ఆఖరి మెట్టుపై బోల్తా
ఇపో (మలేసియా): ఆసియా కప్‌లో భారత్ హాకీ జట్టుకు మళ్లీ నిరాశే మిగిలింది. ఆరేళ్ల తర్వాత కప్ గెలిచే సువర్ణావకాశం వచ్చినా మ్యాచ్ చివరి నిమిషాల్లో చిన్న తప్పిదాలకు భారీ మూల్యం చెల్లించుకుంది. డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియాతో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 3-4 గోల్స్ తేడాతో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది.
దీంతో వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌కు ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా నేరుగా అర్హత సాధించే గొప్ప అవకాశాన్ని చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌కు ముందే భారత్‌కు సాంకేతికంగా ప్రపంచ కప్ బెర్త్ ఖాయమైంది. అయితే కొరియా ఆసియా కప్ విజేతగా అవతరించడంతో ప్రపంచ కప్‌లో భారత్ పాల్గొనేది లేనిది అధికారికంగా ఖరారు కావాలంటే నవంబరు వరకు వేచి చూడాలి. నవంబరులో జరిగే ఓసియానియా టోర్నీలో ఆస్ట్రేలియా లేదా న్యూజిలాండ్ విజేతగా నిలిస్తే అధికారికంగా భారత్ ప్రపంచ కప్‌కు అర్హత సాధిస్తుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రపంచ కప్‌కు అర్హత సాధించడంతో రిజర్వ్ జట్టుగా భారత్‌కు ఆ అవకాశం దక్కుతుంది. ఒకవేళ ఓసియానియా టోర్నీలో ఫిజీ గనుక గెలిస్తే భారత్‌కు ప్రపంచ కప్‌లో పాల్గొనే అవకాశం చేజారుతుంది. అయితే అత్యున్నత ప్రమాణాలున్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లపై పసికూనలాంటి ఫిజీ జట్టు గెలుస్తుందనుకోవడం అత్యాశే అవుతుంది.
ఆసియా కప్‌లో ఫైనల్‌కు చేరే క్రమంలో అజేయంగా నిలిచిన భారత్ అంతిమ సమరంలో తడబడింది. తొలి అర్ధభాగంలో నిరాశపర్చిన టీమిం డియా ఆటగాళ్లు రెండో అర్ధభాగంలో మాత్రం పోరాటపటిమను కనబర్చారు. అయితే కొరియా ఎదురుదాడులను సమర్థంగా అడ్డుకున్నా... ప్రత్యర్థి సర్కిల్‌లోకి దూసుకుపోవడంలో విఫలం కావడం దెబ్బతీసింది. భారత్ తరఫున రూపిందర్‌పాల్ సింగ్ (48వ ని.), నికిన్ తిమ్మయ్య (54వ ని.), మన్‌దీప్ సింగ్ (64వ ని.) గోల్స్ చేశారు. జాంగ్ జోంగ్ హుయున్ (28వ ని.), యు హో సిక్ (29వ ని.), నామ్ హుయున్ వూ (57వ ని.), కాంగ్ మూన్ క్వియోన్ (68వ ని.)లు కొరియాకు గోల్స్ అందించారు. శ్రీజేష్ (బెస్ట్ గోల్ కీపర్), రఘునాథ్ (బెస్ట్ అవుట్‌స్టాండింగ్ ప్లేయర్)లకు అవార్డులు లభించాయి.
పాక్‌కు కాంస్యం
ప్రపంచ కప్‌లో పాల్గొనే అర్హతను కోల్పోయిన పాకిస్థాన్ జట్టు కాంస్యంతో సరిపెట్టుకుంది. మూడు, నాలుగు స్థానాల కోసం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 3-1 గోల్స్ తేడాతో మలేసియాపై విజయం సాధించింది.