'అమ్మా నన్ను మన్నించు'.. హాకీ దిగ్గజం ధనరాజ్ పిళ్లై
1998.. ముప్పైరెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత హాకీ జట్టు ఆసియా క్రీడల్లో స్వర్ణపతకాన్ని గెలుచుకుంది. 10 గోల్స్‌తో సత్తా చాటి కెప్టెన్ ధన్‌రాజ్ పిళ్లై జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాంకాక్ నుంచి ఢిల్లీ వచ్చిన టీమ్‌కి అనూహ్య పరిస్థితి ఎదురైంది. ఘనాతిఘనమైన స్వాగతం సంగతి దేవుడెరుగు.. దేశంలో ఆటను నడిపించే భారత హాకీ సమాఖ్య (ఐహెచ్ఎఫ్)కు చెందిన అధికారులైనా కనీసం విమానాశ్రయానికి వచ్చి తమ ఆటగాళ్లను కలవలేదు.
అన్నింటికి మించి ఎటువంటి కనీస ఏర్పాట్లూ చేయకపోవడంతో ఆటగాళ్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ రాత్రంతా భారత ఆటగాళ్లు ఎయిర్‌పోర్ట్‌లో నేలపై పడుకోవాల్సి వచ్చింది. దాంతో ధన్‌రాజ్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఐహెచ్ఎఫ్ మొత్తాన్ని తిట్టిపడేసి తన కోపాన్ని ప్రదర్శించాడు. ఆ తర్వాతి ఫలితం ఊహించిందే. అప్పట్లో కంటిచూపుతో ఐహెచ్ఎఫ్ని శాసిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి కేపీఎస్ గిల్.. తర్వాతి సిరీస్‌కి ఎంపిక చేయకుండా పిళ్ళైపై చర్య తీసుకొని తన బలాన్ని చూపించాడు.
మళ్లీ టీమ్‌లోకి వచ్చేందుకు ధన్‌రాజ్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అయితే ఇదంతా ఊహించిందే. ‘తప్పు నాది కానప్పుడు దేనికైనా తెగిస్తాను.. న్యాయం కోసం పోరాడేందుకు సిద్ధం’ అనే లక్షణం ధన్‌రాజ్‌లో ఎప్పటినుంచో ఉంది. అద్భుతమైన ఆటగాడిగా మాత్రమే కాకుండా అవసరమైతే వ్యవస్థను ప్రశ్నించేందుకూ సిద్ధపడే తత్వమే ధన్‌రాజ్‌ని ప్రత్యేకంగా నిలబెట్టింది. భారత హాకీ దిగ్గజాలలో ఒకడిగా తనకంటూ విశిష్ట గుర్తింపు తెచ్చుకున్న ఘనత ధన్‌రాజ్‌ది!
ధ్యాన్‌చంద్, బల్బీర్ సింగ్, మొహమ్మద్ షాహిద్ వంటి దిగ్గజాల తర్వాతి తరంలో తన దూకుడైన ఆటతో ధన్‌రాజ్ పిళ్లై భారత హాకీలో ప్రత్యేకంగా నిలిచాడు. 90వ దశకంలో వేర్వేరు కారణాలతో కునారిల్లిన భారత హాకీ సాధించిన కొన్ని చెప్పుకోదగ్గ ఫలితాల్లో తన ఆటతో అతను శిఖరాన నిలిచాడు. హాకీ స్టిక్‌తో మైదానంలో ధన్‌రాజ్ చూపించిన మ్యాజిక్ క్షణాలెన్నో. టర్ఫ్‌పై వేగంగా దూసుకుపోవడం, ప్రత్యర్థి డిఫెండర్లను దాటి సహచరులకు పర్ఫెక్ట్ పాస్‌లు అందించడం, అతని డ్రిబ్లింగ్, రివర్స్ హిట్లు, ఫార్వర్డ్‌గా కొట్టిన గోల్స్ మాత్రమే కాదు.. ప్రత్యర్థి పెనాల్టీలను విఫలం చేయడంలో డిఫెండర్‌గా కూడా ధన్‌రాజ్ ఆట అత్యుత్తమంగా సాగింది.
ఆటలో ప్రతిభ మాత్రమే కాదు.. స్టిక్ చేతిలో ఉంటే అతనికి పూనకం వచ్చేస్తుంది. ఒక రకమైన కసి, ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదల అతని ఆవేశానికి మరింత బలాన్నిస్తాయి. దశాబ్దంన్నర అంతర్జాతీయ కెరీర్లో ధన్‌రాజ్ భారత హాకీకి పోస్టర్ బాయ్‌గా నిలిచాడు. భారత్ తరఫున 339 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అతను 170 గోల్స్ సాధించడమే కాదు, మరెన్నో వందల గోల్స్‌లో తన వంతు పాత్రను పోషించాడు.
ఆటపై మమకారంతో..
పుణే శివారులోని ఖడ్కి.. ధన్‌రాజ్ స్వస్థలం. అతని తండ్రి ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీలో లేబర్‌గా పని చేస్తుండేవాడు. ఆర్మీ అధికారుల ప్రాబల్యం ఉండే ఆ కంటోన్మెంట్ ఏరియాలో చాలామంది ఏదో ఒక ఆడుతూ కనిపించేవారు. క్రీడలపై అమితాసక్తి ఉన్న తండ్రి తన నలుగురు కొడుకులను కూడా ప్రోత్సహించాడు. వారిలో చిన్నవాడు ధన్‌రాజ్‌ని హాకీ ఆకర్షించింది. అక్కడ ఉండే మట్టిలో, పేడతో అలికిన టర్ఫ్‌పై విరిగిన పాత స్టిక్‌లతో హాకీ ఆడుతూ ఉండే ధన్‌రాజ్‌కి ఆ ఆటపై మరింత ఆసక్తి పెరిగింది. ఒకనాటి భారత దిగ్గజం మొహమ్మద్ షాహిద్‌ని అతను విపరీతంగా అభిమానించేవాడు. అతని శైలిలోనే ఆడి చూపించేవాడు. చివరకు అది పూర్తిస్థాయి ప్రొఫెషనల్‌గా మారే వరకు చేరింది. అధికారికంగా ఆ సమయంలో హాకీలో వేర్వేరు వయో విభాగాల్లో పోటీలు లేకపోయినా.. అందరికీ ధన్‌రాజ్‌లో ఏదో ప్రత్యేకత కనిపించింది.
అదే మలుపు..
ధన్‌రాజ్‌లో ప్రతిభను పూర్తిగా వాడుకొని సరైన దారిలో నడిపించాలని అన్నయ్య రమేశ్ భావించాడు. తాను అప్పటికే ముంబైలో హాకీ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తమ్ముడిని తన వద్దకు తెచ్చుకొని సరైన రీతిలో దిశానిర్దేశం చేశాడు. అక్కడే ప్రముఖ కోచ్ జోకిమ్ కార్వాలోను కలవడం పిళ్లై జీవితాన్ని మార్చేసింది. ఈ కుర్రాడిలో ప్రత్యేక ప్రతిభ ఉందని గుర్తించిన ఆయన శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఆటను తీర్చిదిద్దడం మాత్రమే కాకుండా అప్పట్లో యువ ఆటగాళ్లకు అండగా నిలుస్తున్న మహీంద్ర అండ్ మహీంద్ర క్లబ్లో తన సిఫారసుతో ప్రవేశం ఇప్పించి ఆ జట్టు తరఫున ఆడే అవకాశం కల్పించాడు. దాంతో ధన్‌రాజ్ హాకీలో మరింత దూసుకుపోయాడు. చివరకు భారత జట్టులో స్థానం సంపాదించే వరకు అతను ఆగలేదు. 1989లో తొలిసారి దేశం తరఫున ఆడే అవకాశం దక్కించుకున్న ధన్‌రాజ్ 2004 వరకు జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
సాధించిన ఘనతలెన్నో..
15 ఏళ్ల పాటు ధన్‌రాజ్ భారత హాకీలో అంతర్భాగంగా ఉన్నాడు. మన జట్టు సాధించిన ఎన్నో గుర్తుంచుకోదగ్గ విజయాల్లో అతను ప్రధాన పాత్ర పోషించాడు. ఆసియా కప్‌లో ఒకసారి విజేతగా నిలవడంతో పాటు మరో 2 రజతాలు, ఒక కాంస్యం గెలుచుకున్న జట్టులో.. ఆసియా క్రీడల్లో స్వర్ణం, 3 రజతాలు సాధించిన టీమ్‌లలో సభ్యుడైన అతను 2001లో చాంపియన్స్ చాలెంజ్ టోర్నీని గెలుచుకున్న జట్టులో కూడా ఉన్నాడు. హాకీలో 3 మెగా ఈవెంట్లలో కనీసం నాలుగు సార్లు పాల్గొన్న ఏకైక ఆటగాడు ధన్‌రాజ్ కావడం విశేషం.
నాలుగు ఒలింపిక్స్‌లలో, నాలుగు చాంపియన్స్ ట్రోఫీలలో, నాలుగు వరల్డ్ కప్‌లలో అతను భాగమయ్యాడు. వ్యక్తిగత ప్రదర్శనకు సంబంధించి చాంపియన్స్ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచిన క్షణం ధన్‌రాజ్‌ని అందరికంటే అగ్రభాగాన నిలబెట్టింది. ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడు అతనే. 1994 ప్రపంచకప్‌లో అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన వరల్డ్ ఎలెవన్‌ని ఎంపిక చేసినప్పుడూ ధన్‌రాజ్‌కి చోటు దక్కింది.
క్లబ్లలోనూ మేటి..
ఒకప్పుడు మట్టి మైదానాల్లో సత్తా చాటిన భారత హాకీ తర్వాతి రోజుల్లో ఆస్ట్రోటర్ఫ్ దెబ్బకు చతికిలపడింది. సంప్రదాయ శైలికి పూర్తి భిన్నమైన యూరోపియన్ శైలి ప్రపంచ హాకీలోకి ప్రవేశించడంతో మన జట్టు ప్రమాణాలు బాగా పడిపోయాయి. యూరోపియన్ల ఫిట్నెస్తో పోలిస్తే భారత ఆటగాళ్లు ఆ స్థాయిని అందుకోలేని పరిస్థితి. ముఖ్యంగా 90వ దశకంలో మన జట్టు పరాజయాలకు ఇదీ ఒక కారణం. అలాంటి సమయంలోనే ధన్‌రాజ్ తాను కొత్తగా మారేందుకు సిద్ధమయ్యాడు.
జట్టులో అత్యుత్తమ ఫిట్నెస్ ఉన్న ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న అతను తన ఆటనూ మార్చుకుంటే అది భారత జట్టుకు మేలు చేస్తుందని భావించాడు. అందుకే యూరోపియన్ క్లబ్‌లలో అవకాశాల కోసం ప్రయత్నించాడు. ధన్‌రాజ్ స్థాయి ప్లేయర్ గురించి అందరికీ బాగా తెలుసు కాబట్టి ప్రతిజట్టూ అతడిని కోరుకుంది. అందుకే పెద్ద ఎత్తున అతడికి చాన్స్ దక్కింది. స్టట్గార్డ్ కికర్స్ (జర్మనీ), హెచ్‌సీ లయన్ (ఫ్రాన్స్), ఇండియన్ జింఖానా (లండన్) క్లబ్‌లకు అతను ప్రాతినిధ్యం వహించాడు.
వివాదాలతో సహవాసం చేస్తూనే..
ఆటగాడిగా గొప్ప స్థాయికి చేరినా అతని మాటతో, దూకుడుతో ధన్‌రాజ్ చాలా మంది దృష్టిలో రెబల్‌గా మారాడు. అయితే తన తిక్కకూ లెక్క ఉంటుందని అతను పలు సందర్భాల్లో చెప్పుకున్నాడు. విమానాశ్రయ ఘటనలోనే కాకుండా ఆటగాళ్లకు కనీస ఫీజులు కూడా ఇవ్వడం లేదని పలుమార్లు ఫెడరేషన్తో గొడవలు, అంతర్జాతీయ ఆటగాళ్లకు కూడా నాసిరకం ఆహారం ఇస్తున్నారంటూ స్పోర్ట్స్ అథారిటీ కేంద్రలో కుక్‌పై దాడి, మ్యాచ్ జరిగినంతసేపూ భారత్‌ని అవమానించాడంటూ స్టాండ్స్‌లోకి వెళ్లి మరీ ప్రేక్షకుడిని కొట్టిన తీరు అతని ఆవేశాగ్రహాలను చూపించాయి.
అయితే అతను ఏనాడూ ఇలాంటి వాటి వల్ల తన స్థానానికి ముప్పు వస్తుందని భయపడలేదు. ఆసియా గేమ్స్ పతకం తర్వాత ఫెడరేషన్తో గొడవతో కోల్పోయిన స్థానాన్ని ఆరునెలల్లో మళ్లీ దక్కించుకున్నాడు. ‘నాకు తెలుసు.. నా ఆటపై నాకు నమ్మకముంది. మరొకరు నా స్థానాన్ని భర్తీ చేయలేరు’ అని చెప్పడం అతని ఆత్మవిశ్వాసాన్ని చూపించింది. నిజంగానే మైదానం బయట ఘటనలు అతని స్థాయిని తగ్గించలేదు. పద్మశ్రీ పురస్కారం అందుకున్న ధన్‌రాజ్.. ఖేల్‌రత్న అవార్డు స్వీకరించిన తొలి హాకీ క్రీడాకారుడు.
అది మాత్రం దక్కలేదు..
హాకీ ఆటగాడిగా ఎన్నో సాధించినా.. ఒలింపిక్స్ పతకం మాత్రం ధన్‌రాజ్‌కి కలగానే మిగిలిపోయింది. ఏకంగా నాలుగు ఒలింపిక్స్‌లలో పాల్గొన్నా ఆ అదృష్టం లభించలేదు. 1992 బార్సిలోనా, 1996 అట్లాంటా, 2000 సిడ్నీ, 2004 ఏథెన్స్‌లలో పిళ్లై భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. దురదృష్టవశాత్తూ ఆ సమయంలో జట్టు మొత్తం పేలవ ప్రదర్శనే కనబర్చింది. పతకం కాదుకదా కనీసం చేరువగా కూడా రాలేక వరుసగా 7, 8, 7, 7 స్థానాలకే పరిమితమైంది. ముఖ్యంగా సిడ్నీ ఒలింపిక్స్ సమయంలో జట్టుపై కాస్త ఆశలు ఉండేవి.
అందుకే ఈసారి ఎలాగైనా పతకంతో తిరిగొస్తాం అని ధన్‌రాజ్ అందరికీ చెప్పాడు. పోలండ్‌తో చివరి లీగ్ మ్యాచ్ గెలిస్తే భారత్ సెమీస్ చేరుతుంది. ఆఖరి వరకు ఆధిక్యంలో ఉండి గెలిచే అవకాశం ఉన్న స్థితిలో అనూహ్యంగా గోల్ ఇవ్వడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దాంతో తర్వాతి నాలుగు రోజుల పాటు ధన్‌రాజ్.. తన గేమ్స్ విలేజ్ గదిలోనే ఉంటూ రోధించాడు. తనతో మాట్లాడేందుకు తల్లి ఫోన్లో ఎంత ప్రయత్నించినా స్పందించలేదు. మాట తప్పినందుకు మన్నించమని తల్లికి చెప్పమంటూ తన సహచరులకు సూచించాడు. దీనిని దృష్టిలో ఉంచుకునే అతని జీవిత విశేషాలతో కూడిన బయోగ్రఫీకి ఫర్గివ్ మి అమ్మా అని పేరు పెట్టారు.