భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఐదు టెస్ట్ మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రేపటి నుంచి (నవంబర్ 22) ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ పెర్త్ వేదికగా జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 7:50 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఈ మ్యాచ్ ప్రారంబానికి ముందు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. టాస్ ఆలస్యమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే మ్యాచ్ మిగతా రోజుల్లో మాత్రం వర్షం పడే అవకాశం లేదని తెలుస్తుంది. ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లన్నీ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. ఈ సిరీస్ యొక్క లైవ్ స్ట్రీమింగ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఉంటుంది.
ఇదిలా ఉంటే, తొలి టెస్ట్‌లో టీమిండియాకు తుది జట్టు కూర్పు పెద్ద సమస్యగా మారింది. ఫైనల్ ఎలెవెన్‌లో ఎవరిని ఉంచాలో అర్దం కాక భారత మేనేజ్‌మెంట్ తలలు పట్టుకుని కూర్చుకుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ స్థానాన్ని కేఎల్ రాహుల్‌తో భర్తీ చేయాలని ఆలోచిస్తున్నా, అది కాస్త మిస్ ఫైర్ అవుతుందేమోనని ఆందోళన చెందుతుంది.
అభిమన్యు ఈశ్వరన్ వైపు మొగ్గు చూపుదామా అంటే అతనికి అనుభవం లేదు. మరోవైపు వన్‌డౌన్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ సైతం గాయపడిన విషయం తెలిసిందే. చివరి నిమిషం వరకు అతని విషయంలో ఏమీ చెప్పలేమని మేనేజ్‌మెంట్ గోప్యత మెయిన్‌టైన్ చేస్తుంది. అతనికి ప్రత్యామ్నాయంగా దేవ్‌దత్ పడిక్కల్‌ను ఆడిస్తే బాగుంటుందా అని పరిశీలిస్తుంది.
టీమిండియాకు ఉన్న మరో సమస్య మూడో స్పెషలిస్ట్ పేసర్. ఈ స్థానానికి ఆకాశ్‌దీప్‌ను ఎంపిక చేయాలా లేక యువ పేసర్ హర్షిత్ రాణాకు అవకాశం ఇవ్వాలా అనే విషయంలో యాజమాన్యం తీవ్రమైన కసరత్తు చేస్తుంది. కెప్టెన్ బుమ్రా, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ హర్షిత్ రాణావైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. చివరి నిమిషంలో ఆకాశ్‌దీప్ తుది జట్టులోకి తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు పేసర్లు, ఓ స్పిన్నర్ ఫార్ములాతో బరిలోకి దిగాలని యోచిస్తుంది. పేస్ విభాగంలో తొలి రెండు స్థానాలకు బుమ్రా, సిరాజ్ సెట్ కాగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా అశ్విన్ పేరు ఖరారైనట్లు తెలుస్తుంది. ఆసీస్ జట్టులో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు చాలామంది ఉండటంతో మేనేజ్‌మెంట్ రైట్ ఆర్మ ఆఫ్ స్పిన్నర్ అయిన అశ్విన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఆల్‌రౌండర్ కోటాలో నితీశ్‌కుమార్ రెడ్డి పేరు కూడా ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తొలి టెస్ట్‌కు భారత తుది జట్టు (అంచనా)..
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, ధృవ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, అశ్విన్, బుమ్రా, హర్షిత్ రాణా, సిరాజ్
Comments
Please login to add a commentAdd a comment