chief coach
-
డాక్టర్ పుల్లెల గోపీచంద్!
బెంగళూరు: భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌కు మరో గౌరవం దక్కింది. కర్ణాటకకు చెందిన శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. మంగళవారం జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆయనకు ఈ పురస్కారాన్ని అందించారు. జాతీయ అభివృద్ధిలో క్రీడల ద్వారా తనదైన పాత్ర పోషించినందుకు గోపీచంద్‌ను డాక్టరేట్ కోసం ఎంపిక చేసినట్లు యూనివర్సిటీ ప్రకటించింది. గోపీచంద్‌తో పాటు మరో నలుగురు కూడా దీనిని అందుకున్నారు. -
మన హాకీ... మళ్లీ మొదటికి!
కొన్నేళ్ల క్రితం వరకు భారత హాకీ జట్టుకు కొత్త విదేశీ కోచ్ రావడం... కొన్నాళ్లు ఆ పదవిలో కొనసాగడం... అభిప్రాయభేదాలు రావడం... ఆ తర్వాత పదవికి రాజీనామా చేసి వెళ్లిపోవడం తరచూ జరిగేది. కానీ నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియాకు చెందిన గ్రాహమ్ రీడ్ మాత్రం సుదీర్ఘంగానే ఈ పదవిలో కొనసాగారు. ఆయన ఆధ్వర్యంలో భారత్ చెప్పుకోదగ్గ విజయాలే అందుకుంది. కానీ తాజాగా స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో భారత జట్టు వైఫల్యం నేపథ్యంలో ఆయన చీఫ్ కోచ్ పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా హాకీ ఇండియా (హెచ్ఐ) కొత్త కోచ్‌ను వెదికే పనిలో పడింది. ఈ ఏడాది ఆసియా క్రీడలు... వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్ ఉండటంతో హాకీ ఇండియా మళ్లీ విదేశీ కోచ్ వైపు మొగ్గు చూపుతుందా లేక స్వదేశీ కోచ్‌కు ప్రాధాన్యత ఇస్తుందా వేచి చూడాలి. న్యూఢిల్లీ: నాలుగేళ్లుగా నిలకడగా కొనసాగుతున్న భారత పురుషుల హాకీ జట్టు శిక్షణ బృందంలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. స్వదేశంలో అట్టహాసంగా జరిగిన ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత హాకీ జట్టు కనీసం క్వార్టర్ ఫైనల్ చేరకపోవడం... చివరకు తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకోవడంతో హాకీ ఇండియా (హెచ్ఐ) దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాదే పారిస్ ఒలింపిక్స్ ఉండటం... ఈ సంవత్సరం ఆసియా క్రీడల టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు నేరుగా పారిస్ ఒలింపిక్ బెర్త్ దక్కనున్న నేపథ్యంలో హెచ్ఐ ప్రస్తుతం ఉన్న శిక్షణ బృందాన్ని మార్చాలని నిశ్చయించింది.v హెచ్ఐ భవిష్యత్ ప్రణాళికల్లో తన పేరు ఉండే అవకాశం లేదని గ్రహించిన ప్రస్తుత చీఫ్ కోచ్ గ్రాహమ్ రీడ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతోపాటు ఎనలిటికల్ కోచ్ గ్రెగ్ క్లార్క్, సైంటిఫిక్ అడ్వైజర్ మిచెల్ డేవిడ్ పెంబర్టన్ కూడా తమ రాజీనామా లేఖలను హెచ్ఐ అధ్యక్షుడు దిలీప్ టిర్కీకి సమర్పించారు. ఆస్ట్రేలియాకు చెందిన 58 ఏళ్ల రీడ్ 2019 ఏప్రిల్‌లో భారత జట్టుకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఒప్పందం ప్రకారం ఆయన 2024 జూలై–ఆగస్టులో జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడల వరకు పదవిలో ఉండాలి. అయితే స్వదేశంలో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు కనీసం క్వార్టర్ ఫైనల్ కూడా చేరకపోవడం... స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వకపోవడం... పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచడంలో వైఫల్యం...ఆటగాళ్ల మధ్య సమన్వయలేమి... వెరసి రీడ్ రాజీనామాకు దారి తీశాయి. భారత్ 1975 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన తర్వాత మరోసారి ఈ మెగా ఈవెంట్లో సెమీఫైనల్ దశకు చేరుకోలేకపోయింది. ఒలింపిక్ పతకం వచ్చినా... రీడ్ నాలుగేళ్ల శిక్షణ కాలంలో భారత హాకీ జట్టు చెప్పుకోదగ్గ విజయాలు సాధించింది. భారత జట్టు 41 ఏళ్ల ఒలింపిక్ పతక నిరీక్షణకు తెరదించడంలో రీడ్ సఫలమయ్యారు. ఆయన శిక్షణలోనే భారత్ 2021 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం గెలిచింది. 2021–2022 ప్రొ లీగ్ సీజన్లో మూడో స్థానం సంపాదించింది. 2019లో చీఫ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఏడాదే భువనేశ్వర్‌లో జరిగిన ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో భారత్ గెలిచి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందింది. ‘చీఫ్ కోచ్ పదవి నుంచి తప్పుకొని ఆ బాధ్యతలు వేరేవారికి అప్పగించే సమయం వచ్చింది. భారత జట్టుతో, హాకీ ఇండియాతో కలిసి పనిచేసినందుకు గర్వంగా ఉంది. ఈ నాలుగేళ్ల కాలంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. భవిష్యత్‌లో భారత జట్టుకు మంచి విజయాలు లభించాలని కోరుకుంటున్నాను’ అని రీడ్ వ్యాఖ్యానించారు. రీడ్, గ్రెగ్ క్లార్క్, మిచెల్ డేవిడ్ రాజీనామాలను ఆమోదించినట్లు హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు దిలీప్ టిర్కీ తెలిపారు. గతంలోనూ... భారత హాకీ జట్టుకు తొలి విదేశీ కోచ్‌గా వ్యవహరించిన ఘనత జర్మనీకి చెందిన గెరార్డ్ రాచ్‌కు దక్కుతుంది. ఆయన 2004 జూలైలో టీమిండియాకు తొలి విదేశీ కోచ్ అయ్యారు. 2007 ఫిబ్రవరిలో ఆయన రాజీనామా చేసి వెళ్లిపోయారు. 2009 మేలో స్పెయిన్‌కు చెందిన జోస్ బ్రాసా కోచ్‌గా వచ్చి 2010 నవంబర్ వరకు ఆ పదవిలో కొనసాగారు. 2011 జూన్‌లో ఆస్ట్రేలియాకు చెందిన మైకేల్ నాబ్స్ ఐదేళ్ల కాలానికి భారత జట్టుకు కోచ్‌గా వచ్చారు. కానీ ఆయన రెండేళ్లు మాత్రమే ఆ పదవిలో కొనసాగి 2013 జూన్‌లో వెళ్లిపోయారు. అనంతరం ఆస్ట్రేలియాకే చెందిన టెర్రీ వాల్‡్ష 2013 అక్టోబర్ నుంచి 2014 అక్టోబర్ వరకు... నెదర్లాండ్స్‌కు చెందిన పాల్ వాన్ యాస్ 2015 జనవరి నుంచి జూన్ వరకు... నెదర్లాండ్స్‌కు చెందిన రోలంట్ ఆల్ట్‌మన్స్ 2015 జూన్ నుంచి 2017 సెప్టెంబర్ వరకు... నెదర్లాండ్స్‌కే చెందిన జోయెర్డ్ మరీన్ 2017 సెప్టెంబర్ నుంచి 2018 మే వరకు భారత జట్టుకు కోచ్‌లుగా వ్యవహరించారు. -
‘స్టిక్’ సీన్ మారింది...
సాక్షి క్రీడా విభాగం: ఎన్నో ఏళ్లుగా చెప్పుకోదగ్గ విజయాలు లేని బాధ, ఆటతీరుపై జోక్‌లు... అధికారుల చేతకానితనం, జట్టులో అంతర్గత రాజకీయాలు... ప్రతిభకు పాతర, ఆటగాళ్లంటే చులకనభావం... ఇంటా, బయటా భారత హాకీపై లెక్కలేనన్ని విమర్శలు వచ్చాయి. ఇలాంటి స్థితిలో రెండేళ్ల క్రితం చీఫ్ కోచ్‌గా వచ్చిన ఆస్ట్రేలియన్ గ్రాహం రీడ్ ‘భారత జట్టు ఉండాల్సింది ఈ స్థానంలో కాదు. దీన్ని నేను ఎక్కడికో తీసుకెళతాను’ అని తొలి మాటగా అన్నాడు. కొత్తగా రాగానే అందరూ చెప్పే మాటలే ఇవి అని ఎవరూ నమ్మలేదు. పైగా అంతర్గత రాజకీయాలతోపాటు కొత్తగా వచ్చే మార్పులను అంత సులభంగా అంగీకరించలేని తత్వం ఉన్న ఆటగాళ్ల జట్టుతో అతను సాధిస్తాడా అని అంతా తేలిగ్గా తీసుకున్నారు. కానీ రీడ్ ఎక్కడా తగ్గలేదు. కంప్యూటర్ సైన్స్ చదివి ఐటీ రంగంలో సుదీర్ఘ కాలం పని చేయడంతో పాటు ఆస్ట్రేలియాలోని ప్రముఖ సంస్థల్లో పెద్ద హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉన్న రీడ్ హాకీలోనూ తనదైన కొత్త శైలితో ఆటగాళ్లను దారిలో పెట్టాడు. రీడ్ వచ్చే నాటికి జట్టులో అందరూ వ్యక్తిగతంగా పెద్ద ప్లేయర్లే. కానీ తుది ఫలితం వరకు వచ్చేసరికి మాత్రం అంతా అంతంతమాత్రమే. ముందుగా టీమ్‌ను ఒక్క చోటికి చేర్చడంలో అతను సఫలమయ్యాడు. పేరుకు శ్రీజేశ్, మన్‌ప్రీత్, మన్దీప్, బీరేంద్ర లక్డాలాంటి సీనియర్లు ఉన్నా వారెప్పుడూ జట్టుకంటే ఎక్కువ కాదనే భావనను రీడ్ కల్పించాడు. కోచింగ్ క్యాంప్‌లో రీడ్ భార్య స్వచ్ఛందంగా ఆటగాళ్లకు ‘పర్సనాలిటీ డెవలప్మెంట్’ క్లాస్‌లు తీసుకొని వారిలో ఆత్మవిశ్వాసం పెంచే ప్రయత్నం చేసిందంటే రీడ్ ఎంతగా తన మిషన్‌లో మునిగాడో అర్థమవుతుంది. టోక్యో ఒలింపిక్స్‌లో ఎంపికైన వారిలో 12 మందికి ఇదే తొలి ఒలింపిక్స్. ఇలాంటి టీమ్‌ను ఎంచుకోవడంలో కూడా కోచ్ సాహసం కనిపిస్తుంది. ఆటగాళ్లు, అధికారులతో ఏ విషయంలోనైనా మొహమాటం లేకుండా నిక్కచ్చిగా నిజం మాట్లాడే రీడ్ తత్వం అందరికీ మేలు చేసింది. ఫిట్నెస్ సూపర్... సుదీర్ఘ కాలంగా భారత హాకీ వైఫల్యాల్లో ఫిట్‌నెస్‌లేమి కూడా కీలకపాత్ర పోషించింది. ఆటపరంగా ఎంతో బాగున్నా, ఆస్ట్రోటర్ఫ్‌పై కొద్దిసేపు ఆడగానే అలసటకు గురై మనోళ్లు ఇబ్బంది పడుతూ కొనసాగడం గతంలో చాలాసార్లు జరిగింది. దీనిని ఎలాగైనా మార్చాలని రీడ్ సంకల్పించాడు. స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌లతో పాటు సైంటిఫిక్ అడ్వైజర్ రాబిన్ అర్కెల్ సహకారం తీసుకొని ఆటగాళ్లను ఫిట్‌గా తయారు చేశాడు. యూరోపియన్ జట్లతో పోటీ పడినప్పుడు గతంలో ఎదురైన సమస్యలేవీ లేకుండా మనోళ్లు వారితో సమానంగా మైదానంలో చురుగ్గా కనిపించడం ఆటగాళ్లలో వచ్చిన కీలకమార్పు. తీవ్రమైన వేడి ఉన్న ఒసి స్టేడియంలో 13 రోజుల వ్యవధిలో 8 మ్యాచ్‌లు ఆడగలగడం వారి ఫిట్నెస్ను చూపించింది. రీడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మనోళ్లు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచడం బాగా మెరుగైంది. టోక్యోలో భారత్ 8 మ్యాచ్‌లలో 25 గోల్స్ చేసింది. ఇక సబ్స్టిట్యూట్లను సమర్థంగా వాడుకోవడం రీడ్ వ్యూహాల్లో బాగా పని చేసింది. సెమీస్‌లో సిమ్రన్‌జిత్‌కు విశ్రాంతినివ్వగా, కాంస్య పోరులో అతను కొత్త ఉత్సాహంతో వచ్చి రెండు గోల్స్ చేశాడు. అమిత్ రోహిదాస్ ‘ఫస్ట్ రషర్’ రూపంలో శ్రీజేశ్కంటే ముందే పెనాల్టీలను ఆపడానికి ముందుకు దూసుకురావడం మనం గతంలో చూడని మార్పు. భారత ఆటగాళ్లు తమను, తమ కోచ్‌ను, తమ సహచరులను, తమ శిక్షణను నమ్మారు కాబట్టే ఈ ఫలితం వచ్చింది. నాలుగు దశాబ్దాలుగా బరిలోకి దిగిన ప్రతీ భారత జట్టు మట్టిపై ఆడిన తమ ముందు తరంవారి విజయాల భారం మోస్తూ కుప్పకూలిపోయేది. ఈ జట్టు మాత్రం అలా కాలేదు. హాకీ మున్ముందు మరింత వెలిగేందుకు తమ వైపునుంచి తొలి అడుగు వేసింది. -
విదేశీ కోచ్‌లు కాదు... వ్యవస్థ బాగుండాలి
న్యూఢిల్లీ: భారత క్రీడల్లో విదేశీ కోచ్‌ల రాకతో మొత్తం మారిపోతుందనుకుంటే పొరపాటని... ముందు వ్యవస్థ బాగుంటేనే అన్ని బాగుంటాయని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డారు. ‘మన క్రీడా ప్రగతికి విదేశీ కోచ్‌లు కీలక భూమిక పోషిస్తారు. నిజానికి వారి సేవలు అవసరం కూడా.... భిన్నదేశాలకు చెందిన కోచ్‌ల మేళవింపు మనకు మేలు చేస్తుంది. క్రీడల్లో మనకు నైపుణ్యం లేని చోట ప్రారంభ దశలో విదేశీ సహాయ బృందాలు కావాల్సిందే. అయితే విజయవంతంగా రాణిస్తున్న జట్లకూ విదేశీ కోచ్‌లే ఉండాలంటే అది ఎంత మాత్రం మంచిది కాదు. దీని వల్ల మన వ్యవస్థకు న్యాయం జరగదు. విదేశీ కోచ్‌లను సలహాదారులుగా వినియోగించుకోవచ్చు. కానీ ముఖ్యమైన కోచింగ్ బాధ్య తలు, అధికారాలు స్వదేశీ కోచ్‌లకే అప్పజెప్పాలి. ఆటగాళ్లు విదేశీ కోచ్‌ల నుంచి నేర్చుకోవడం ముఖ్యమే. అలాగే ఎప్పుడో ఒకప్పుడు వాళ్లను వదులుకోవాలి. ఎందుకంటే వాళ్లు మనల్ని ద్వితీయ శ్రేణి జట్టుగానే తయారు చేస్తున్నారు. కారణం వాళ్లూ ద్వితీయ శ్రేణి కోచ్‌లే! వాళ్ల దేశంలోని అత్యుత్తమ కోచ్‌లు వారి ఆటగాళ్లకు సేవలందిస్తారు. రెండో ఉత్తమ కోచ్‌లు ఇతర దేశాలకు తరలి వెళతారు’ అని ఆయన వివరించారు. -
టీమిండియా చీఫ్ కోచ్‌గా ద్రావిడ్?
ముంబై: టీమిండియా చీఫ్ కోచ్ పదవికి మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ పేరు వినిపిస్తోంది. ద్రావిడ్‌ను చీఫ్ కోచ్‌గా నియమించాలని బోర్డు భావిస్తున్నట్టు సమాచారం. సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లతో కూడిన బీసీసీఐ అడ్వైజరీ కమిటీ ఈ మేరకు ద్రావిడ్‌ను సంప్రదించినట్టు క్రికెట్ వర్గాలు తెలిపాయి. కాగా ఈ విషయంపై ద్రావిడ్ కానీ అడ్వైజరీ కమిటీ సభ్యులు కానీ స్పందించలేదు. ద్రావిడ్ ప్రస్తుతం భారత్-ఎ, అండర్-19 జట్లకు చీఫ్ కోచ్‌గా ఉన్నాడు. టెస్టు క్రికెట్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రతిభావంతులైన యువ బ్యాట్స్‌మెన్‌ను ప్రోత్సహించేందుకు సమర్థుడైన వ్యక్తికి చీఫ్ కోచ్ బాధ్యతలు అప్పగించాలని బోర్డు భావిస్తోంది. ఇందుకు ద్రావిడ్ అప్పగిస్తే, అతనికి పూర్తి స్వేచ్ఛనివ్వడంతో పాటు దీర్ఘకాలిక కాంట్రాక్టు ఇవ్వవచ్చని బోర్డు వర్గాలు వెల్లడించాయి. అంటే 2019 ప్రపంచ కప్ వరకు చీఫ్ కోచ్‌గా నియమించవచ్చు. టీమిండియా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న రవిశాస్త్రి పదవీకాలం టి-20 ప్రపంచ కప్‌తో ముగిసింది. -
కొత్త కోచ్ అన్వేషణలో టీమిండియా!
న్యూఢిల్లీ: టీమిండియాకు ఫుల్ టైమ్ కోచ్ అవసరం ఉందా?, జట్టుతో తాత్కాలికంగా కాకుండా పూర్తిగా ఓ వ్యక్తిని నియమించాలని బీసీసీఐ భావిస్తుందా? అంటే అవుననక తప్పదు. అంతకుముందు టీమిండియా చీఫ్ కోచ్ గా ఉన్న డంకెన్ ఫ్లెచర్ కు వరల్డ్ కప్ కు ముందు ఉద్వాసన పలకడంతో జట్టుకు రవిశాస్త్రి డైరెక్టర్ గా ఉంటూ సేవలు అందిస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా డైరెక్టర్ గా ఉన్న రవిశాస్త్రి సాధ్యమైనంతవరకూ జట్టుకు అందుబాటులో ఉన్నా.. కొత్త కోచ్ ను ఎంపిక చేయడంపై బీసీసీఐ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల సచిన్, గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లతో కూడిన క్రికెట్ సలహా కమిటీని ఏర్పాటు చేసిన బీసీసీఐ.. జట్టుకు ఫుల్ టైం కోచ్ ఉంటే బాగుంటుందని యోచిస్తోంది. తాజాగా బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు అందుకు మరింత బలాన్నిస్తున్నాయి. జట్టుకు ఒక సంపూర్ణమైన కోచ్ ఉంటే మరిన్నిఫలితాలు సాధించడానికి ఆస్కారం ఉంటుందని ఠాగూర్ స్పష్టం చేశాడు. అయితే దీనిపై క్రికెట్ సలహా కమిటీతో చర్చిస్తామన్నాడు. టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి జట్టుకు అందిస్తున్న సేవలపై అధికశాతం మంది ఆటగాళ్లు నుంచి సానుకూలమైన నివేదిక వచ్చిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఒకవేళ ఫుల్ టైమ్ కోచ్ పై తాము నిర్ణయం తీసుకుంటే ఆ తరువాత పరిణామాలు ఏమిటి అనేది వేచి చూడక తప్పదన్నాడు. వచ్చే నెలలో కొత్త కోచ్ ఎంపికపై బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
భారత హాకీ జట్టు కోచ్‌గా ఓల్ట్‌మన్స్
న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు చీఫ్ కోచ్‌గా రోలెంట్ ఓల్ట్‌మన్స్‌ను నియమించారు. ప్రస్తుతం జట్టు డైరెక్టర్‌గా ఉన్న ఓల్ట్‌మన్స్‌కు కోచ్ బాధ్యతలు అప్పగించినట్టు హాకీ ఇండియా ప్రకటించింది. భారత హాకీ కోచ్ పాల్ వాన్‌ను హాకీ ఇండియా తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో అతని స్థానంలో నియామకం చేపట్టారు. హాకీ ఇండియా అధ్యక్షుడు బాత్రా కేంద్ర క్రీడా ప్రాధికార సంస్థ డైరెక్టర్ జనరల్ శ్రీనివాసన్‌తో సమావేశమయ్యారు. అనంతరం కొత్త కోచ్‌ను నియమిస్తున్నట్టు చెప్పారు. -
17న వాల్ష్‌పై నిర్ణయం
న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు చీఫ్ కోచ్ టెర్రీ వాల్ష్ భవితవ్యంపై ఈనెల 17న నిర్ణయం తీసుకోనున్నారు. శుక్రవారం సమావేశమైన ముగ్గురు సభ్యుల కమిటీ ఆయన చేసిన డిమాండ్లను పరిశీలించినా తుది నిర్ణయానికి రాలేకపోయింది. దీంతో సోమవారం మరోసారి చర్చించాలని నిర్ణయించుకుంది. మాజీ కెప్టెన్ అజిత్ పాల్ సింగ్, అశోక్ కుమార్, జాఫర్ ఇక్బాల్‌ల బృందం వాల్ష్తో పాటు హై ఫెర్ఫార్మెన్స్ డెరైక్టర్ రోలెంట్ ఆల్ట్‌మన్, ‘సాయ్’ అధికారులతో కలిసి మూడు గంటల పాటు చర్చలు జరిపారు. హాకీ ఇండియా అధికారులు మాత్రం ఈ సమావేశానికి హాజరుకాలేదు. మరోవైపు తన డిమాండ్లను నెరవేర్చకపోతే కోచ్ పదవిలో కొనసాగే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన వాల్ష్... భారత్‌లో క్రీడా పరిపాలన వ్యవస్థ బాగాలేదని విమర్శించారు.