క్రికెట్ ప్రపంచంలో ప్రతీ శకంలో ఒక క్రికెటర్ తన ఆటతీరుతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించడం సహజమే. కానీ తన దృష్టిలో మాత్రం ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరి శకంలో వారు తమ స్టైలీష్ ఆటతీరుతో క్రికెట్ గతినే మార్చేశారంటూ పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ యూ ట్యూబ్ ఇంటర్యూలో పేర్కొన్నాడు. మరి ఇంజమామ్ చెప్పిన ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరో తెలుసా.. సర్ వివి రిచర్డ్స్, సనత్ జయసూర్య, ఎబి డివిలియర్స్.ఇంజమామ్ మాట్లాడుతూ.. 'మొదటి శకంలో వెస్టిండీస్ లెజెండరీ బ్యాట్స్‌మెన్ సర్ వివి రిచర్డ్స్ తన ఆటతీరుతో క్రికెట్ అనే పదానికి కొత్త అర్థాన్నిచ్చాడు. అది ఎలా అంటే అరవీర భయంకరమైన ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొంటూ ఫుట్‌వర్క్ ఆధారం చేసుకొని రిచర్డ్స్ ఆడే షాట్లు ముచ్చట గొలిపేవి. ఫాస్ట్ బౌలర్లు తమ వైవిధ్యమైన బంతులతో భయానికి గురి చేసినా ఫుట్‌వర్క్ టెక్నిక్‌తో షాట్లు ఎలా ఆడాలో నేర్పించాడు. ఇప్పటికి ఆయన ఆడిన షాట్లు ఒక చరిత్రే' అని పేర్కొన్నాడు. (కోహ్లికి ఖాతాలోకి మరో రికార్డు!)
ఇక రెండో తరంలో శ్రీలంక స్టార్ ఓపెనర్ సనత్ జయసూర్య మరోసారి క్రికెట్ అనే పదానికి కొత్త అర్థాన్ని ఇచ్చాడని ఇంజమామ్ పేర్కొన్నాడు. ' ఓపెనర్ అనే పదానికి సరైన నిర్వచనం సనత్ జయసూర్య అని కొనియాడారు. క్రికెట్ ఫార్మాట్‌లో ఐసీసీ కొత్త నిబంధనలు తీసుకువచ్చాక మొదటి 15 ఓవర్లలో సనత్ జయసూర్య అటాకింగ్ గేమ్ ఎలా అనేది స్పష్టంగా చూపించాడు . ఓపెనర్‌గా ప్రమోషన్ లభించిన తర్వాత జయసూర్య తన బ్యాటింగ్‌తో మొదటి 15 ఓవర్లు బౌలర్లలపై విరుచుకుపడిన విధానం, బంతిని బాదితే బౌండరీలే అన్న చందంగా జయసూర్య బ్యాటింగ్ తీరు అప్పటి ప్రేక్షకులు అంత తేలిగ్గా మరిచిపోరు. 1996 ప్రపంచకప్ శ్రీలంక గెలవడంలో జయసూర్య ప్రధాన పాత్ర పోషించాడని' తెలిపాడు.
ఇక మూడో తరం ఆటగాడిగా దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు ఎబి డివిలియర్స్ పేరును ఇంజమామ్ పేర్కొన్నాడు. 'పరిమిత ఓవర్లు, టీ20లు వచ్చిన తర్వాత డివిలియర్స్ తన విధ్వంసకర ఆటతీరుతో చెలరేగిపోయేవాడు. ముఖ్యంగా 360 డిగ్రీల కోణంలో డివిలియర్స్ ఆడే షాట్లు అతని విధ్వంసానికి ప్రతీకగా నిలిచింది. రివర్స స్వీప్,పాడల్ స్వీప్ వంటి కొత్త కొత్త షాట్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేశాడు. ప్రపంచకప్ సాధించలేదనే ఒక్క బాధ తప్ప డివిలియర్స్ తన కెరీర్‌ను ఆద్యంతం విధ్వంసకరంగానే కొనసాగించాడని' వెల్లడించాడు. అందుకే తన దృష్టిలో క్రికెట్ గతిని మార్చిన ఆటగాళ్లుగా రిచర్డ్స్, జయసూర్య, డివిలియర్స్ ఎప్పటికి తన మదిలో నిలిచిపోతారని తెలిపాడు. అంతేగాక వీరు ముగ్గురిలో ఒక కామన్ ఫ్యాక్టర్ ఉందని, విఫలమైన ప్రతీసారీ తిరిగి తమ సత్తా ఏంటో క్రికెట్ ప్రపంచానికి చూపించారని ఇంజమామ్ కొనియాడాడు.(వారి భుజాలపై సచిన్.. బెస్ట్ మూమెంట్ అదే)
ఇక విండీస్‌కు ప్రాతినిధ్యం వహించిన వివి రిచర్డ్స్ 90.20 స్ట్రైక్ రేట్‌తో 121 టెస్టుల్లో 8540, 187 వన్డేల్లో 6721 పరుగులను సాధించాడు. అలాగే శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించిన సనత్ జయసూర్య తన అంతర్జాతీయ కెరీర్లో 445 వన్డేల్లో 13430, 110 టెస్టుల్లో 6973 పరుగులు నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించిన ఎబి డివిలియర్స్ 114 టెస్టుల్లో 8765, 228 వన్డేల్లో 9577, 78 టీ20ల్లో 1673 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment