ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత పురుషుల హాకీ జట్టు జైత్రయాత్రకు బ్రేక్ పడింది. బెల్జియంతో హోరాహోరీగా సాగిన గురువారం నాటి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ సేన ఓటమిపాలైంది. దీంతో పూల్-బిలో భారత్ రెండోస్థానానికి పడిపోగా.. తాజా విజయంతో బెల్జియం టాప్‌లోకి దూసుకువెళ్లింది.
కాగా భారత పురుషుల హాకీ జట్టు ఇప్పటికే క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే, బలాబలాలను పరీక్షించుకునే క్రమంలో గ్రూపు దశలో.. నాలుగో మ్యాచ్‌లో భాగంగా వరల్డ్ నంబర్ వన్ బెల్జియంతో తలపడింది. నాకౌట్ దశకు ముందు ధీటైన ప్రత్యర్థిని ఎదుర్కొన్న భారత్.. గెలుపొంది ఉంటే ఆత్మవిశ్వాసం ఇనుమడించి ఉండేది.
ఉత్కంఠగా సాగిన మ్యాచ్
అయినప్పటికీ టోక్యో గోల్డ్ మెడలిస్ట్ బెల్జియంకు భారత్ గట్టిపోటీనిచ్చింది. భారత్ తరఫున అభిషేక్ గోల్(18వ నిమిషంలో)తో మెరవగా.. బెల్జియం ప్లేయర్లలో తిబియూ స్టాక్‌బ్రోక్స్(33వ నిమిషంలో), జాన్-జాన్ డొమెన్(44వ నిమిషం) చెరో గోల్ సాధించారు. ఫలితంగా 1-2తో భారత జట్టు బెల్జియం చేతిలో ఓటమిపాలైంది. ఇక బెల్జియం కూడా ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ చేరింది. ఇదిలా ఉంటే.. తదుపరి మ్యాచ్‌లో భారత్ ఆఖరిగా ఆస్ట్రేలియాతో తలపడనుంది.
ఐర్లాండ్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్లో
గత ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి... పూర్వవైభవాన్ని గుర్తు చేసిన భారత పురుషుల హాకీ జట్టు ప్యారిస్‌లోనూ శుభారంభం అందుకుంది. ఆడిన తొలి మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక ‘డ్రా’ నమోదు చేసుకున్న టీమిండియా 7 పాయింట్లతో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. పూల్ ‘బి’లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత హాకీ జట్టు 2–0తో ఐర్లాండ్‌ను ఓడించింది.
ఇక మంగళవారం ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (13వ, 19వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో సత్తా చాటాడు. మ్యాచ్ మొత్తంలో భారత్‌కు 9 పెనాల్టీ కార్నర్ అవకాశాలు రాగా.. అందులో కేవలం ఒక్క దాన్ని మాత్రమే గోల్‌గా మలచగలిగింది. మరోవైపు ఐర్లాండ్ 10 పెనాల్టీ కార్నర్ లను వృథా చేసింది.
తొలి రెండు క్వార్టర్స్‌లో ఒక్కో గోల్ చేసిన టీమిండియా... ద్వితీయార్థంలో గోల్ కొట్టలేకపోయింది. మన డిఫెండర్లు మెరుగైన ప్రదర్శన కనబర్చగా.. గోల్ కీపర్ శ్రీజేశ్ అడ్డుగోడలా నిలిచి ప్రత్యర్థి ప్రయత్నాలను భగ్నం చేశాడు. గ్రూప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఐర్లాండ్ నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించింది. కాగా రెండు గ్రూప్‌ల్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్స్‌కు చేరుతాయి.
ప్యారిస్ ఒలింపిక్స్-2024 పురుషుల హాకీ పూల్స్
పూల్-ఏ: నెదర్లాండ్స్, జర్మనీ, గ్రేట్ బ్రిటన్, స్పెయిన్, ఫ్రాన్స్, సౌతాఫ్రికా
పూల్-బి: బెల్జియం, భారత్, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, న్యూజిలాండ్, ఐర్లాండ్.
చదవండి: Paris Olympics 2024: షూటింగ్‌లో కాంస్య పతకం.. ఎవరీ స్వప్నిల్ కుసాలె..?
Comments
Please login to add a commentAdd a comment