భారత హాకీ జోరుగా...
రెండో మ్యాచ్‌లోనూ నెదర్లాండ్స్‌పై విజయం
2–0తో సిరీస్ సొంతం
ఆమ్‌స్టర్‌డామ్: యూరోప్ పర్యటనలో భారత హాకీ జట్టుకు చక్కటి విజయం లభించింది. ప్రపంచ నాలుగో ర్యాంకర్ నెదర్లాండ్స్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2–0తో సొంతం చేసుకుంది. సోమవారం రాత్రి జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 2–1 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్‌ను బోల్తా కొట్టించింది. భారత జట్టులో 9 మంది జూనియర్ ఆటగాళ్లు ఉన్నా... పటిష్టమైన నెదర్లాండ్స్‌పై మనదే పైచేయి కావడం విశేషం. 4వ నిమిషంలో గుర్జంత్ సింగ్, 51వ నిమిషంలో మన్‌దీప్ సింగ్ ఒక్కో గోల్ చేసి భారత్‌ను విజేతగా నిలిపారు.
మ్యాచ్ నాలుగో నిమిషంలో వరుణ్ డ్రాగ్ ఫ్లిక్ ద్వారా గోల్ చేసే ప్రయత్నం చేయగా డచ్ కీపర్ దానిని అడ్డుకున్నాడు. అయితే రీబౌండ్‌లో రివర్స్ స్టిక్‌తో బంతిని పోస్ట్‌లోకి పంపించిన గుర్జంత్ అంతర్జాతీయ హాకీలో తన తొలి గోల్ నమోదు చేశాడు. ఆ తర్వాత భారత్ పదే పదే ప్రత్యర్థిపై ఎదురుదాడి చేసింది. అర్మాన్ ఖురేషీకి గోల్ చేసేందుకు మంచి అవకాశం వచ్చినా... దురదృష్టవశాత్తూ బంతి గోల్‌పోస్ట్‌కు కాస్త దూరంగా వెళ్లింది. చివరి క్వార్టర్‌లో పెనాల్టీని మన్‌దీప్ గోల్‌గా మలచడంతో ఆధిక్యం 2–0కు పెరిగింది. చివరకు 58వ నిమిషంలో నెదర్లాండ్స్ ఆటగాడు సాండర్ గోల్ సాధించినా... అది ఆ జట్టును పరాజయం నుంచి కాపాడలేకపోయింది.