Hockey Coach
-
మన హాకీ... మళ్లీ మొదటికి!
కొన్నేళ్ల క్రితం వరకు భారత హాకీ జట్టుకు కొత్త విదేశీ కోచ్ రావడం... కొన్నాళ్లు ఆ పదవిలో కొనసాగడం... అభిప్రాయభేదాలు రావడం... ఆ తర్వాత పదవికి రాజీనామా చేసి వెళ్లిపోవడం తరచూ జరిగేది. కానీ నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియాకు చెందిన గ్రాహమ్ రీడ్ మాత్రం సుదీర్ఘంగానే ఈ పదవిలో కొనసాగారు. ఆయన ఆధ్వర్యంలో భారత్ చెప్పుకోదగ్గ విజయాలే అందుకుంది. కానీ తాజాగా స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో భారత జట్టు వైఫల్యం నేపథ్యంలో ఆయన చీఫ్ కోచ్ పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా హాకీ ఇండియా (హెచ్ఐ) కొత్త కోచ్‌ను వెదికే పనిలో పడింది. ఈ ఏడాది ఆసియా క్రీడలు... వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్ ఉండటంతో హాకీ ఇండియా మళ్లీ విదేశీ కోచ్ వైపు మొగ్గు చూపుతుందా లేక స్వదేశీ కోచ్‌కు ప్రాధాన్యత ఇస్తుందా వేచి చూడాలి. న్యూఢిల్లీ: నాలుగేళ్లుగా నిలకడగా కొనసాగుతున్న భారత పురుషుల హాకీ జట్టు శిక్షణ బృందంలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. స్వదేశంలో అట్టహాసంగా జరిగిన ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత హాకీ జట్టు కనీసం క్వార్టర్ ఫైనల్ చేరకపోవడం... చివరకు తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకోవడంతో హాకీ ఇండియా (హెచ్ఐ) దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాదే పారిస్ ఒలింపిక్స్ ఉండటం... ఈ సంవత్సరం ఆసియా క్రీడల టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు నేరుగా పారిస్ ఒలింపిక్ బెర్త్ దక్కనున్న నేపథ్యంలో హెచ్ఐ ప్రస్తుతం ఉన్న శిక్షణ బృందాన్ని మార్చాలని నిశ్చయించింది.v హెచ్ఐ భవిష్యత్ ప్రణాళికల్లో తన పేరు ఉండే అవకాశం లేదని గ్రహించిన ప్రస్తుత చీఫ్ కోచ్ గ్రాహమ్ రీడ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతోపాటు ఎనలిటికల్ కోచ్ గ్రెగ్ క్లార్క్, సైంటిఫిక్ అడ్వైజర్ మిచెల్ డేవిడ్ పెంబర్టన్ కూడా తమ రాజీనామా లేఖలను హెచ్ఐ అధ్యక్షుడు దిలీప్ టిర్కీకి సమర్పించారు. ఆస్ట్రేలియాకు చెందిన 58 ఏళ్ల రీడ్ 2019 ఏప్రిల్‌లో భారత జట్టుకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఒప్పందం ప్రకారం ఆయన 2024 జూలై–ఆగస్టులో జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడల వరకు పదవిలో ఉండాలి. అయితే స్వదేశంలో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు కనీసం క్వార్టర్ ఫైనల్ కూడా చేరకపోవడం... స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వకపోవడం... పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచడంలో వైఫల్యం...ఆటగాళ్ల మధ్య సమన్వయలేమి... వెరసి రీడ్ రాజీనామాకు దారి తీశాయి. భారత్ 1975 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన తర్వాత మరోసారి ఈ మెగా ఈవెంట్లో సెమీఫైనల్ దశకు చేరుకోలేకపోయింది. ఒలింపిక్ పతకం వచ్చినా... రీడ్ నాలుగేళ్ల శిక్షణ కాలంలో భారత హాకీ జట్టు చెప్పుకోదగ్గ విజయాలు సాధించింది. భారత జట్టు 41 ఏళ్ల ఒలింపిక్ పతక నిరీక్షణకు తెరదించడంలో రీడ్ సఫలమయ్యారు. ఆయన శిక్షణలోనే భారత్ 2021 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం గెలిచింది. 2021–2022 ప్రొ లీగ్ సీజన్లో మూడో స్థానం సంపాదించింది. 2019లో చీఫ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఏడాదే భువనేశ్వర్‌లో జరిగిన ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో భారత్ గెలిచి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందింది. ‘చీఫ్ కోచ్ పదవి నుంచి తప్పుకొని ఆ బాధ్యతలు వేరేవారికి అప్పగించే సమయం వచ్చింది. భారత జట్టుతో, హాకీ ఇండియాతో కలిసి పనిచేసినందుకు గర్వంగా ఉంది. ఈ నాలుగేళ్ల కాలంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. భవిష్యత్‌లో భారత జట్టుకు మంచి విజయాలు లభించాలని కోరుకుంటున్నాను’ అని రీడ్ వ్యాఖ్యానించారు. రీడ్, గ్రెగ్ క్లార్క్, మిచెల్ డేవిడ్ రాజీనామాలను ఆమోదించినట్లు హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు దిలీప్ టిర్కీ తెలిపారు. గతంలోనూ... భారత హాకీ జట్టుకు తొలి విదేశీ కోచ్‌గా వ్యవహరించిన ఘనత జర్మనీకి చెందిన గెరార్డ్ రాచ్‌కు దక్కుతుంది. ఆయన 2004 జూలైలో టీమిండియాకు తొలి విదేశీ కోచ్ అయ్యారు. 2007 ఫిబ్రవరిలో ఆయన రాజీనామా చేసి వెళ్లిపోయారు. 2009 మేలో స్పెయిన్‌కు చెందిన జోస్ బ్రాసా కోచ్‌గా వచ్చి 2010 నవంబర్ వరకు ఆ పదవిలో కొనసాగారు. 2011 జూన్‌లో ఆస్ట్రేలియాకు చెందిన మైకేల్ నాబ్స్ ఐదేళ్ల కాలానికి భారత జట్టుకు కోచ్‌గా వచ్చారు. కానీ ఆయన రెండేళ్లు మాత్రమే ఆ పదవిలో కొనసాగి 2013 జూన్‌లో వెళ్లిపోయారు. అనంతరం ఆస్ట్రేలియాకే చెందిన టెర్రీ వాల్‡్ష 2013 అక్టోబర్ నుంచి 2014 అక్టోబర్ వరకు... నెదర్లాండ్స్‌కు చెందిన పాల్ వాన్ యాస్ 2015 జనవరి నుంచి జూన్ వరకు... నెదర్లాండ్స్‌కు చెందిన రోలంట్ ఆల్ట్‌మన్స్ 2015 జూన్ నుంచి 2017 సెప్టెంబర్ వరకు... నెదర్లాండ్స్‌కే చెందిన జోయెర్డ్ మరీన్ 2017 సెప్టెంబర్ నుంచి 2018 మే వరకు భారత జట్టుకు కోచ్‌లుగా వ్యవహరించారు. -
పాయింట్ల పట్టికలో అట్టడుగున.. పడి పడి పైకి ఎగసి
ఒలింపిక్స్‌లో నాలుగు దశాబ్దాల తర్వాత దక్కిన పతకం.. చరిత్ర సృష్టించిన భారత పురుషుల హాకీ టీం. మ్యాచ్ ఆరు సెకండ్ల వ్యవధిలో ముగుస్తుందనగా.. ప్రత్యర్థికి దక్కిన పెనాల్టీ కార్నర్. మ్యాచ్ ఫలితాన్నే మార్చేసే ఆ గోల్‌ను తీవ్ర ఒత్తిడిలోనూ చాకచక్యంగా అడ్డుకుని హీరో అయ్యాడు భారత పురుషుల హాకీ టీం గోల్ కీపర్ శ్రీజేష్. ‘అయినా గెలిచింది కాంస్యమే కదా.. ఆ మాత్రానికేనా ఇంతా?’ అని అనుకునేవాళ్లు బోలెడు మంది ఉండొచ్చు. కానీ, ఇవాళ్టి విజయం నిజంగానే సంబురాలకు అర్హమైందని భారత హాకీ చరిత్ర చెప్పకనే చెబుతోంది. హాకీ.. మన జాతీయ క్రీడ. ఈ పేరు వినగానే జైపాల్ సింగ్ ముండా, లాల్ షా బోఖారి, ధ్యాన్ చంద్, కిషన్‌లాల్, కేడీ సింగ్ లాంటి హాకీ దిగ్గజాల పేరు గుర్తుకు వచ్చేది ఒకప్పుడు. వీళ్ల సారథ్యంలో వరుస ఒలింపిక్స్‌లో ఆరు స్వర్ణాలు సాధించింది భారత హాకీ పురుషుల జట్టు. ఒక రజతం, మళ్లీ స్వర్ణం, ఆపై రెండు వరుస కాంస్యాలు.. ఒక ఒలింపిక్ గ్యాప్(కెనడా ఒలింపిక్స్‌లో 7 స్థానం) తర్వాత మరో స్వర్ణం.. ఇదీ వరుస ఒలింపిక్స్‌లో భారత హాకీ టీం సాధించిన ట్రాక్ రికార్డు. అలాంటిది ఆ తర్వాతి నుంచి ఒలింపిక్ పతాకం కాదు కదా.. పేలవమైన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఎక్కడో అట్టడుగునకు చేరుతూ వచ్చింది భారత పురుషుల హాకీ టీం. ఇక మహిళల జట్టు సంగతి సరేసరి. అయితేనేం కిందపడ్డా.. పోరాట పటిమను ప్రదర్శిస్తూ వచ్చారు. ఇన్నేళ్లలో మెరుగైన స్థితిని అందుకున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 40 ఏళ్ల తర్వాత జాతీయ క్రీడలో భారత్‌కు దక్కిన ఒలింపిక్ పతక విజయం అద్భుతమనే చెప్పాలి. క్లిక్ చేయండి:1980 తర్వాత తొలిసారి.. ఫొటో హైలెట్స్ కారణాలు.. క్రీడలకు కమర్షియల్ రంగులు అద్దుకుంటున్న టైం అది. ఆ టైంలో ఆటల్లో ‘రాజకీయాలు’ ఎక్కువయ్యాయి. హాకీలో టాలెంట్‌కు సరైన అందలం దక్కకపోగా.. రిఫరెన్స్‌లు, రికమండేషన్లతో సత్తువలేని ఆటగాళ్ల ఎంట్రీ జట్టును నిర్వీర్యం చేస్తూ వచ్చింది. దీనికి తోడు ఆటగాళ్ల మధ్య గొడవలు ఒక సమస్యగా మారితే.. ‘కోచ్’ ఓ ప్రధాన సమస్యగా మారింది. తరచూ కోచ్‌లు మారుతుండడం, భారత హాకీ ఫెడరేషన్లో నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతుండడం, స్పానర్షిప్-ఎండోర్స్మెంట్ వివాదాలు వెంటాడాయి. వెరసి.. ఈ ప్రతికూల ప్రభావాలన్నీ ఆటగాళ్లపై, ఆటపై పడ్డాయి. తెరపైకి అప్పుడప్పుడు కొందరు హాకీ ప్లేయర్ల పేర్లు వచ్చినా, విజయాలు పలకరించినా.. అవి కేవలం వార్తల్లో మాత్రమే వినిపిస్తుండేవి. వీటికితోడు క్రికెట్‌కు పెరిగిన ఆదరణతో హాకీ ఉత్త జాతీయ క్రీడగా మారిపోయింది. ప్రోత్సాహకాల్లో మిగిలిన ఆటలకు తగ్గిన ప్రాధాన్యం(హాకీ అందులో ఒకటి)తో ప్రభుత్వాలు చిన్నచూపు చూశాయి. ఇదే ధోరణిని జనాల్లోనూ పెరిగిపోయేలా చేశాయి. గత నలభై ఏళ్లలో లీగ్ టోర్నీలు, ఆసియన్ టోర్నీల్లో తప్పా.. ప్రపంచ కప్‌ల్లో(తొలి రెండింటిల్లో కాంస్యం, ఆపై 1975లో స్వర్ణం), మిగతా టోర్నమెంట్లలో ఎక్కడా భారత హాకీ టీం హవా నడవలేదు. ఇప్పుడు నాలుగు దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియా హాకీ దిగ్గజం గ్రాహం రెయిడ్ కోచింగ్‌లో రాటుదేలిన భారత హాకీ టీం.. ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలోకి దిగి టోక్యో ఒలింపిక్స్‌లో క్వార్టర్స్‌లో బ్రిటన్ను ఓడించడం సంచలన విజయమనే చెప్పాలి. అటుపై సెమీస్‌లో ఛాంపియన్ బెల్జియం చేతిలో ఓటమి, ఆపై కాంస్యపు పోరులో జర్మనీపై విజయాన్ని.. అద్భుతంగానే వర్ణించాలి. ఒకవేళ ఓడిపోయి ఉన్నా.. ఈ ఒలింపిక్స్‌లో మనవాళ్లు సత్తా చూపారనే భావించాల్సి వచ్చేది. మొత్తం 12.. 1980 మాస్క్ ఒలింపిక్స్‌లో గోల్డ్ తర్వాత(అప్పుడు నేరుగా ఫైనల్‌కు క్వాలిఫై అయ్యింది భారత్)..ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ పురుషుల టీం కనబరిచిన ప్రదర్శన కచ్చితంగా మెరుగైందనే చెప్పొచ్చు. 1984 నుంచి వరుస ఒలింపిక్స్‌లో ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, పన్నెండు స్థానాల్లో కొనసాగుతున్న వచ్చిన భారత పురుషుల హాకీ టీం .. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై కాకపోవడంతో తీవ్ర విమర్శలపాలైంది. ఈ తరుణంలో హాకీలో తిరిగి జవసత్వాలు నింపుతూ వస్తున్న యువ టీం.. టోక్యో ఒలింపిక్స్‌లో సెమీస్ దాకా చేరుకోవడం, అటుపై కాంస్యం పోరులో నెగ్గడం విశేషం. ఇప్పటిదాకా జరిగిన ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు.. ఎనిమిది స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో(టోక్యో కాంస్యంతో కలిపి) పతకాలు సాధించించింది. ఈ మెరుగైన ప్రదర్శనను జట్టు మునుముందు ఇలాగే కొనసాగాలని ఆశిద్దాం. -సాక్షి, వెబ్ డెస్క్ -
హాకీ కోచ్ హరేంద్ర సింగ్‌పై వేటు
న్యూఢిల్లీ:భారత సీనియర్ పురుషుల హాకీ జట్టు చీఫ్ కోచ్ పదవి నుంచి హరేంద్ర సింగ్‌ను తప్పించారు. సొంతగడ్డపై జరిగిన ప్రపంచ కప్‌లో భారత జట్టు సెమీఫైనల్ చేరడంలో విఫలం కావడమే అందుకు కారణం. హరేంద్ర స్థానంలో కొత్త కోచ్ ఎంపిక కోసం హాకీ ఇండియా దరఖాస్తులు కూడా కోరింది. వరల్డ్ కప్‌లో గ్రూప్ దశలో టాపర్‌గా నిలిచిన భారత్... క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్ చేతిలో ఓడింది. మ్యాచ్‌లో పరాజయం అనంతరం మేం 13 మందితో తలపడ్డామంటూ రిఫరీలకు వ్యతిరేకంగా హరేంద్ర చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 2018 మే నుంచి హరేంద్ర కోచ్‌గా వ్యవహరించారు. గత పాతికేళ్లలో హాకీ సమాఖ్య తప్పించిన 25వ కోచ్ హరేంద్ర కావడం విశేషం. అయితే హరేంద్రను గతంలో పని చేసిన విధంగా జూనియర్ హాకీ జట్టు బాధ్యతలు అప్పగించారు. -
పురుషుల హాకీ కోచ్‌గా హరేంద్ర
న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్ఐ) భారత జట్ల కోచ్‌లను పరస్పరం మార్చేసింది. మహిళల కోచ్ హరేంద్ర సింగ్‌ను పురుషుల జట్టుకు నియమించగా, పురుషుల కోచ్ జోయర్డ్ మరీనేకు మళ్లీ మహిళల బాధ్యతలు అప్పగించింది. గతంలో మరీనే మహిళల జట్టుకు శిక్షణ ఇచ్చారు. గోల్డ్ కోస్ట్‌లో ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పురుషుల జట్టు పతకం గెలవడంలో విఫలం కావడంతో హెచ్ఐ ఈ నిర్ణయం తీసుకుంది. మరీనే శిక్షణలో నిరాశపరిచిన మన్‌ప్రీత్ సేన ఐదో స్థానంలో నిలిచింది. 2006 కామన్వెల్త్ తర్వాత పతకం లేకుండా రావడం ఇదే మొదటిసారి. మరోవైపు మహిళల జట్టు కూడా పతకం గెలవకపోయినా... నాలుగో స్థానం పొందింది. అయితే హరేంద్రకు పురుషుల జట్టును విజయవంతంగా నడిపించిన అనుభవముంది. 2009 నుంచి 2011 వరకు ఆయన కోచ్‌గా సేవలందించారు. రెండేళ్ల క్రితం 2016లో జూనియర్ ప్రపంచకప్‌లో భారత యువ జట్టు టైటిల్ గెలవడంతో కీలకపాత్ర పోషించారు. ఆయన మార్గదర్శనంలోనే గతేడాది జపాన్‌లో జరిగిన ఆసియా కప్‌లో మహిళల జట్టు విజేతగా నిలిచింది. మహిళల జట్టుతో తన పయనం సానుకూలంగా సాగిందని ఇప్పుడు పురుషుల జట్టు బాధ్యతలు అప్పగించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు హరేంద్ర చెప్పారు. ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో ఉన్న మరీనే తిరిగి మహిళల జట్టుకు రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచకప్‌కు జట్టును సన్నద్ధం చేస్తానని తెలిపారు. -
‘తోలుబొమ్మలా’ ఆడమంటారు!
హాకీ కోచ్‌ల పరిస్థితిపై బ్రాసా వ్యాఖ్య అధికారులతో వేగలేమన్న మాజీ కోచ్ న్యూఢిల్లీ: ఆత్మాభిమానం ఉన్న విదేశీ కోచ్‌లు ఎవరూ భారత హాకీ జట్టుకు శిక్షకుడిగా వ్యవహరించేందుకు ఇష్టపడరని మాజీ కోచ్ జోస్ బ్రాసా వ్యాఖ్యానించారు. హాకీ ఇండియా (హెచ్ఐ) చెప్పినట్లుగా తోలుబొమ్మలా ఆడేవారే ఎక్కువ కాలం మనగలుగుతారని ఆయన అన్నారు. 2009 నుంచి వరుసగా నలుగురు విదేశీ కోచ్‌లను కారణం లేకుండా అవమానకరంగా తొలగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘ఆరంభంలో హెచ్ఐ, సాయ్ హాకీ కోచ్‌ను ఆకాశంలో నిలబెడతారు. నువ్వు మాత్రం ఆటగాళ్లను ఎంపిక చేయవచ్చని చెబుతారు. ఒకసారి కాంట్రాక్ట్‌పై సంతకం చేశాక వారికి నచ్చిన ఆటగాళ్లు లేకపోతే అన్నింటిలో జోక్యం చేసుకోవడం ప్రారంభమవుతుంది. అసలు సమస్య స్వేచ్ఛ లేకపోవడమే. సమర్థులైన కోచ్‌లు ఎవరూ తోలుబొమ్మలా ఉండటానికి ఇష్టపడరు’ అని బ్రాసా అభిప్రాయపడ్డారు. ఇదే తరహాలో తనకు ఎదురైన అనుభవాన్ని ఆయన వివరించారు. ‘భారత హాకీ పరిపాలకులతో కలిసి పని చేయడం చాలా కష్టం. వారు చెప్పినట్లు వింటే సరి. ఆటకు సంబంధించిన అంశంలో కాస్త వాదించినా సరే వేధింపులు మొదలవుతాయి. ఒక రకంగా నన్ను బానిసగా చూశారు. ఆటగాళ్లు సమ్మె చేసిన సమయంలో కావాలని నా జీతం ఆపేశారు. నా జీవితంలో అవి అత్యంత బాధాకరమైన రోజులు’ అని స్పెయిన్‌కు చెందిన బ్రాసా వివరించారు. అయితే భారత హాకీ ఆటగాళ్లతో పని చేయడం మంచి అనుభవమని, వారు చాలా ప్రతిభావంతులని ఆయన ప్రశంసించారు. హాకీ ఇండియా అధికారుల జోక్యం లేకపోతే ప్రపంచంలో ఏ స్థాయి పతకమైన సాధించే సత్తా వారికుందన్న బ్రాసా... నరీందర్ బాత్రా రాజకీయాలతో ఇప్పుడు ఒలింపిక్స్ సన్నాహకాలకు వారికి చాలా తక్కువ సమయం ఉండటం దురదృష్టకరమన్నారు.