కెన్యా కేక
♦ ఏడు స్వర్ణాలతో తొలిసారి అగ్రస్థానం
♦ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్
బీజింగ్ : ఈసారి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పతకాల పట్టికలో ఊహించని దృశ్యం ఆవిష్కృతమైంది. 33 ఏళ్ల ఈ మెగా ఈవెంట్ చరిత్రలో తొలిసారి కెన్యా రూపంలో ఒక ఆఫ్రికా దేశం పతకాల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆదివారం ముగిసిన ఈ చాంపియన్‌షిప్‌లో కెన్యా 7 స్వర్ణాలు, 6 రజతాలు, 3 కాంస్యాలతో కలిపి మొత్తం 16 పతకాలతో టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. జమైకా 7 స్వర్ణాలు, 2 రజతాలు, 3 కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలతో రెండో స్థానాన్ని పొందింది. గతంలో 10 సార్లు పతకాల పట్టికలో అగ్రస్థానాన్ని పొందిన అమెరికా ఈసారి మూడో స్థానానికి పడిపోయింది. అమెరికా జట్టు ఆరేసి స్వర్ణ, రజత, కాంస్య పతకాలతో మొత్తం 18 పతకాలను తమ ఖాతాలో వేసుకుంది.
ర్యాంక్‌ను ఆయా దేశాలు సాధించిన స్వర్ణ, రజత, కాంస్య పతకాల ఆధారంగా నిర్ణయిస్తారు. ఫలితంగా జమైకా, కెన్యా సమానంగా ఏడు చొప్పున స్వర్ణాలు నెగ్గిన, మెరుగైన రజత పతకాల ఆధారంగా కెన్యాకు టాప్ ర్యాంక్ దక్కింది. మొత్తం 206 దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో 32 దేశాలకు కనీసం ఒక్క పతకమైనా దక్కింది. మరోవైపు భారత్‌కు ఈసారీ నిరాశే ఎదురైంది. మహిళల మారథాన్ రేసులో బరిలోకి దిగిన ఓపీ జైషా, సుధా సింగ్ వరుసగా 18వ, 19వ స్థానాలతో సరిపెట్టుకున్నారు.
పోటీల చివరి రోజు ఆదివారం ఏడు విభాగాల్లో ఫైనల్స్ జరిగాయి. పురుషుల 1500 మీటర్ల విభాగంలో కెన్యా అథ్లెట్స్ అస్‌బెల్ కిప్‌రోప్ (3ని:34.40 సెకన్లు), మనాన్‌గోయ్ (3ని:34.60 సెకన్లు) వరుసగా స్వర్ణ, రజత పతకాలను నెగ్గారు. మహిళల 4ఁ400 మీటర్ల రిలేలో జమైకా జట్టు... పురుషుల 4ఁ400 మీటర్ల రిలేలో అమెరికా జట్టు పసిడి పతకాలు సాధించాయి. మహిళల మారథాన్‌లో మరె దిబాబా (ఇథియోపియా-2గం:27ని.35 సెకన్లు) విజేతగా నిలువగా... పురుషుల హైజంప్‌లో డెరెక్ డ్రూన్ (కెనడా-2.34 మీటర్లు), మహిళల జావెలిన్ త్రోలో కత్రినా మోలిటర్ (జర్మనీ-67.69 మీటర్లు) స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. మహిళల 5000 మీటర్ల రేసులో ఇథియోపియా అథ్లెట్స్ అల్మాజ్ అయానా (14ని.26.83 సెకన్లు), సెన్‌బెరీ తెఫెరి, గెన్‌జెబి దిబాబా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను నెగ్గి ‘క్లీన్ స్వీప్’ చేశారు.