దిగ్గజ క్రికెటర్‌ సరసన పంత్‌.. 148 ఏళ్ల టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇద్దరు మాత్రమే..! | IND vs AUS 5th Test: Rishabh Pant Has Most 50 Plus Scores With 160 Plus Strike Rate, Shares The Record With Viv Richards | Sakshi
Sakshi News home page

దిగ్గజ క్రికెటర్‌ సరసన పంత్‌.. 148 ఏళ్ల టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇద్దరు మాత్రమే..!

Published Sat, Jan 4 2025 3:04 PM | Last Updated on Sat, Jan 4 2025 3:10 PM

IND vs AUS 5th Test: Rishabh Pant Has Most 50 Plus Scores With 160 Plus Strike Rate, Shares The Record With Viv Richards

టీమిండియా డైనమిక్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్‌ సరసన చేరాడు. సిడ్నీ టెస్ట్‌లో మెరుపు హాఫ్‌ సెంచరీతో అలరించిన పంత్‌.. 148 ఏళ్ల టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో 160 ప్లస్‌ స్ట్రయిక్‌రేట్‌తో అత్యధిక హాఫ్‌ సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. టెస్ట్‌ల్లో పంత్‌, రిచర్డ్స్‌ చెరో రెండు సార్లు 160 ప్లస్‌ స్ట్రయిక్‌రేట్‌తో హాఫ్‌ సెంచరీలు చేశారు. టెస్ట్‌ క్రికెట్‌లో మరే ఇతర బ్యాటర్‌ ఈ స్థాయి స్ట్రయిక్‌రేట్‌తో రెండు హాఫ్‌ సెంచరీలు చేయలేదు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. సిడ్నీ టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో పంత్‌ 33 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేశాడు. సహచర ఆటగాళ్లు ఒక్కో పరుగు రాబట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న చోట పంత్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో పంత్‌ రాణించకపోయుంటే టీమిండియా పరిస్థితి ఘోరంగా ఉండేది. పంత్‌ సునామీ ఇన్నింగ్స్‌ పుణ్యమా అని భారత్‌ ఓ మోస్తరు లక్ష్యాన్ని అయినా ఆసీస్‌ ముందుంచగలుగుతుంది.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసి 145 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. భారత సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ (22), కేఎల్‌ రాహుల్‌ (13), శుభ్‌మన్‌ గిల్‌ (13), విరాట్‌ కోహ్లి (6), రిషబ్‌ పంత్‌ (61), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (4) ఔట్‌ కాగా.. రవీంద్ర జడేజా (8), వాషింగ్టన్‌ సుందర్‌ (6) క్రీజ్‌లో ఉన్నారు. స్కాట్‌ బోలాండ్‌ నాలుగు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. పాట్‌ కమిన్స్‌, బ్యూ వెబ్‌స్టర్‌ తలో వికెట్‌ తీశారు.

అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా భారత్‌కు నాలుగు పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో అరంగేట్రం ప్లేయర్‌ బ్యూ వెబ్‌స్టర్‌ (57) అర్ద సెంచరీతో రాణించగా.. స్టీవ్‌ స్మిత్‌ (33), సామ్‌ కొన్‌స్టాస్‌ (22), అలెక్స్‌ క్యారీ (21), పాట్‌ కమిన్స్‌ (10) రెండంకెల స్కోర్లు చేశారు. ఉస్మాన్‌ ఖ్వాజా (2), లబూషేన్‌ (2), ట్రవిస్‌ హెడ్‌  (4), మిచెల్‌ స్టార్క్‌ (1), బోలాండ్‌ (9) విఫలమయ్యారు. భారత బౌలర్లలో ప్రసిద్ద్‌ కృష్ణ, మహ్మద్‌ సిరాజ్‌ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్‌ బుమ్రా, నితీశ్‌ కుమార్‌ రెడ్డి చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 185 పరుగులకు ఆలౌటైంది. పంత్‌ (40) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. ఆఖర్లో బుమ్రా (22) కూడా బ్యాట్‌ ఝులిపించాడు. భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (20), యశస్వి జైస్వాల్‌ (10), విరాట్‌ కోహ్లి (17), రవీంద్ర జడేజా (26), వాషింగ్టన్‌ సుందర్‌ (14) రెండంకెల స్కోర్లు చేయగా.. కేఎల్‌ రాహుల్‌ (4), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (0), ప్రసిద్ద్‌ కృష్ణ (3) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే నిష్క్రమించారు. ఆసీస్‌ బౌలర్లలో బోలాండ్‌ 4, ప్టార్క్‌  3, కమిన్స్‌ 2, లియోన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్‌  సిరీస్‌లో ఆసీస్‌ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement