భారత్ జోరు కొనసాగేనా?
రాయ్‌పూర్: ఇటీవలి కాలంలో అద్భుత ప్రదర్శనతో దూసుకెళుతున్న భారత హాకీ జట్టు మరో ప్రతిష్టాత్మక పోరుకు సిద్ధమవుతోంది. నేటి (శుక్రవారం) నుంచి జరిగే హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యుఎల్) ఫైనల్స్ టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో అర్జెంటీనాతో ఢీకొననుంది. ప్రపంచ స్థాయిలో టాప్-8 దేశాల జట్లు పాల్గొనే ఈ టోర్నీకి రాయ్‌పూర్‌లో కొత్తగా నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ స్టేడియం వేదిక కానుంది. సర్దార్ సింగ్ నేతృత్వంలోని భారత్ జట్టు ఇటీవలి కివీస్ పర్యటనలో ఆతిథ్య జట్టును 2-1తో ఓడించి జోరు మీదుంది. ప్రస్తుత టోర్నీలో బలమైన జట్లు ఉన్న పూల్ ‘బి’లో భారత్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి ఉంది.
ఇదే గ్రూపులో ప్రపంచ రెండవ ర్యాంకులో ఉన్న నెదర్లాండ్స్, జర్మనీ (3వ ర్యాంకు), అర్జెంటీనా (5వ ర్యాంక్) ఉన్నాయి. 18 మందితో కూడిన భారత జట్టుకు డిఫెండర్లు బీరేంద్ర లక్రా, వీఆర్ రఘునాథ్, రూపిందర్ పాల్ సింగ్ కీలకం కానున్నారు. మిడ్‌ఫీల్డ్‌లో సర్దార్, దేవేందర్ వాల్మీకి, మన్‌ప్రీత్ సింగ్, ధరమ్‌వీర్ సింగ్, ముజ్తబా.. అటాకింగ్‌లో ఎస్‌వీ సునీల్, రమన్‌దీప్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్ సత్తా చూపేందుకు సిద్ధమవుతున్నారు. వీరంతా పూర్తి స్థాయిలో రాణిస్తే అర్జెంటీనాపై పైచేయి సాధించొచ్చు. ఈ టోర్నీలో ఆడే దేశాలన్నీ ఒలింపిక్స్‌కు అర్హత సాధించినవే కావడంతో ప్రత్యర్థుల బలాబలాలపై అంచనాకు రానున్నాయి.