కేజ్రీవాల్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానం నుంచి పోటీ చేస్తానని ఆప్ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఓటమి భయంతో తాను న్యూఢిల్లీతోపాటు మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై గురువారం మీడియా సమావేశంలో స్పందించారు. గత ఎన్నికల్లో పోటీ చేసినట్లే వచ్చే ఎన్నికల్లో కూడా న్యూఢిల్లీ సీటు నుంచి మాత్రమే మళ్లీ ఉంటానన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రతిపక్ష ఇండియా కూటమితో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈసారి పోటీ ఆప్, బీజేపీల మధ్యే ప్రధానంగా ఉండనుందన్నారు. కేజ్రీవాల్‌కు ఈ దఫా ఓటమి తప్పదు, అందుకే మరో చోటు నుంచి పోటీ చేస్తారంటూ బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ ‘ఎక్స్’లో చేసిన వ్యాఖ్యలకు పైవిధంగా బదులిచ్చారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్‌తోపాటు ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ బీజేపీ నుంచి, మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేస్తుండటం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment