‘తోలుబొమ్మలా’ ఆడమంటారు! | Hockey coaches comment on situation Brassey | Sakshi
Sakshi News home page

‘తోలుబొమ్మలా’ ఆడమంటారు!

Published Mon, Jul 27 2015 1:14 AM | Last Updated on Sun, Sep 3 2017 6:13 AM

‘తోలుబొమ్మలా’ ఆడమంటారు!

‘తోలుబొమ్మలా’ ఆడమంటారు!

 హాకీ కోచ్‌ల పరిస్థితిపై బ్రాసా వ్యాఖ్య    
  అధికారులతో వేగలేమన్న మాజీ కోచ్
 న్యూఢిల్లీ: ఆత్మాభిమానం ఉన్న విదేశీ కోచ్‌లు ఎవరూ భారత హాకీ జట్టుకు శిక్షకుడిగా వ్యవహరించేందుకు ఇష్టపడరని మాజీ కోచ్ జోస్ బ్రాసా వ్యాఖ్యానించారు. హాకీ ఇండియా (హెచ్‌ఐ) చెప్పినట్లుగా తోలుబొమ్మలా ఆడేవారే ఎక్కువ కాలం మనగలుగుతారని ఆయన అన్నారు. 2009 నుంచి వరుసగా నలుగురు విదేశీ కోచ్‌లను కారణం లేకుండా అవమానకరంగా తొలగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘ఆరంభంలో హెచ్‌ఐ, సాయ్ హాకీ కోచ్‌ను ఆకాశంలో నిలబెడతారు. నువ్వు మాత్రం ఆటగాళ్లను ఎంపిక చేయవచ్చని చెబుతారు. ఒకసారి కాంట్రాక్ట్‌పై సంతకం చేశాక వారికి నచ్చిన ఆటగాళ్లు లేకపోతే అన్నింటిలో జోక్యం చేసుకోవడం ప్రారంభమవుతుంది. అసలు సమస్య స్వేచ్ఛ లేకపోవడమే. సమర్థులైన కోచ్‌లు ఎవరూ తోలుబొమ్మలా ఉండటానికి ఇష్టపడరు’ అని బ్రాసా అభిప్రాయపడ్డారు.
 
  ఇదే తరహాలో తనకు ఎదురైన అనుభవాన్ని ఆయన వివరించారు. ‘భారత హాకీ పరిపాలకులతో కలిసి పని చేయడం చాలా కష్టం. వారు చెప్పినట్లు వింటే సరి. ఆటకు సంబంధించిన అంశంలో కాస్త వాదించినా సరే వేధింపులు మొదలవుతాయి. ఒక రకంగా నన్ను బానిసగా చూశారు. ఆటగాళ్లు సమ్మె చేసిన సమయంలో కావాలని నా జీతం ఆపేశారు. నా జీవితంలో అవి అత్యంత బాధాకరమైన రోజులు’ అని స్పెయిన్‌కు చెందిన బ్రాసా వివరించారు. అయితే భారత హాకీ ఆటగాళ్లతో పని చేయడం మంచి అనుభవమని, వారు చాలా ప్రతిభావంతులని ఆయన ప్రశంసించారు. హాకీ ఇండియా అధికారుల జోక్యం లేకపోతే ప్రపంచంలో ఏ స్థాయి పతకమైన సాధించే సత్తా వారికుందన్న బ్రాసా... నరీందర్ బాత్రా రాజకీయాలతో ఇప్పుడు ఒలింపిక్స్ సన్నాహకాలకు వారికి చాలా తక్కువ సమయం ఉండటం దురదృష్టకరమన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement