‘కాలేజ్ డేస్‌లో టెన్నిస్ బాగా ఆడేవాణ్ణి.తర్వాత ఉద్యోగ బాధ్యతలతో ఆటకు పూర్తిగా దూరమయ్యాను. అయితే ఇటీవల మా కంపెనీ స్పోర్ట్స్ టీమ్‌లో చేరడంతో మరోసారి టెన్నిస్ బ్యాట్‌తో నా సత్తా చాటగలిగాను’ అంటూ చెప్పారు నగరంలోని యూసుఫ్‌గూడలోనివసించే రంజిత్. సిబ్బందిని ఆరోగ్య పథంలో నడిపించే క్రమంలో కంపెనీలు ఉద్యోగులను మారథాన్‌లు, క్రీడల్లో ప్రోత్సహిస్తున్న తీరుకు ఇది చిరు ఉదాహరణ మాత్రమే.
సాక్షి, సిటీబ్యూరో :ఒక మారథాన్‌లో పాల్గొనాలంటే కొన్ని రోజుల పాటు శరీరాన్ని దానికి సన్నద్ధం చేయాలి. టెన్నిస్/ఫుట్‌బాల్ మరేదైనా క్రీడల్లో పాల్గొనాలంటే కూడా ముందస్తు శిక్షణ తప్పదు. అన్ని రోజుల సమయం వెచ్చించాలంటే ఉద్యోగాలు, బాధ్యతలు ఉంటే కష్టం. అయితే ఏకంగా మనం పనిచేసే కంపెనీలే సెలవులతో పాటు కావాల్సిన వసతులన్నీ ఇచ్చి ప్రోత్సహిస్తే... ‘ఆటాడుకుందాం రా.. అంటూ పాడేసుకోమా?’ అందుకే మన నగరం కేవలం బిర్యానీలు, ముత్యాలకు మాత్రమే కాదు... ఇప్పుడు ఐటీ ఉద్యోగుల ఆటలకు, మారథాన్‌లకూ కేరాఫ్‌గా మారుతోంది. అత్యధిక సంఖ్యలో ఐటీ ఉద్యోగులు స్పోర్ట్స్ ఈవెంట్లలో పాల్గొంటున్నారు. తద్వారా దేశంలో జరిగే మారథాన్‌లలో హైదరాబాద్‌కు ప్రత్యేకతను తెచ్చిపెడుతున్నారు. కేవలం రెండు మూడు నెలలు తప్ప మిగిలిన ఏడాది మొత్తం చక్కని వాతావరణం, ఆహ్లాదకరమైన పరిసరాలు ఔత్సాహిక క్రీడలకు అనుకూలంగా ఉండడం... నగరంలో కార్పొరేట్ స్పోర్ట్స్ కల్చర్ స్థిరపడేందుకు కారణమవుతున్నాయి.
మారథాన్... ధనాధన్
రన్నర్స్ ఎప్పుడూ పరుగు తీసే సామర్థ్యానికి సానబెట్టుకుంటూనే ఉంటారు. ఈ క్రమంలో కచ్చితమైన సమయపాలన అలవడుతుందని, లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్‌తో ఎనర్జీ మేనేజ్‌మెంట్ తెలుస్తుందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. జీవితకాలాన్ని పెంచడంలో పరుగుకు ఎనలేని ప్రాధాన్యత ఉందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అలాగే చురుకైన జీవనశైలి, పనిలో రాణింపునకు కూడా ఇది దోహదపడుతుందని స్పష్టం చేస్తున్నాయి. అది మారథాన్ అయినా లేక ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్ట్ వర్క్ అయినా సరే... అంకితభావం, వేగం, సామర్థ్యం, ఓర్పు... ఈ నాలుగూ లక్ష్యసాధనకు అత్యవసరం. ఈ నేపథ్యంలోనే కంపెనీలు సిటీ మారథాన్‌లలో తమ ఉద్యోగులు పాల్గొనడాన్ని బాగా ప్రోత్సహిస్తున్నాయి. దాదాపు 11ఏళ్లుగా కొనసాగుతున్న హైదరాబాద్ మారథాన్‌లో అంతకంతకు పెరుగుతున్న ఐటీ ఉద్యోగుల భాగస్వామ్యానికి కారణమిదే. తొలుత 10కె రన్, 5కె రన్‌లకే పరిమితమైన ఉద్యోగులు ఇప్పుడు హాఫ్, ఫుల్ మారథాన్‌లకు సైతం సై అంటుండడం విశేషం. దీని వల్ల టైమ్ మేనేజ్‌మెంట్, క్రమశిక్షణ, లక్ష్యాలను సాధించాలనే పట్టుదల, క్రమబద్ధమైన కార్యాచరణ వంటి లక్షణాలు బాగా అలవడతాయనే సైకాలజిస్ట్‌ల సూచనలను కంపెనీలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
ఇదోఉదాహరణ..
నగరంలోని పలు కంపెనీలు ఇదే బాట పడుతున్నాయి. ‘లివ్ వెల్’ పేరుతో ఆప్టమ్ కార్పొరేట్ కంపెనీ ప్రత్యేక వెల్‌నెస్ ప్రోగ్రామ్‌ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తమ ఉద్యోగుల పూర్తిస్థాయి ఆరోగ్యంపై కంపెనీ శ్రద్ధ వహిస్తోంది. వీటిలో యోగా, పొగతాగే అలవాటు నుంచి విముక్తి వరకు ఉన్నాయి. అదే విధంగా క్రీడల్ని కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికి తమ ఉద్యోగుల్లో 5,700 మంది ప్రయోజనం పొందారని కంపెనీ ఇటీవల ప్రకటించింది. అంతేకాదు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడంలో ఉద్యోగులను ప్రోత్సహించే దిశగా హైదరాబాద్ మారథాన్‌లో ఈసారి సంస్థ నుంచి 1200 మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన మారథాన్‌లలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొంటున్న కంపెనీగా వరుసగా 4 ట్రోఫీలు సైతం దక్కించుకుంది.
హెల్తీ లైఫ్‌స్టైల్ కోసం...
ఉద్యోగుల ఆరోగ్యానికే మా తొలి ప్రాధాన్యం. సిటీలో జరిగే స్పోర్ట్స్ ఈవెంట్లలో వీలున్నంత వరకు వారిని మేం ప్రోత్సహించడం వెనుక కారణం ఇదే. మారథాన్‌లో పాల్గొనే ఉద్యోగుల సంఖ్య పరంగా గత నాలుగేళ్లుగా మేం టాప్ ప్లేస్‌లో ఉండడం దీనికో ఉదాహరణ.– క్షితిజి కశ్యప్,వైస్ ప్రెసిడెంట్, హ్యూమన్ క్యాపిటల్, ఆప్టమ్ గ్లోబల్ సొల్యూషన్స్
Comments
Please login to add a commentAdd a comment