ఆసీస్‌తో తొలి టెస్ట్‌కు (బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ) ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఇండియా-ఏతో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు. గిల్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తూ చేతి వేలిని గాయపర్చుకున్నాడు. గాయం తీవ్రతపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. మెడికల్ టీమ్ గిల్‌కు తగిలిన గాయాన్ని దగ్గరి నుంచి పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తుంది. గిల్ గాయం నేపథ్యంలో అతను తొలి టెస్ట్ ఆడేది లేదన్నది సందిగ్దంలో పడింది.
కాగా, గిల్ గాయానికి ముందు టీమిండియా ఆటగాళ్లు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్ కూడా ప్రాక్టీస్ సందర్భంగా గాయపడ్డారు. ఈ ముగ్గురిలో రాహుల్ గాయం కాస్త తీవ్రమైందిగా తెలుస్తుంది. విరాట్ తనకు తగిలిన స్వల్ప గాయం నుంచి పూర్తిగా కోలుకుని ప్రాక్టీస్ మ్యాచ్‌లో చురుకుగా పాల్గొన్నాడు. సర్ఫరాజ్ సైతం మోచేతి గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని తెలుస్తుంది. శుభ్‌మన్ గిల్ గాయమే ప్రస్తుతం టీమిండియా మేనేజ్‌మెంట్‌కు ఆందోళన కలిగిస్తుంది.
ఇదిలా ఉంటే, తొలి టెస్ట్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ భారత ఇన్నింగ్స్‌ను (యశస్వి జైస్వాల్‌తో కలిసి) ప్రారంభిస్తాడని తెలుస్తుంది. శుభ్‌మన్ గిల్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే వన్‌డౌన్‌లో వస్తాడు. ఆతర్వాత విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ బ్యాటింగ్‌కు దిగుతారు. ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్‌లలో ఎవరో ఒకరికి తుది జట్టులో చోటు దక్కవచ్చు.
ఆల్‌రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా బరిలో ఉంటాడు. అశ్విన్ స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి టెస్ట్ అరంగేట్రం చేయడం ఖాయమని తెలుస్తుంది. స్పెషలిస్ట్ పేసర్లుగా బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీప్ బరిలోకి దిగడం దాదాపుగా ఖయమైపోయింది. తొలి టెస్ట్ పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment