టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ను ఉద్దేశించి మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) కీలక వ్యాఖ్యలు చేశాడు. సిడ్నీ టెస్టు ముగిసిన వెంటనే హిట్‌మ్యాన్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందన్నాడు. రోజురోజుకీ రోహిత్ వయసు పెరుగుతోందని.. కాబట్టి తనకు తానుగా రెడ్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకొనేందుకు సిద్ధంగానే ఉన్నాడని అభిప్రాయపడ్డాడు.
బ్యాటర్‌గా.. కెప్టెన్‌గా వైఫల్యాలు
కాగా గత కొంతకాలంగా రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా ఘోర పరాభవాలు చవిచూస్తున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టుల్లో 3-0తో క్లీన్‌స్వీప్.. తాజాగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ వైఫల్యాలు రోహిత్‌ను వేధిస్తున్నాయి.
ఆసీస్ పర్యటనలో రెండో టెస్టు నుంచి జట్టుతో చేరిన రోహిత్ శర్మ అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోతున్నాడు. ఇప్పటి వరకు కంగారూ జట్టుతో ముగిసిన మూడు టెస్టుల్లో ఐదు ఇన్నింగ్స్ ఆడిన అతడు.. కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్ సారథ్యంలో ఈ మూడు మ్యాచ్‌లలో రెండింటిలో ఓడిన టీమిండియా.. ఒకటి మాత్రం డ్రా చేసుకోగలిగింది.
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ బ్యాటింగ్ శైలి, కెప్టెన్సీ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్వరగా అతడు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో పాటు.. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రోహిత్ శర్మ అందుకు సిద్ధంగానే ఉన్నాడు
ఈ నేపథ్యంలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ తన కెరీర్ గురించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాడనిపిస్తోంది. సిడ్నీ టెస్టు తర్వాత అతడు రిటైర్మెంట్ ప్రకటించినా ఆశ్చర్యం అక్కర్లేదు. ఎందుకంటే.. రోజురోజుకీ అతడేమీ యువకుడు కావడం లేదు కదా!
శుబ్‌మన్ గిల్ (Shubman Gill)వంటి ఎంతో మంది యువ ఆటగాళ్లు జట్టులో సుస్థిర స్థానం కోసం ఎదురుచూస్తున్నారు. గతేడాది సగటున 40 పరుగులు చేసిన గిల్ వంటి ఆటగాళ్లను పక్కనపెట్టడం సరికాదు. ప్రతిభ ఉన్న యువకులను బెంచ్‌కే పరిమితం చేయడం తెలివైన నిర్ణయం అనిపించుకోదు. కాబట్టి రోహిత్ వైదొలుగుతాడనే అనిపిస్తోంది.
ఒకవేళ సిడ్నీలో టీమిండియా గెలిచి.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరినా.. చేరకపోయినా రోహిత్ మాత్రం తుది నిర్ణయం వెల్లడిస్తాడని.. అందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. 37 ఏళ్ల రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికితే యువకులకు మార్గం సుగమమవుతుందని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
సిడ్నీలో గెలిస్తేనే
కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో ఐదు టెస్టులు ఆడుతున్న టీమిండియా.. ఆతిథ్య జట్టు చేతిలో 2-1తో వెనుకబడి ఉంది. పెర్త్‌లో గెలిచిన భారత్.. అడిలైడ్‌లో ఓడి.. బ్రిస్బేన్ టెస్టును డ్రా చేసుకుంది. అయితే, మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో మాత్రం 184 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.
ఇరుజట్ల మధ్య జనవరి 3-7 మధ్య సిడ్నీ వేదికగా ఆఖరిదైన ఐదో టెస్టు జరుగుతుంది. ఇందులో గెలిస్తేనే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి.
చదవండి: లవ్ యూ కాంబ్లీ.. త్వరలోనే వచ్చి కలుస్తా: టీమిండియా దిగ్గజం భరోసా
Comments
Please login to add a commentAdd a comment