ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ ఎప్పుడూ కొత్త సవాళ్లను విసురుతుంది. అదీ ఆస్ట్రేలియా గడ్డ పై జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ లో పోటీ ఎప్పుడూ అత్యున్నత స్థాయిలో ఉంటుంది. భారత్ ఆటగాళ్ల క్రీడా జీవితానికి ఇది ఎప్పుడూ కఠిన పరీక్ష గా నిలుస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఆస్ట్రేలియా ఆటగాళ్ల ఈ సిరీస్ కి సన్నద్ధమయ్యే తీరు. ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ గడ్డ పై జరిగే టెస్ట్ సిరీస్ కి అత్యున్నత స్థాయిలో సిద్దమౌవుతారు. అదే స్థాయిలో పోటీ పడతారు.
అందుకు భిన్నంగా భారత్ ఆటగాళ్లు ఈ సిరీస్ కి ముందు చాల పేలవంగా ఆడి సొంత గడ్డ పై న్యూజిలాండ్ చేతిలో వరసగా రెండు టెస్ట్ మ్యాచ్ల్లో ఘోరంగా విఫలమై పరాజయాన్ని చవిచూసారు.అయితే ఈ సిరీస్ లోని తొలి టెస్ట్ లో జట్టుకి నాయకత్వం వహించిన జస్ప్రీత్ బుమ్రా ఎనిమిది వికెట్లు పడగొట్టి ఒంటిచేత్తో భారత్ ని గెలిపించాడు.
అయితే తొలి టెస్ట్ కి వ్యకిగత కారణాల వల్ల దూరమైన రోహిత్ శర్మ రెండో టెస్ట్ లో పునరాగమనం భారత జట్టు సమతుల్యాన్ని దెబ్బతీసింది. ఇందుకు ప్రధాన కారణం రోహిత్ శర్మ పేలవమైన ఫామ్. రోహిత్ శర్మ కి జోడీగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అదే స్థాయిలో ఘోరంగా విఫలవడంతో ప్రస్తుత వారి టెస్ట్ క్రికెట్ జీవితం కొనసాగించడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ బాధ్యతారహితమైన షాట్ ల పై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం రిషబ్ పంత్ నాలుగో టెస్ట్ లో చివరి రోజున కొట్టిన దారుణమైన షాట్. టెస్ట్ మ్యాచ్ డ్రా దిశగా పయనిస్తున్న సమయంలో రిషబ్ (104 బంతుల్లో ౩౦ పరుగులు) ఒక చెత్త షాట్ కొట్టి ఆస్ట్రేలియా బౌలర్లకు కొత్త ఉత్సాహాన్ని అందించాడు. దీంతో భారత్ వికెట్లు వడి వడి గా పడిపోవడంతో జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ రిషబ్ పంత్ కొట్టిన షాట్ ఆటలో భాగంగా జరిగిందనీ చెబుతూ అతన్ని హెచ్చరించాడు. పంత్ జట్టు అవసరాలకు అనుగుణంగా తన షాట్ లు కొట్టేందుకు ప్రయత్నించాలి, అని రోహిత్ వ్యాఖ్యానించాడు.
"పంత్ జట్టు అవసరాలని గుర్తించాల్సిన అవసరం ఉంది. అయితే అతని హై-రిస్క్ పద్ధతులు గతంలో జట్టుకు అద్భుతమైన విజయాల్ని అందించాయని అంగీకరించాడు. అయితే పంత్ అవుటైన తీరును బాధాకరం అంటూనే అతను జట్టు అవసరాలకి అనుగుణంగా బ్యాటింగ్ చేయాలని సూచించాడు. "రిషబ్ పంత్ స్పష్టంగా జట్టు కి తన నుంచి ఎలాంటి అవసరమో ఉందో అర్థం చేసుకోవాలి," అని రోహిత్ వ్యాఖ్యానించాడు.
అయితే పంత్ ని భారత్ మాజీ స్పిన్నర్ దిలీప్ దోషి సమర్ధించాడు. "పంత్ తన ఆటతీరును మార్చడానికి ప్రయత్నించకూడదు. అతను సహజంగానే అద్భుతమైన ఆటగాడు. తన సహజ సిద్ధమైన ఆటతీరుతో జట్టుని చాల సార్లు గెలిపించాడు. కానీ అప్పుడప్పుడు అనుచిత షాట్‌లతో జట్టుని నిరాశపరుస్తాడు," అని దోషి వ్యాహ్యానించాడు.
మెల్బోర్న్ టెస్ట్ ఓటమి తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లతో పాటు రిషబ్ పంత్, హైదరాబాద్ మీడియం పేసర్ మహ్మద్ సిరాజ్ లు సైతం విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే జట్టులో పంత్ స్థానానికి ప్రస్తుతం ఢోకా లేకపోవచ్చు కానీ అతని బ్యాటింగ్ తీరు పై నిఘా నేత్రం ఉంటుందనేది స్పష్టం.
Comments
Please login to add a commentAdd a comment