ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టు(Boxing Day Test)కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన గాయం గురించి కీలక అప్‌డేట్ అందించాడు. తన మోకాలు బాగానే ఉందని.. ఈ విషయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు. అదే విధంగా.. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే బ్యాటింగ్ ఆర్డర్ కూర్పు ఉంటుందని మరోసారి స్పష్టం చేశాడు.
కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy) ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పెర్త్‌లో భారత్, అడిలైడ్‌లో ఆసీస్ గెలవగా.. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు వర్షం వల్ల డ్రా అయింది. ఫలితంగా ఇరుజట్లు సిరీస్‌లో ప్రస్తుతం 1-1తో సమంగా ఉన్నాయి.
నేను బాగానే ఉన్నాను
ఈ క్రమంలో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో డిసెంబరు 26(బాక్సింగ్ డే) నుంచి నాలుగో టెస్టు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma PC) మంగళవారం మీడియాతో మాట్లాడాడు. ప్రాక్టీస్‌లో తనకు తీవ్ర గాయమైందన్న వార్తలను ఖండించిన హిట్‌మ్యాన్.. తన మోకాలు బాగానే ఉందని పేర్కొన్నాడు.
అతడిపై ఒత్తిడి లేదు
అదే విధంగా.. టీమిండియా యువ ఆటగాళ్ల వైఫల్యాల గురించి విలేకరులు ప్రస్తావించగా.. ‘‘రిషభ్ పంత్‌పై ఎలాంటి ఒత్తిడి లేదు. అతడు గత కొంతకాలంగా ఫామ్‌లోనే ఉన్నాడు. అయితే, రెండు, మూడో టెస్టులో మాత్రం రాణించలేకపోయాడు.
వాళ్లు తిరిగి పుంజుకుంటారు
అంతమాత్రాన ఏకపక్షంగా అతడి గురించి తీర్పులు ఇచ్చేయడం సరికాదు. ఎలా ఆడాలన్న అంశంపై అతడికి పూర్తి స్పష్టత ఉంది. శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ కూడా తిరిగి పుంజుకుంటారు. జట్టులో వారి పాత్ర ఏమిటో వారికి బాగా తెలుసు’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
కాగా ఆస్ట్రేలియాతో ఇప్పటి వరకు పూర్తయిన మూడు టెస్టుల్లో యశస్వి జైస్వాల్ 193, రిషభ్ పంత్ 96 పరుగులు చేశారు. ఇక రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చిన శుబ్‌మన్ గిల్ 60 పరుగులు చేశాడు.
మరోవైపు.. వ్యక్తిగత కారణాల వల్ల తొలి టెస్టుకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ.. రెండు(3, 6), మూడు టెస్టు(10)ల్లో పూర్తిగా విఫలమయ్యాడు. అయితే, ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్ కోసం ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసిన రోహిత్.. ఆరో స్థానంలో బరిలోకి దిగుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment