ఈసారి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పతకాల పట్టికలో ఊహించని దృశ్యం ఆవిష్కృతమైంది. 33 ఏళ్ల ఈ మెగా ఈవెంట్ చరిత్రలో తొలిసారి కెన్యా రూపంలో ఒక ఆఫ్రికా దేశం పతకాల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆదివారం ముగిసిన ఈ చాంపియన్‌షిప్‌లో కెన్యా 7 స్వర్ణాలు, 6 రజతాలు, 3 కాంస్యాలతో కలిపి మొత్తం 16 పతకాలతో టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. జమైకా 7 స్వర్ణాలు, 2 రజతాలు, 3 కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలతో రెండో స్థానాన్ని పొందింది. గతంలో 10 సార్లు పతకాల పట్టికలో అగ్రస్థానాన్ని పొందిన అమెరికా ఈసారి మూడో స్థానానికి పడిపోయింది. అమెరికా జట్టు ఆరేసి స్వర్ణ, రజత, కాంస్య పతకాలతో మొత్తం 18 పతకాలను తమ ఖాతాలో వేసుకుంది. ర్యాంక్‌ను ఆయా దేశాలు సాధించిన స్వర్ణ, రజత, కాంస్య పతకాల ఆధారంగా నిర్ణయిస్తారు. ఫలితంగా జమైకా, కెన్యా సమానంగా ఏడు చొప్పున స్వర్ణాలు నెగ్గిన, మెరుగైన రజత పతకాల ఆధారంగా కెన్యాకు టాప్ ర్యాంక్ దక్కింది. మొత్తం 206 దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో 32 దేశాలకు కనీసం ఒక్క పతకమైనా దక్కింది. మరోవైపు భారత్‌కు ఈసారీ నిరాశే ఎదురైంది. మహిళల మారథాన్ రేసులో బరిలోకి దిగిన ఓపీ జైషా, సుధా సింగ్ వరుసగా 18వ, 19వ స్థానాలతో సరిపెట్టుకున్నారు. పోటీల చివరి రోజు ఆదివారం ఏడు విభాగాల్లో ఫైనల్స్ జరిగాయి. పురుషుల 1500 మీటర్ల విభాగంలో కెన్యా అథ్లెట్స్ అస్బెల్ కిప్రోప్ (3ని:34.40 సెకన్లు), మనాన్గోయ్ (3ని:34.60 సెకన్లు) వరుసగా స్వర్ణ, రజత పతకాలను నెగ్గారు. మహిళల 4ఁ400 మీటర్ల రిలేలో జమైకా జట్టు... పురుషుల 4ఁ400 మీటర్ల రిలేలో అమెరికా జట్టు పసిడి పతకాలు సాధించాయి. మహిళల మారథాన్‌లో మరె దిబాబా (ఇథియోపియా-2గం:27ని.35 సెకన్లు) విజేతగా నిలువగా... పురుషుల హైజంప్‌లో డెరెక్ డ్రూన్ (కెనడా-2.34 మీటర్లు), మహిళల జావెలిన్ త్రోలో కత్రినా మోలిటర్ (జర్మనీ-67.69 మీటర్లు) స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. మహిళల 5000 మీటర్ల రేసులో ఇథియోపియా అథ్లెట్స్ అల్మాజ్ అయానా (14ని.26.83 సెకన్లు), సెన్బెరీ తెఫెరి, గెన్‌జెబి దిబాబా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను నెగ్గి ‘క్లీన్ స్వీప్’ చేశారు.