జ్యూరిక్ (స్విట్జర్లాండ్): ఈ ఏడాది బరిలోకి దిగిన ప్రతి టోర్నీలోనూ అగ్రస్థానంలో నిలిచిన ఒలింపిక్, ప్రపంచ చాంపియన్, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరో విజయంపై దృష్టి సారించాడు. ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్‌లో భాగంగా నేడు జ్యూరిక్‌లో జరిగే మీట్‌లో నీరజ్ పోటీపడనున్నాడు. ఈ సీజన్‌లో నీరజ్ రెండు డైమండ్ లీగ్ మీట్‌లలో (మే 5 దోహా; జూన్ 30 లుజానె) అగ్రస్థానంలో నిలిచాడు.
అనంతరం ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించాడు. నేడు అర్ధరాత్రి 12 తర్వాత మొదలయ్యే జావెలిన్ త్రో ఈవెంట్‌లో నీరజ్‌తోపాటు జాకుబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్), ప్రపంచ మాజీ చాంపియన్ పీటర్స్ అండర్సన్ (గ్రెనెడా), వెబెర్ (జర్మనీ) తదితర స్టార్స్ పోటీపడనున్నారు
.
ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం బిడ్..!
2027 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఆతిథ్య హక్కుల కోసం భారత్ బిడ్ వేస్తుందని బుధవారం ఇక్కడి మీడియాతో నీరజ్ చోప్రా వ్యాఖ్యానించాడు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోద ముద్ర లభిస్తే భారత అథ్లెటిక్స్ సమాఖ్య చొరవ తీసుకుంటుంది. 2027 ప్రపంచ చాంపియన్‌షిప్ నిర్వహణ కోసం అక్టోబర్ 2లోపు బిడ్ దాఖలు చేయాలి. ఇప్పటికే 2027 ప్రపంచ చాంపియన్‌షిప్ ఆతిథ్యం కోసం బీజింగ్ తమ బిడ్ దాఖలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment