భారత్‌ను ఆదుకున్న ఆకాశ్‌దీప్
జర్మనీని నిలువరించిన టీమిండియా హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నీ
రాయ్‌పూర్: తొలి మ్యాచ్‌లో నిరాశపరిచిన భారత హాకీ జట్టు రెండో మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేసింది. హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) ఫైనల్స్ టోర్నమెంట్‌లో భాగంగా ఒలింపిక్ చాంపియన్ జర్మనీతో శనివారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌ను భారత్ 1-1తో ‘డ్రా’గా ముగించింది. ఆట ఆరో నిమిషంలో నిక్లాస్ వెలెన్ గోల్‌తో జర్మనీ ఖాతా తెరువగా... భారత్ తరఫున 47వ నిమిషంలో ఆకాశ్‌దీప్ సింగ్ గోల్ సాధించి స్కోరును సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. ఆట మొదలైన తొలి నిమిషం నుంచే సమన్వయంతో ఆడుతూ జర్మనీ గోల్‌పోస్ట్‌పై దాడులు చేశారు.
మూడో నిమిషంలో భారత్‌కు గోల్ చేసే అవకాశం వచ్చినా చింగ్లెన్‌సనా సింగ్ కొట్టిన షాట్‌ను జర్మనీ గోల్‌కీపర్ అడ్డుకున్నాడు. ఆ తర్వాత సర్దార్ సింగ్ అందించిన పాస్‌ను ‘డి’ ఏరియాలో తల్వీందర్ సింగ్ అందుకోలేకపోయాడు. అయితే జర్మనీ జట్టు కూడా దూకుడుగా ఆడేందుకే ప్రయత్నించింది. ఆరో నిమిషంలో మథియాస్ ముల్లర్ ముగ్గురు భారత ఆటగాళ్లను తప్పిస్తూ కుడి వైపు నుంచి దూసుకెళ్లి ‘డి’ ఏరియాలో సహచరుడు నిక్లాస్ వెలెన్‌కు పాస్ ఇచ్చాడు. నిక్లాస్ మిగతా కార్యాన్ని పూర్తి చేసి జర్మనీకి తొలి గోల్‌ను అందించాడు. గోల్ సమర్పించుకున్నప్పటికీ భారత ఆటగాళ్లు డీలా పడకుండా ఉత్సాహంతో ఆడారు. ఫినిషింగ్ లోపం వెంటాడినా చివరకు ఆకాశ్‌దీప్ గోల్‌తో భారత్ స్కోరును సమం చేయగలిగింది. మంగళవారం జరిగే లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ తలపడుతుంది.