ముంబై: భారత పురుషుల హాకీ జట్టుపై మాజీ కెప్టెన్ ధన్రాజ్ పిళ్లై ప్రశంసలు కురిపించాడు. ఇటీవల కాలంలో విశేషమైన ఆట తీరుతో అదరగొట్టిన భారత జట్టు చరిత్రను తిరగరాయడానికి సిద్ధంగా ఉందని కొనియాడాడు. గత నాలుగు ఒలింపిక్స్ల్లో భారత్కు అందని ద్రాక్షగా ఉన్న పతకం ఈసారి ఖాయమన్నాడు.
'భారత జట్టుకు ముందుగా అభినందనలు. చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్కు చేరి తొలిసారి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఫైనల్లో వరల్డ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు గట్టిపోటీ ఇచ్చారు. భారత ప్రదర్శన అమోఘం. గెలుపు, ఓటములు అనేవి ఆటలో సహజం. నేను ఆడేటప్పుడు ఎప్పుడూ కూడా భారత జట్టు ఇంత నిలకడగా లేదు. ఫీల్డ్లో 70 నిమిషాల పాటు అత్యంత నిలకడతో భారత జట్టు ఆకట్టుకుంది. గతంలో ఆస్ట్రేలియాను వారి దేశంలోనే ఓడించాం. అయినప్పటికీ దాని కంటే మొన్న జరిగిన ఫైనల్లో ఆడిన తీరే అబ్బురపరిచింది. భారత జట్టు ప్రస్తుత ఆట తీరు చూస్తుంటే రియో ఒలింపిక్స్లో భారత హాకీ జట్టుకు పతకం ఖాయం'అని ధనరాజ్ పిళ్లై అభిప్రాయపడ్డాడు.