Indian Men's Hockey Team Chief Coach Graham Reid Resigns - Sakshi
Sakshi News home page

మన హాకీ... మళ్లీ మొదటికి!

Published Tue, Jan 31 2023 5:18 AM | Last Updated on Tue, Jan 31 2023 9:51 AM

Indian mens hockey team chief coach Graham Reid resigns - Sakshi

టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్, చీఫ్‌ కోచ్‌ గ్రాహమ్‌ రీడ్‌ (ఫైల్‌)

కొన్నేళ్ల క్రితం వరకు భారత హాకీ జట్టుకు కొత్త విదేశీ కోచ్‌ రావడం... కొన్నాళ్లు ఆ పదవిలో కొనసాగడం... అభిప్రాయభేదాలు రావడం... ఆ తర్వాత పదవికి రాజీనామా చేసి వెళ్లిపోవడం తరచూ జరిగేది. కానీ నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియాకు చెందిన గ్రాహమ్‌ రీడ్‌ మాత్రం సుదీర్ఘంగానే ఈ పదవిలో కొనసాగారు. ఆయన ఆధ్వర్యంలో భారత్‌ చెప్పుకోదగ్గ విజయాలే అందుకుంది. కానీ తాజాగా స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో భారత జట్టు వైఫల్యం నేపథ్యంలో ఆయన చీఫ్‌ కోచ్‌ పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా హాకీ ఇండియా (హెచ్‌ఐ) కొత్త కోచ్‌ను వెదికే పనిలో పడింది. ఈ ఏడాది ఆసియా క్రీడలు... వచ్చే ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌ ఉండటంతో హాకీ ఇండియా మళ్లీ విదేశీ కోచ్‌ వైపు మొగ్గు చూపుతుందా లేక స్వదేశీ కోచ్‌కు ప్రాధాన్యత ఇస్తుందా వేచి చూడాలి. 
 
న్యూఢిల్లీ: నాలుగేళ్లుగా నిలకడగా కొనసాగుతున్న భారత పురుషుల హాకీ జట్టు శిక్షణ బృందంలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. స్వదేశంలో అట్టహాసంగా జరిగిన ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో భారత హాకీ జట్టు కనీసం క్వార్టర్‌ ఫైనల్‌ చేరకపోవడం... చివరకు తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకోవడంతో హాకీ ఇండియా (హెచ్‌ఐ) దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాదే పారిస్‌ ఒలింపిక్స్‌ ఉండటం... ఈ సంవత్సరం ఆసియా క్రీడల టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు నేరుగా పారిస్‌ ఒలింపిక్‌ బెర్త్‌ దక్కనున్న నేపథ్యంలో హెచ్‌ఐ ప్రస్తుతం ఉన్న శిక్షణ బృందాన్ని మార్చాలని నిశ్చయించింది.v హెచ్‌ఐ భవిష్యత్‌ ప్రణాళికల్లో తన పేరు ఉండే అవకాశం లేదని గ్రహించిన ప్రస్తుత చీఫ్‌ కోచ్‌ గ్రాహమ్‌ రీడ్‌ తన పదవికి రాజీనామా చేశారు.

ఆయనతోపాటు ఎనలిటికల్‌ కోచ్‌ గ్రెగ్‌ క్లార్క్, సైంటిఫిక్‌ అడ్వైజర్‌ మిచెల్‌ డేవిడ్‌ పెంబర్టన్‌ కూడా తమ రాజీనామా లేఖలను హెచ్‌ఐ అధ్యక్షుడు దిలీప్‌ టిర్కీకి సమర్పించారు. ఆస్ట్రేలియాకు చెందిన 58 ఏళ్ల రీడ్‌ 2019 ఏప్రిల్‌లో భారత జట్టుకు హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఒప్పందం ప్రకారం ఆయన 2024 జూలై–ఆగస్టులో జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌ క్రీడల వరకు పదవిలో ఉండాలి. అయితే స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌ టోర్నీలో భారత జట్టు కనీసం క్వార్టర్‌ ఫైనల్‌ కూడా చేరకపోవడం... స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వకపోవడం... పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలచడంలో వైఫల్యం...ఆటగాళ్ల మధ్య సమన్వయలేమి... వెరసి రీడ్‌ రాజీనామాకు దారి తీశాయి. భారత్‌ 1975 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన తర్వాత మరోసారి ఈ మెగా ఈవెంట్‌లో  సెమీఫైనల్‌ దశకు చేరుకోలేకపోయింది.  

ఒలింపిక్‌ పతకం వచ్చినా...
రీడ్‌ నాలుగేళ్ల శిక్షణ కాలంలో భారత హాకీ జట్టు చెప్పుకోదగ్గ విజయాలు సాధించింది. భారత జట్టు 41 ఏళ్ల ఒలింపిక్‌ పతక నిరీక్షణకు తెరదించడంలో రీడ్‌ సఫలమయ్యారు. ఆయన శిక్షణలోనే భారత్‌ 2021 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. 2022 బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజతం గెలిచింది. 2021–2022 ప్రొ లీగ్‌ సీజన్‌లో మూడో స్థానం సంపాదించింది. 2019లో చీఫ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఏడాదే భువనేశ్వర్‌లో జరిగిన ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో భారత్‌ గెలిచి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందింది. ‘చీఫ్‌ కోచ్‌ పదవి నుంచి తప్పుకొని ఆ బాధ్యతలు వేరేవారికి అప్పగించే సమయం వచ్చింది. భారత జట్టుతో, హాకీ ఇండియాతో కలిసి పనిచేసినందుకు గర్వంగా ఉంది. ఈ నాలుగేళ్ల కాలంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. భవిష్యత్‌లో భారత జట్టుకు మంచి విజయాలు లభించాలని కోరుకుంటున్నాను’ అని రీడ్‌ వ్యాఖ్యానించారు. రీడ్, గ్రెగ్‌ క్లార్క్, మిచెల్‌ డేవిడ్‌ రాజీనామాలను ఆమోదించినట్లు హాకీ ఇండియా (హెచ్‌ఐ) అధ్యక్షుడు దిలీప్‌ టిర్కీ తెలిపారు.

గతంలోనూ...
భారత హాకీ జట్టుకు తొలి విదేశీ కోచ్‌గా వ్యవహరించిన ఘనత జర్మనీకి చెందిన గెరార్డ్‌ రాచ్‌కు దక్కుతుంది. ఆయన 2004 జూలైలో టీమిండియాకు తొలి విదేశీ కోచ్‌ అయ్యారు. 2007 ఫిబ్రవరిలో ఆయన రాజీనామా చేసి వెళ్లిపోయారు. 2009 మేలో స్పెయిన్‌కు చెందిన జోస్‌ బ్రాసా కోచ్‌గా వచ్చి 2010 నవంబర్‌ వరకు ఆ పదవిలో కొనసాగారు. 2011 జూన్‌లో ఆస్ట్రేలియాకు చెందిన మైకేల్‌ నాబ్స్‌ ఐదేళ్ల కాలానికి భారత జట్టుకు కోచ్‌గా వచ్చారు. కానీ ఆయన రెండేళ్లు మాత్రమే ఆ పదవిలో కొనసాగి 2013 జూన్‌లో వెళ్లిపోయారు. అనంతరం ఆస్ట్రేలియాకే చెందిన టెర్రీ వాల్‌‡్ష 2013 అక్టోబర్‌ నుంచి 2014 అక్టోబర్‌ వరకు... నెదర్లాండ్స్‌కు చెందిన పాల్‌ వాన్‌ యాస్‌ 2015 జనవరి నుంచి జూన్‌ వరకు... నెదర్లాండ్స్‌కు చెందిన రోలంట్‌ ఆల్ట్‌మన్స్‌ 2015 జూన్‌ నుంచి 2017 సెప్టెంబర్‌ వరకు... నెదర్లాండ్స్‌కే చెందిన జోయెర్డ్‌ మరీన్‌ 2017 సెప్టెంబర్‌ నుంచి 2018 మే వరకు భారత జట్టుకు కోచ్‌లుగా వ్యవహరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement