Viv Richards
-
దిగ్గజ క్రికెటర్ సరసన పంత్.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇద్దరు మాత్రమే..!
టీమిండియా డైనమిక్ బ్యాటర్ రిషబ్ పంత్ వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ సరసన చేరాడు. సిడ్నీ టెస్ట్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో అలరించిన పంత్.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో 160 ప్లస్ స్ట్రయిక్‌రేట్‌తో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. టెస్ట్‌ల్లో పంత్, రిచర్డ్స్ చెరో రెండు సార్లు 160 ప్లస్ స్ట్రయిక్‌రేట్‌తో హాఫ్ సెంచరీలు చేశారు. టెస్ట్ క్రికెట్లో మరే ఇతర బ్యాటర్ ఈ స్థాయి స్ట్రయిక్‌రేట్‌తో రెండు హాఫ్ సెంచరీలు చేయలేదు.మ్యాచ్ విషయానికొస్తే.. సిడ్నీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో పంత్ 33 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేశాడు. సహచర ఆటగాళ్లు ఒక్కో పరుగు రాబట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న చోట పంత్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో పంత్ రాణించకపోయుంటే టీమిండియా పరిస్థితి ఘోరంగా ఉండేది. పంత్ సునామీ ఇన్నింగ్స్ పుణ్యమా అని భారత్ ఓ మోస్తరు లక్ష్యాన్ని అయినా ఆసీస్ ముందుంచగలుగుతుంది.రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసి 145 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. భారత సెకెండ్ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (22), కేఎల్ రాహుల్ (13), శుభ్‌మన్ గిల్ (13), విరాట్ కోహ్లి (6), రిషబ్ పంత్ (61), నితీశ్ కుమార్ రెడ్డి (4) ఔట్ కాగా.. రవీంద్ర జడేజా (8), వాషింగ్టన్ సుందర్ (6) క్రీజ్‌లో ఉన్నారు. స్కాట్ బోలాండ్ నాలుగు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. పాట్ కమిన్స్, బ్యూ వెబ్‌స్టర్ తలో వికెట్ తీశారు.అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా భారత్‌కు నాలుగు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో అరంగేట్రం ప్లేయర్ బ్యూ వెబ్‌స్టర్ (57) అర్ద సెంచరీతో రాణించగా.. స్టీవ్ స్మిత్ (33), సామ్ కొన్‌స్టాస్ (22), అలెక్స్ క్యారీ (21), పాట్ కమిన్స్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. ఉస్మాన్ ఖ్వాజా (2), లబూషేన్ (2), ట్రవిస్ హెడ్ (4), మిచెల్ స్టార్క్ (1), బోలాండ్ (9) విఫలమయ్యారు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులకు ఆలౌటైంది. పంత్ (40) మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఆఖర్లో బుమ్రా (22) కూడా బ్యాట్ ఝులిపించాడు. భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (20), యశస్వి జైస్వాల్ (10), విరాట్ కోహ్లి (17), రవీంద్ర జడేజా (26), వాషింగ్టన్ సుందర్ (14) రెండంకెల స్కోర్లు చేయగా.. కేఎల్ రాహుల్ (4), నితీశ్ కుమార్ రెడ్డి (0), ప్రసిద్ద్ కృష్ణ (3) సింగిల్ డిజిట్ స్కోర్లకే నిష్క్రమించారు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 4, ప్టార్క్ 3, కమిన్స్ 2, లియోన్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో ఆసీస్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
బ్రాడ్‌మన్ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లి
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్ పేరిట ఉన్న ఓ ఆల్‌టైమ్ రికార్డుపై కన్నేశాడు. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగబోయే రెండో టెస్ట్‌లో విరాట్ మరో రెండు సెంచరీలు చేస్తే.. ఏ జట్టుపై అయినా విదేశాల్లో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన ఆటగాడిగా అవతరిస్తాడు. బ్రాడ్‌మన్ 1930-1948 మధ్యలో ఇంగ్లండ్‌లో ఇంగ్లండ్‌పై 11 సెంచరీలు చేయగా.. విరాట్ 2011-2024 మధ్యలో ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై 10 సెంచరీలు చేశాడు. అడిలైడ్ టెస్ట్‌లో విరాట్ మరో రెండు సెంచరీలు చేస్తే బ్రాడ్‌మన్ రికార్డు బద్దలవుతుంది.బ్రాడ్‌మన్- ఇంగ్లండ్‌పై 11 సెంచరీలువిరాట్ కోహ్లి- ఆస్ట్రేలియాపై 10 సెంచరీలుజాక్ హాబ్స్- ఆస్ట్రేలియాపై 9 సెంచరీలుసచిన్ టెండూల్కర్- శ్రీలంకపై 9 సెంచరీలువివియన్ రిచర్డ్స్- ఇంగ్లండ్‌పై 8 సెంచరీలుసునీల్ గవాస్కర్- ఇంగ్లండ్‌పై 7 సెంచరీలుకాగా, విరాట్ కోహ్లి ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో అజేయ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇది అతనికి టెస్ట్‌ల్లో 30వ సెంచరీ కాగా.. ఓవరాల్‌గా 81వ సెంచరీ.ఇదిలా ఉంటే, డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది.పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు తొలి ఇన్నింగ్స్‌లో తడబడ్డా రెండో ఇన్నింగ్స్‌లో విజృంభించి ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి సెంచరీలతో విరుచుకుపడగా.. బుమ్రా ఎనిమిది వికెట్ల ప్రదర్శనతో ఆసీస్ నడ్డి విరిచాడు. -
WI VS ENG 1st ODI: విరాట్ రికార్డును సమం చేసిన షాయ్ హోప్
విండీస్ వన్డే జట్టు సారధి షాయ్ హోప్ పరుగుల యంత్రం విరాట్ కోహ్లి, విండీస్ బ్యాటింగ్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ పేరిట ఉన్న ఓ రికార్డును సమం చేశాడు. వన్డేల్లో అత్యంత వేగంగా (114 ఇన్నింగ్స్‌లో) 5000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్, వివ్ రిచర్డ్స్లతో కలిసి సంయుక్తంగా మూడో స్థానాన్ని ఆక్రమించాడు. ఇంగ్లండ్‌తో నిన్న (డిసెంబర్ 3) జరిగిన తొలి వన్డేల్లో అజేయ మెరుపు శతకంతో (83 బంతుల్లో 109 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) విరుచుకుపడిన హోప్ ఈ ఘనతను సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా ఈ మార్కును తాకిన రికార్డు పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ పేరిట ఉంది. బాబర్ కేవలం 97 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. బాబర్ తర్వాత ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హషీమ్ ఆమ్లా ఉన్నాడు. ఆమ్లా 101 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను సాధించాడు. ఇదిలా ఉంటే, స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్‌లో భాగంగా నిన్న జరిగిన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. షాయ్ హోప్ సూపర్ సెంచరీతో విండీస్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌట్ కాగా.. విండీస్ మరో ఏడు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బ్రూక్ (72 బంతుల్లో 71; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సాల్ట్ (45), క్రాలే (48), సామ్ కర్రన్ (28), బ్రైడన్ కార్స్ (31 నాటౌట్) పర్వాలేదనిపించగా.. విండీస్ ఇన్నింగ్స్‌లో హోప్‌తో పాటు అలిక్ అథనాజ్ (66), రొమారియో షెపర్డ్ (49), బ్రాండన్ కింగ్ (35), షిమ్రోన్ హెట్‌మైర్ (32) రాణించారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే డిసెంబర్ 6న జరుగనుంది. ఇంగ్లండ్ జట్టు ఈ పర్యటనలో 3 వన్డేల సిరీస్‌తో పాటు 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా ఆడనుంది. -
రోహిత్ ఒక అద్భుతం.. అతడంటే నాకు ఎంతో ఇష్టం: విండీస్ దిగ్గజం
ఆసియాకప్-2023కు టీమిండియా అన్ని విధాల సన్నద్దమవుతోంది. ఢిపెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనున్న భారత్.. మరోసారి ఆసియా కింగ్‌గా నిలవాలని భావిస్తోంది. ఈ క్రమంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రెయినింగ్ క్యాంపులో భారత జట్టు బీజీబీజీగా గడుపుతోంది. ఈ మెగా టోర్నీకి ముందు టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ టెస్టును కూడా క్లియర్ చేశారు. మరికొంత మంది ఆటగాళ్లు కూడా యో- యో టెస్టుకు హాజరకానున్నారు. ఆగస్టు 30న ముల్తాన్ వేదికగా పాకిస్తాన్ నేపాల్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్2న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఆసియాకప్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పై వెస్టిండీస్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్ ప్రశంసలు కురిపించాడు. రోహిత్ శర్మకు అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయని రిచర్డ్స్ కొనియాడాడు. రోహిత్ ఒక అద్భుతం.. "ప్రపంచ అత్యత్తుమ క్రికెటర్లలో రోహిత్ శర్మ ఒకడు. రోహిత్ అద్భుతమైన ఆటగాడు. అతడి బ్యాటింగ్ స్టైల్ అంటే నాకు ఎంతో ఇష్టం. రోహిత్లో కొంచెం భయం, ఒత్తిడి వంటవి కనిపించవు. అటువంటి ఆటగాళ్లను నేను ఎక్కువగా ఇష్టపడతాను" అని జర్నలిస్ట్ విమల్ కుమార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిచర్డ్స్ పేర్కొన్నాడు. చదవండి: Asian Games 2023: ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.. ఏకంగా పాకిస్తాన్ కెప్టెన్‌గా! ఎవరీ అక్రమ్? -
'సూర్యను చూస్తుంటే సర్ వివియన్ రిచర్డ్స్ గుర్తొస్తున్నాడు'
టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ ప్రశంసల వర్షం కురింపిచాడు. వెస్టిండీస్ గ్రేట్ సర్ వివియన్ రిచర్డ్స్‌తో సూర్యను పోల్చాడు. కాగా సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అదేవిధంగా టీ20ల్లో వరల్డ్ నెం1 బ్యాటర్‌గా సూర్య కొనసాగుతున్నాడు. ఇటీవలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో సూర్య చెలరేగాడు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో సత్తా చాటుతున్న సూర్యకు టెస్టు జట్టులో కూడా చోటు దక్కింది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌కు ఈ ముంబైకర్ భారత సెలక్టర్లు ఎంపికచేశారు. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ టాక్‌తో మూడీ మాట్లాడుతూ.. "సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేసే విధానం అద్భుతమైనది. నేను క్రికెట్ ఆడే తొలి రోజుల్లో సర్ వివియన్ రిచర్డ్స్ కూడా సూర్యలానే బ్యాటింగ్ చేసేవాడు. ప్రస్తుతం సూర్యను చూస్తుంటే మళ్లీ నాకు రిచర్డ్స్ గుర్తొస్తున్నాడు. అతడకి ఒంటిచేత్తో జట్టును గెలిపించే సత్తా ఉంది" అని పేర్కొన్నాడు. చదవండి: IND vs SL 3rd ODI: పద్మనాభస్వామి ఆశీస్సులు తీసుకున్న భారత క్రికెటర్లు -
క్రీడల చరిత్రలో క్రికెట్, ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లు ఆడిన ఆసీస్ ప్లేయర్ ఎవరో తెలుసా..?
ప్రపంచ క్రీడల చరిత్రలో అత్యంత అరుదైన ఘటన ఒకటి ఉంది. ఓ అంతర్జాతీయ ప్లేయర్.. క్రికెట్ వరల్డ్‌కప్‌తో పాటు ఫిఫా ప్రపంచకప్‌లో కూడా పాల్గొని, విశ్వంలో ఈ ఘనత సాధించిన తొలి క్రీడాకారిణిగా చరిత్ర పుటల్లో నిలిచింది. ప్రపంచ క్రీడల చరిత్రలో టార్చ్‌లైట్ వేసి వెతికినా ఇలాంటి ఓ ఘటన నమోదైన దాఖలాలు లేవు. ఆస్ట్రేలియాకు చెందిన 32 ఏళ్ల మహిళా క్రికెటర్ ఎల్లైస్ పెర్రీ 16 ఏళ్ల వయసులోనే (2007) అంతర్జాతీయ క్రికెట్ టీమ్‌తో పాటు ఫుట్‌బాల్ జట్టులోకి కూడా ఎంట్రీ ఇచ్చి.. అటు ఐసీసీ మహిళల వరల్డ్‌కప్ (2009)తో పాటు 2011 ఫిఫా మహిళల ప్రపంచకప్‌లో కూడా పాల్గొంది. పెర్రీ.. ఓ పక్క క్రికెట్లో సంచనాలు నమోదు చేస్తూనే, ఫుట్‌బాల్‌లోనూ సత్తా చాటింది. ఆల్‌రౌండర్‌గా వరల్డ్‌కప్‌లో నేటికీ బద్ధలు కాని ఎన్నో రికార్డులు నమోదు చేసిన పెర్రీ.. ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండర్‌గా ఉంటూనే గోల్స్ సాధించింది. 2011 ఫిఫా ప్రపంచకప్‌లో స్వీడన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో పెర్రీ.. మెరుపు వేగంతో సాధించిన గోల్‌ను ఆసీస్ ఫుట్‌బాల్ ప్రేమికులు ఎన్నటికీ మర్చిపోలేరు. అయితే ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న కొన్ని క్లబ్‌లు క్రికెట్ కావాలో, ఫుట్‌బాల్ కావాలో తేల్చుకోమని చెప్పడంతో 2014లో ఫుట్‌బాల్‌కు స్వస్తి పలికి నేటికీ ఆసీస్ జట్టులో కీలక సభ్యురాలిగా కొనసాగుతుంది. క్లబ్ లెవెల్ ఫుట్‌బాల్‌లో ఎన్నో అద్భుతాలు చేసిన పెర్రీ.. అంతర్జాతీయ క్రికెట్లో అంతకుమించిన ఎన్నో చెరగని రికార్డులు తన ఖాతాలో వేసుకుంది. అటు క్రికెట్లోనూ.. ఇటు ఫుట్‌బాల్‌లోనూ సత్తా చాటిన పెర్రీ ఎందరో మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆమెను దేశంలోని అన్ని అత్యుత్తమ పురస్కారాలతో సత్కరించింది. క్రికెట్లో ఆసీస్ తరఫున టెస్ట్‌ల్లో 10 మ్యాచ్‌లు ఆడిన పెర్రీ.. 75.20 సగటుతో 752 పరుగులు చేసింది. ఇందులో 2 శతకాలు 3 అర్ధశతకాలు ఉన్నాయి. ఆమె అత్యుత్తమ స్కోర్ 213 నాటౌట్‌గా ఉంది. సుదీర్ఘ ఫార్మాట్లో ఆమె 37 వికెట్లు కూడా సాధించింది. 128 వన్డేలు ఆడిన పెర్రీ.. 50.28 సగటున 2 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీల సాయంతో 3369 పరుగులు చేసి 161 వికెట్లు పడగొట్టింది. ఇక, 126 టీ20లు ఆడిన పెర్రీ.. 4 హాఫ్ సెంచరీల సాయంతో 1253 చేసి 115 వికెట్లు పడగొట్టింది. ఇక ఫుట్‌బాల్ విషయానికొస్తే.. ఆసీస్ తరఫున 18 మ్యాచ్‌లు ఆడిన పెర్రీ.. 3 గోల్స్ సాధించింది. అలాగే క్లబ్ స్థాయిలో 50కి పైగా మ్యాచ్‌ల్లో పాల్గొంది. విండీస్ దిగ్గజం కూడా ఫిఫా వరల్డ్‌కప్, క్రికెట్ ప్రపంచకప్ ఆడాడు.. అయితే..! పురుషుల క్రికెట్లో విండీస్ దిగ్గజం, ఆల్ టైమ్ గ్రేట్ సర్ వివియన్ రిచర్డ్స్ కూడా ఫిఫా వరల్డ్‌కప్, క్రికెట్ ప్రపంచకప్‌లలో ఆడాడు. 70, 80 దశకాలలో క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన రిచర్డ్స్.. 1975, (తొలి వన్డే ప్రపంచకప్), 1979, 1983 వన్డే ప్రపంచకప్‌లలో పాటు 1974 ఫిఫా వరల్డ్‌కప్‌లో కూడా పాల్గొన్నాడు. కరీబియన్ దీవుల్లోని అంటిగ్వా తరఫున ఫిఫా వరల్డ్‌కప్ బరిలోకి దిగిన సర్ రిచర్డ్స్.. క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు. నాటి పోటీల్లో ఆంటిగ్వా ఆశించిన స్థాయిలో రాణించలేక, వరల్డ్‌కప్ మెయిన్ డ్రాకు అర్హత సాధించలేకపోయింది. -
నన్ను GOAT అని పిలవకండి.. ఆ ఇద్దరే అందుకు అర్హులు: విరాట్ కోహ్లి
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి.. క్రీడాభిమానులు తనను GOAT (Greatest Of All Time) అని సంబోధించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. తన పేరు ముందు అంత పెద్ద ట్యాగ్‌ను తగిలించవద్దని విజ్ఞప్తి చేశాడు. తాను ఆ బిరుదుకు అర్హున్ని కాదని ఖరాఖండిగా చెప్పాడు. నా అభిమానులైనా సరే నన్ను GOAT అని పిలిస్తే అంగీకరించనని, అలా పిలుపించుకునే అర్హత ప్రపంచ క్రికెట్లో కేవలం ఇద్దరికి మాత్రమే ఉందని తెలిపాడు. ఆ ఇద్దరు తాను అమితంగా ఆరాధించే దిగ్గజ ప్లేయర్లు వివియన్ రిచర్డ్స్, సచిన్ టెండూల్కర్ అని పేర్కొన్నాడు. టీ20 వరల్డ్‌కప్-2022లో పాక్‌పై ఆడిన చారిత్రక ఇన్నింగ్స్ అనంతరం సోషల్‌మీడియాలో విరాట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. దీనిపై ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు విరాట్ ఈ మేరకు స్పందించాడు. కాగా, గత ఆదివారం (అక్టోబర్ 23) పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి పొట్టి క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లి.. టీ20 వరల్డ్‌కప్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ బాది కెరీర్ బెస్ట్ ఫామ్‌లో కొనసాగున్నాడు. పాక్‌పై 82 పరుగులు చేసి అజేయంగా నిలిచిన కోహ్లి.. ఇవాళ (అక్టోబర్ 27) నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 62 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దాదాపు 1000 రోజుల తర్వాత పూర్వవైభవాన్ని సాధించిన కింగ్ కోహ్లి.. ఆతర్వాత వెనుదిరిగి చూడట్లేదు. రన్‌మెషీన్, కింగ్ కోహ్లి, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ బిరుదులకు వంద శాతం అర్హుడినని రుజువు చేసుకుంటున్నాడు. -
విండీస్ దిగ్గజానికి క్లిష్ట పరిస్థితి.. కోహ్లి త్యాగం!
వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ కోసం టీమిండియా మెషిన్‌గన్ విరాట్ కోహ్లి త్యాగం చేశాడు. అదేంటి కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్లో బిజీగా ఉంటే ఈ త్యాగం అనే పదం ఎక్కడినుంచి వచ్చిందని ఆశ్చర్యపోకండి. కోహ్లి త్యాగం చేసింది ఇప్పుడు కాదు.. 2019లో వెస్టిండీస్ టూర్ సందర్భంగా. టీమిండియా మాజీ క్రికెటర్ వివేక్ రజ్దన్ ఇటీవలే ఒక ఇంటర్య్వూలో పాల్గొన్నాడు. కోహ్లి, రిచర్డ్స్ మధ్య జరిగిన ఒక ఆసక్తికర ఘటనను ఆయన పంచుకున్నాడు. '' 2019లో టీమిండియా వెస్టిండీస్ టూర్‌కు వెళ్లింది. అంటిగ్వాలో మ్యాచ్ పూర్తి చేసుకున్న టీమిండియా తర్వాతి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఫ్లైట్‌లో మ్యాచ్ జరిగే ప్రదేశానికి వెళ్లింది. అయితే అనుకోకుండా అదే ఫ్లైట్‌కు వివ్ రిచర్డ్స్ కూడా రావాల్సి వచ్చింది. అప్పటికే టీమిండియా ఆటగాళ్ల లగేజితో క్యాబిన్స్ అన్నీ ఫుల్ అయ్యాయి. రిచర్డ్స్ తన లగేజీ పెట్టుకోవడానికి అన్ని క్యాబిన్స్ చూసినప్పటికి లాభం లేకపోయింది. అయితే ఇదంతా గమనించిన కోహ్లి తన సీటు నుంచి లేచి.. తోటి ఆటగాళ్ల లగేజీని సర్ది తన లగేజీని కిందకు దించాడు. ఆ తర్వాత రిచర్డ్స్ లగేజీని తీసుకొని తన క్యాబిన్లో పెట్టాడు. తన లగేజీని కోహ్లి తాను కూర్చున్న సీటు కిందే పెట్టుకున్నాడు. కోహ్లి చర్యకు ముచ్చటపడిన రిచర్డ్స్ చిరునవ్వుతో అతని భుజాన్ని నిమిరాడు. ఆ తర్వాత సహాయం చేసినందుకు థ్యాంక్స్ చెప్పాడు. అంటూ వివరించాడు. కాగా కోహ్లి ఇదే విండీస్ టూర్లో ఆఖరిసారి సెంచరీ నమోదు చేశాడు. అప్పటినుంచి సెంచరీ చేయడంలో విఫలమవుతూ వచ్చిన కోహ్లి మూడేళ్లు కావొస్తున్నప్పటికి శతకం మాత్రం అందుకోలేదు. దీనికి తోడూ బ్యాటింగ్‌లోనూ చెత్త ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఐపీఎల్‌లోనూ చెత్త ఫామ్‌ను కొనసాగించిన కోహ్లి.. ఎట్టకేలకు గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిశాడు. అయితే కోహ్లి అర్థసెంచరీ చేసినప్పటికి జట్టును మాత్రం ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. ఈ సీజన్లో ఆర్సీబీ పడుతూ లేస్తూ తమ ప్రయాణం కొనసాగిస్తుంది. ఆరంభంలో మంచి విజయాలు సాధించినప్పటికి సీజన్ మధ్యలో పరాజయాలు ఎదురయ్యాయి. ప్రస్తుతం 10 మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. ఐదు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. చదవండి: Tilak Varma: తిలక్ నువ్వు ఇలా కూడా చేస్తావా? పాపం బేబీ ఏబీడీ! వీడియో వైరల్ "In 2019, Sir Viv Richards was worried because he could not find a space in overhead locker for his luggage. No one got up, I saw Virat Kohli moved his own luggage, kept it below the seat & made room for Viv's luggage, Sir Viv patted his shoulder & said Thank You." - Vivek Razdan — CricketMAN2 (@ImTanujSingh) May 3, 2022 -
జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2022: పిల్లలకు బంధాలు కావాలి
‘ప్రేమలో ఉన్నప్పుడు మనం ఎవ్వరి మాటా వినం. కాని పిల్లలు పుట్టాక అన్నీ మెల్లగా అర్థమవుతాయి. పిల్లలకు బంధాలు కావాలి. తల్లీ తండ్రీ ఇద్దరూ కావాలి. తల్లి తరఫు ఉన్నవారూ తండ్రి తరఫు ఉన్నవారూ అందరూ కావాలి. బంధాలు లేని పిల్లలు చాలా సఫర్ అవుతారు’ అంది నీనాగుప్తా. జీవితం ఎవరికైనా ఒక్కో దశలో ఒక్కోలా అర్థం అవుతుంది. క్రికెటర్ వివ్ రిచర్డ్స్‌తో కుమార్తెను కన్న నీనా పిల్లల గురించి చెబుతున్న మాటలు వినదగ్గవి. ఆమె తన ఆత్మకథ ‘సచ్ కహూ తో’ గురించి జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో మాట్లాడింది. ‘వివ్ రిచర్డ్స్ (క్రికెటర్)తో నేను ప్రేమలో ఉన్నాను. పెళ్లితో సంబంధం లేకుండా బిడ్డను కనాలని నిశ్చయించుకున్నాను. అప్పుడు ఎందరో మిత్రులు ఎన్నో రకాలుగా నాకు సలహాలు ఇచ్చారు. కాని నేను ఎవ్వరి మాటా వినలేదు. ముందుకే వెళ్లాను. మసాబా పుట్టింది. కాని సింగల్ పేరెంట్‌గా పిల్లల్ని పెంచడం చాలా చాలా కష్టం. ఆ విధంగా నేను మసాబాకు అన్యాయం చేశాను అని ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తూ ఉంటుంది. పిల్లలకు బంధాలు కావాలి. తల్లిదండ్రులు ఇద్దరూ కావాలి. వారి వైపు ఉన్న అమ్మమ్మలు, తాతయ్యలు, బంధువులు అందరూ కావాలి. మసాబాకు ఆ విధంగా తండ్రి వైపు నుంచి పెద్ద లోటును మిగిల్చాను’ అంది నటి నీనా గుప్తా. ఆమె రాసిన ‘సచ్ కహూ తో’ ఆత్మకథ మార్కెట్లో ఉంది. దాని గురించి మాట్లాడటానికి ఆమె ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’కు హాజరయ్యింది. ‘మాది తిండికి హాయిగా గడిచే కుటుంబం. కాని మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. దాని వల్ల పిల్లలుగా మేము ఎదుర్కొన్న ఇబ్బంది పెద్దగా లేకపోయినా మా అమ్మ చాలా సతమతమయ్యేది. ఆమె బాధ చూసి నాకు చాలా బాధ కలిగేది. బాల్యంలో అలాంటి ప్రభావాలు గాఢమైన ముద్ర వేస్తాయి’ అందామె. నీనా గుప్తా నటిగా పూర్తిగా నిలదొక్కుకోని రోజులవి. హటాత్తుగా వివ్ రిచర్డ్స్‌తో గర్భం దాల్చాను అని పత్రికలకు చెప్పి సంచలనం సృష్టించింది. 1989లో కుమార్తె మసాబాకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమె ప్రస్థానం ఎలా ఉంటుందో అని చాలా మంది ఆందోళనగా, కుతూహలంగా గమనించారు. ఇప్పుడు ఆమె నటిగా, కుమార్తె ఫ్యాషన్ డిజైనర్‌గా సక్సెస్‌ను చూస్తున్నారు. కాని ఈలోపు ఎన్నో జీవితానుభవాలు. ‘మసాబాను నెలల బిడ్డగా ఇంట్లో వదిలి నేను పనికి వెళ్లాల్సి వచ్చేది. ఒక్కోసారి షూటింగ్‌కి కూడా తీసుకెళ్లి షాట్‌కు షాట్‌కు మధ్యలో పాలు ఇచ్చేదాన్ని. ఆమె రంగు, రూపం... వీటిని చూసి పిల్లలు కామెంట్లు చేసేవారు. తండ్రి కనిపించేవాడు కాదు. నా కూతురుకు ఏది ఎలా ఉన్నా ‘యూ ఆర్ ది బెస్ట్’ అని చెప్తూ పెంచుకుంటూ వచ్చాను. కాని మనం ఎంత బాగా పెంచినా బంధాలు లేకుండా పిల్లలు పెరగడం ఏమాత్రం మంచిది కాదని చెప్పదలుచుకున్నాను’ అందామె. అలాగే ఒంటరి స్త్రీని సమాజం ఎంత అభద్రతగా చూస్తుందో కూడా ఆమె వివరించింది. ‘సింగిల్ ఉమెన్‌గా ఉండటం వల్ల నేను ఇబ్బంది పడలేదు కానీ నా వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. ఏదైనా పార్టీకి వెళ్లి ఏ మగాడితోనైనా ఐదు నిమిషాలు మాట్లాడితే ఆ మగాడి భార్య తుర్రున పరిగెత్తుకుంటూ మా దగ్గరకు వచ్చేసేది. సింగిల్ ఉమెన్ అంటే పురుషులను వల్లో వేసుకునేవారు అనే ఈ ధోరణి అన్యాయం’ అని నవ్వుతుందామె. స్త్రీలను వారి దుస్తులను బట్టి జడ్జ్ చేయడం అనే మూస నుంచి బయడపడాలని నీనా గట్టిగా చెబుతుంది. ‘నేను ఢిల్లీలో ఎం.ఏ సంస్కృతం చదివాను. కాలేజ్‌కు చాలా మోడ్రన్ బట్టలు వేసుకుని వెళ్లేదాన్ని. సంస్కృతం చదువుతూ ఇలాంటి బట్టలు వేసుకుని వస్తుంది ఏమిటి అని ఏ ఆడపిల్లా నాతో మాట్లాడేది కాదు. నేను ఆ పక్కనే ఉండే మరో కాలేజ్‌కు వెళ్లి క్యారెమ్స్ ఆడుతూ కూచునేదాన్ని. చివరకు ఫస్ట్ ఇయర్లో నాకు మంచి మార్కులు రావడం చూసి అందరూ నాకు ఫ్రెండ్స్ అయ్యారు’ అందామె. ఇంకో ఉదాహరణ కూడా చెప్పింది. ‘ముంబైలో నా కెరీర్ మొదలులో రచయిత గుల్జార్, నేను రోజూ బాడ్మింటన్ ఆడటానికి కారులో వెళ్లేవాళ్లం. ఇద్దరం షార్ట్స్ వేసుకుని పక్కపక్కన కూచుని వెళ్లేవాళ్లం. ఇన్నేళ్ల తర్వాత మొన్న నేను షార్ట్స్‌లో ఆయన ఇంటికి వెళ్లి నా ఆత్మకథ కాపీ అందించాను. అది నెట్లో చూసి ‘హవ్వ.. గుల్జార్ గారిని కలవడానికి వెళ్లి ఈ వయసులో షార్ట్స్ వేసుకుంటావా’ అని ట్రోలింగ్. అరె.. ఏమిటిది? ఎండగా ఉంది వేసుకున్నాను... లేదా కాళ్లు బాగున్నాయని వేసుకున్నాను. మీకేంటి నొప్పి’ అంటుందామె. నీనా గుప్తాకు నటిగా ఎంత ప్రతిభ ఉన్నా ఆమెకు కమర్షియల్ సినిమాల్లోకాని పార్లల్ సినిమాల్లో కాని లీడ్ రోల్స్ రాలేదు. ‘షబానా ఆజ్మీ తన సినిమాల్లో వేసిన పాత్రలన్నీ వేయాలని నాకు ఉంటుంది. ఆర్ట్ సినిమాల్లో కూడా అన్నీ హీరోయిన్ పాత్రలు షబానా, స్మితా పాటిల్, దీప్తికి దక్కాయి. అది నాకు బాధే. కాని ఇప్పుడు నేను లీడ్ రోల్స్ చేసి హిట్స్ కొడుతున్నాను. అది ఆనందం’ అంటుందామె. నీనా గుప్తా అమెరికాలో తీస్తున్న ఒక బాలీవుడ్ సినిమాలో తెలుగు పనిమనిషిగా నటిస్తోంది. ఆమె నటించిన ‘పంచాయత్’ వెబ్ సిరీస్ చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ‘స్త్రీలుగా మీరు ఏ విషయంలోనూ చిన్నబుచ్చుకోకండి. ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది. అది గమనించుకుని యూ ఆర్ ది బెస్ట్ అనుకోండి. అదే మీ సక్సెస్‌మంత్ర’ అందామె. ఆమె నిజమే చెబుతోంది. అందుకే ఆమె పుస్తకం పేరు ‘సచ్ కహూ తో’. – సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
నేచురల్స్ విజయం.. ఆ రుచి వెనుక రహస్యం ఇదే
మంచి వ్యాపారి కావాలంటే ఉండాల్సిన అర్హతలు కుటుంబ నేపథ్యం, పెట్టుబడి, మేనేజ్మెంట్ డిగ్రీలు ఇవేమీ అక్కర్లేదనీ నిరూపించాడీ వ్యాపారి. పదో తరగతి పాస్ కావడానికే నానా తంటాలు పడ్డా కామన్ సెన్స్ తో బిజినెస్‌లో సక్సెస్ అయ్యాడు. సహజత్వాన్ని మరో మెట్టుపైకి చేర్చాడు Naturals Ice Cream Success Story: రఘునందన్ శ్రీనివాస్ కామత్ అంటే ఎవరికీ తెలియదు. కానీ ఆయన స్థాపించిన నాచురల్స్ ఐస్‌క్రీం అంటే తెలియని వారు తక్కువ. అక్కడి రుచిని తలచుకుని నోరూరని వారు అరుదు. అమితాబ్ బచ్చన్ నుంచి వివియన్ రిచర్డ్స్ వరకు ఆ ఐస్‌క్రీంకి ఫిదా అయిపోయారు. ఐస్‌క్రీం తింటున్నామా లేక పళ్లు తింటున్నామా అనేంత సహజంగా ఇక్కడ హిమక్రీములు తయారవుతాయి. ఒక్కసారి ఇక్కడ ఐస్‌క్రీం రుచి చూసిన వారు రెండో సారి గుర్తు పెట్టుకుని మరీ తింటారు. ఇంతకీ అంతలా ఆకట్టుకునే ఆ ఐస్‌క్రీం తయారీకి బీజం ఎలా పడింది. మంగళూరు టూ ముంబై కర్నాటకలోని మంగళూరుకి చెందిన శ్రీనివాస్ కామత్ పళ్ల వ్యాపారి. మార్కెట్లో వందల పళ్ల మధ్య పక్వానికి వచ్చి రుచి ఎక్కువగా పండుని ఎంపిక చేయడంలో ఆయన దిట్ట. దీంతో పళ్ల మంగళూరులో పళ్ల వ్యాపారం చేస్తూ భార్య, ఏడుగురు సంతానాన్ని పోషించేవాడు. అయితే పళ్లపై వచ్చే వ్యాపారం సరిపోకపోవడంతో కుటుంబాన్ని ముంబైకి మార్చాడు. అలా తన పదిహేనవ ఏట తల్లిదండ్రులతో కలిసి ముంబైలో అడుగు పెట్టాడు రఘునందన్ శ్రీనివాస్ కామత్. తినుబండారాల షాప్ పళ్ల వ్యాపారం వద్దనుకుని ముంబైలో తినుబండరాల షాప్‌ని ఓపెన్ చేసింది ఆ కుటుంబం. మిగిలిన అక్కడున్న మిగిలిన షాప్‌లని కాదని తమ దగ్గరికే కష్టమర్లు వచ్చేలా చేసేందుకు రుచికరమైన ఆహార పదార్థాలు తయారు చేసేది రఘునందన్ తల్లి ప్రయత్నించేది. అయితే అంత తేలిగ్గా ఆ టేస్టీ ఫుడ్ రెసీపీ దొరికేది కాదు. అయినా ఆమె ప్రయత్నిస్తూనే ఉండేది. ఆమెకు తోడుగా రఘునందన్ వంటింట్లో ఎక్కువ సేపు గడిపేవాడు. వారి ప్రయత్నం ఫలించి రుచికరమైన రెసిపీలతో ఆ షాప్ బాగా నడిచింది. ఆర్థిక ఇబ్బందులు లేని స్థితికి ఆ కుటుంబం చేరుకుంది. దీంతో అక్కడే ఐస్‌క్రీంలు అమ్మడం కూడా ప్రారంభించారు. సొంత ప్రయత్నం ముంబైలోని ఈటెరీ షాప్‌లో ఇంట్లోనే తయారు చేసిన వెనీలా, చాక్లెట్ ఫ్లేవర్లు అమ్మేవారు. అయితే అన్నతో వచ్చిన విబేధాల కారణంగా ఆ షాప్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. కొత్తగా తనను తాను నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. దీంతో ఎవరూ చేయనిది ఏదైనా చేయాలని ఆలోచించాడు. ఫ్రూట్ ఫ్లేవర్లు అప్పటి వరకు వెనీలా, స్ట్రాబెరీ, చాక్లెట్ ఫ్లేవర్ ఐస్‌క్రీమ్‌లే అమ్మేవారు. మ్యాంగో, జామ, ద్రాక్ష ఫ్లేవర్లలో ఐస్‌క్రీమ్‌లు ఎందుకు అమ్మకూడదనే ఆలోచన రఘునందన్‌లో కలిగింది. రుచి ఎక్కువగా ఉండే పళ్లను గుర్తించడంలో తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్న నైపుణ్యం, కొత్త రెసిపీలు తయారు చేయడంలో తల్లి నుంచి నేర్చుకున్న మెళకువలు రంగరించి ఫ్రూట్ఫ్లేవర్లలో ఐస్‌క్రీమ్‌లు తయారు చేశాడు. ఫస్ట్ స్టోర్ ముంబైలో జనసంచారం ఎక్కువగా ఉండే జూహు రోడ్లో 1984లో కేవలం నాలుగు టేబుళ్లతో నాచురల్స్ ఐస్‌క్రీం స్టోర్‌ని ఏర్పాటు చేశాడు. అప్పటి వరకు రెగ్యులర్ ఫ్లేవర్ల తిని మోహం మొత్తిపోయిన జనాలకు ఈ ఫ్రూట్ ఫ్లేవర్లు బాగా నచ్చాయి. అంతే మరుసటి ఏడాదికే విల్లేపార్లేలో మరో స్టోర్ ఓపెన్ చేశాడు. ఆ తర్వాత కొద్ది కాలానికే ముంబైలో ఐస్‌క్రీమ్ అంటే నాచురల్స్ అనే పరిస్థితి మారింది. వివ్ మాటలతో లెజండరీ క్రికెటర్ సునిల్ గవాస్కర్ హోస్ట్‌గా 1986లో సన్నీడేస్ కార్యక్రమం వచ్చేది. దానికి అతిధిగా వచ్చిన వివ్ రిచర్డ్స్ మాట్లాడుతూ.. తానెప్పుడు ముంబై వచ్చినా నాచురల్స్లో ఐస్‌క్రీమ్స్ తప్పక తింటానని, అక్కడ దొరికే రుచి మరెక్కడా దొరకదంటూ కితాబిచ్చాడు. ఆ కార్యక్రమంలో ఒక్కసారిగా నాచురల్స్ పేరు మార్మోగిపోయింది. మౌత్‌టాక్ నాచురల్స్ ప్రయాణం ప్రారంభైనప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రాండ్ ప్రచారంపై ఒక్క రూపాయి కూడా ఖర్చు రఘునందన్ కామత్ ఖర్చు పెట్టలేదు. అక్కడ ఐస్‌క్రీం రుచి చూసిన వాళ్లే ప్రచారం చేసి పెట్టారు. అందులో వివియన్ నుంచి అమితాబ్ బచ్చన్ వరకు ఎందరో ఉన్నారు. అలా నోటిమాట సాయంతోనే ముంబై నుంచి దేశమంతటా నాచురుల్స్ రుచులు విస్తరించాయి. రూ.300 కోట్ల టర్నోవర్ రోడ్డు పక్కన చిన్న తినుబండరాల షాప్ నుంచి ప్రారంభమైన రఘునందన్ శ్రీనివాస్ కామత్ ప్రయాణం రోజు రూ. 300 కోట్ల టర్నోవర్‌కి చేరుకుంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో 135 పైగా ఔట్లెట్లు ఉన్నాయి. ఇక్కడ దాదాపు దోస, కోకోనట్, ద్రాక్ష, లిచి, జామ ఒకటేమిటి ఇలా అన్ని రకాల ఫ్లేవరల్లో ఐస్‌క్రీమ్‌లు దొరుకుతాయి. అదే రహస్యం నాచురల్స్ సక్సెస్ వెనుక ఉన్న రహాస్యం కామన్సెన్స్ అంటారు రఘునందన్ కామత్. తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆ జ్ఙానంతోనే నాచురల్స్ స్థాపించానని చెబుతారు. వాళ్ల నుంచి నేర్చరుకున్న విషయాలనే మరింత సాన పెట్టానంటారు. అందులో కృత్రిమత్వం ఏమీ లేదనే. అందుకే తమ ఐస్‌క్రీమ్‌లు అంత సహాజంగా ఉంటాయంటారు. - సాక్షి, వెబ్‌డెస్క్ -
Sachin Tendulkar: ఆ రెండు కోరికలు నెరవేరలేదు
ముంబై: 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో అసాధ్యమనుకున్న ఎన్నో రికార్డులను తిరగరాసి, భారత క్రికెట్ రూపురేఖలను మార్చిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్.. తన జీవితంలో రెండు కోరికలు కలగానే మిగిలిపోయాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. టెస్టులు, వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డుతో పాటు అంతర్జాతీయ కెరీర్లో 100 సెంచరీల మైలురాయిని అందుకున్న ఏకైక క్రికెటర్‌గా నిలిచిన ఈ భారత రత్నం.. తన కెరీర్లో ఆ రెండు కోరికలు నెరవేరకపోవడం ఇప్పటికీ కలచివేస్తుందని వాపోయాడు. చిన్నతనం నుంచి తన బ్యాటింగ్హీరోగా భావించే సునీల్ గవాస్కర్‌తో కలిసి ఆడలేకపోవడాన్ని, అలాగే తను పిచ్చిగా ఆరాధించే సర్వివియన్రిచర్డ్స్ కు ప్రత్యర్ధిగా ఆడలేకపోవడాన్ని తన క్రికెటింగ్ కెరీర్లో రెండు లోటుపాట్లుగా భావిస్తానని చెప్పుకొచ్చాడు. గవాస్కర్ రిటైర్ అయిన రెండేళ్లకు తాను క్రికెట్లోకి అరంగేట్రం చేయడం వల్ల అతనితో డ్రెసింగ్ రూమ్ షేర్ చేసుకునే అవకాశం దక్కలేదని, 80, 90 దశకాల్లో క్రికెట్ ఆడిన ప్రతి ఆటగాడికి సన్నీతో కలిసి ఆడటం అనేది ఓ కల అని సచిన్ వివరించాడు. మరోవైపు వివ్ రిచర్డ్స్‌తో కలిసి కౌంటీ క్రికెట్ ఆడటాన్ని అదృష్టంగా భావిస్తానని, వివ్ లాంటి డాషింగ్ బ్యాట్స్‌మెన్‌కు ప్రత్యర్ధిగా ఉంటే ఆ మజానే వేరని పేర్కొన్నాడు. తాను అరంగేట్రం చేసిన తర్వాతే వివ్ రిచర్డ్స్ రిటైర్డ్ అయినప్పటికీ అంతర్జాతీయ వేదికపై తామెప్పుడూ ఎదురెదురు పడలేదని, ఈ లోటు తనను జీవితాంతం బాధిస్తుందని చెప్పుకొచ్చాడు. కాగా, 1989లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన సచిన్.. 2013లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఈ 24 ఏళ్ల కెరీర్లో 463 వన్డేలు, 200 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన సచిన్.. దాదాపు 35000 వేల పరుగులు సాధించాడు. ఇందులో 100 శతకాలు, 164 అర్ధశతకాలు ఉన్నాయి. చదవండి: ఐపీఎల్ 2021 కోసం ముందుకు జరుగనున్న సీపీఎల్..? -
రిచర్డ్స్‌పై ఇయాన్ స్మిత్ ప్రశంసలు
దిగ్గజ క్రికెటర్ సర్ వివియన్ రిచర్డ్స్‌పై న్యూజిలాండ్ మాజీ వికెట్ కీపర్ ఇయాన్ స్మిత్ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుత సయయంలో ఐపీఎల్ వంటి టీ20 లీగ్‌ల్లో టీమ్ యజమానులు వివియన్ రిచర్డ్స్కు అధిక మొత్తంలో చెల్లించి తమ జట్టులోకి తీసుకోవాల్సి వచ్చేదని అన్నారు. ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్, న్యూజిలాండ్ ఆటగాడు బెన్ స్టోక్స్‌లకు చెల్లించే దానికంటే అధిక మొత్తం చెల్లించాల్సి ఉండేదన్నారు. రిచర్డ్స్ ఏ ఫార్మాట్లోనైనా, ఏ దశాబ్దంలోనైనా గొప్పగా రాణించే ఆటగాడు అని తను నమ్ముతున్నానని తెలిపారు. ఆ కాలంలోనే రిచర్డ్స్ స్ట్రైక్ రేట్‌ను ప్రతి ఒక్కరు గొప్పదిగా భావించారని తెలిపారు. ఐపీఎల్ వంటి టీ20 లీగులు లేని కాలంలో ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లకు సమానమైన స్ట్రైక్ రేట్‌ను నెలకొల్పాడని కొనియాడారు. కాగా, క్రికెట్ ఆల్‌టైమ్ గ్రేట్‌లో వివియన్ రిచర్డ్స్ ఒకరు అన్న విషయం తెలిసిందే. 1990ల్లోనే రిచర్డ్స్ స్ట్రైక్ రేట్ 67.1 నమోదు చేశారు. ఇక, గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంలో కమిన్స్‌ను రూ.15.5 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో అత్యంత విలువైన విదేశీ ఆటగాడిగా కమిన్స్ నిలిచాడు. -
‘రిచర్డ్స్.. నన్ను చంపేస్తానన్నాడు’
కరాచీ: పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాకిస్తాన్ పేస్‌కు వన్నె తెచ్చిన బౌలర్లలో అక్రమ్ కూడా ఒకడు. ఇమ్రాన్ ఖాన్ తర్వాత ఆ స్థాయి బౌలింగ్‌ను అందుకున్న బౌలర్ అక్రమ్. ప్రధానంగా బంతిని రివర్స్ స్వింగ్ చేయడంలో అక్రమ్ సిద్ధహస్తుడు. తన మాయాజాలంతో పాకిస్తాన్‌కు ఎన్నో విజయాలను అందించిన ఘనత ఈ ఎడమచేతి వాటం బౌలర్‌ది. ఆ క్రమంలోనే ప్రత్యర్థి జట్లు అక్రమ్ బౌలింగ్‌కు భయపడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ఓ వికెట్‌ను ఖాతాలో వేసుకున్న తర్వాత అక్రమ్ భయపడ్డాడట. ఈ విషయాన్ని అక్రమ్ షేర్ చేసుకున్నాడు. (బాస్.. నాకు ఓపెనింగ్ కొత్త కాదు) ‘ 1988 ప్రాంతంలో రిచర్డ్స్ నా బౌలింగ్‌లో చాలాసార్లు హిట్ చేశాడు. అతనొక భారీ కాయుడు. నేనేమో సన్నగా ఉండేవాడిని. అయితే రిచర్డ్స్కు బౌలింగ్ చేసేటప్పుడు ఓ బౌన్సర్ వేస్తే అతని క్యాప్ కింది పడిపోయింది. అదొక పెద్ద ఘనతగా నేను భావించా. దాంతో రిచర్డ్స్ వద్దకు వెళ్లి నాకు వచ్చీ రాని ఇంగ్లిష్‌లో స్లెడ్జ్ చేశా. దానికి రిచర్డ్స్ రిప్లై చేసి షాక్ తిన్నా.మళ్లీ ఇలా చేశావంటే ఊరుకోను అన్నాడు. ఆ తర్వాత ఏదో అన్నాడు. అది నాకు సరిగా అర్థం కాలేదు. ఇదే విషయాన్ని అప్పటి మా కెప్టెన్ ఇమ్రాన్‌ఖాన్‌కు చెప్పా. ఏమీ భయపడవద్దు. మళ్లీ బౌన్సర్ వేయమన్నాడు. దాంతో బౌన్సర్ వేశా. చివరగా ఓ ఇన్‌స్వింగర్‌తో రిచర్డ్స్‌ను బౌల్డ్ చేయడంతో నా ఆనందానికి అవధుల్లేవు. ఇక వెళ్లిపో’ అంటూ పెద్దగా అరిచాను. ఆ తర్వాత రిచర్డ్స్ పెవిలియన్‌కు చేరిన తర్వాత షర్ట్ లేకుండా కూర్చోవడం చూశాను. అయితే నాకు కోసమే చూస్తున్నాడని అనుకోలేదు. మేము డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లే క్రమంలో రిచర్డ్స్ బ్యాట్ పట్టుకుని షర్ట్ లేకుండా నా కోసం చూస్తున్నాడు. ఇది నాకు అర్థమైపోయింది. ఈ విషయాన్ని ఇమ్రాన్‌కు చెప్పా. నువ్వే హ్యాండిల్ చేసుకుంటేనే బాగుంటుదని చెప్పాడు. అదే సమయంలో ఇమ్రాన్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయా. ఆ తర్వాత రిచర్డ్స్ వద్దకు వెళ్లి సారీ చెప్పా. మళ్లీ ఆ తప్పు చేయనన్నా. నువ్వు అలా చేయకపోవడం మంచిది. ఒకవేళ మళ్లీ రిపీట్ అయితే నిన్ను చంపేస్తా’ అని రిచర్డ్స్ వార్నింగ్ ఇచ్చాడన్నాడు. (‘క్రికెట్ చరిత్రలో ధోనినే పవర్ఫుల్’) -
సచిన్, రిచర్డ్స్‌లకు ఇది మరిచిపోలేని రోజు
క్రికెట్ ప్రపంచంలో ఈ ఇద్దరి పేర్లకు పెద్దగా పరిచయం అక్కర్లేదనిపిస్తుంది. ఎందుకంటే వారిద్దరు క్రికెట్ ప్రపంచంలో తమ ముద్రను ఎప్పుడో వేశారు. అందులో ఒకరు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అయితే మరొకరు విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్. ఈ ఇద్దరు కలిసి మ్యాచ్‌లు తక్కువే ఆడినా ఎవరికి వారు సాటి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే వీరిద్దరు తమ జీవితంలో ఎన్నో మైలురాళ్లను అందుకున్నారు. అయితే సచిన్, రిచర్డ్స్‌లకు ఏప్రిల్ 15 ప్రత్యేకమైన రోజుగా మిగిలిపోతుంది. ఒకరు ఐపీఎల్లో తన మెయిడెన్ సెంచరీ సాధిస్తే, మరొకరు 34 ఏళ్ల క్రితం టెస్టు మ్యాచ్‌లో 56 బంతుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ మైలురాయిని అందుకున్నాడు.(‘ధోని.. అయామ్ ఈగర్లీ వెయిటింగ్’) వివరాల్లోకి వెళితే.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ప్రాతినిధ్యం వహించిన సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే అప్పటికే మూడేళ్ల నుంచి ఐపీఎల్లో ఆడుతన్నా సెంచరీ సాధించలేకపోయాననే లోటు మాత్రం సచిన్‌కు అలాగే ఉండేది. కానీ అది ఏప్రిల్ 15, 2011తో తీరిపోయిందనే చెప్పాలి. కొచ్చి టస్కర్స్ కేరళతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 66 బంతుల్లోనే 100 పరుగులు చేసి మునుపటి సచిన్‌ను గుర్తు చేశాడు. ఆ మ్యాచ్‌లో డేవిస్ జాకబ్స్, అంబటి రాయుడులు సచిన్‌కు మంచి సహకారం అందించారు. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై ఓటమిపాలైంది. కాగా సచిన్ తన ఐపీఎల్ కెరీర్లో 78 మ్యాచ్‌లాడి 2334 పరుగులు చేశాడు. ఇందులో 13 అర్థ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ 2013లో ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు. ఇక మరొక అద్బుతం 1986లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో చోటుచేసుకుంది. ఐదో టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 26 పరుగులు చేసిన వివ్ రిచర్డ్స్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం పూనకం వచ్చినట్లుగా ఆడాడు. వన్డే మ్యాచ్‌ను తలపిస్తూ సాగిన ఇన్నింగ్స్‌లో 58 బంతుల్లోనే 110 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని దాటికి ఇంగ్లండ్ ముంగిట 401 పరుగుల విజయలక్ష్యం వచ్చి చేరింది. అయితే విండీస్ భీకర బౌలింగ్ దాటికి 170 పరుగులకే ఆలౌట్ అయిన ఇంగ్లండ్ మ్యాచ్‌తో పాటు 5-0 తేడాతో సిరీస్‌ను విండీస్‌కు అప్పగించేసింది. ఈ మ్యాచ్ తన కెరీర్లో ఎప్పటికి గుర్తుండిపోతుందని రిచర్డ్స్ ఇప్పటికే చాలా ఇంటర్య్వూల్లో చెప్పుకొచ్చాడు. విండీస్ దిగ్గజం తన కెరీర్ మొత్తం ఆద్యంతం దూకుడుగానే ఆడడం విశేషంగా చెప్పుకోవచ్చు. 121 టెస్టుల్లో 8540 పరుగులు చేసిన విండీస్ దిగ్గజం వన్డేల్లో 6721 పరుగులు చేశాడు. కాగా, టెస్టుల్లో రిచర్డ్స్ వేగవంతమైన శతకం రికార్డును న్యూజిలాండ్ ఆటగాడు మెక్‌కలమ్ బద్దలుకొట్టాడు. 2016లో క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఆస్ట్రేలియాపై జరిగిన టెస్టులో 54 బంతుల్లోనే మెక్‌కలమ్ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. -
పొలాక్ మదిలో సచిన్ కానీ అతడి జాబితాలో..
హైదరాబాద్ : టీమిండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పై దక్షిణాఫ్రికా మాజీ సారథి షాన్ పొలాక్ ప్రశంసల వర్షం కురిపించాడు. తన తరం క్రికెటర్లలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ సచిన అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. పరిస్థితులకు తగ్గట్టు తన ఆటను మార్చుకుంటాడని ప్రశంసించాడు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పొలాక్ పలు ఆసక్తికర విషయాలను పేర్కొన్నాడు. ‘పరిస్థితులను ఆకలింపు చేసుకుని, జట్టు అవసరాలకు తగ్గట్లు తన ఆటను మార్చుకుంటాడు. అతడికి సంధించే షార్ట్ పిచ్ బంతులను కీపర్, స్లిప్ ఫీల్డర్ల మీదుగా ఆడే షాట్స్ అప్పట్లో ఓ వండర్ అనుకోవాలి. టెక్నికల్‌గా అతడి బ్యాటింగ్‌లో ఎలాంటి లోపాలు లేవు. అందుకే ఔట్ చేయడం చాలా కష్టంగా అనిపించేది. అయితే అతడు తప్పిదం చేసేవరకు వేచి చూసేవాళ్లం’అని పొలాక్ పేర్కొన్నాడు. ఇక సచిన్ వన్డేల్లో 9 సార్లు అవుట్ చేసిన పొలాక్.. ఎక్కువ సార్లు అతడిని అవుట్ చేసిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. వివి రిచర్డ్స్ పేరు చెప్పిన హోల్డింగ్ ఇక ఇదే అంశంపై వెస్టిండీస్ మాజీ పేసర్ మైకేల్ హోల్డింగ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘నేను చూసిన అప్పడు, ఇప్పుడు, ఎప్పటికీ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ వివి రిచర్డ్సే. రిచర్డ్ హ్యాడ్లీ, డెన్నీస్ లిల్లీ, అబ్ధుల్ ఖాదీర్, బిషన్ బేడి, ఇయాన్ బోథమ్ వంటి అప్పటి ప్రపంచ ప్రఖ్యాత బౌలర్లను సమర్థవంతంగా ఎలాంటి భయం, బెరుకు లేకుండా పరుగులు రాబట్టాడు. అందుకే రిచర్డ్స్ అత్యుత్తమ ఆటగాడని నా అభిప్రాయం’అని హోల్డింగ్ పేర్కొన్నాడు. -
అందుకే అతన్ని పాక్ 'వివ్ రిచర్డ్స్' అంటారు
కరాచి : పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ ఆ జట్టు మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. అప్పట్లో ఇంజమామ్ పాక్ జట్టుకు ఆణిముత్యంలా దొరికాడంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. ఇంజమామ్‌ను పాక్ వివ్ రిచర్డ్స్గా పోలుస్తారని.. హెల్మెట్ లేకుండానే తన బ్యాటింగ్‌తో బౌలర్లపై విరుచుకుపడుతూ ఎన్నోసార్లు మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడంటూ సక్లయిన్ ముస్తాక్ తన యూట్యుబ్ చానెల్లో చెప్పుకొచ్చాడు. సక్లయిన్ మాట్లాడుతూ.. ' ఇంజమామ్ జట్టులోకి వచ్చినప్పుడు నాకు బాగా గుర్తుంది. తనకు వచ్చిన మొదటి అవకాశంలోనే తనేంటో నిరూపించుకున్నాడు. తొలి మ్యాచ్‌లోనే అరవీర భయంకరమైన బౌలర్లు కలిగిన విండీస్ టీమ్‌కు భయపడకుండా తలకు హెల్మెట్ లేకుండానే బ్యాటింగ్‌కు దిగి ప్రంట్ పుట్ షాట్స్‌తో బౌలర్లపై విరుచుకుపడిన తీరు నేను అంత తొందరగా మరిచిపోను. అయితే ఇంజమామ్ జట్టులోకి వచ్చేసరికి ఇమ్రాన్‌ఖాన్ జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. ప్రాక్టీస్ సెషన్లో ఇంజమామ్‌ను ఒకసారి పరీక్షిద్దామని ఇమ్రాన్ అప్పటి జట్టు బౌలర్లైన వసీమ్ అక్రమ్, వకార్ యునీస్లను కోరాడు. ఈ ఇద్దరు బౌలర్లు తమ పేస్ బౌలింగ్‌తో విరుచుకుపడుతుంటే ఇంజమామ్ మాత్రం వారి బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటున్న తీరు ఇమ్రాన్‌ను ఆకట్టుకుంది. దీంతో విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన ఇంజమామ్ ఫ్రంట్ ఫుట్, కవర్ డ్రైవ్, కట్ షాట్లు ఆడుతూ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.(స్మిత్ కేవలం టెస్టులకే కానీ కింగ్ కోహ్లి..) అతని ఆటతీరుకు ముచ్చటపడిన పాక్ అభిమానులు ఇంజూను పాక్ వివ్ రిచర్డ్స్గా అభివర్ణించారు. విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ కూడా ప్రత్యర్థి బౌలర్లకు ఏమ్రాం అవకాశం ఉండకుండా తన ఫ్రంట్ ఫుట్ షాట్లతో విరుచుకుపడేవాడు. ఇంజమామ్ మైదానం ఆవల, బయట ఎంత నెమ్మదిగా కదిలినా ఒక్కసారి బ్యాట్ పడితే కచ్చితమైన ఫుట్‌వర్క్‌తో షాట్లు ఆడేవాడు. నేను ఇంజమామ్‌తో కలిసి చాలా మ్యాచ్‌లు ఆడేవాడిని. నెట్స్‌లో ప్రాక్టీస్ సమయంలో తనను స్టంప్ అవుట్ చేసే అవకాశం ఇచ్చేవాడు కాదు. అందుకే అతన్ని మేం ముద్దుగా గేమ్ చేంజర్, మ్యాచ్ విన్నర్ అనేవాళ్లం' అంటూ సక్లయిన్ చెప్పుకొచ్చాడు. పాక్ అత్యుత్తమ స్పిన్నర్‌గా పేరు పొందిన సక్లయిన్ ముస్తాక్ జట్టు తరపున 49 టెస్టులు, 169 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు. -
చచ్చిపోయినా ఫర్వాలేదనుకున్నా!
మెల్బోర్న్: క్రికెట్ ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడైన సర్ వివియన్ రిచర్డ్స్ తన సుదీర్ఘ కెరీర్లో ఏనాడూ హెల్మెట్ పెట్టుకోలేదు. ఎలాంటి భయం లేకుండానే బరిలోకి దిగిన అతను ఆ సమయంలో ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ బౌలర్లను చితక్కొట్టాడు. ఆటపై ఉన్న పిచ్చి ప్రేమే తనలో ధైర్యాన్ని నింపిందని రిచర్డ్స్ గుర్తు చేసుకున్నాడు. ‘క్రికెట్‌ను నేను విపరీతంగా ప్రేమించాను. ఎంతగా అంటే ఆడుతూనే చనిపోయి నా ఫర్వాలేదనుకునేవాడిని. క్రికెట్‌ను నేను ఎంచుకున్నాను కాబట్టి మైదానంలోనే కుప్పకూలినా అంతకంటే అదృష్టం లేదని భావించేవాడిని’ అని ఈ విధ్వంసక బ్యాట్స్‌మన్ వ్యాఖ్యానించాడు. ఆసీస్ ఆల్‌రౌండర్ షేన్వాట్సన్తో వీడియో సంభాషణ సందర్భంగా రిచర్డ్స్ ఈ మాటలు అన్నాడు. ‘ఇతర ఆటగాళ్లను చూసి నేను ఎప్పుడూ స్ఫూర్తి పొందేవాడిని. అత్యుత్తమ స్థాయిలో రాణించే మహిళలను కూడా అలాగే గౌరవించేవాడిని. ఫార్ములా వన్ రేసింగ్ కార్‌ను డ్రైవ్ చేసేవారిని చూస్తే అంతకంటే ప్రమాదకరం ఇంకేం ఉంటుందని అనిపించేది’ అంటూ వివ్ అన్నాడు. -
'ఆ ముగ్గురు క్రికెట్ గతిని మార్చారు'
-
'ఆ ముగ్గురు క్రికెట్ గతిని మార్చారు'
క్రికెట్ ప్రపంచంలో ప్రతీ శకంలో ఒక క్రికెటర్ తన ఆటతీరుతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించడం సహజమే. కానీ తన దృష్టిలో మాత్రం ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరి శకంలో వారు తమ స్టైలీష్ ఆటతీరుతో క్రికెట్ గతినే మార్చేశారంటూ పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ యూ ట్యూబ్ ఇంటర్యూలో పేర్కొన్నాడు. మరి ఇంజమామ్ చెప్పిన ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరో తెలుసా.. సర్ వివి రిచర్డ్స్, సనత్ జయసూర్య, ఎబి డివిలియర్స్.ఇంజమామ్ మాట్లాడుతూ.. 'మొదటి శకంలో వెస్టిండీస్ లెజెండరీ బ్యాట్స్‌మెన్ సర్ వివి రిచర్డ్స్ తన ఆటతీరుతో క్రికెట్ అనే పదానికి కొత్త అర్థాన్నిచ్చాడు. అది ఎలా అంటే అరవీర భయంకరమైన ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొంటూ ఫుట్‌వర్క్ ఆధారం చేసుకొని రిచర్డ్స్ ఆడే షాట్లు ముచ్చట గొలిపేవి. ఫాస్ట్ బౌలర్లు తమ వైవిధ్యమైన బంతులతో భయానికి గురి చేసినా ఫుట్‌వర్క్ టెక్నిక్‌తో షాట్లు ఎలా ఆడాలో నేర్పించాడు. ఇప్పటికి ఆయన ఆడిన షాట్లు ఒక చరిత్రే' అని పేర్కొన్నాడు. (కోహ్లికి ఖాతాలోకి మరో రికార్డు!) ఇక రెండో తరంలో శ్రీలంక స్టార్ ఓపెనర్ సనత్ జయసూర్య మరోసారి క్రికెట్ అనే పదానికి కొత్త అర్థాన్ని ఇచ్చాడని ఇంజమామ్ పేర్కొన్నాడు. ' ఓపెనర్ అనే పదానికి సరైన నిర్వచనం సనత్ జయసూర్య అని కొనియాడారు. క్రికెట్ ఫార్మాట్లో ఐసీసీ కొత్త నిబంధనలు తీసుకువచ్చాక మొదటి 15 ఓవర్లలో సనత్ జయసూర్య అటాకింగ్ గేమ్ ఎలా అనేది స్పష్టంగా చూపించాడు . ఓపెనర్‌గా ప్రమోషన్ లభించిన తర్వాత జయసూర్య తన బ్యాటింగ్‌తో మొదటి 15 ఓవర్లు బౌలర్లలపై విరుచుకుపడిన విధానం, బంతిని బాదితే బౌండరీలే అన్న చందంగా జయసూర్య బ్యాటింగ్ తీరు అప్పటి ప్రేక్షకులు అంత తేలిగ్గా మరిచిపోరు. 1996 ప్రపంచకప్ శ్రీలంక గెలవడంలో జయసూర్య ప్రధాన పాత్ర పోషించాడని' తెలిపాడు. ఇక మూడో తరం ఆటగాడిగా దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు ఎబి డివిలియర్స్ పేరును ఇంజమామ్ పేర్కొన్నాడు. 'పరిమిత ఓవర్లు, టీ20లు వచ్చిన తర్వాత డివిలియర్స్ తన విధ్వంసకర ఆటతీరుతో చెలరేగిపోయేవాడు. ముఖ్యంగా 360 డిగ్రీల కోణంలో డివిలియర్స్ ఆడే షాట్లు అతని విధ్వంసానికి ప్రతీకగా నిలిచింది. రివర్స స్వీప్,పాడల్ స్వీప్ వంటి కొత్త కొత్త షాట్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేశాడు. ప్రపంచకప్ సాధించలేదనే ఒక్క బాధ తప్ప డివిలియర్స్ తన కెరీర్‌ను ఆద్యంతం విధ్వంసకరంగానే కొనసాగించాడని' వెల్లడించాడు. అందుకే తన దృష్టిలో క్రికెట్ గతిని మార్చిన ఆటగాళ్లుగా రిచర్డ్స్, జయసూర్య, డివిలియర్స్ ఎప్పటికి తన మదిలో నిలిచిపోతారని తెలిపాడు. అంతేగాక వీరు ముగ్గురిలో ఒక కామన్ ఫ్యాక్టర్ ఉందని, విఫలమైన ప్రతీసారీ తిరిగి తమ సత్తా ఏంటో క్రికెట్ ప్రపంచానికి చూపించారని ఇంజమామ్ కొనియాడాడు.(వారి భుజాలపై సచిన్.. బెస్ట్ మూమెంట్ అదే) ఇక విండీస్‌కు ప్రాతినిధ్యం వహించిన వివి రిచర్డ్స్ 90.20 స్ట్రైక్ రేట్‌తో 121 టెస్టుల్లో 8540, 187 వన్డేల్లో 6721 పరుగులను సాధించాడు. అలాగే శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించిన సనత్ జయసూర్య తన అంతర్జాతీయ కెరీర్లో 445 వన్డేల్లో 13430, 110 టెస్టుల్లో 6973 పరుగులు నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించిన ఎబి డివిలియర్స్ 114 టెస్టుల్లో 8765, 228 వన్డేల్లో 9577, 78 టీ20ల్లో 1673 పరుగులు చేశాడు. -
నేను ఎందుకు హెల్మెట్ వాడలేదంటే...
నార్త్‌సౌండ్ (ఆంటిగ్వా): వెస్టిండీస్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్ బ్యాటింగ్ విధ్వంసం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. హెల్మెట్ కూడా వాడకుండా నాటి పేస్ బౌలర్లపై అతను తనదైన శైలిలో విరుచుకు పడ్డాడు. ఇటీవల ఆర్చర్ బౌలింగ్‌లో స్మిత్ గాయపడిన తర్వాత హెల్మెట్ల వాడకంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో అతను దీనిపై స్పందించాడు. మరో స్టార్ క్రికెటర్, భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యాతగా మారి అడిగిన ఈ ప్రశ్నకు అతను జవాబిచ్చాడు. ‘నేను మగాడిని. నేను ఇలా చెబితే దురుసుగా అనిపించవచ్చు కానీ అది నాపై నాకున్న నమ్మకం. నాకు నచి్చన ఆటనే ఆడుతున్నానని నేను నమ్మాను. నా ఆటపై నాకు విశ్వాసం ఎక్కువ. ఈ క్రమంలో గాయపడేందుకు కూడా సిద్ధంగా ఉండాలి. నేను హెల్మెట్ వాడే ప్రయత్నం చేసినప్పుడు అసౌకర్యంగా అనిపించింది. నాకు ఇచి్చన టీమ్ క్యాప్‌ను చూసే నేను గర్వపడ్డాను. ఇక్కడ నిలబడే స్థాయి నాకు ఉందనేది తెలుసు. నేను నిజంగా గాయపడితే బయటపడటం కూడా దేవుడి చేతుల్లోనే ఉంది’ అని రిచర్డ్స్ వివరించాడు. దీంతో పాటు పలు ఆసక్తికర అంశాలపై రిచర్డ్స్‌ను కోహ్లి ఇంటర్వ్యూ చేశాడు. -
‘టీమిండియాకు గట్టిపోటీ తప్పదు’
ముంబై: కరీబియన్ పర్యటనకు వస్తున్న భారత జట్టుకు వెస్టిండీస్ గట్టిపోటీ ఇస్తుందని ఆ దేశ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ అన్నారు. కోహ్లి బృందం కరీబియన్‌లో మూడు టి20లు, మరో మూడు వన్డేలతో పాటు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగే రెండు టెస్టు మ్యాచ్‌లు కూడా ఆడుతుంది. ‘ఈ సిరీస్ ఏదో ఆషామాషీగా జరుగుతుందని నేను అనుకోను. భారత్, వెస్టిండీస్ పోరు ఈసారి ఉత్కంఠభరితంగా జరుగుతుంది. విరాట్ కోహ్లి సేనకు విండీస్ జట్టు నుంచి సవాళ్లు తప్పవు. దీంతో పోటీ క్లిష్టంగా ఉంటుంది’ అని ఆయన తెలిపారు. భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్ మాట్లాడుతూ తన హృదయంలో వెస్టిండీస్‌కు ప్రత్యేక స్థానముందన్నారు. విండీస్ ఆటగాళ్లను ఎప్పుడూ అభిమానిస్తూనే ఉంటానని చెప్పారు. -
భారత ఫ్యాన్స్‌పై వివ్ రిచర్డ్స్ సంచలన వ్యాఖ్యలు
లండన్ : భారత అభిమానులకు కొంచెం కూడా ఓపిక ఉండదని వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ అభిప్రాపడ్డాడు. వారనుకున్న ఫలితం రాకుంటే పిచ్చిగా అభిమానించే ఆటగాళ్ల దిష్టిబొమ్మలు ఎందుకు తగలబెడతారో ఇప్పటికి అర్థం కాదన్నాడు. ప్రపంచకప్‌లో కోహ్లిసేన బాగా రాణించాలంటే భారత అభిమానులు ఓపికలతో ఉండాలని సూచించాడు. సలామ్ క్రికెట్ 2019 కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘భారత అభిమానులకు కొన్నిసార్లు ఓపిక ఉండదు. దిష్టిబొమ్మలను తగలబెట్టడం తెలివితక్కువ పని. ఏ ఆటగాడికైనా ఓడిపోవాలని ఉండదు. గెలవడానికే ప్రయత్నిస్తారు. ఈ రోజు హీరో కాకపోయినంత మాత్రానా రేపు జీరో కాదు. ప్రత ఒక్కరి పట్ల గౌరవంగా, మర్యాదకంగా నడుచుకోవాలి. అన్నిసార్లు మనకే మంచి జరగాలంటే కుదురదు’ అని రిచర్డ్స్ చెప్పుకొచ్చాడు. సౌరవ్ గంగూలీ సారథ్యంలోని భారత జట్టు 2003 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడగానే భారత అభిమానులు ఆటగాళ్ల ఇళ్లపై దాడి చేయడం, దిష్టిబొమ్మలు తగలబెట్టిన విషయం తెలిసిందే. ఇక 2007 ప్రపంచకప్‌లో లీగ్ దశ నుంచే నిష్క్రమించడంతో కూడా అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. క్రికెటర్ల ఇళ్లపై రాళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ పరాజయంతో తీవ్రంగా కుంగిపోయిన సచిన్ రిచర్డ్స్ ఫోన్‌కాల్‌తోనే తేరుకొని మరో నాలుగేళ్లు క్రికెట్ ఆడానని ఈ కార్యక్రమంలోనే వెల్లడించాడు. ‘ 2007 ప్రపంచకప్‌లోని నా ప్రదర్శన కెరీర్‌లోని అత్యంత చెత్త ప్రదర్శన. ఈ ఓటమితో ఆటకు గుడ్‌బై చెప్పుదాం అనుకున్నా. ఆ సమయంలో మా అన్న 2011లో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆడుతావని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. అయినా నేను కన్వీన్స్ కాలేదు. నేను ఫామ్‌హౌస్‌లో ఉండగా వివ్ రిచర్డ్స్ ఫోన్ చేశాడు. సుమారు 45 నిమిషాలు మాట్లాడాడు. ఆ కాల్‌తో నేను నా నిర్ణయాన్ని మార్చుకున్నా’ అని సచిన్ చెప్పుకొచ్చాడు. -
‘కోహ్లి అంటే పాక్‌లో పిచ్చి అభిమానం’
లండన్: టీమిండియా సారథి విరాట్ కోహ్లి అంటేనే రికార్డుల రారాజు. ఇప్పటికే ఎన్నో రికార్డుల, అవార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. తన ఆటతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే దాయాది పాకిస్తాన్లో కోహ్లి అంటే పడి చచ్చిపోతారని ఆ జట్టు మాజీ సారథి యునిస్ ఖాన్ తెలిపాడు. ప్రపంచకప్‌లో భాగంగా లండన్‌లో నిర్వహించిన సలాం క్రికెట్ 2019లో పాల్గొన్న యునిస్ కోహ్లిపై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘పాక్ ప్రజలు విరాట్ కోహ్లి అంటే అమితంగా ప్రేమిస్తారు. మా దేశంలోని ప్రస్తుత యువత అతడిలా బ్యాటింగ్ చేయాలని, ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. గతేడాది జరిగిన ఆసియా కప్‌లో టీమిండియా పరుగుల యంత్రం ఆడకపోవడం పట్ల మా దేశ క్రికెట్ అభిమానులు తీవ్రంగా నిరాశపడ్డారు. కోహ్లి ఆసియా కప్‌లో పాల్గొని ఉంటే స్టేడియం దద్దరిల్లి పోయేది. ప్రపంచకప్‌లో టీమిండియాకు కోహ్లినే కీలకం. అతడి రాణింపుపైనే ఆ జట్టు గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి’అంటూ పాక్ మాజీ సారథి యునిస్ ఖాన్ పేర్కొన్నాడు. భారత బ్యాట్స్‌మెన్ అంటే నాకు ఇష్టం ఇకే ఇదే కార్యక్రమంలో పాల్గొన్న వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు వివి రిచర్డ్స్ టీమిండియా ఆటగాళ్లను కొనియాడాడు. ‘నాకు భారత బ్యాట్స్‌మెన్ అంటే చాలా ఇష్టం. వారిలో ఎలాంటి గర్వం, పొగరు ఉండదు. వారిలో ఆటపై ఇష్టం, శ్రధ్ద మాత్రమే కనిపిస్తుంది. ఇక విరాట్ కోహ్లిలో గెలవాలనే కసి నాకు బాగా నచ్చింది. ఏ ఆటగాడయినా గెలవాలనే కోరుకుంటాడు. కానీ కోహ్లిలో ఆ గుణం కాస్త ఎక్కువగా ఉంటుంది. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలలో గెలవాలనే పట్టుదల ఇంకా ఎక్కువగా ఉండాలి. కోహ్లినే టీమిండియా బలం’అంటూ రిచర్డ్స్ వ్యాఖ్యానించాడు. -
‘నా బ్యాటింగ్ హీరోకు జన్మదిన శుభాకాంక్షలు’
వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజ ఆటగాడు వీవి రిచర్డ్స్కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. రిచర్డ్స్ 1952 మార్చి 07న జన్మించాడు. ఈ సందర్భంగా సచిన్ తన ట్వీటర్ అకౌంట్లో అతనితో కలిసి దిగిన ఫొటోను పోస్టు చేశాడు. ‘నా బ్యాటింగ్ హీరోకు జన్మదిన శుభాకాంక్షలు’ అని పోస్టు చేశాడు. రిచర్డ్స్ విధ్వంకర బ్యాట్స్‌మెన్‌గా పేరు పొందిన విషయం తెలిసిందే. వెస్టిండీస్ జట్టుకు చాలా సంవత్సరాలు తన సేవలు అందించాడు రిచర్డ్స్. బ్యాటింగ్‌తో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆయన రాబోయే తరాల వారికి స్పూర్తిగా నిలిచాడు. వెస్టిండీస్ జట్టులో బౌలర్ల హవా కొనసాగుతున్న రోజుల్లో కూడా రిచర్డ్స్ బ్యాటింగ్‌తో అభిమానులను సంపాదించుకున్నాడు. రిచర్డ్స్ తన క్రికెట్ కెరీర్‌ను 1974 నవంబర్ 22న ఇండియాతో టెస్టు మ్యాచ్‌తో ప్రారంభించాడు. తన చివరి టెస్టు మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌తో 1991 ఆగస్టు 8న ఆడాడు. 1975లో వన్డేలలో ఆరంగ్రేటం చేశాడు. రిచర్డ్స్ 1984–1991 కరేబియన్ జట్టుకు కెప్టెన్సీ భాద్యతలు చేపట్టాడు. రిచర్డ్ష్ మొత్తం 121 టెస్టు మ్యాచ్‌లు ఆడి 8,540 పరుగులు సాధించాడు. వెస్టిండీస్1975, 79 వరల్డ్ కప్ సాధించడంలో రిచర్డ్స్ కీలకపాత్ర పోషించాడు. -
కోహ్లికి రిచర్డ్స్ మద్దతు
ముంబై:ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ అనంతరం ఆ జట్టులోని ఆటగాళ్లతో ఇక స్నేహ భావం లేదంటూ పేర్కొని విమర్శల పాలైన భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లికి వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ మద్దతుగా నిలిచాడు. ప్రధానంగా భారత్ తో సిరీస్ లో ఆసీస్ తన లైన్ ను అతిక్రమించడమే విరాట్ వ్యాఖ్యలకు ప్రధాన కారణంగా రిచర్డ్స్ అభివర్ణించాడు. భారత్ పర్యటనలో ఆసీస్ ఆటగాళ్ల వ్యవహార శైలిని విరాట్ సీరియస్ గా తీసుకోవడంతోనే అతని వ్యాఖ్యలకు కారణమై ఉండవచ్చని రిచర్డ్స్ అన్నాడు. 'ఆసీస్ క్రికెట్ జట్టు స్లెడ్జింగ్ చేయడంలో లో ఎప్పుడూ దిట్ట. ప్రధాన ఆటగాళ్లను ముందుగానే లక్ష్యంగా చేసుకుని పైచేయి సాధించడం ఆసీస్ కు వెన్నతో పెట్టిన విద్య. ఆ క్రమంలోనే భారత్ తో సిరీస్ లో ఆసీస్ హద్దులు దాటి ఉండవచ్చు. అదే సమయంలో స్టార్ ఆటగాడు విరాట్ ను టార్గెట్ చేయడం కూడా అతన్ని ఇబ్బంది పెట్టింది. దాంతోనే సిరీస్ తరువాత ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇంకెంత మాత్రమూ స్నేహితులు కాదంటూ విరాట్ బహిరంగ ప్రకటనకు కారణమై ఉండవచ్చు'అని రిచర్డ్స్ అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంచితే భారత జట్టు తన నంబర్ వన్ ర్యాంకును సుదీర్ఘ కాలం కాపాడుకోవాలంటే విదేశాల్లో సత్తా చాటాల్సిన అవసరం ఉందన్నాడు.