
హిరోటో, ఎలబస్సి
జకార్త: ప్రశాంతంగా సాగుతున్న ఏషియన్ గేమ్స్‌లో శనివారం వివాదం చోటుచేసుకుంది. పురుషుల రన్నింగ్ కాంపిటేషన్‌లో తనను నెట్టేసి జపాన్ ఆటగాడు హిరోటో స్వర్ణం గెలిచాడని బెహ్రెయిన్ రన్నర్ ఎలబస్సి ఆరోపించాడు. జకార్త వీధుల్లో అప్పటి వరకు జరిగిన 42 కిలోమీటర్ల పరుగు పందెంలో ఈ ఇద్దరు ఆటగాళ్లు నువ్వా-నేనా అన్నట్లు పరుగెత్తారు. ఫైనల్ 100 మీటర్ల విభాగంలో హోరాహోరిగా పోటీపడ్డారు. అయితే అంతా ఎలబస్సే గెలుస్తాడని భావించారు. ఇంతలో అతని సమీపంలో ఉన్న హిరటో.. ఎలబస్సిని నెట్టేశాడు. దీంతో పట్టు తప్పిన ఎలబస్సి కింద పడిపోకుండా సమన్వయంతో పరుగును కొనసాగించాడు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రెప్పపాటు వ్యవధిలో స్వర్ణం గెలుస్తాననుకున్న ఎలబస్సి ఆశలు గల్లంతయ్యాయి. దీంతో హిరటోకు పసిడి సొంతం కాగా.. ఎలబస్సికి రజతం దక్కింది. ‘అతను తోసేసాడు లేకుంటే నేనే గెలిచేవాడిని’ అని పరుగు అనంతరం ఎలబస్సి ఆవేదన వ్యక్తం చేశాడు.
స్వర్ణ విజేత హిరోటో మాత్రం.. ‘చివర్లో అసలేం జరిగిందో నాకు తెలియదు. కానీ ఆశ్చర్యం వేస్తుంది’ అని తెలిపాడు. జపాన్ అధికారులేమో అతన్ని అధిగమించే సమయంలో వారి మధ్య గ్యాప్ లేదని, దాంతోనే తమ అథ్లెట్ తాకాడని వాదిస్తున్నారు. రిఫరీ మాత్రం ఇరుదేశాల అభ్యర్థనలను తోసిపుచ్చారు. దీంతో బెహ్రెయిన్ జట్టు మేనేజ్‌మెంట్ అధికారులు ఆసియా క్రీడల ప్రతినిధులకు ఫిర్యాదు చేశారు. వీడియోలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. బెహ్రెయిన్ కోచ్ మాత్రం జపాన్ అథ్లెట్ ఎలాగైనా నెగ్గాలనే ఉద్దేశంతో తోసేశాడని ఆరోపించాడు.
Comments
Please login to add a commentAdd a comment