కొత్త కోచ్ అన్వేషణలో టీమిండియా!
న్యూఢిల్లీ: టీమిండియాకు ఫుల్ టైమ్ కోచ్ అవసరం ఉందా?, జట్టుతో తాత్కాలికంగా కాకుండా పూర్తిగా ఓ వ్యక్తిని నియమించాలని బీసీసీఐ భావిస్తుందా? అంటే అవుననక తప్పదు. అంతకుముందు టీమిండియా చీఫ్ కోచ్ గా ఉన్న డంకెన్ ఫ్లెచర్ కు వరల్డ్ కప్ కు ముందు ఉద్వాసన పలకడంతో జట్టుకు రవిశాస్త్రి డైరెక్టర్ గా ఉంటూ సేవలు అందిస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా డైరెక్టర్ గా ఉన్న రవిశాస్త్రి సాధ్యమైనంతవరకూ జట్టుకు అందుబాటులో ఉన్నా.. కొత్త కోచ్ ను ఎంపిక చేయడంపై బీసీసీఐ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల సచిన్, గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లతో కూడిన క్రికెట్ సలహా కమిటీని ఏర్పాటు చేసిన బీసీసీఐ.. జట్టుకు ఫుల్ టైం కోచ్ ఉంటే బాగుంటుందని యోచిస్తోంది. తాజాగా బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు అందుకు మరింత బలాన్నిస్తున్నాయి.
జట్టుకు ఒక సంపూర్ణమైన కోచ్ ఉంటే మరిన్నిఫలితాలు సాధించడానికి ఆస్కారం ఉంటుందని ఠాగూర్ స్పష్టం చేశాడు. అయితే దీనిపై క్రికెట్ సలహా కమిటీతో చర్చిస్తామన్నాడు. టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి జట్టుకు అందిస్తున్న సేవలపై అధికశాతం మంది ఆటగాళ్లు నుంచి సానుకూలమైన నివేదిక వచ్చిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఒకవేళ ఫుల్ టైమ్ కోచ్ పై తాము నిర్ణయం తీసుకుంటే ఆ తరువాత పరిణామాలు ఏమిటి అనేది వేచి చూడక తప్పదన్నాడు. వచ్చే నెలలో కొత్త కోచ్ ఎంపికపై బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.