India vs Australia Test Series 2021: India Win Test Series In Australia | 'గాబా’ మైదానంలో కొత్త చరిత్ర.. - Sakshi
Sakshi News home page

'గాబా’ మైదానంలో కొత్త చరిత్ర..

Published Wed, Jan 20 2021 4:48 AM | Last Updated on Wed, Jan 20 2021 2:18 PM

India vs Australia: India Create History, Win Gabba Test - Sakshi

బ్రిస్బేన్‌కు రండి చూసుకుందాం... అవును వచ్చాం, అయితే ఏంటి? ‘గాబా’ మైదానంలో ఆడేందుకు భయపడుతున్నారు... మా పోరాటం సిడ్నీలోనే చూపించాం, మాకు భయమేంటి? మీరు పరుగులు చేయడం కష్టం... ఏమీ లేదు, మీతో సమానంగా పరుగులు సాధించాం చూడండి... ఇలాంటి బౌలింగ్‌తో మమ్మల్ని ఆలౌట్‌ చేయలేరు... చూశారా, మొత్తం 20 వికెట్లు పడగొట్టగలిగాం. మేం 32 ఏళ్లుగా ఇక్కడ ఓడలేదు... ఇలాంటి ఎన్నో రికార్డులు, కోటలు కూలగొట్టాం, చరిత్రను తిరగరాయడం మాకు కొత్త కాదు. ఇప్పుడు అదే చేశాం!!!

హాజల్‌వుడ్‌ బౌలింగ్‌లో లాంగాఫ్‌ దిశగా షాట్‌ కొట్టిన రిషబ్‌ పంత్‌... బంతి బౌండరీ లైన్‌ను తాకిన క్షణాన ‘గాబా’ మైదానంలో కొత్త చరిత్ర లిఖితమైంది... ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండో టెస్టు సిరీస్‌ను గెలుచుకొని భారత్‌ సగర్వంగా నిలిచింది. ఆసీస్‌కు మూడు దశాబ్దాలుగా ఓటమి ఎరుగని అడ్డాగా ఉన్న చోట, గతంలో ఏ జట్టుకూ ఆసీస్‌ గడ్డపై సాధ్యం కాని విధంగా 328 పరుగుల లక్ష్యాన్ని అందుకొని టీమిండియా కొత్త రికార్డును సృష్టించింది. రెండేళ్ల క్రితంనాటి విజయంతో పోలిస్తే ఎన్నో అవరోధాలను దాటి మరింత గొప్ప ప్రదర్శనతో రహానే సేన సత్తా చాటింది. ఐదో రోజు ఏ దశలోనూ ఓటమికి భయపడకుండా... ‘డ్రా’ కోసం ఆడకుండా గెలుపుపై మాత్రమే గురి పెట్టిన భారత జట్టు చివరకు ఫలితాన్ని సాధించింది. హోరాహోరీ సిరీస్‌లో చివరి మ్యాచ్‌ ఆఖరి రోజు ఆట అత్యంత ఉత్కంఠభరితంగా సాగి చివరి గంటలో మరో రెండు ఓవర్లు మాత్రమే మిగిలి ఉండగా విజేత ఎవరో తేలడం టెస్టు క్రికెట్‌ మజాను చూపించింది. డిసెంబర్‌ 19న ‘36’తో పాతాళానికి చేరిన మన జట్టు ప్రతిష్ట తాజా ప్రదర్శనతో జనవరి19కి వచ్చేసరికి ఆకాశమంత ఎత్తుకు ఎగసింది.

బ్రిస్బేన్‌: భారత జట్టు టెస్టు క్రికెట్‌ చరిత్రలో మరో గొప్ప విజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియాతో మంగళవారం ముగిసిన చివరి టెస్టులో భారత్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించి 2–1 తేడాతో బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీని గెలుచుకుంది. 328 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 7 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రిషభ్‌ పంత్‌ (138 బంతుల్లో 89 నాటౌట్‌; 9 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపు బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చగా... ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ (146 బంతుల్లో 91; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), చతేశ్వర్‌ పుజారా (211 బంతుల్లో 56; 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. మ్యాచ్‌ చివరి రోజు మొత్తం 100 ఓవర్లు అందుబాటులో ఉండగా 97వ ఓవర్‌ చివరి బంతికి జట్టు గెలుపు ఖాయమైంది. ముందుగా భయపడినట్లుగా బ్రిస్బేన్‌లో వర్షం రాకపోవడంతో ఆటకు ఏమాత్రం అంతరాయం కలగలేదు. సిరీస్‌లో అత్యధికంగా 21 వికెట్లు పడగొట్టిన ప్యాట్‌ కమిన్స్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచాడు. 

గిల్‌ సెంచరీ మిస్‌
ఓవర్‌నైట్‌ స్కోరు 4/0తో ఆట కొనసాగించిన భారత్‌ ఆరంభంలోనే రోహిత్‌ శర్మ (7) వికెట్‌ కోల్పోయింది. అయితే గిల్, పుజారా భాగస్వామ్యం ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. ముఖ్యంగా గిల్‌ చూడచక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో 90 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. మరోవైపు పుజారా మాత్రం ఎప్పటిలాగే తనదైన శైలిలో పరుగులు చేయకపోయినా... పట్టుదలగా నిలబడ్డాడు. హాఫ్‌ సెంచరీ తర్వాత గిల్‌ మరింత దూకుడుగా ఆడాడు. ముఖ్యంగా స్టార్క్‌ వేసిన షార్ట్‌ బంతులను అప్పర్‌కట్‌తో ఒకసారి, ఆ తర్వాత పుల్‌ షాట్‌తో మరోసారి కొట్టిన రెండు సిక్సర్లు హైలైట్‌గా నిలిచాయి. అయితే ఈ జోరును లయన్‌ అడ్డుకున్నాడు. డ్రైవ్‌ చేయబోయి స్లిప్‌లో స్మిత్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో గిల్‌ శతకం చేజారింది. గిల్, పుజారా రెండో వికెట్‌కు 114 పరుగులు జోడించారు. క్రీజ్‌లో ఉన్నంతసేపు వేగంగా ఆడిన రహానే (22 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్స్‌) అదే జోరులో వెనుదిరిగాడు. 196 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ను చేరుకున్న పుజారా... ఆసీస్‌ కొత్త బంతి తీసుకున్న తొలి ఓవర్లోనే అవుటయ్యాడు. కమిన్స్‌ వేసిన అద్భుత బంతికి వికెట్ల ముందు దొరికిపోయిన అతను... రివ్యూ చేసినా లాభం లేకపోయింది.  

పంత్‌ జోరు 
పుజారా వెనుదిరిగే సమయానికి భారత్‌ మిగిలిన 19.4 ఓవర్లలో విజయానికి సరిగ్గా 100 పరుగులు చేయాల్సి ఉంది. ప్రధాన బ్యాట్స్‌మెన్‌ అవుట్‌ కావడంతో భారత్‌ విజయంపై దృష్టి పెడుతుందా... లేక ఆత్మరక్షణలో పడి ‘డ్రా’ కోసం ఆడుతుందా అనే సందేహం కనిపించింది. అయితే పంత్‌ మాత్రం తగ్గలేదు. దూకుడైన షాట్లతో ప్రత్యర్థి బౌలర్లందరినీ ఒత్తిడిలో పడేశాడు. 100 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. మయాంక్‌ అగర్వాల్‌ (9)ను కూడా అవుట్‌ చేసి ఆసీస్‌ ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే సుందర్‌ అండతో చెలరేగిన పంత్‌ చివరి వరకు నిలబడి జట్టుకు అపూర్వ విజయాన్ని అందించాడు.  

గెలిపించిన భాగస్వామ్యం
మయాంక్‌ అవుటైన తర్వాత పంత్‌కు జతగా వాషింగ్టన్‌ సుందర్‌ (29 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్‌) వచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత అర్ధ సెంచరీ సాధించినా... టెస్టు చివరి రోజు ఛేదనలో తీవ్ర ఒత్తిడి మధ్య ఆడటం అంత సులువు కాదు. చివరి 8 ఓవర్లలో 50 పరుగులు చేయాల్సిన స్థితి. టెస్టుల్లో ఉండే నిబంధనల కారణంగా ఓవర్‌కు 5 లేదా 6 పరుగుల రన్‌రేట్‌తో పరుగులు చేయడం దాదాపుగా అసాధ్యం. పైగా 12 ఓవర్లే వేసిన కొత్త బంతి ఆసీస్‌ బౌలర్లకు అందుబాటులో ఉంది. ఈ దశలో కూడా రిస్క్‌ తీసుకోకుండా ఆడితే ‘డ్రా’ కావచ్చని అనిపించింది. కానీ పంత్, సుందర్‌ మాత్రం స్వేచ్ఛగా ఆడేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా అప్పటి వరకు ఆసీస్‌ ఆశలు పెట్టుకున్న కమిన్స్‌ ఓవర్లో సుందర్‌ వరుసగా 6, 4 బాదడంతో గెలుపు దారి కనిపించింది. లయన్‌ వేసిన తర్వాతి ఓవర్లో పంత్‌ రెండు ఫోర్లు కొట్టగా, ‘బైస్‌’ రూపంలో మరో ఫోర్‌తో సహా మొత్తం 15 పరుగులు వచ్చేశాయి. విజయానికి పది పరుగుల దూరంలో సుందర్, ఆ వెంటనే శార్దుల్‌ (2) కూడా అవుటైనా... పంత్‌ మరో రెండు బౌండరీలతో జట్టును గెలిపించాడు.

కొంత మంది యువకులు...
‘మనలో ఎవరైనా జీవితంలో 36 లేదా అంతకంటే తక్కువ స్కోరు చేస్తే ప్రపంచం ఏమీ ముగిసిపోదని గుర్తుంచుకోండి’... బ్రిస్బేన్‌ విజయం తర్వాత దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ వ్యాఖ్య ఇది. భారత జట్టు కూడా సరిగ్గా ఇలాగే ఆలోచించింది. అడిలైడ్‌లో ఘోర పరాజయం తర్వాత మెల్‌బోర్న్‌లో గెలుపుతో నిలబడింది. సిడ్నీలో ఓటమికి చేరువైనా పట్టుదలతో పోరాడిన టీమ్‌... అదే స్ఫూర్తిని బ్రిస్బేన్‌లోనూ కొనసాగించింది. ఒకడుగు ముందుకు వేసి ఓటమి నుంచి తప్పించుకుంటే చాలని ఆగిపోకుండా విజయంతో ముగించింది. నమ్మకం, ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసం, పోరాటతత్వం... ఆటలో ఇవన్నీ అప్పడప్పుడు మనకు కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఆటగాళ్లు వీటన్నింటినీ ఒకే చిత్రంలో చూపించారు.

దాని ఫలితమే తాజా విజయం. కీలక ఆటగాళ్లు దూరం కావడం, ఉన్నవారు గాయాలతో సహవాసం చేస్తుండటంతో ఒక దశలో చివరి టెస్టుకు ముందు 11 మంది ఆటగాళ్లైనా అందుబాటులో ఉంటారా అనిపించింది. వీటికి తోడు మానసికంగా టీమిండియా ఆటగాళ్లను దెబ్బ తీసే ప్రయత్నం కూడా జరిగింది! సిడ్నీలో గెలుపు దూరమవుతున్న సమయంలో ఆసీస్‌ ఆటగాళ్లు నోరు జారితే, ప్రేక్షకులు కూడా ఇబ్బంది పెట్టారు. పైగా క్వీన్స్‌లాండ్‌లో మళ్లీ కఠిన ఆంక్షలు, పాటించకుంటే రావాల్సిన అవసరం లేదని అధికారుల ప్రకటనలు... చివరకు ఎలాగైనా ఆడేందుకు సిద్ధమని వెళితే హోటల్‌లో కనీస వసతులు కూడా లేవు. ఈ పరిణామాలు సాధారణంగా ఎవరినైనా దెబ్బ తీస్తాయి. కానీ టీమిండియా ఆటగాళ్లు మాత్రం పరిస్థితులు ఎలా ఉన్నా తమ అంతిమ లక్ష్యం సిరీస్‌ గెలవడమే అనేదాన్ని మరచిపోలేదు.

బ్రిస్బేన్‌ టెస్టులో ఒక్కో ఆటగాడు తనదైన ముద్ర వేశాడు. ముఖ్యంగా యువ ఆటగాళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. షమీ గాయంతో అవకాశం దక్కించుకున్న సిరాజ్‌... నెట్‌ బౌలర్‌గా వచ్చి దూసుకుపోయిన నటరాజన్‌ తమ బౌలింగ్‌ పదును చూపించడంతో ఆసీస్‌ భారీ స్కోరు సాధించలేకపోయింది. ఇక మూడేళ్లుగా ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ ఆడకపోయినా, ఎవరూ ఊహించని విధంగా జట్టులోకి వచ్చిన వాషింగ్టన్‌ సుందర్, అదృష్టవశాత్తూ టెస్టుల్లో మళ్లీ అడుగు పెట్టిన శార్దుల్‌ ఠాకూర్‌ కలిసి బ్యాటింగ్‌లో భారత్‌ను ఆదుకున్నారు. గిల్‌ బ్యాటింగ్‌ అతను భవిష్యత్‌ తార అని చూపించింది. అందరికీ మించి సిరీస్‌లో 928 బంతులు ఎదుర్కొని ఆసీస్‌ బౌలర్లకు అలసట తెప్పించిన పుజారా పాత్ర కూడా ఎంతో పెద్దది. చివరి రోజైతే అతను శరీరంలో అన్ని చోట్లా బంతుల గాయాలు తగిలించుకుంటూ మొండిగా నిలబడటం వల్లే చివర్లో వికెట్లు చేతిలో ఉండి భారత్‌ దూకుడుగా ఆడే సాహసం చేయగలిగింది.

‘అవకాశం వచ్చినప్పుడు జట్టుకు ఉపయోగపడే ఇలాంటి క్షణాల కోసమే మేం ఎదురు చూసేది’ అంటూ శార్దుల్‌ చేసిన వ్యాఖ్య యువ ఆటగాళ్ల చేతల్లో కూడా కనిపించింది. సిడ్నీ టెస్టులో మన హనుమ విహారి చూపించిన పోరాటాన్ని సగటు అభిమానులు ఎప్పటికీ మరచిపోలేరు. 90వ దశకం నుంచి చూసుకుంటే ఆసీస్‌ గడ్డపై భారత్‌ ఆడిన సిరీస్‌లలో 0–4, 0–3 పరాజయాలు, ఆపై 1–1, 1–2తో కాస్త సంతృప్తి, మళ్లీ 0–4, 0–2 తర్వాత రెండేళ్ల క్రితం 2–1 విజయం ఆనందం నింపింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన జట్టు సాధించిన విజయం నిస్సందేహంగా అన్నింటికంటే అత్యుత్తమం. అన్నట్లు... అడిలైడ్‌ ఫలితం తర్వాత భారత్‌కు 0–4తో క్లీన్‌స్వీప్‌ తప్పదంటూ వ్యాఖ్యానించిన మైకేల్‌ క్లార్క్, రికీ పాంటింగ్, మార్క్‌ వా, హాడిన్, మైకేల్‌ వాన్‌ ఇప్పుడు తలలు ఎక్కడ పెట్టుకుంటారో!

పంత్‌ ప్రతాపం!
‘రిషభ్‌ పంత్‌ నడుమును చూశారా...’ తాజా సిరీస్‌లో ఒక భారత మాజీ క్రికెటర్‌ కామెంటరీలో చేసిన వ్యాఖ్య ఇది. పంత్‌ ఫిట్‌నెస్‌పై చాలా కాలంగా వినిపిస్తున్న విమర్శలకు పరాకాష్ట ఇది. అయితే నడుము సైజు కాదు, బ్యాటింగ్‌లో పదును ముఖ్యమని పంత్‌ నిరూపించాడు. రెండేళ్ల క్రితం ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో కూడా 350 పరుగులు చేసిన పంత్, పుజారా తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. అయినా సరే టెస్టుల్లో వికెట్‌ కీపర్‌గా అతను పనికి రాడంటూ పదే పదే జట్టు నుంచి పక్కన పెడుతూనే వచ్చారు. బ్యాటింగ్‌ బాగున్నా.. తన ప్రాథమిక బాధ్యత అయిన కీపింగ్‌లో విఫలమవుతున్నాడంటూ భారత్‌ వృద్ధిమాన్‌ సాహాకే ప్రాధాన్యతనిచ్చింది.

అడిలైడ్‌ టెస్టులో కూడా సాహాకే అవకాశం దక్కింది. అయితే జట్టు బ్యాటింగ్‌ వైఫల్యం నేపథ్యంలో రెండో టెస్టులో జట్టులోకి వచ్చినా... కొన్ని క్యాచ్‌లు వదిలేయడంతో విమర్శల ధాటి మరింత తీవ్రమైంది. అయితే తాజా ప్రదర్శన తర్వాత పంత్‌కు ప్రత్యామ్నాయం గురించి ఆలోచించే అవకాశం ఉండకపోవచ్చు. 36 ఏళ్ల సాహాకు అతను చెక్‌ పెట్టినట్లే. బ్రిస్బేన్‌లో కీపర్‌గా ఎక్కడా విఫలం కాని పంత్‌ బ్యాటింగ్‌లో తన విలువేమిటో చూపించాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతను ఒంటి చేత్తో మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేశాడు. నలుగురు ఆసీస్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని పంత్‌ కొట్టిన బౌండరీలు చివరి రోజు హైలైట్‌గా నిలిచాయి.

పంత్‌ దూకుడు కారణంగానే భారత్‌ లక్ష్యంవైపు సాగింది. అతను అవుటై ఉంటే జట్టు కూడా ‘డ్రా’ గురించి ఆలోచించేదేమో. ఇన్నింగ్స్‌ చివర్లో కూడా ఎలాంటి సందేశాలు పంపకుండా మేనేజ్‌మెంట్‌ స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వడంతో చివరి సెషన్లో పంత్‌ చెలరేగిపోయాడు. ఉత్కంఠభరిత క్షణాలను దాటి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. 23 ఏళ్ల ఈ ఢిల్లీ కుర్రాడు సుదీర్ఘ కాలం భారత కీపర్‌గా అద్భుతాలు చేయగలడనడంలో సందేహం లేదు.  

నా జీవితంలో ఇదే అత్యుత్తమ క్షణం. నేను ఆడని సమయంలో కూడా జట్టు నాకు అండగా నిలిచింది. ఇది నాకు కలల సిరీస్‌. నువ్వు మ్యాచ్‌ విన్నర్‌వని, గెలిపించాలని మేనేజ్‌మెంట్‌ నన్ను బాగా ప్రోత్సహిస్తూ వచ్చింది. నేను ఎప్పుడూ అదే ఆలోచించేవాడిని. ఇప్పుడు అది చేసి చూపించాను. ఐదో రోజు పిచ్‌ కొంత టర్న్‌ అవుతుండటంతో షాట్‌లు ఆడే విషయంలో చాలా జాగ్రత్త పడ్డాను. –రిషభ్‌ పంత్‌ 

‘కెప్టెన్‌ కూల్‌’
ఆసీస్‌ను వారి సొంతగడ్డపై ఎదుర్కొనేందుకు ఆటతోనే కాదు మాటలతో కూడా ఢీ అంటే ఢీ అనేలా ఉండాలి. కోహ్లి లేకపోతే రహానే వల్ల అవుతుందా? సిరీస్‌ ఆరంభంలో వినిపించిన వ్యాఖ్య ఇది. అయితే ఆట గెలవాలంటే మాటలతో పని లేదని రహానే నిరూపించాడు. మూడు టెస్టుల్లోనూ ప్రశాంతంగా జట్టును నడిపించి చారిత్రక సిరీస్‌ విజయాన్ని అందించాడు. ముఖ్యంగా తనకు అందుబాటులో ఉన్న పరిమిత వనరులతోనే అతను ఈ ఘనతను సాధించడం విశేషం. యువ ఆటగాళ్లను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ, వారి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టడంలో రహానే ప్రత్యేకత కనిపించింది. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ తన భావోద్వేగాలు ప్రదర్శించకుండా చూపిన నాయకత్వ పటిమపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ జట్టును తీర్చిదిద్దడంలో కోహ్లిదే ప్రధాన పాత్ర అయినా...ఈ సిరీస్‌ విజయం మాత్రం రహానేదే. ఈ ఘనత మాత్రం అతనికే సొంతం. 

విజయం గురించి చెప్పేందుకు నాకు మాటలు రావట్లేదు. జట్టులో ప్రతీ ఒక్కరి ప్రదర్శన పట్ల నేను గర్వపడుతున్నా. అడిలైడ్‌ ఓటమి తర్వాత దాని గురించి మళ్లీ మాట్లాడుకోలేదు. ఫలితంతో సంబంధం లేకుండా మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని, పట్టుదలగా ఆడాలని మాత్రమే అనుకున్నాం. ఇదంతా సమష్టి కృషి ఫలితం. భారత జట్టుకు నాయకత్వం వహించడం ఒక గౌరవం. ప్రస్తుతానికి ఈ విజయాన్ని బాగా ఆస్వాదిస్తున్నాం. –అజింక్య రహానే, భారత కెప్టెన్‌ 

చాలా నిరాశగా ఉంది. కీలక సమయాల్లో పటిష్టమైన భారత జట్టు మాపై ఆధిక్యం ప్రదర్శించింది. మంచి అవకాశాలు మేం చేజార్చుకున్నాం. 300కంటే ఎక్కువ పరుగులతో ఊరించే లక్ష్యాన్ని ముందుంచాలని అనుకున్న మేం ఆ విషయంలో సఫలమయ్యాం. అయితే భారత బ్యాట్స్‌మెన్‌ అన్నింటికీ ఎదురొడ్డి పోరాడారు. మా బౌలర్లు మంచి అవకాశాలు సృష్టించినా వాటిని సరైన రీతిలో వాడుకోలేకపోయాం.   –టిమ్‌ పైన్, ఆస్ట్రేలియా కెప్టెన్‌

సాధారణంగా నా కళ్లల్లో కన్నీళ్లు ఎప్పుడూ కనిపించవు. కానీ నేను కూడా భావోద్వేగానికి గురయ్యాను. కుర్రాళ్లు సాధించిన ఘనత అసాధారణం. కోవిడ్‌ పరిస్థితులు, గాయాలు, 36 పరాభవం తర్వాత వచ్చిన ఈ విజయం చరిత్రలో నిలిచిపోతుంది. అన్నింటికంటే కఠిన పర్యటన ఇది. గత సిరీస్‌లో ఆడిన ఒక్క బౌలర్‌ కూడా ఈ చివరి టెస్టులో ఆడలేదు. అనుభవం లేని ఆటగాళ్లతో ఇలాంటి ఫలితం రాబట్టాలంటే ఎంతో ఆత్మవిశ్వాసం ఉండాలి. విదేశాల్లో విజయాల వెనక చాలా శ్రమ ఉంది. అన్నీ ఒక్కరాత్రిలో జరిగిపోవు.
–రవిశాస్త్రి, టీమిండియా హెడ్‌ కోచ్

భారత జట్టును తక్కువ అంచనా వేయవద్దని, దేన్నీ తేలిగ్గా తీసుకోవద్దని నేను పాఠం నేర్చుకున్నాను. 130 కోట్ల మంది జనాభా నుంచి 11 మంది ఆడుతున్నారంటే వారంతా అత్యుత్తమ ఆటగాళ్లే అని అర్థం. భారత జట్టును ఎంత ప్రశంసించినా తక్కువే.     –జస్టిన్‌ లాంగర్, ఆసీస్‌ కోచ్‌

భారత క్రికెట్‌లో ఇదే అద్భుత క్షణం. వారు ‘డ్రా’ కోసం ఆడలేదు. విజయం కోసం దూసుకుపోయారు. తాము ఏ స్థితిలోనూ భయపడేది లేదని యువ భారత్‌ నిరూపించింది. ఈ కుర్రాళ్ల చేతుల్లో భారత క్రికెట్‌ భవిష్యత్తు భద్రంగా ఉందని అర్థమైంది.     –సునీల్‌ గావస్కర్‌

యువ ఆటగాళ్లు అవసరమైన కీలక సమయంలో సత్తాచాటారు. వారిని చూస్తే గర్వంగా ఉంది. ఈ విజయం చిరకాలం గుర్తుండిపోతుంది.     –వీవీఎస్‌ లక్ష్మణ్‌

ఇదో గొప్ప విజయం. ఆస్ట్రేలియాకు వెళ్లి ఇలాంటి విజయం అందుకోవడం ఎవరూ మరచిపోలేరు. జట్టు సాధించిన విజయం విలువ అమూల్యం. అందరికీ అభినందనలు. –సౌరవ్‌ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

ఏమి విజయమిది... అడిలైడ్‌ ఫలితం తర్వాత మాపై సందేహాలు వ్యక్తం చేసిన వారందరికీ ఇదే సమాధానం. అద్భుత ప్రదర్శనలతో పాటు జట్టు చూపించిన పట్టుదల, అంకితభావం ఎంతో ప్రత్యేకం. ఈ గెలుపును ఆస్వాదించండి.     –విరాట్‌ కోహ్లి

అద్భుత విజయమిది. మూడు దశాబ్దాల తర్వాత బ్రిస్బేన్‌ కోటను కూల్చిన భారత జట్టుకు అభినందనలు. మీ శక్తి సామర్థ్యాలను చూసి దేశం గర్విస్తోంది.  –వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ సీఎం 

పరిమిత వనరులతోనే ఆస్ట్రేలియాను ఓడించిన టీమిండియాకు అభినందనలు. –కేసీఆర్, తెలంగాణ సీఎం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement