మారథాన్ మమ్మీ
ఎదుటి వాళ్ల సమస్యలు కొన్ని చాలా సాధారణంగా కనిపిస్తాయి. వీటినీ గట్టెక్కానని చెప్పుకోవడం పెద్ద ఘనతా అని కూడా అనిపిస్తుంది. కాని వాటిని అనుభవిస్తున్న వాళ్లకే తెలుస్తుంది ఆ సమస్యల లోతు. అయినా ఈదుకుంటూ జీవితం చూపించిన ఒడ్డుకు చేరడం నిజంగా ధైర్యమే! అలాంటి ధీశాలే ఈ ఫొటోలోని వ్యక్తి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ పేజీలో తన కథ రాసి చాలామందికి ప్రేరణగా నిలిచారు. ఆమె జీవితం ఆమె మాటల్లోనే...
‘‘నేను డిగ్రీ అలా పూర్తి చేశానో లేదో మంచి సంబంధం వచ్చిందని పెళ్లిచేసేశారు మా పెద్దవాళ్లు. ఆయన డాక్టర్. గ్రామీణ మధ్యతరగతి నుంచి వచ్చిన నాకు నిజంగానే అది గొప్ప సంబంధమే అనిపించింది. అంతా అనుకున్నట్టే జరిగితే జీవితం ఎందుకు అవుతుంది? కాబట్టి జరగలేదు. నా కన్నా తొమ్మిదేళ్లు పెద్దవాడైన నా భర్తకు, నాకు మానసిక సఖ్యత కుదరలేదు. మేమిద్దరం ఒకరికొకరం అర్థమయ్యేలోపే మాకు బాబు పుట్టాడు. వాడి రెండోయేట పిల్లాడికి ఆటిజం ఉందని బయటపడింది. పిల్లాడికున్న సమస్య కూడా మా మధ్య సయోధ్యను కుదర్చలేకపోయింది. ప్రతిక్షణం మేమిద్దరం గొడవలు పడ్తూంటే వాడు బెంబేలెత్తి పోవడం.. దాంతో వాడి ప్రాబ్లం మరింత జటిలమవడం ఇష్టంలేక ఒకరికొరం సమ్మతించుకునే విడాకులు తీసుకున్నాం. మా ఇద్దరి ఫైనాన్షియల్ రెస్పాన్స్‌బిలిటీ మా ఆయనే చూసుకోవాలనే ఒప్పందం ఉన్నా.. నా అసలు జీవితం విడాకుల తర్వాతే మొదలైంది. పిల్లాడి బాధ్యత అంతా నాదే. వాడిని థెరపీస్‌కు తీసుకెళ్లడం.. వాడితో నేనెలా నడచుకోవాలో ట్రైనింగ్ తీసుకోవడం.. ఇలా ట్వంటీఫోర్ ఇంటూ సెవెన్ వాటి చుట్టే ఉండేదాన్ని. సింగిల్ మదర్‌గా ఆ టఫ్ జాబ్‌లో పడిపోయి నా గురించి నేను మరిచిపోయాను.
కొడుకు విహాన్‌తో మారథాన్ మమ్మీ (నాడు – నేడు)
ఫలితంగా బరువు పెరిగాను. దాంతో నాకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో అప్పుడు స్పృహలోకి వచ్చాను. వెంటనే మా ఇంటి దగ్గర జిమ్‌లో జాయిన్ అయ్యాను. నా రొటీన్‌లో అదీ భాగమయ్యేసరికి ఆ జిమ్ కాస్త మూతబడింది. అప్పటి నుంచి ప్రతి రోజూ ఉదయం పరిగెత్తడం మొదలుపెట్టాను. నేను చేస్తోంది మంచి పని, తర్వాత అది నా జీవితాన్నే మార్చేస్తుందని అప్పటికి నాకు తెలియదు. ఓ నాలుగు నెలలకు ముంబై మారథాన్ గురించి తెలిసింది. దాని మీద అవగాహన లేకపోయినా అందులో పాల్గొన్నాను. గెలిచాను. ఆశ్చర్యమేసింది. నా శక్తీ తెలిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పరుగు ఆపలేదు. దాదాపు 95 మారథాన్లలో పాల్గొన్నాను. మెడల్స్ గెలుచుకున్నాను. చాలామందికి శిక్షణా ఇస్తున్నాను. నేను గెలిచినప్పుడల్లా మా అబ్బాయి మొహంలో కనిపించే ఆనందం నాకు కొత్త ఉత్సాహాన్నిస్తుంటుంది. స్కూల్లో వాడిని ఎవరైనా ‘‘మీ అమ్మ చేస్తుంది?’’ అని అడిగితే ‘‘మా అమ్మ రన్నర్ ’’ అని చెప్తాడు. అది చాలు నేను సెల్ఫ్ సఫీషియంట్ అని అనుకోవడానికి, చెప్పుకోవడానికి. నేను, నా భర్త విడిపోయి కలిసి ఉంటున్నాం. సమస్యలు లేకపోతే జీవితానికి ఒకటే దారి. సమస్యలొస్తే నాలుగు దారులు. యెస్.. ప్రాబ్లమ్స్ జీవితాన్ని నాలుగు దారుల కూడలిలో నిలబెడ్తాయి. మనలోని శక్తిని వెలికితీస్తాయి. కొత్త బలాన్నిస్తాయి. దానికి నేనే ఉదాహరణ’’ అంటూ రాసుకున్నారు ఆమె (ఎక్కడా తన పేరును ప్రస్తావించలేదు).
Comments
Please login to add a commentAdd a comment