Finals Tourney
-
టైటిల్‌కు విజయం దూరంలో...
మరోసారి సాధికారిక ప్రదర్శనతో అలరించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఈ ఏడాది తొలిసారి ఓ అంతర్జాతీయ టోర్నీలో ఫైనల్‌కు చేరింది. సీజన్లో తొలి టైటిల్ లోటును తీర్చుకునేందుకు మరో విజయం దూరంలో నిలిచింది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్లో ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి తుది సమరానికి అర్హత సాధించింది. జకార్తా: నెల రోజులపాటు లభించిన విరామ సమయంలో పక్కా ప్రణాళికతో సాధన చేసిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు అద్భుత ఫలితాలు సాధిస్తోంది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్లో సింధు ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు 46 నిమిషాల్లో 21–19, 21–10తో ప్రపంచ మూడో ర్యాంకర్ చెన్ యుఫె (చైనా)పై గెలిచింది. ఈ ఏడాది సింగపూర్ ఓపెన్, ఇండియా ఓపెన్‌లో సెమీఫైనల్లో వెనుదిరిగిన ఈ తెలుగమ్మాయి తాజా గెలుపుతో సీజన్లో తొలి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. నేడు జరిగే ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 10–4తో యామగుచిపై ఆధిక్యంలో ఉంది. రెండో సెమీఫైనల్లో అకానె యామగుచి 21–9, 21–15తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)ను బోల్తా కొట్టించింది. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్, స్విస్ ఓపెన్, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్స్ సాధించి జోరు మీదున్న చెన్ యుఫె ఆటలు సింధు ముందు సాగలేదు. తొలి గేమ్‌లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. నాలుగుసార్లు చెన్ యుఫె ఆధిక్యంలోకి వెళ్లినా దానిని నిలబెట్టుకోలేకపోయింది. సింధు 14–18తో వెనుకబడిన దశలో వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 19–18తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత చెన్ యుఫె ఒక పాయింట్ సాధించగా... ఆ వెంటనే సింధు రెండు పాయింట్లు గెలిచి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్ ఆరంభంలో సింధు తడబడినట్లు కనిపించినా వెంటనే గాడిలో పడింది. 2–5తో వెనుకబడిన దశలో సింధు వరుసగా ఏడు పాయింట్లు గెలిచి 9–5తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత స్కోరు 10–8తో ఉన్నదశలో సింధు వరుసగా 8 పాయింట్లు సాధించి 18–8తో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది. అదే జోరులో రెండో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. 3 ఇండోనేసియా ఓపెన్‌లో భారత్ తరఫున ఫైనల్ చేరిన మూడో ప్లేయర్‌గా సింధు నిలిచింది. గతంలో సైనా నెహ్వాల్ వరుసగా నాలుగుసార్లు (2009, 2010, 2011, 2012) ఫైనల్ చేరి మూడుసార్లు (2009, 2010, 2012) టైటిల్ గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 2017లో విజేతగా నిలిచాడు. -
చాంపియన్ భారత్
హిరోషిమా: మహిళల హాకీ సిరీస్ ఫైనల్స్ టోర్నీ చాంపియన్‌గా భారత్ అవతరించింది. ఇప్పటికే ఫైనల్స్ చేరడం ద్వారా ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించిన భారత్ హిరోషిమాలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 3–1 గోల్స్ తేడాతో ఆతిథ్య జపాన్‌పై విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. నువ్వా నేనా అన్నట్లు సాగిన తుది పోరులో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న భారత్ జపాన్ను మట్టికరిపించింది. భారత్ తరపున మరోసారి రాణించిన గుర్జిత్ కౌర్ రెండు గోల్స్(45వ, 60వ నిమిషంలో) సాధించి విజయంలో కీలకపాత్ర పోషించింది. రాణి రాంపాల్(3వ నిమిషంలో) మరో గోల్ నమోదు చేసింది. జపాన్ తరపున నమోదైన ఏకైక గోల్‌ను మోరి కనోన్(11వ నిమిషంలో) సాధించింది. మ్యాచ్ మొత్తంలో భారత్ 26 సార్లు జపాన్ రక్షణ వలయంలోకి ప్రవేశించగా, జపాన్ కేవలం 13 సార్లు మాత్రమే భారత్ రక్షణ వలయంలోకి ప్రవేశించింది. మ్యాచ్‌లో భారత్‌కు 8 పెనాల్టీ కార్నర్స్ లభించగా జపాన్‌కు కేవలం 2 మాత్రమే లభించాయి. భారత్ సాధించిన మూడు గోల్స్ కూడా పెనాల్టీ కార్నర్ల రూపంలో రావడం విశేషం. టోర్నీలో అపజయం ఎరుగని భారత్ మొత్తం 27 గోల్స్ చేయగా కేవలం 4 గోల్స్‌ను మాత్రమే ప్రత్యర్థులకు సమర్పించుకుంది. భారత కెప్టెన్ రాణి రాంపాల్ బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలవగా, గుర్జీత్ కౌర్ టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచింది. అంతకుముందు 3వ స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో చిలీ 3–1తో పెనాల్టీ షూటౌట్లో విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 3–3 గోల్స్‌తో సమంగా ఉండటంతో షూటౌట్లో విజేతను నిర్ణయించారు. -
ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ బెర్త్ సొంతం
హిరోషిమా: ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ టోర్నీకి భారత మహిళల హాకీ జట్టు అర్హత సాధించింది. హిరోషిమాలో జరుగుతోన్న మహిళల హాకీ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో చిలీపై విజయం సాధించి క్వాలిఫయర్స్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ 4–2 గోల్స్ తేడాతో విజ యం సాధించింది. భారత్ తరపున గుర్జిత్ కౌర్(22, 37వ నిమిషంలో), నవ్‌నీత్ కౌర్(31వ నిమిషంలో), రాణి రాంపాల్(57వ నిమిషంలో)లు గోల్స్ సాధించగా... చిలీ తరపున కరోలినా గార్సియా(18వ నిమి షంలో), మాన్యుల ఉరోజ్ (43వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. ఆట 18వ నిమిషంలో కరోలినా గార్సియా గోల్‌తో చిలీ ఖాతా తెరిచింది. అయితే షాక్ నుంచి త్వరగానే తేరుకున్న భారత్ 22వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్ పోస్ట్‌లోకి నెట్టి గుర్జిత్ కౌర్ స్కోరును సమం చేసింది. తర్వాత మరింత దూకుడును పెంచిన భారత్ ప్రత్యర్థి గోల్ పోస్టుపైకి దాడులను ముమ్మరం చేసింది. ఆట 31వ నిమిషంలో ఫీల్డ్ గోల్ చేసిన నవ్‌నీత్ కౌర్ భారత్‌కు 2–1 ఆధిక్యాన్నిచ్చింది. 37వ నిమిషంలో మరో గోల్ సాధించిన గుర్జీత్ కౌర్ భారత్ స్కోర్‌ను 3–1కు తీసుకెళ్లింది. చిలీ తరపున మాన్యుల ఉరోజ్ 43వ నిమిషంలో గోల్ సాధించి భారత్ ఆధిక్యాన్ని 3–2కు తగ్గించింది. 4వ క్వార్టర్లో భారత్ తరపున గోల్ సాధించిన రాణి రాంపాల్ భారత విజయాన్ని ఖాయం చేసింది. మ్యాచ్‌లో భారత్ 2 గ్రీన్ కార్డులను పొందగా, చిలీ 1 గ్రీన్ కార్డును పొందింది. మరో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య జపాన్ 3–1తో పెనాల్టీ షూటౌట్లో రష్యాపై విజయం సాధించి ఫైనల్లో ప్రవేశించింది. నిర్ణీత సమయంలో ఇరుజట్లు ఒక్కో గోల్ చేయడంతో షూటౌట్ అనివార్యమైంది. ఆదివారం భారత్, జపాన్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది. -
భారత్ జోరు కొనసాగేనా?
రాయ్‌పూర్: ఇటీవలి కాలంలో అద్భుత ప్రదర్శనతో దూసుకెళుతున్న భారత హాకీ జట్టు మరో ప్రతిష్టాత్మక పోరుకు సిద్ధమవుతోంది. నేటి (శుక్రవారం) నుంచి జరిగే హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యుఎల్) ఫైనల్స్ టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో అర్జెంటీనాతో ఢీకొననుంది. ప్రపంచ స్థాయిలో టాప్-8 దేశాల జట్లు పాల్గొనే ఈ టోర్నీకి రాయ్‌పూర్‌లో కొత్తగా నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ స్టేడియం వేదిక కానుంది. సర్దార్ సింగ్ నేతృత్వంలోని భారత్ జట్టు ఇటీవలి కివీస్ పర్యటనలో ఆతిథ్య జట్టును 2-1తో ఓడించి జోరు మీదుంది. ప్రస్తుత టోర్నీలో బలమైన జట్లు ఉన్న పూల్ ‘బి’లో భారత్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి ఉంది. ఇదే గ్రూపులో ప్రపంచ రెండవ ర్యాంకులో ఉన్న నెదర్లాండ్స్, జర్మనీ (3వ ర్యాంకు), అర్జెంటీనా (5వ ర్యాంక్) ఉన్నాయి. 18 మందితో కూడిన భారత జట్టుకు డిఫెండర్లు బీరేంద్ర లక్రా, వీఆర్ రఘునాథ్, రూపిందర్ పాల్ సింగ్ కీలకం కానున్నారు. మిడ్‌ఫీల్డ్‌లో సర్దార్, దేవేందర్ వాల్మీకి, మన్‌ప్రీత్ సింగ్, ధరమ్వీర్ సింగ్, ముజ్తబా.. అటాకింగ్‌లో ఎస్వీ సునీల్, రమన్‌దీప్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్ సత్తా చూపేందుకు సిద్ధమవుతున్నారు. వీరంతా పూర్తి స్థాయిలో రాణిస్తే అర్జెంటీనాపై పైచేయి సాధించొచ్చు. ఈ టోర్నీలో ఆడే దేశాలన్నీ ఒలింపిక్స్‌కు అర్హత సాధించినవే కావడంతో ప్రత్యర్థుల బలాబలాలపై అంచనాకు రానున్నాయి.