
సాధారణ కుటుంబం, ఏమాత్రం సౌకర్యాలు లేని గ్రామం నుంచి వచ్చిన నేపథ్యం... అయితే పట్టుదలే పెట్టుబడిగా ముందుకు సాగిన ఆ అమ్మాయి భారత హాకీ జట్టు స్థాయికి ఎదిగింది. ప్రపంచకప్, ఒలింపిక్స్ సహా ప్రఖ్యాత టోర్నీలలో భాగమైంది. ఎనిమిదేళ్ల క్రితమే భారత జట్టులోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఇతిమరపు రజని ఇటీవల మరోసారి తన సత్తాను ప్రదర్శించింది. ప్రతిష్టాత్మక ఆసియా కప్ గెలిచిన జట్టులో గోల్‌కీపర్‌గా కీలక పాత్ర పోషిం చింది. భారత జట్టులో సభ్యురాలే అయినా... చాలా కాలంగా తగిన గుర్తింపు దక్కించుకోలేకపోయిన రజని, ఇప్పుడు హాకీకి లభిస్తున్న ఆదరణతో పాటు తనకు కూడా లభిస్తున్న ప్రోత్సాహం పట్ల సంతోషం వ్యక్తం చేస్తోంది.
సాక్షి, హైదరాబాద్:ఇతిమరపు రజని తొలిసారి భారత జట్టు తరఫున 2009లో ఆడింది. మధ్యలో గాయంతో కొంత కాలం మినహా రెగ్యులర్ సభ్యురాలిగా ఉన్న ఆమె 67 అంతర్జాతీయ మ్యాచ్‌లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. జపాన్‌లో ఇటీవల జరిగిన ఆసియా కప్ టోర్నీలో టీమిండియా విజయంలో భాగస్వామిగా ఉన్న రజని, ప్రస్తుత జాతీయ జట్టులో దక్షిణ భారతానికి చెందిన ఏకైక క్రీడాకారిణి కావడం విశేషం. ‘నా కెరీర్‌లో అత్యుత్తమ విజయాల్లో ఇదొకటి. 13 ఏళ్ల తర్వాత ఆసియా కప్ గెలిచిన జట్టులో సభ్యురాలిని కావడం చాలా సంతోషంగా ఉంది. ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి అజేయంగా నిలవగలిగాం. గత రెండేళ్లుగా మహిళల హాకీ మంచి విజయాలతో అందరి దృష్టిలో పడింది. 2015కు ముందు నాకు ఆరేళ్ల అంతర్జాతీయ కెరీర్ ఉన్నా వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది మాత్రమే నన్ను గుర్తు పట్టేవాళ్లు. ఇప్పుడు ‘హాకీ రజని’ అని పెద్ద సంఖ్యలో అభిమానిస్తుంటే గర్వంగా అనిపిస్తోంది’ అని రజని వ్యాఖ్యానించింది.
చిత్తూరు జిల్లా నుంచి...
తిరుపతి సమీపంలో యెర్రవారిపాలెం మండలంలోని యెనుమలవారి పల్లి రజని స్వస్థలం. తండ్రి కార్పెంటర్ వృత్తిలో ఉన్నారు. పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో హాకీపై పెరిగిన ఆసక్తి ఆమెను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. టీమ్ గేమ్‌తో పాటు అమ్మాయి కావడం వల్ల కొంత అభ్యంతరాలు వ్యక్తమైనా కుటుంబ సభ్యుల అండదండలు రజనిని ముందుకు వెళ్లేలా చేశాయి. స్కూల్ గేమ్స్‌లో ప్రదర్శన తర్వాత 2005లో తిరుపతిలోని ‘శాప్’ హాకీ అకాడమీలో చేరడం రజని కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత దూసుకుపోయిన ఈ అమ్మాయి 2008లో తొలిసారి భారత జూనియర్ జట్టు క్యాంప్‌లోకి ఎంపికైంది. గోల్‌కీపర్‌గా ఈ దశలో మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ నిలకడగా రాణించడంతో ఏడాది తిరిగే సరికి సీనియర్ టీమ్‌లో భాగం కావడం విశేషం. ‘గోల్ కీపర్‌గా అనుభవం పెరిగిన కొద్దీ నేను మరింత రాటుదేలాను. దాంతో పాటు కీపింగ్‌ను బాగా ఆస్వాదించాను. మైదానంలో నేను కీపర్‌గా ఐదు నిమిషాలు నిలబడిన సమయంలో ఒక్క గోల్ ఆపగలిగినా కూడా జట్టు విజయానికి నేను ఉపయోగపడినట్లే. అదే పట్టుదల ప్రతీ మ్యాచ్‌లో కనబరుస్తాను’ అని రజని తన గురించి చెప్పింది.
బెస్ట్ గోల్‌కీపర్‌గా...
అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన ఏడాదికే ప్రపంచ కప్‌లో పాల్గొనే భారత జట్టులో రజనికి అవకాశం లభించింది. అయితే ఈ టోర్నీలో జట్టు సమష్టి వైఫల్యం కారణంగా పెద్దగా గుర్తింపు లభించలేదు. అదే ఏడాది జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో కూడా జట్టులో భాగంగా ఉన్నా ఫలితం మాత్రం రాలేదు. అయితే 2013 మాత్రం ఆమె కెరీర్‌లో కీలకంగా నిలిచింది. ముందుగా ఆసియా కప్‌లో కాంస్యం సాధించిన జట్టులో భాగంగా ఉన్న రజని... కొద్ది రోజులకే జపాన్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో సత్తా చాటింది. భారత్ రజత పతకం గెలవడంతో కీలక పాత్ర పోషించి ‘బెస్ట్ గోల్ కీపర్’ అవార్డును సొంతం చేసుకుంది. అయితే తర్వాతి ఏడాదే గాయంతో ఆమె జట్టుకు దూరమైంది. ‘గాయంతో ఆటకు దూరమై కోలుకుంటున్న సమయంలో తీవ్ర వేదన అనుభవించాను. అయితే అంతే పట్టుదలగా పోరాడి ఏడాదిలోపే మళ్లీ స్థానం సాధించాను. 36 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన జట్టులో ఉండటం నా ఆనందాన్ని రెట్టింపు చేసింది’ అని రజని నాటి రోజులు గుర్తు చేసుకుంది.
అదే లక్ష్యంతో...
భారత జట్టులాగే రజని కెరీర్ కూడా ఆరంభంలో ఒడిదుడుకులకు లోనైంది. అయితే 2015లో ఎఫ్‌ఐహెచ్ వరల్డ్ లీగ్ రౌండ్ మొదలు ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో విజయం, రియో ఒలింపిక్స్, ఆ తర్వాత వరల్డ్ లీగ్, తాజాగా ఆసియా కప్ టైటిల్... ఇలా జట్టు ప్రదర్శన ఆకట్టుకునేలా సాగుతోంది. వీటన్నింటిలో రజని భాగంగా ఉంది. తాజాగా ఆసియా కప్ విజయంతో భారత జట్టు వచ్చే ఏడాది లండన్‌లో జరిగే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించింది కూడా. ‘వచ్చే సంవత్సరం ప్రపంచకప్‌లాంటి పెద్ద టోర్నీలో బాగా ఆడటమే జట్టు లక్ష్యం. కొత్త కోచ్ హరీంద్ర సింగ్ జట్టును సమర్థంగా నడిపిస్తున్నారు. ఇక 2018లోనే ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించాలని పట్టుదలగా ఉన్నాం. అయితే నా కెరీర్‌కు సంబంధించి అంతిమ లక్ష్యం 2020 టోక్యో ఒలింపిక్స్. అక్కడ పతకం గెలవగలిగితే కెరీర్‌లో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది’ అని రజని పేర్కొంది. 26 ఏళ్ల రజని ప్రస్తుతం సెంట్రల్ రైల్వే (ముంబై)లో జూనియర్ టికెట్ కలెక్టర్ (టీసీ)గా పని చేస్తోంది. స్పోర్ట్స్ కోటాలోనే ఆమెకు ఈ ఉద్యోగం దక్కింది. గత ఏడాది రియో ఒలింపిక్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెకు నగదు ప్రోత్సాహకం అందించింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మంచి ఉద్యోగాన్ని కూడా ఆమె ఆశిస్తోంది. ఎన్నో ప్రతికూలతలను అధిగమించి భారత జట్టు తరఫున సుదీర్ఘ కాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న తనకు ఇతరత్రా కూడా సహకారం అందించాలని కూడా రజని కోరుకుంటోంది.
హాకీని ఎంచుకున్న సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. పురుషుల హాకీకే అంతంత మాత్రం గుర్తింపు లభిస్తున్నప్పుడు మహిళల హాకీ గురించి చెప్పేదేముంది. కానీ ఆటపై ఆసక్తి, సన్నిహితుల సహకారంతో గట్టిగా నిలబడ్డాను. మా ఊరు వెళ్లాలంటే ఇప్పటికీ కనీసం మూడు కిలోమీటర్ల నడక తప్పదు. కొన్నాళ్లుగా లభించిన గుర్తింపు వల్ల నేను టూర్ నుంచి వచ్చాక ఏదైనా వాహనం అందుబాటులో ఉంటోంది. అంతకుముందు నా కిట్ బ్యాగ్, లగేజీ చూసి కనీసం బస్సు కూడా ఆపకుండా వెళ్లిపోయేవాళ్లు. అలాంటప్పుడు ఎంత బాధ పడ్డానో! భారత జట్టులో సభ్యురాలే అయినా టోర్నీలు జరిగే సమయంలో రోజువారీ అలవెన్స్ మినహా మ్యాచ్ ఫీజులాంటివేమీ మాకు లేవు. కానీ హాకీపై పిచ్చిప్రేమతో ముందుకు వెళ్లాను. భారత జట్టు సభ్యురాలిగా ఉండటమే అన్నింటికంటే గర్వపడే విషయం.
–‘సాక్షి’తో ఇతిమరపు రజని
Comments
Please login to add a commentAdd a comment