
Kapil Dev Comments On Rishabh Pant: గతేడాది డిసెంబర్ 30న జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ అసుపత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా స్టార్ ఆటగాడు, యంగ్ వికెట్‌కీపర్ రిషబ్ పంత్‌పై క్రికెట్ దిగ్గజం, భారత వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చావును అతి సమీపంగా చూసి వచ్చిన పంత్‌ను చూసి అందరూ జాలి పడుతుంటే, కపిల్ మాత్రం ఘాటు వ్యాఖ్యలతో పంత్‌పై విరుచుకుపడ్డాడు. రోడ్డు ప్రమాదంలో మూడు లిగ్మెంట్లు (కుడి మోకాలిలో) తెగిపోయి మంచానికే పరిమితమైన పంత్ త్వరగా కోలుకోవాలని అందరూ ఆశిస్తుంటే కపిల్ మాత్రం నిర్దయగా నోరు పారేసుకున్నాడు.
ఇంతకీ కపిల్ దేవ్ ఏమన్నాడంటే.. యువకుడైన పంత్ నిర్లక్ష్యంగా కారు నడిపి తన ప్రాణాలను రిస్క్‌లో పెట్టుకోవడంతో పాటు భారత క్రికెట్ భవిష్యత్తును ఏడాది కాలం పాటు అగమ్యగోచరంగా మార్చేశాడంటూ మండిపడ్డాడు. టెస్ట్‌ల్లో రెగ్యులర్ సభ్యుడైన పంత్.. ఈ ఏడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిన్ ఫైనల్స్ ఉన్నాయన్న ధ్యాసే లేకుండా కారు నడిపి తన ప్రాణాలతో చెలగాటం ఆడటమే కాకుండా టీమిండియాను దారుణంగా దెబ్బతీశాడంటూ ధ్వజమెత్తాడు.
పంత్ జట్టులో లేకపోవడం వల్ల జట్టు కాంబినేషన్ పూర్తిగా దెబ్బతినిందని, దీని వల్ల టీమిండియా లయ కోల్పోయే ప్రమాదముందని అభిప్రాయపడ్డాడు. పంత్ లేని లోటు నిజంగా తీర్చలేనిదని, ఈ ప్రభావం BGT 2023పై తప్పకచూపుతుందని అన్నాడు. పంత్ అందుబాటులో లేకపోవడం వల్ల జట్టులో ఓ వ్యక్తిని (వికెట్‌కీపర్) అదనంగా తీసుకోవాల్సి వస్తుందని, దీంతో పాటు బ్యాటింగ్ లైనప్‌లో చాలా మార్పులు చేయాల్సి వస్తుందని తెలిపాడు.
నిర్లక్ష్యంగా కారు నడిపి ఏడాది పాటు జట్టును శూన్యంలోని నెట్టిన పంత్‌ను పూర్తిగా కోలుకున్న తర్వాత చెంపదెబ్బ కొట్టాలని ఉందంటూ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా అన్నాడు. జట్టులో సమస్యలకు పంత్ కారకుడయ్యాడంటూనే అతను త్వరగా కోలుకోవాలని అన్నాడు. తనకు పంత్‌పై వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదని, అతను అందుబాటులో లేకపోవడం వల్ల టీమిండియాకు సమస్య వచ్చిందన్నదే తన బాధ అని చెప్పుకొచ్చాడు. కాగా, ప్రస్తుతం గాయాల నుంచి కోలుకుంటున్న పంత్ ఏడాదికాలం పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి ఉంది. ఈ సమయంలో టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిన్ ఫైనల్స్ వంటి కీలక టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment