శ్రేష్ట భారత్ గురించి నేనెప్పుడో చెప్పా
బీజేపీ ఇప్పుడు చెబుతోంది: చంద్రబాబు
హైదరాబాద్ : బీజేపీ ఇప్పుడు చెబుతున్న శ్రేష్ట భారత్ (అత్యుత్తమ భారతదేశం) గురించి తాను అధికారంలో ఉన్నప్పుడే ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చెప్పారు. చంద్రబాబు బుధవారం తన నివాసంలో సీమాంధ్రలో పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. 7 లోక్‌సభ స్థానాలు, 47 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. తాను సీఎంగా ఉన్న సమయంలోనే దేశ, విదేశాల్లో పర్యటించి భారతదేశానికి ఎన్నో శక్తి సామర్థ్యాలున్నాయని చెప్పానన్నారు. అయితే అవకాశాలు లేక వెనుకబడిపోయి ఉందని వివరించానని అన్నారు. సంస్కరణలతో పాటు సాంకేతిక పరిజ్ఞానం రావటంతో తాను గతంలోనే సుపరిపాలనను అందించానని, మోడీ ఇప్పుడు అదే చెబుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ సీట్లను కేసీఆర్ తనతో పాటు కూతురు, కుమారుడు, అల్లుడికి పంచుకున్నారని విమర్శించారు.
కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని, అది ఏం పార్టీనో అర్థంకావడంలేదని వ్యాఖ్యానించారు. ఆయనది ఉద్యమ పార్టీ అని చెప్పుకునే కేసీఆర్.. టీడీపీ నుంచి వెళ్లిన వారిని చివరి నిమిషంలో పార్టీలో చేర్చుకుని టిక్కెట్లు ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ గంగానది మాదిరిగా తయారైందని, దానిలో ఎంతో కాలుష్యం ఉందని, ఎవరో వ స్తారు, పోతుంటారని చెప్పారు. మీరు కూడా సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలను చేర్చుకున్నారు కదా అని విలేకరులు ప్రశ్నించగా.. అటువైపు ఆ పార్టీ పూర్తిగా మట్టికొట్టుకు పోయిందని, ఆ పార్టీ నాయకులకు ఒక వేదిక లేదని, వారికి వేదిక కల్పించేందుకు చేర్చుకుంటున్నానని సమర్థించుకున్నారు. టీడీపీ లౌకిక పార్టీ అని అన్నారు. కులం, ఇతర పేర్లతో రెచ్చగొట్టి లబ్ధిపొందాలని కొందరు చూస్తుంటారని, అటువంటి వారిని ఎవ్వరూ పట్టించుకోవద్దని చెప్పారు. పలు ప్రాంతాల్లో పార్టీ నేతలు తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు వేయడాన్ని, పార్టీ నేత ఆర్.కృష్ణయ్యపై దాడిచేయటాన్ని బాబు ఖండించారు. నందమూరి బాలకృష్ణ, హరికృష్ణలకు ఎక్కడి నుంచి అవకాశం కల్పించాలో వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. తన నియోజకవర్గం సంఖ్యాపరంగా ఆఖరున ఉన్నందువల్లే తన పేరును తొలి జాబితాలో చివర్లో పెట్టుకున్నానని చెప్పారు.
ఈ విలేకరుల సమావేశానికి సాక్షిని అనుమతించలేదు. వివిధ మార్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వార్త ఇస్తున్నాం.
సాక్షిని అనుమతించి ఉంటే ఈ కింది ప్రశ్నలకు సమాచారం రాబట్టేది.
1. బీజేపీ మతతత్వ పార్టీ అని, గతంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశానని చెప్పిన మీరు ఇప్పుడు అదే పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటారు? బీజేపీని లౌకిక పార్టీగా మీరు గుర్తిస్తున్నారా?
2. ఏదో ఒక రాజకీయ పార్టీతో పొత్తు లేకుండా మీరు స్వతంత్రంగా ఎన్నికల్లో పోటీ చేయడంలేదు. మీకు సొంతంగా బలం లేకపోవడంతోనే ఇలా చేస్తున్నారంటున్నారు. మీరేమంటారు?
3. కాంగ్రెస్ నేతలకు వేదిక లేకపోతే మీకెందుకు కష్టం? వారిని చేర్చుకుని ఎందుకు టికెట్లిస్తున్నట్టు? కాంగ్రెస్ వారిపై మీకెందుకంత ప్రేమ?
4. కేసీఆర్ కూతురు, కొడుకులకు టికెట్లిచ్చారని విమర్శిస్తున్న మీరు.. మీ బావ హరికృష్ణ, వియ్యంకుడు బాలకృష్ణలను పోటీకి దూరం పెడతానని చెప్పగలరా?
సీమాంధ్ర టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులు
కింజారపు అచ్చన్నాయుడు - టెక్కలి; కూన రవికుమార్ - ఆముదాలవలస; కిమిడి కళా వెంకట్రావు- ఎచ్చర్ల ; కావలి ప్రతిభా భారతి - రాజాం; నిమ్మక జయకృష్ణ - పాలకొండ; పతివాడ నారాయణస్వామి నాయుడు - నెల్లిమర్ల; వెలగ పూడి రామకృష్ణబాబు - విశాఖ తూర్పు; గణబాబు - విశాఖ పశ్చిమ ; కేఎస్ఎన్ఎస్ రాజు - చోడవరం; గవిరెడ్డి రామానాయుడు - మాడుగుల; చింతకాయల అయ్యన్నపాత్రుడు - నర్సీపట్నం; బండారు సత్యనారాయణమూర్తి - పెందుర్తి; యనమల కృష్ణుడుయాదవ్ - తుని; పర్వత సత్యనారాయణమూర్తి - ప్రత్తిపాడు; పిల్లి అనంతలక్ష్మి - కాకినాడ గ్రామీణ; దాట్ల సుబ్బరాజు - ముమ్మడివరం; పులవర్తి నారాయణమూర్తి - పి. గన్నవరం; వేగుళ్ల జోగేశ్వరరావు - మండపేట; పెందుర్తి వెంకటేష్ - రాజానగరం; రావి వెంకటేశ్వరరావు: గుడివాడ; కాగిత వెంకట్రావు - పెడన; వర్ల రామయ్య - పామర్రు; దేవినేని ఉమామహేశ్వరరావు - మైలవరం; శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) - జగ్గయ్యపేట; సిద్ధా రాఘవరావు - దర్శి; కరణం వెంకటేష్ - అద్దంకి; ఏలూరి సాంబశివరావు - పర్చూరు; కదిరి బాబూరావు - కనిగిరి; బీద మస్తాన్‌రావు : కావలి; విజయజ్యోతి : బద్వేల్; పుత్తా నరసింహారెడ్డి : కమలాపురం; పి. రామసుబ్బారెడ్డి - జమ్మలమడుగు; బీసీ జనార్ధనరెడ్డి - బనగానపల్లె; కె. మీనాక్షి నాయుడు - ఆదోని; వీరభద్రగౌడ్ - ఆలూరు; కాలువ శ్రీనివాసులు - రాయదుర్గం, పయ్యావుల కేశవ్ - ఉరవకొండ; పరిటాల సునీత - రాప్తాడు; బీకే పార్థసారథి - పెనుకొండ; వరదాపురం సూరి - ధర్మవరం; ఉన్నం హనుమంతరాయచౌదరి - కల్యాణదుర్గం; పల్లె రఘునాథరెడ్డి- పుట్టపర్తి; కందికుంట వెంకటప్రసాద్ - కదిరి ; బొజ్జల గోపాలకృష్ణారెడ్డి - శ్రీకాళహస్తి; గాలి ముద్దుకృష్ణమనాయుడు - నగరి; ఆర్వీ సుభాష్‌చంద్రబోస్ - పలమనేరు; నారా చంద్రబాబునాయుడు - కుప్పం
సమాంధ్రలో టీడీపీ లోక్‌సభ అభ్యర్థులు..
1. కింజారపు రామ్మోహన్నాయుడు - శ్రీకాకుళం ; 2. పూసపాటి అశోక్ గజపతిరాజు - విజయనగరం ; 3. మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) - ఏలూరు: 4. కొనకళ్ల నారాయణ - మచిలీపట్నం ; 5. ఎన్ఎండీ ఫారూఖ్ : నంద్యాల ; 6. నిమ్మల కిష్టప్ప - హిందూపురం ; 7. డాక్టర్ ఎన్.శివప్రసాద్ - చిత్తూరు