హిరోషిమా: ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ టోర్నీకి భారత మహిళల హాకీ జట్టు అర్హత సాధించింది. హిరోషిమాలో జరుగుతోన్న మహిళల హాకీ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో చిలీపై విజయం సాధించి క్వాలిఫయర్స్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ 4–2 గోల్స్ తేడాతో విజ యం సాధించింది. భారత్ తరపున గుర్జిత్ కౌర్(22, 37వ నిమిషంలో), నవ్‌నీత్ కౌర్(31వ నిమిషంలో), రాణి రాంపాల్(57వ నిమిషంలో)లు గోల్స్ సాధించగా... చిలీ తరపున కరోలినా గార్సియా(18వ నిమి షంలో), మాన్యుల ఉరోజ్ (43వ నిమిషంలో) చెరో గోల్ చేశారు.
ఆట 18వ నిమిషంలో కరోలినా గార్సియా గోల్‌తో చిలీ ఖాతా తెరిచింది. అయితే షాక్ నుంచి త్వరగానే తేరుకున్న భారత్ 22వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్ పోస్ట్‌లోకి నెట్టి గుర్జిత్ కౌర్ స్కోరును సమం చేసింది. తర్వాత మరింత దూకుడును పెంచిన భారత్ ప్రత్యర్థి గోల్ పోస్టుపైకి దాడులను ముమ్మరం చేసింది. ఆట 31వ నిమిషంలో ఫీల్డ్ గోల్ చేసిన నవ్‌నీత్ కౌర్ భారత్‌కు 2–1 ఆధిక్యాన్నిచ్చింది. 37వ నిమిషంలో మరో గోల్ సాధించిన గుర్జీత్ కౌర్ భారత్ స్కోర్‌ను 3–1కు తీసుకెళ్లింది.
చిలీ తరపున మాన్యుల ఉరోజ్ 43వ నిమిషంలో గోల్ సాధించి భారత్ ఆధిక్యాన్ని 3–2కు తగ్గించింది. 4వ క్వార్టర్‌లో భారత్ తరపున గోల్ సాధించిన రాణి రాంపాల్ భారత విజయాన్ని ఖాయం చేసింది. మ్యాచ్‌లో భారత్ 2 గ్రీన్ కార్డులను పొందగా, చిలీ 1 గ్రీన్ కార్డును పొందింది. మరో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య జపాన్ 3–1తో పెనాల్టీ షూటౌట్‌లో రష్యాపై విజయం సాధించి ఫైనల్‌లో ప్రవేశించింది. నిర్ణీత సమయంలో ఇరుజట్లు ఒక్కో గోల్ చేయడంతో షూటౌట్ అనివార్యమైంది. ఆదివారం భారత్, జపాన్‌ల మధ్య టైటిల్ పోరు జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment