
న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు భారత్ సన్నద్ధత
బెంగళూరు: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల్లో భారత జట్టు ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగి మంచి ఫలితాలు సాధించింది. బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీప్ కూడా తమ బౌలింగ్‌తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఇదే వ్యూహాన్ని న్యూజిలాండ్‌పై కూడా టీమిండియా అమలు చేసే అవకాశం ఉంది.
ఈ సిరీస్ తర్వాత జరగబోయే ఆస్ట్రేలియా పర్యటనకు కూడా పేసర్లకు ఇది సన్నాహకంగా పనికొస్తుందని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. రేపటి నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు జరగనున్న నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియంలో సోమవారం జట్టు ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు.
‘పరిస్థితులు, పిచ్, ప్రత్యర్థిని బట్టి తుది జట్టు ఎంపిక ఉంటుంది. మా డ్రెస్సింగ్ రూమ్‌లో పెద్ద సంఖ్యలో అత్యుత్తమ ఆటగాళ్లు ఉండటం సానుకూలాంశం. వారిలోంచి ఎవరినైనా ఎంచుకోవచ్చు. అందరూ జట్టును గెలిపించగల సమర్థులే అని మా నమ్మకం. చిన్నస్వామి స్టేడియంలో పిచ్‌ను చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం’ అని జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్నాడు.
ఇటీవల శ్రీలంక చేతిలో 0–2తో టెస్టు సిరీస్‌లో ఓడిన కివీస్... 37 వికెట్లను స్పిన్నర్లను సమర్పించుకుంది. ఈ నేపథ్యంలో కుల్దీప్, అక్షర్‌లకు కూడా తొలి టెస్టులో చోటు ఇస్తారా అనేది ఆసక్తికరం. ‘వారిద్దరూ ప్రతిభావంతులే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరినీ మేం పక్కన పెట్టడం లేదు. అయితే జట్టును గెలిపించగల 11 మందిని ఎంపిక చేయడమే అన్నింటికంటే ముఖ్యం’ అని గంభీర్ స్పష్టం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment