World Athletics Championships: నీరజ్‌ స్వర్ణ చరిత్ర | Neeraj Chopra becomes first Indian to win gold at World Athletics Championships - Sakshi
Sakshi News home page

World Athletics Championships: నీరజ్‌ స్వర్ణ చరిత్ర

Published Mon, Aug 28 2023 5:56 AM | Last Updated on Mon, Aug 28 2023 9:44 AM

Neeraj Chopra becomes first Indian to win gold at World Athletics Championships - Sakshi

నాలుగు దశాబ్దాల ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో ఏ భారతీయ అథ్లెట్‌కు సాధ్యంకాని ఘనతను జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా సాధించాడు. ఈ మెగా ఈవెంట్‌ చివరిరోజు ఆదివారం నీరజ్‌ చోప్రా భారత అభిమానుల్లో పసిడి కాంతులు నింపాడు. అందరి అంచనాలను నిజం చేస్తూ నీరజ్‌ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. తద్వారా ఈ ప్రతిష్టాత్మక చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా కొత్త చరిత్రను లిఖించాడు.  

బుడాపెస్ట్‌ (హంగేరి): భారతీయులు కూడా ఇక సగర్వంగా చెప్పవచ్చు... ప్రపంచ అథ్లెటిక్స్‌లో మాకు ఉన్నాడు ఒక ప్రపంచ చాంపియన్‌ అని... గత ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం నెగ్గిన జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా ఈసారి పతకం రంగు మార్చాడు. ‘రజత’«దీరుడి నుంచి ‘పసిడి’వీరుడిగా మారాడు. ఆదివారం ముగిసిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నీరజ్‌ చోప్రా స్వర్ణ పతకం సాధించాడు. నీరజ్‌ రెండో ప్రయత్నంలో విసిరిన జావెలిన్‌ అత్యధికంగా 88.17 మీటర్ల దూరం వెళ్లింది. మొత్తం ఆరు ప్రయత్నాల్లో ఈ దూరాన్ని మరో అథ్లెట్‌ అధిగమించలేకపోయాడు. ఫలితంగా నీరజ్‌కు బంగారు పతకం ఖరారైంది. పాకిస్తాన్‌కు చెందిన అర్షద్‌ నదీమ్‌ 87.82 మీటర్లతో రజత పతకం దక్కించుకోగా... జాకుబ్‌ వాద్లెచ్‌ (చెక్‌ రిపబ్లిక్‌) 86.67 మీటర్లతో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. భారత్‌కే చెందిన కిశోర్‌ కుమార్‌ జేనా 84.77 మీటర్లతో ఐదో స్థానంలో, మనూ 84.14 మీటర్లతో ఆరో స్థానంలో నిలిచారు. 

 

ఫౌల్‌తో మొదలు...
క్వాలిఫయింగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన నీరజ్‌ చోప్రా ఫైనల్‌ను నిరాశాజనకంగా ప్రారంభించాడు. నీరజ్‌ తొలి ప్రయత్నమే ఫౌల్‌ అయింది. దాంతో భారత అభిమానులు కాస్త ఆందోళన చెందారు. కానీ నీరజ్‌ వెంటనే తేరుకున్నాడు. రెండో ప్రయత్నంలో నీరజ్‌ జావెలిన్‌ను ఏకంగా 88.17 మీటర్ల దూరం విసిరాడు. ఈ ప్రదర్శనతో నీరజ్‌ చివరిదైన 12వ స్థానం నుంచి అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. నిరీ్ణత ఆరు ప్రయత్నాల వరకు నీరజ్‌ అగ్రస్థానాన్ని కొనసాగించాడు.  



అన్నీ సాధించాడు...
2016లో ప్రపంచ అండర్‌–20 చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచి వెలుగులోకి వచి్చన నీరజ్‌ ఈ ఏడేళ్ల కాలంలో ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగాడు. 2017 ప్రపంచ సీనియర్‌ చాంపియన్‌షిప్‌లో తొలిసారి పాల్గొని 15వ స్థానంలో నిలిచిన నీరజ్‌ ఆ తర్వాత రాటుదేలాడు. అదే ఏడాది భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలిచిన నీరజ్‌... 2018 ఆసియా క్రీడల్లో, 2018 కామన్వెల్త్‌ గేమ్స్‌లోనూ పసిడి పతకాలు సొంతం చేసుకున్నాడు.

2021లో టోక్యో ఒలింపిక్స్‌లో అందరి అంచనాలను తారుమారు చేస్తూ స్వర్ణ పతకం నెగ్గిన ఈ హరియాణా స్టార్‌ 2022 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం, 2022 ప్రతిష్టాత్మక డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో స్వర్ణంతో మరింత ఎత్తుకు ఎదిగాడు. అదే జోరును కొనసాగిస్తూ తాజా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకంతో యావత్‌ భారతాన్ని ఆనందడోలికల్లో ముంచాడు. తాజా స్వర్ణంతో నీరజ్‌ అథ్లెటిక్స్‌లోని అన్ని మేజర్‌ ఈవెంట్లలో పతకాలు నెగ్గిన జావెలిన్‌ త్రోయర్‌గా నిలిచాడు.   



భారత రిలే జట్టుకు ఐదో స్థానం
ఆదివారమే జరిగిన పురుషుల 4్ఠ400 మీటర్ల రిలే ఫైనల్లో అనస్‌ యాహియా, అమోజ్‌ జేకబ్, అజ్మల్, రాజేశ్‌ రమేశ్‌లతో కూడిన భారత బృందం ఐదో స్థానాన్ని దక్కించుకుంది. భారత బృందం 2 నిమిషాల 59.92 సెకన్లలో గమ్యానికి చేరింది. మరోవైపు మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌ ఫైనల్లో భారత అథ్లెట్‌ పారుల్‌ చౌధరీ 11వ స్థానంలో నిలిచింది. పారుల్‌ 9 నిమిషాల 15.31 సెకన్లలో గమ్యానికి చేరి కొత్త జాతీయ రికార్డు నెలకొలి్పంది.   

3: ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు లభించిన మొత్తం పతకాలు. 2003లో మహిళల లాంగ్‌జంప్‌లో అంజూ జార్జి కాంస్యం సాధించగా... 2022లో నీరజ్‌ రజతం, 2023లో నీరజ్‌ స్వర్ణం గెలిచాడు.

2: ఒలింపిక్స్‌తోపాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ స్వర్ణ పతకాలు గెలిచిన రెండో భారతీయ క్రీడాకారుడు నీరజ్‌ చోప్రా. గతంలో షూటర్‌ అభినవ్‌ బింద్రా ఈ ఘనత సాధించాడు. అభినవ్‌ బింద్రా 2006 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో పసిడి పతకాలు
గెలిచాడు.

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement